“ఈ పుస్తకంలో అమ్మాయిలకు చాలా రిఫరెన్స్ లు ఉన్నాయి సార్ – చదవడం కొనసాగించమంటారా?”
******************
“ఒక స్త్రీ విద్యావంతురాలయితే ఒక కుటుంబం మొత్తం విద్యావంతం అవుతుంది” అని సాధారణ సత్యంగా చెబుతుంటారు. కానీ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు) వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించి అలహాబాద్ హై కోర్టు చేత చీవాట్లు తిన్నారు.
ఎ.ఎం.యు లోని మౌలానా ఆజాద్ లైబ్రరీ అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంధాలయం. విచిత్రంగా ఇందులోకి విద్యార్ధినులకు ప్రవేశాన్ని నిషేదించారట. అనేక దశాబ్దాలుగా ఇందులోకి అమ్మాయిలు రాకుండా నిషేధం విధించారని వైస్ ఛాన్సలర్ మాటలే చెబుతున్నాయి. యూనివర్సిటీకి 3 కి.మీ దూరంలో ఉండే మహిళా కాలేజీ విద్యార్ధినులు తమకూ లైబ్రరీలో ప్రవేశం ఇవ్వాలని కోరగా అందుకు వి.సి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
తిరస్కరించడమే కాకుండా ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. అమ్మాయిలు లైబ్రరీకి రావడం మొదలు పెడితే ఇక అబ్బాయిలు వరదలా పోటెత్తుతారని, వారందరికి తగిన చోటు లేదు కనుక అమ్మాయిలను అనుమతించబోమని వి.సి జమీరుద్దీన్ అన్నారని పత్రికలు తెలిపాయి.
అమ్మాయిలను అనుమతించకపోవడమే ఒక పెద్ద తిరోగామి చర్య. మహిళలపై వివక్షతో కూడుకున్న చర్య. దాన్ని సమర్ధించుకోవడానికి అమ్మాయిలు వస్తే వారి వెంట నాలుగు రెట్లు అబ్బాయిలు లైబ్రరీకి వరుస కడతారని వ్యాఖ్యానించడం ఏమిటో బొత్తిగా మింగుడు పడని వ్యవహారం. లైబ్రరీకి వచ్చి చదువుకోవాలని ప్రోత్సహించడం మానేసి రావద్దని చెప్పడం దారుణం. దానికి ఛాందస భావాలను అడ్డు తెచ్చుకోవడం ఇంకా ఘోరం.
వి.సి చెప్పిన మాటల ప్రకారం మహిళా కాలేజీకి మౌలానా లైబ్రరీకి మధ్య దూరం 3 కి.మీ. ఈ దారిలో ఈవ్ టీజింగ్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందిట. అందువలన ఈ దారి వెంట అమ్మాయిలు రావడం ప్రారంభిస్తే వారి వెనుక అబ్బాయిలు పడి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వి.సి గారు తమ గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈవ్ టీజింగ్ జరుగుతుందని అమ్మాయిలు కాలేజీ వదిలి రాకూడదా? అసలు ఇల్లే వదిలి రాకూడదంటే పోలా? ఇది ఖాఫ్ పంచాయితీలు జారీ చేసే ఫత్వాలకు ఎ మాత్రం భిన్నం? కాకపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరో రూపంలో ఫత్వా జారీ చేశారు. రూపం మార్పు తప్ప సారంలో పెద్దగా మార్పు లేదు.
ఈవ్ టీజింగ్ నేరం. నిర్భయ చట్టం ద్వారా కఠిన శిక్షలను ఈవ్ టీజింగ్ నేరానికి జత చేశారు. ఈవ్ టీజింగ్ జరిగితే ఆ సంగతి పోలీసులు చూసుకుంటారు. చూసుకోవాలి కూడా. ఆ మేరకు వైస్ ఛాన్సలర్ కూడా కాస్త దృష్టి పెట్టి పోలీసులను అప్రమత్తతలో ఉంచితే మరింత బాగు. దానికి బదులు అసలు లైబ్రరీకి రావద్దనడం, వారికి కావలసిన పుస్తకాలను కాలేజీ నుండే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే పంపిస్తామనడం బొత్తిగా అప్రజాస్వామికం. వివక్షాపూరితం.
ఈ నేపధ్యంలో కొందరు లాయర్లు అలహాబాద్ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో హై కోర్టు వి.సి ని మందలించినంత పని చేసింది. వి.సి తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దానితో వి.సి తన మాటలకి తప్పు అర్ధం తీశారని చెప్పారు. చోటుతోనే సమస్య తప్ప మరొకటి కాదని చెప్పుకున్నారు.
చోటు మాత్రమే సమస్య అయితే అమ్మాయిలను అనుమతించని ప్రాక్టీస్ దశాబ్దాల నుండే కొనసాగుతోందని ఎందుకు చెప్పడం? చోటు చాలకపోతే ఇంకో భవనం నిర్మించాలి. లైబ్రరీని విస్తరించాలి. అంతే గాని చదువరులను నిరుత్సాహపరచకూడదు కదా. యూనివర్సిటీ ఉన్నదే విద్య అందించడానికి తప్ప విద్యను నిరోధించేందుకు కాదు.
యూనివర్సిటీ అధికారులకి అమ్మాయిల పొడ గిట్టడం లేదని, చివరికి అమ్మాయిలను రిఫర్ చేసే పుస్తకాలన్నా గిట్టడం లేదని దానితో అధికారులకు అలాంటి పుస్తకాలను చూపడానికి లైబ్రరీ సిబ్బంది భయపడుతున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది.
O My God How can he became a University Vice Chancellor, and why media not concentrated this issue for these many days. and why the girls not raised this issue so far?.
అమ్మాయిలు చదువుకోకూడదు, జ్ఞానాన్ని సంపాదించకూడదు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశ్నించకూడదు. అలా అమ్మాయిలు ప్రశ్నించడం మొదలుపెడితే ఎన్నేసి మతాల పునాదులు కదిపోతాయో ఒక్కసారి ఆలోచించండి! Zameer-ud-din అంటే conscious of the religion అని అర్ధం. ఆయనగారు సార్ధకనామధేయులు!
ఇలాంటి వ్యక్తిని V.C.గా భరించవలసివస్తున్నందుకు అలీఘడ్ విద్యర్ధులకి నా సానుభూతి.
ఆ వీసీ ఉద్దేశం ఏమిటట అంటే….
ఆ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ నుంచి పీజీతో పాటూ పరిశోధన చేసే విద్యార్థినులూ ఉన్నారట. ఐతే సహజంగానే ఇంటర్ మీడియట్ స్థాయి విద్యార్థినులు ఎక్కువగా ఉంటారు కదా…అక్కడ 2700 మంది ఉన్నారట. వీళ్లు లైబ్రరీకి రావడం వల్ల పరిశోధక విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని…పైగా ఇంటర్మీడియట్ స్థాయికి వారికి లైబ్రరీతో పెద్ద పనేమీ ఉండదు కదా అని ఆ అమయాక వీసీ అనుకున్నారట…
– లైబ్రరీ విద్యార్థినులకు సరిపోదనుకుంటే….లైబ్రరీ వసతులు పెంచాలి. లేదా ఇంటర్ మీడియట్ వారికోసం మరోచోట లైబ్రరీ పెట్టాలి. అందునా యూనివర్శిటీ కాబట్టి ఎప్పటికప్పు తన మౌలిక సౌకర్యాలు పెంచుకోవాలి కానీ….తిరోగమనం దిశగా పయనించడం శోచనీయం.
– ఇలాంటి వాటివల్లేనేమో….ఇటీవల జరిగిన ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలపైన జరిగిన
ఓ అధ్యయనంలో…. మనదేశానికి చెందిన యూనివర్శిటీల్లో టాప్ 200 దాకా ఒక్కటీ లేదు. ఐఐటీలు 220 తర్వాత స్థానంలో నిలబడ్డాయి. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందన్న సూక్తి మన పాలకుల చెవికి ఇంకా చేరుకోలేదు.