(శరద్ పవార్ పార్టీ ఎన్.సి.పి ఓటింగులో పాల్గొనబోనని చెబుతూనే ఉంది. అవసరం అయితే బి.జె.పి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తానని కూడా చివరి క్షణాల్లో ప్రకటించింది. అయినప్పటికీ 41 మంది ఎన్.సి.పి సభ్యుల మద్దతుతో విశ్వాస పరీక్ష నెగ్గడం కంటే, న్యాయబద్ధత అంతగా లేని మూజువాణి ఓటుతో నెగ్గించుకోవడానికే బి.జె.పి మొగ్గు చూపింది. ఈ అంశంపై ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్)
************
122 మంది ఎమ్మెల్యేల బి.జె.పి, మెజారిటీకి 22 సీట్లు తగ్గినప్పటికీ, మహారాష్ట్ర అసెంబ్లీలో 13 రోజుల దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుందని పరీక్షకు చాలా ముందుగానే స్పష్టమైపోయింది. 41 మంది సభ్యులు కలిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తాను ఓటింగులో పాల్గొనకుండా తప్పుకుంటానని మొదటి నుండి చెబుతూనే ఉంది. తద్వారా సభా బలాన్ని తగ్గించడం ద్వారా బి.జె.పి ప్రభుత్వానికి సురక్షితమైన మార్గాన్ని తెరిచి ఉంచింది. ఓటింగు రోజు వచ్చేనాటికి ఎన్.సి.పి మరో అడుగు ముందుకు వెళ్ళి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి అంగీకరించింది. ఆ విధంగా ప్రభుత్వానికి 19 ఓట్ల మెజారిటీ వచ్చి ఉండేది.
అయినప్పటికీ బుధవారం నాడు ఓట్ల విభజనకు లేదా తలల లెక్కింపుకు నిరాకరించడం ద్వారా తన విజయాన్ని కాంతి విహీనం కావించడంతో పాటు బలహీనపరచడానికి సైతం, బి.జె.పి మొగ్గు చూపింది. కాంగ్రెస్, శివసేన సభ్యులు తీవ్ర ధ్వనితో నిరసిస్తున్నప్పటికీ -కొందరు సభ్యులు అసెంబ్లీ వెల్ లోకి కూడా ప్రవేశించారు- బి.జె.పి ప్రభుత్వం మూజువాణి ఓటు ద్వారా విశ్వాస పరీక్ష నెగ్గింది. పర్యవసానంగా ఓ ప్రశ్న తలెత్తుతోంది: తలలను నిజంగానే లెక్కించినా సరే ఎలాగూ విశ్వాస పరీక్షను బి.జె.పి నెగ్గే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ న్యాయబద్ధత కలిగిన మూజు వాణి ఓటింగును ఎందుకు ఆశ్రయించినట్లు? అది కూడా ఐదేళ్ల పదవీ కాలం ఆరంభంలోనే?
తనకు అనుకూలంగా ప్రజల భావోద్వేగాలు భారీ మొత్తంలో కొనసాగుతున్న నేపధ్యంలో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న బి.జె.పికి ఓటింగులో నెగ్గుతానన్న నమ్మకం లేదని భావించలేము. మరింత సంబద్ధమైన కారణం ఏమై ఉంటుందంటే… ఎన్.సి.పి మద్దతు తీసుకున్నట్లుగా కనిపించడానికి బి.జె.పికి ఇష్టం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలోనే కాకుండా తాను ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ కూడా అవినీతి కారణంతో అత్యంత తీవ్రంగా బి.జె.పి టార్గెట్ చేసిన పార్టీ ఎన్.సి.పి. ఉదాహరణకి దశాబ్దకాలం పాటు నీటిపారుదల మంత్రిత్వ శాఖను నిర్వహించిన ఎన్.సి.పి, వేలాది కోట్ల రూపాయల ఆర్ధిక కుంభకోణానికి కారణంగా ఆరోపణలకు గురై, ఉప ముఖ్య మంత్రి పదవికి ఎన్.సి.పి నేత అజిత్ పవార్ రాజీనామా చేసేందుకు కూడా దారి తీసింది. సునీల్ తత్కారే, చగన్ భుజబల్ లాంటి ఇతర ఎన్.సి.పి నేతలు కూడా అనేక ఇతర కుంభకోణాలకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొన్న అటువంటి పార్టీ నుండి, స్ధిరమైన ప్రభుత్వం ఏర్పరిచే పేరుతో, ఇప్పుడు మద్దతు తీసుకోవడం అంటే సుపరిపాలన, స్వచ్ఛమైన మరియు పారదర్శకమైన ప్రభుత్వ పాలనను అందిస్తామన్న తమ వాగ్దానంపై (అనుమానపు) క్రీనీడ పడుతుందని ఆ పార్టీ నేతలు భావించి ఉండవచ్చు. కానీ, “ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారన్న” శివసేన ఆరోపణల నేపధ్యంలోనూ, తాజాగా మళ్ళీ సభా విశ్వాసం కోరనంతవరకూ సభలో ఎలాంటి కార్యకలాపాన్ని అనుమతించేది లేదన్న కాంగ్రెస్ హెచ్చరికల వల్లనూ, రానున్న వారాలలో ఫడ్నవీస్ ప్రభుత్వం తన పనిపై శ్రద్ధ పెట్టడం కష్టంగా మారవచ్చు. డివిజన్ ఓటింగ్ కోసం చేసిన డిమాండ్ ను తిరస్కరించిన నూతన స్పీకర్ హరిభవు బగాడే పై అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా కాంగ్రెస్ బెదిరించింది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం పొందే విషయంలోనూ కొత్త ప్రభుత్వం ఓటింగును ఎదుర్కోవలసి రావచ్చు. అందుకోసం మళ్ళీ తన బలగాలను కూర్చుకోవలసిన అవసరం ఎలాగూ తప్పదు. ఇది అంత సానుకూలమైన ఆరంభం కాదన్నది స్పష్టమే.