(మాచిల్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో కోర్టు మార్షల్ జరిగిన పర్యవసానంగా ఐదుగురు సైనికులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ శిక్షను చూపిస్తూ AFSPA ను రద్దు చేయనవసరం లేదని మాజీ ఆర్మీ అధిపతి, ప్రస్తుత ఉప విదేశీ మంత్రి జనరల్ వి.కె.సింగ్ అప్పుడే ప్రకటించేశారు. ఈ పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయం. -విశేఖర్)
కాశ్మీర్ లో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడినందుకు గాను 4 రాజ్ పుటానా రైఫిల్స్ కు చెందిన ఐదుగురు సైనిక అధికారులకు – ఆ యూనిట్ కమాండింగ్ అధికారి అయిన కల్నల్, ఒక కెప్టెన్, ముగ్గురు జవాన్లు- జనరల్ కోర్టు మార్షల్ ద్వారా అందిన జీవిత ఖైదు అంత త్వరగా వచ్చిందేమీ కాదు. ఐదుగురు సైనికులు ఏప్రిల్ 30, 2010 తేదీన ముగ్గురు అమాయక యువకులను కాల్చి చంపి, వారిని పాకిస్తానీ మిలిటెంట్లుగా చెబుతూ “ఎన్ కౌంటర్” చేసినందుకు నగదు బహుమతి పొందారన్న నేరంలో దోషులుగా తేలారు. ఈ హత్యల అనంతరం కాశ్మీరు లోయ నాలుగు నెలలపాటు భారీ ఆందోళనలతో అట్టుడికిపోయింది. పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో కాశ్మీరీలు రాళ్ళతో తలపడుతూ వీధి యుద్ధాలు సాగించారు. ఫలితంగా జరిగిన ఘర్షణల్లో మరో 120 మంది కాశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు కౌమార ప్రాయంలోనూ, యౌవనం లోనూ ఉన్నవారే.
పోలీసుల పరిశోధన అనంతరం, ఒక కల్నల్, ఇద్దరు మేజర్లతో సహా 11 మందిపై సోపోర్ క్రిమినల్ కోర్టులో అభియోగ పత్రం నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణ ప్రక్రియను నిలిపివేయడంలో విజయవంతం అయిన ఆర్మీ ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ నిర్వహిస్తానని ఎంచుకుంది. అందులోనూ పోలీసులు వచ్చిన నిర్ధారణే ఫలితంగా వచ్చింది. బహిరంగం కావించడానికి నిరాకరించిన ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ నివేదిక ఆధారంగా ఆర్మీ, డిసెంబర్ 2013లో కోర్టు మార్షల్ కు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు మార్షల్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమై సెప్టెంబర్ లో ముగిసింది. ఆనాటికి కోర్టు తన ఆదేశాలను రిజర్వ్ లో ఉంచింది. సాక్ష్యాధారాలు ఏమీ లేవని చెబుతూ మిలట్రీ కోర్టు పత్రిబాల్ కేసును మూసేయడంతో, పత్రిబాల్ తీర్పు వెలువడిన కొద్ది రోజులకు కోర్టు మార్షల్ కు ఆదేశించబడిన మాచిల్ కేసు లోనూ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎవరికీ లేకపోయింది. కానీ (కోర్టు మార్షల్ ద్వారా) అందిన శిక్ష నిస్సందేహంగా తీవ్రమైనదే. తప్పుడు చర్యలకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఒక నిరోధకంగా పనిచేస్తుందని భావించవచ్చు. నార్త్రన్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జి.ఎస్.హుడా ఈ శిక్షను నిర్ధారిస్తేనే అమలులోకి వస్తుంది. జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ తీర్పును రాష్ట్రానికి ‘మలుపు తిరిగిన క్షణం’ గా అభివర్ణించారు.
సైనికుల చేతుల్లో ఇద్దరు కౌమార ప్రాయపు బాలురు ప్రాణాలు కోల్పోవడంతో (కాశ్మీరు) లోయ మరోసారి ఆగ్రహంతో ఉడికిపోతోంది. ఈ పరిస్ధితుల్లో వెలువడిన తీర్పు ద్వారా దోష నిర్ధారణ జరగడమే కాకుండా (కఠిన) శిక్ష కూడా పడడంతో, తమావాళ్లు చేసే తప్పులకు తన అంతర్గత ప్రక్రియ ద్వారా బాధ్యులను చేయగల సంస్ధగా సైన్యం ప్రతిష్ట పెరుగుతుంది. 7 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు, ఒక సుబేదారులు నిందితులుగా ఉన్న పత్రిబాల్ ఎన్ కౌంటర్ కేసును కూడా తిరిగి తెరిచినట్లయితే కాశ్మీర్ ప్రజల్లో మరింత నమ్మకాన్ని సైన్యం పెంపొందించుకోగలదు.
సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ను గానీ లేదా ఆ చట్టం లోని నేరం నుండి తప్పించుకునే అవకాశం ఇచ్చే క్లాజులను గానీ రద్దు చేయనవసరం లేకుండానే (బాధితులకు) న్యాయం చేయవచ్చని చెప్పడానికి మాచిల్ కేసు తీర్పును ఖచ్చితంగా ఒక ఉదాహరణగా చూపుతారు. కానీ ఏఎఫ్‌ఎస్‌పిఏ చట్టం లోని బాధ్యతాలేమి అవకాశాల నీడలో శరణు పొండినంతవరకు, పౌర న్యాయస్ధానాల నిశిత పరిశీలనకు ఆవల నిలిచి ఉన్నంతవరకూ, సైన్యం తనను తాను బాధ్యతాయుతమైన సంస్ధగా చెప్పుకోజాలదు. కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్లా, పోలీసు అభియోగపత్రం ద్వారా నేరం జరిగిందనడానికి స్పష్టమైన సాక్ష్యాలు వెల్లడి అయినందువల్లా సైన్యంపై తీవ్ర ఒత్తిడి వచ్చినందువల్లనే కదా మాచిల్ కేసులో సైన్యం చర్యలకు ఉపక్రమించింది!