ఒక నాటకం పూర్తయింది. పత్రికలను, రాజకీయ విశ్లేషకులను, పరిశీలకులను, జనాన్ని చివరి నిమిషం వరకు ముని వేళ్ళ మీద నిలబెట్టిన సస్పెన్స్ ధ్రిల్లర్ చివరికి ఎటువంటి మలుపులు లేకుండానే చప్పగా ముగిసింది. రంగంలో ఉన్న పార్టీలన్నీ, చివరికి కాంగ్రెస్ తో సహా, చక్కగా సహకరించడంతో మొట్టమొదటి బి.జె.పి ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా విశ్వాస పరీక్ష పూర్తి చేసుకుంది.
బి.జె.పి ప్రభుత్వం విశ్వాస పరీక్ష విషయంలో అసలు ఓటింగు కోరిన నాధుడే లేడు. కాంగ్రెస్, ఎన్.సి.పి, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన… ఇలా పార్టీలన్నీ పూర్తి సహకారం అందించడంతో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను పూర్తి చేసుకుంది. 5 యేళ్ళ పాటు ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని పాలించవలసిన ప్రభుత్వ మెజారిటీని, అది కూడా అనుమానాస్పద పరిస్ధితులు నెలకొని ఉన్న పరిస్ధితుల్లో, కేవలం మూజువాణి ఓటు ద్వారా నిర్ణయించేశారు.
ప్రతిపక్షంలో కూర్చుంటానని ప్రకటించిన శివసేన కనీసం మూజువాణి ఓటులో కూడా ‘నో’ అని చెప్పలేదు. మూజువాణి ఓటు అంటే స్పీకర్/ప్రోటెం స్పీకర్ ఒక తీర్మానాన్ని చదివి దానికి ఒప్పుకునేవారు Aye అనాలని కోరుతారు. వ్యతిరేకించేవారు No అనాలని కోరుతారు. ప్రోటెం స్పీకర్ గారు విశ్వాస తీర్మానానికి Aye లను తీసుకున్నారు గాని No లను తీసుకోలేదని పత్రికల ద్వారా తెలుస్తోంది. No ఓటు తీసుకోవాలని శివసేన కోరలేదు, కాంగ్రెస్ కూడా కోరలేదు. ప్రభుత్వ ఏర్పాటులో పాలకవర్గ పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
ఇంతకీ శివసేన ప్రభుత్వానికి అనుకూలంగా మూజువాణి ఓటింగులో పాల్గొన్నదో లేక వ్యతిరేకంగా పాల్గొన్నదో తెలియదు. పత్రికలు కూడా ఏ విషయం చెప్పలేకపోయాయి. కాంగ్రెస్ కూడా No ఓట్ల కోసం అడగకపోవడం మరీ దారుణం. భారత దేశంలో ఉందని చెప్పే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలకమైన పాత్ర అప్పగించబడింది. నిరంతరం మెలకువగా ఉంటూ పాలక పక్షం పాలనను తగిన విధంగా విమర్శలకు గురి చేస్తూ తద్వారా ప్రజలకు నిఖార్సయిన, సద్విమర్శలతో పాలిష్ చేయబడిన ప్రజాస్వామ్య పాలనను అందించే బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. అలాంటిది విశ్వాస పరీక్షలో కనీసం తమ వ్యతిరేకతను కూడా కాంగ్రెస్, శివసేనలు రికార్డు చేయకపోవడం దారుణం.
అంతకు ముందు బుధవారం ఉదయం వరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో శివసేన జరిపిన చర్చలు విఫలం అయ్యాయని పత్రికలు తెలిపాయి. అనగా తమ మధ్య ఏవో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని చివరి నిమిషం వరకు చెప్పేందుకు బి.జె.పి, శివసేనలు ప్రయత్నించాయి. ఈ విభేదాలు కేవలం పదవి పంపకాల గురించే తప్ప ప్రజా సేవ గురించి కాదన్నది స్పష్టమే. అంతకాడికి రోజుల తరబడి హెచ్చరికలు చేసుకుంటూ, విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకుంటూ షో చేయడం ఎందుకు?
పరిస్ధితి గురించి ఎన్.సి.పి నాయకులు చేసిన వ్యాఖ్యానంలోనే సగం అర్ధం అవుతుంది. “ఢిల్లీలో బేరసారాలు జరపడానికి వాళ్ళు తమ ప్రతినిధిని పంపించారు. ముంబైలో కూడా వారు బేరాలు సాగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి బేరసారాల్లో మునిగి తేలుతున్నది వారే” అని ఎన్.సి.పి నేత చగన్ భుజ్ బల్, శివసేనపై వ్యాఖ్యానిస్తూ అన్నారు.
స్పీకర్ పదవికి కూడా తమ అభ్యర్ధిని నిలబెట్టిన శివసేన చివరికి ఆయనను కూడా ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ కూడా స్పీకర్ పదవికి అభ్యర్ధిని నిలపలేదు. ఆ విధంగా స్పీకర్ ఎన్నిక నల్లేరుపై నడక కానుంది.
కనుక కేకులో సాధ్యమైనంత ఎక్కువ వాటా కోసం శివసేన బేరం ఆడగా, అందుకు బి.జె.పి ఒప్పుకోకపోవడమే అసలు విషయం. ఇందులో ప్రజాస్వామ్యమూ లేడు, ప్రజా సేవా లేదు, ప్రజల ప్రయోజనాలూ లేవు. ఉన్నదంతా సంపదల దోపిడీ రాజకీయాలే.
ఈ సినిమాని (నాటకాన్ని) నేను ఇంతవరకే బోలెడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ నరాలు తెగిపోయేంత సస్పెన్స్ అనుభవించాను. రేప్పొద్దున ఇదే సినిమాని వేరేరాస్ట్రాలవాళ్ళు తమ ప్రాంతీయంగా రీమేక్ చేయుదురు. మరికొందరు ఇదే కధతో ఏకంగా బాలీవుడ్డు సినిమానే తీసెదరు. అప్పుడుకూడా నేను ఇదే సస్పెన్స్‌తోడ దాన్ని ఆస్వాదించెదనని, ఒక ఉత్తమ ప్రేక్షకుడిగా నోరుమెదపక చూసెదనని ఇక్కడ ప్రమాణం చేయుచున్నాడను.
ఇట్లు
ఒక ప్రేక్షక (ఓటరు) దేవుడు.