బి.జె.పి నేత నరేంద్ర మోడి హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’ ప్రజల ముందుకు ఒక్కొక్కటి వచ్చి వాలుతోంది. 4.5 కోట్ల కుటుంబాలకు ఉపాధి ఇచ్చే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లు అనుమతించేది లేదన్నారు. ఆన్-లైన్ రిటైల్ మార్కెటింగ్ గేట్లను బార్లా తెరిచేశారు. ‘శ్రమయేవ జయతే’ అంటూ కార్మికుడిని ‘శ్రమ యోగి’ అని నెత్తిన పెట్టుకున్నామన్నారు. కార్మికుల హక్కులను నేల రాస్తూ కంపెనీలకు చిత్తానుసారం ‘హైర్ అండ్ ఫైర్’ చేసే హక్కును దఖలు పరిచారు. తాజాగా గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీని కె.జి కి 20 రూపాయల మేరకే పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదీ ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా!
బడ్జెట్ ద్వారా ఇచ్చే వంట గ్యాస్ సబ్సిడీని ఒక కె.జికి 20 రూపాయల వద్ద స్తంభింపజేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చర్య వల్ల తక్షణం వంట గ్యాస్ రేట్లు పెరగవు. అంతర్జాతీయంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం వల్లా, అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తితో ఆ దేశ గ్యాస్ దిగుమతులు తగ్గడం వల్లా గ్యాస్, చమురు ధరలు తగ్గడంతో ప్రస్తుతానికి కేంద్ర చర్య గ్యాస్ ధరలపై ప్రభావం చూపవు.
కానీ ఇంధన ధరలు ఎప్పుడూ తగ్గిన స్ధితిలో కొనసాగవు. అప్పుడప్పుడూ తగ్గుదల చూపినా, అవి నికరంగా పైకి, ఇంకా పైకి చూస్తుంటాయి. కావున సబ్సిడీని స్తంభింపజేసినందున భవిష్యత్తులో ధరలు పెరిగినప్పుడు ఆ పెరిగిన ధరని చమురు శుద్ధి కంపెనీలన్నా భరించాలి లేదా వినియోగాదురుల నెత్తినన్నా మోదాలి. కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని చెప్పే కదా, ప్రతినెలా ఇంధనం ధరలు పెంచుతున్నది! కాబట్టి పెరిగే ధరలు జనం నెత్తిన పడడం ఖాయంగా కనిపిస్తోంది.
గ్యాస్ సబ్సిడీ స్తంభన గురించి చెబుతూ యూనియన్ చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇలా తెలిపారు: “వంట గ్యాస్ నిమిత్తం స్ధిరమైన బడ్జెట్ సబ్సిడీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సబ్సిడీని కిలో గ్యాస్ కి రు. 20 వద్ద స్తంభింపజేసాము. కె.జి ఒక్కింటికి సబ్సిడీని స్తంభింపజేసినందున చమురు కంపెనీలు సదరు సబ్సిడీని అవసరమైన వారికి మాత్రమే అందేలా జాగ్రత్త తీసుకోవాలి. వారు పెద్ద సిలిండర్లను కొనుగోలు చేయగల పరిస్ధితిలో ఉండరు. FMGC (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు షాంపూలు లాంటి ఉత్పత్తులను చిన్న సైజులో తయారు చేసి జనానికి అందుబాటులో ఉంచినట్లుగానే వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్లను 5 కె.జిల సామర్ధ్యం గలవి ఇవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాము” అని ప్రధాన్ తెలిపారు.
చమురు మంత్రి ఉద్దేశ్యంలో: గ్యాస్ ధరలు తగ్గించి పేదలకు సైతం అందుబాటులోకి తేవాలంటే చమురు, గ్యాస్ ధరలను వాస్తవంగా తగ్గించవలసిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ల సైజునే కుందించి వేసి, ధరలు తగ్గాయన్న భ్రమలు కలుగజేస్తే సరిపోతుంది. వలస వెళ్ళినవారు, విద్యార్ధులు, కార్మికులు మొదలైన వారికి పెద్ద సిలిండర్లు అవసరం లేదు. వారు తక్కువ డబ్బు వెచ్చించి చిన్న సైజు సిలిండర్లు కొనుక్కుని వాటితో సర్దుకోగలరు. పెద్ద సిలిండర్లు వారికెందుకు?
ప్రస్తుతం గృహ, వాణిజ్య వినియోగదారులు వాడుతున్న సాధారణ సిలిండర్ బరువు 14.2 కె.జిలు. సబ్సిడీ ఈ సిలిండర్లకు మాత్రమే ఇప్పుడు అందిస్తున్నారు. 5 కె.జిల సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వడం లేదు. ఈ ఆచరణ నుండి పక్కకు తొలిగి చిన్న సిలిండర్లకు కూడా సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధర పెరిగిపోయిందన్న వాస్తవం అనుభవం లోకి రాకుండానే వారి చేత చేదు మాత్ర మింగించవచ్చు.
కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పధకాన్ని కొనసాగించడం. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు నగదు బదిలీ పధకాన్ని విమర్శించారు. ఆధార్ కార్డు అనుసంధానాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తోడనే ఈ రెండింటిని అమలు చేయడానికి బి.జె.పి పూనుకుంది. కాంగ్రెస్/యు.పి.ఏ ప్రభుత్వం చెప్పినట్లుగానే సబ్సిడీ లీకేజి అరికట్టడానికి ఈ చర్య తప్పనిసరి అని ఎన్.డి.ఏ/బి.జె.పి చెబుతోంది. అయితే ఆధార్ అనుసంధానానికి, గ్యాస్ సిలిండర్ డెలివరీకి మధ్య సంబంధం పెట్టబోమని చెప్పడం ఒక ఊరట. ఇది అనుకోవడానికి/చెప్పుకోవడానికి మాత్రమే. సాక్ష్యాత్తు సుప్రీం కోర్టు ఆధార్ కార్డుకూ ఇతర పౌర సేవలకూ లంకె పెట్టొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆధార్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
కేంద్రం తీసుకున్న సబ్సిడీ స్తంభన నిర్ణయం ఫలితం ఏమిటో కింద పటంలో చూడవచ్చు.