‘ఎరుపంటే ఎందుకురా భయం భయం!
పసి పిల్లలు మీకంటే నయం నయం!!
కలం వెంబడి అచ్చంగా నిప్పులు కురిపించిన చెరబండరాజు గారి ఓ కవితలోని పాదాలివి.
ఇంధ్ర ధనుస్సులో ఎరుపు రంగు ఆ చివరన ఉంటుంది. ఎరుపు రంగు కిరణానికి తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) మిగిలిన ఆరు రంగులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందువలన ఎరుపు రంగు తీక్షణత ఎక్కువ. ఆ కారణం వల్ల పసి పిల్లలు ఎరుపు రంగుకి ఇట్టే ఆకర్షితులు అవుతారు.
రక్తం పోరాటానికి చిహ్నం. పోరాటంలో గాయం తప్పనిసరి. అనాది కాలం నుండి వ్యవస్ధల మార్పులకు దారి తీసిన వర్గ పోరాటాల సంగతి చెప్పనే అవసరం లేదు. అణచివేత ఉన్నచోట తిరుగుబాటు తప్పదు. తిరుగుబాటు సఫలం అయినా, విఫలం అయినా రక్తం చిందక తప్పదు. రక్తం రంగు ఎరుపు. ఆ విధంగా ఎరుపు పోరాటానికి, తిరుగుబాటుకు చిహ్నం అయింది.
చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు పోరాట కెరటమై ముంచెత్తినపుడు పోలీసులు కాల్పులు జరిపి కొందరిని పొట్టన బెట్టుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వీరుడొకరు నేలకు ఒరుగుతూ రక్తంతో తడిచిన తన ఒంటి వస్త్రాన్ని ఎత్తిపట్టి ‘ఇదే మన జెండా’ అని నినదించాడు. ఆ విధంగా కార్మిక వర్గానికి, కార్మికవర్గ పోరాటాలకు ఎరుపు రంగు ప్రియమైన రంగు అయింది.
ఈ చరిత్ర లోతులు తెలియని అధములు ఎరుపుని హేళన చేయడం కద్దు. వారి హేళనలు ఎలా ఉన్నప్పటికీ శ్రామికులను అణచివేతకు గురి చేసే ధనిక వర్గ పాలకులు సైతం పోరాటాల ఎరుపు రంగుని తామూ స్వీకరించడం తాజా ధోరణిగా కనిపిస్తోంది.
లేదంటే “Blood Swept Lands and Seas of Red” పేరుతో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం తరపున యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన జవాన్ల స్మృతిలో లండన్ లో భారీ స్మృతి కళా చిహ్నం (Art installation) నిర్మించి ప్రదర్శించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
లండన్ సామ్రాజ్యాధీశుల ఎరుపు ధోరణి సంగతి అటుంచితే, వారి పనుపున కళా ప్రియులు సృష్టించిన భారీ కళా చిహ్నం మాత్రం అద్వితీయంగా కనిపిస్తోంది.
2014 నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 యేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా కామన్ వెల్త్ (బ్రిటిష్ సామ్రాజ్యం నీడన బతికిన దేశాల కూటమి) దేశాల నుండి యుద్ధంలో పాల్గొని మరణించిన ఒక్కొక్క సైనికుడికి గుర్తుగా ఒక్కొక్క ఎర్రని సిరమిక్ పాపీ పువ్వును నాటడం ప్రారంభించారు. జులై 17 తేదీన ‘టవర్ ఆఫ్ లండన్’ వద్ద ప్రారంభం అయిన ఈ ప్రక్రియ కళాకారులు నిర్మించిన స్మృతి చిహ్నంగా రూపు దిద్దుకుంది.
అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 8,88,245 సిరమిక్ పాపీ పుష్పాలను కళాకృతి వద్ద నాటారు. ఇలా నాటే ప్రక్రియను ఒక క్రమ పద్ధతిలో కొనసాగిస్తూ వచ్చారు. వీటన్నింటిని కలిపి చూస్తే కోట గోడ లోని ఒక కిటికీ నుండి రక్తం కారుతూ ఒక పెద్ద ఎర్ర సముద్రంగా మారిన దృశ్యం మన కళ్ల ముందు కనపడేలా రూపు దిద్దారు.
రక్తం కారుతున్న కిటికీని Weeping Window (ఏడుస్తున్న కిటికీ) గా కళాకారులు పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులను తలచుకుని బ్రిటిష్ రాణిగారి కోట ఒక కిటికీ ద్వారా విలపిస్తోందని, ఈ కోట విలాపం కన్నీటికి బదులు ఆనాటి సైనికులు తర్పణం కావించిన రక్తాన్ని కార్చితోందని ఆ రక్తమే ఈనాడు సముద్రమై మన ముందు నిలిచిందని కళాకారులు చెప్పదలిచారు.
“రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా” అన్నట్టుగా, “రాణి గారు తలచుకుంటే రక్త సముద్రాలకు కొదవా” అనుకోవాలిక!
మొదటి ప్రపంచ యుద్ధం శ్రామికుల కోసం జరిగిన యుద్ధం కాదు. అది సామ్రాజ్యాల కోసం జరిగిన యుద్ధం. అప్పటికే ప్రపంచ మార్కెట్లను ఆక్రమించిన సామ్రాజ్యాల నుండి తగిన మార్కెట్ వాటాను సామరస్య చర్చలలో పొందలేకపోయిన నూతన సామ్రాజ్యాలు బలవంతంగా లాక్కోవడానికి తెగబడిన ఫలితంగా ప్రపంచ మానవ సమాజంపై రుద్దబడిన అంతులేని మానవ హనన యుద్ధమది.
సైనికులు రక్త తర్పణం కావించడం నిజమే గానీ, రక్త తర్పణ ఫలితం ప్రజలకు సరే, కనీసం ఆ సైనికులకు కూడా దక్కలేదన్నది చేదు వాస్తవం.
కానీ ఈ కళాకృతి మాత్రం పరమాద్భుతం అని చెప్పక తప్పదు. ఇప్పటికే నాలుగు మిలియన్ల మంది సందర్శించిన ఈ అద్భుత స్మృతి చిహ్నాన్ని కావాలంటే మీరూ చూడండి.
Photos: The Atlantic