మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!


జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.

మియాన్మార్ పర్యటన అనంతరం ప్రధాని మోడి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియాలో మొదటి రోజు ఆయన క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు. యూనివర్సిటీ వారు తయారు చేసిన అగ్రికల్చరల్ రోబోట్ ను చూశారు. అక్కడ సందేశం రాశారు. యూనివర్సిటీ పిల్లలను కలుసుకుని ఈ రోజు ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ పుట్టిన రోజని, ఆయన పుట్టిన రోజును తాము పిల్లల దినంగా జరుపుతామని, ‘పిల్లలదినం రోజున పిల్లల మధ్య గడపడం ఆనందంగా ఉంద’ని పిల్లలకు చెప్పారు.

మోడి సందర్శన సాగుతున్న క్రమంలో ఓ చోట ఇండియా పటంలో కాశ్మీరు లేకపోవడాన్ని కొందరు గమనించారు. విషయం ఎలా బైటికి పోక్కిందో తెలియదు గాని ట్విట్టర్ లో కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. భారత ప్రధాని సమక్షంలోనే భారత దేశ పటంలో కాశ్మీరు లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ తప్పును భారత్ గుర్తించి ప్రశ్నించిందా లేదా అని అడిగారు.

వారికి సమాధానంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. జరిగిన తప్పును తాము వెంటనే ఎత్తి చూపామని, యూనివర్సిటీ అధికారులు మనకు బేషరతు క్షమాపణలు చెప్పారని అక్బరుద్దీన్ ట్విట్టర్ లోనే సమాధానం ఇచ్చారు. విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్ ఈ అంశాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తెచ్చారని ఆ మేరకు సమాధానం పొందామని అక్బరుద్దీన్ తెలిపారు.

కానీ ఈ విషయమై సుజాత సింగ్ ఏమి చెప్పారో పత్రికల నుండి ఎలాంటి సమాచారం లేదు. దేశ సరిహద్దుల గురించి ఎలాంటి రాజీ పడేది లేదని ప్రధాని నరేంద్ర మోడి తరచుగా చెబుతుంటారు. ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తూ ఆయన కఠినమైన హెచ్చరికలే జారీ చేశారు. కాశ్మీరు, ఆక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ల వద్ద చైనా, పాకిస్తాన్ లతో ఉన్న సరిహద్దు వివాదాల్లో యు.పి.ఏ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించ్చిందని, తాము అధికారంలోకి వస్తే రాజీలేని కఠిన వైఖరి పాటిస్తామని మోడి హామీ ఇచ్చారు. అలాంటి మోడి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన పర్యటనలోనే భారత దేశ సరిహద్దు విషయంలో తప్పు దొర్లినప్పటికీ హిందూత్వ సంస్ధలు కిక్కురుమనకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? యు.పి.ఏ అధికారంలో ఉంటే ఒక వైఖరి, తమ ప్రతినిధి అధికారంలో ఉంటే మరో వైఖరిని హిందూత్వ సంస్ధలు పాటిస్తాయని ప్రజలు భావించాలా?

దేశ సరిహద్దులకు సంబంధించి మోడి ప్రధాన మంత్రిగా ఉండగా భిన్న వైఖరి కలిగి ఉండడం ఇదే మొదటిసారి కాదు. చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఇండియా పర్యటించినపుడు గుజరాత్ ప్రభుత్వం ఏకంగా అక్సాయ్ చిన్ ను తీసుకెళ్లి చైనాలో కలిపేసింది. జమ్ము & కాశ్మీర్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలను వివాదాస్పద ప్రాంతాలుగా చూపించింది. అప్పుడు కూడా హిందూత్వ సంస్ధలు కిక్కురుమనలేదు.

మోడి, గ్జి జిన్ పింగ్ ల సమక్షంలో చైనీయ గువాంగ్ డాంగ్ రాష్ట్రానికి, గుజరాత్ రాష్ట్రానికి మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి డి పాండ్యన్ గువాంగ్ డాంగ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియజేసే పటాన్ని కాపీలు తీసి ఆహూతులకు పంచి పెట్టారు. ఈ పటంలో అరుణాచల్ ప్రదేశ్, జమ్ము & కాశ్మీర్ లు వివాదాస్పద రాష్ట్రాలుగా చూపించగా, అక్సాయ్ చిన్ ను చైనాలో భాగంగా చూపించారు. చైనా అధ్యక్షుడిని మంచి చేసుకోవడానికే గుజరాత్ ప్రభుత్వం ఈ పనికి దిగిందని ఎవరన్నా ఆరోపిస్తే అందులో తప్పు వెతకవచ్చా?

ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాలలో కూడా ఇదే పటాన్ని అధికారికంగా చూపి ఉంటారని, దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినా గుజరాత్ ప్రభుత్వం నుండి సమాధానం వఛ్కిన దాఖలా లేదు. MoU లో పటం కలపలేదని గుజరాత్ ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్లుగా కొన్ని పత్రికలు చెప్పినప్పటికీ అసలు పటంలో తప్పు దొర్లడానికి కారణం ఏమిటో చెప్పలేదు. జిన్ పింగ్ పర్యటన కొనసాగినన్ని రోజులు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు అధికారిక కార్యక్రమాల నుండి దూరంగా పెట్టారని కూడా కాంగ్రెస్ ఆరోపించింది.

కాశ్మీర్ ప్రజల దృష్టిలో జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉండగా మెజారిటీ భాగం ఇండియా ఆక్రమణలో ఉంది. వారి దృష్టి కోణాన్ని మార్చాలని ఆశిస్తే వారి చారిత్రక జాతి హక్కులను గౌరవిస్తూ, వారి మనసులను గెలుచుకునే విధానాలను అవలంబించడం మినహా మరో మార్గం లేదు. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల విషయంలో చైనా, ఇండియాలు సామరస్య పూర్వకంగా చర్చలు జరుపుకుని శాశ్వత సరిహద్దులను నిర్ణయించుకోవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అప్పటివరకూ సరిహద్దు తగాదా విషయంలో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కొనసాగుతూనే ఉంటుంది.

Photos: Indian Express, Zee News, India Today

3 thoughts on “మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

  1. హిందూత్వవాదుల నాటకాలు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వికీపీదియాలో, కాశ్మీర్ పాకిస్తాన్‌లో ఉన్నట్టు ఎప్పటి నుంచో చూపిస్తోన్నా భాజపావాళ్ళు పట్టించుకోలేదు కానీ గూగుల్ చైనాలో అక్సాయ్‌చిన్ చైనాలో ఉన్నట్టు చూపిస్తే భాజపా నేత సుబ్రమణ్య స్వామి చైనాని తిడుతూ ఫేస్‌బుక్‌లో పోస్త్ పెట్టాడు.

  2. ప్రవీణ్ గారూ, రాజకీయ విమర్శల్లో గానీ ఇతర వ్యవస్ధాగత విమర్శల్లో గానీ వ్యక్తిగత ప్రసక్తితో విమర్శ చేస్తే అది హుందాగా ఉండదు. మీరు తరచుగా ఆ పని చేస్తున్నారు. అందువల్ల మీ విమర్శలో వాడి తగ్గిపోతుంది. ‘నాకు తెలుసు’ అన్నది వ్యక్తిగతం. అది అప్రస్తుతం. విమర్శను విషయం పైనే ప్రధానంగా కేంద్రీకరించగలిగితే ఉపయోగం.

  3. సుబ్రహ్మణ్యస్వామి చైనాని తిడుతూ ఫేస్‌బుక్‌లో పోస్త్ పెట్టినప్పుడు చాలా మంది అసలు విషయం గమనించలేదు. ఆ విషయం నేను గమనించాను అంటే దాని అర్థం నేను ఒక్కణ్ణే గమనించాను అని కాదు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s