Yet again a sensible political cartoon from Keshav!
కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో సున్నిత హాస్యస్ఫోరకమైన కార్టూన్!
బి.జె.పి, శివసేనలు, ఆ పార్టీలు తమదిగా చెప్పుకునే రాజకీయ-సాంస్కృతిక-చారిత్రక భావజాలం రీత్యా, విడదీయరాని, విడదీయ లేని కవలలు.
విడదీయలేని కవలలను విడదీయడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించాలి. వైద్య శాస్త్రంలోని అనేక శాఖలలో నిష్ణాతులయిన వైద్యులు ఉమ్మడిగా, క్రమబద్ధంగా, జాగ్రత్తగా గంటల తరబడి కృషి చేస్తే గాని కవలలు ఇద్దరినీ ప్రాణంతో విడదీయడం సాధ్యం కాదు. అనేక కేసుల్లో ఇద్దరి ప్రాణం పోతుందన్న భయంతో శస్త్ర చికిత్సకు వైద్యులు సిద్ధపడరు.
నేటి రోజులు బి.జె.పివి. పట్టిందల్లా బంగారం అయిపోయినట్లు కాలు పెట్టిన చోటల్లా అధికారం దక్కుతున్న రోజులు! అందుకు కారణం తమ నాయకత్వ ప్రతిభే అని బి.జె.పి నేతలు భావిస్తుండవచ్చు. కానీ ఈ రోజే ఓ కార్యక్రమంలో అద్వానీ వ్యాఖ్యానించినట్లు, ఎన్నడూ లేని పూర్తి స్ధాయి మెజారిటీతో బి.జె.పి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అత్యంత తీవ్రంగా శ్రమించిన ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే, అది కాంగ్రెస్! నెగిటివ్ ఓటుతోనే బి.జె.పి విజయం దక్కింది తప్ప పాజిటివ్ ఓటుతో కాదని అద్వానీ చెప్పకనే చెప్పారు. తద్వారా మోడి జైత్రయాత్ర అన్న భావనను ఆయన నిరాకరించడం వేరే సంగతి.
ఈ నేపధ్యంలో విడదీయలేని కవల సోదరుడిని కూటమి నుండి ఎగిరి అవతల పడేలా లాగి తంతే, ఈ రోజు అవతల పడేది శివసేన కావచ్చు గాని, రేపు కింద పడేది బి.జె.పియే అని కార్టూనిస్టు ఎంతో తమాషాగా రూపు కట్టారు. పక్కన శరద్ పవార్ ని చూసుకుని తన్నితే రేపు కింద పడ్డప్పుడు లేవదీసే పనిలో ఆయన ఉండబోరని కూడా కార్టూన్ పరోక్షంగా సూచిస్తున్నట్లుంది.
నిజానికి బేషరతు మద్దతు ఇవ్వడంలో శరద్ పవార్ వ్యూహం అదే కావచ్చు. తన ఓటరు పునాదిని ఖాళీ చేస్తుంటే, ఏ రాజకీయ గండర గండడు చూస్తూ ఊరుకోగలడు చెప్పండి?!
శరద్ పవర్ ను నిజంగానే రాజకీయాలలో గండర గండుడనే అనుకోవలసి ఉంటుందా?