పెట్టుబడి వాతావరణం సరిగా లేదు -జపాన్


Yasutoshi Nishimura

ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా లేదని జపాన్ ఆరోపిస్తోంది. భారత ప్రధాని మోడి ఇటీవల జపాన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 3.5 ట్రిలియన్ యెన్ లు లేదా 35 బిలియన్ డాలర్లు లేదా 2.1 లక్షల కోట్ల రూపాయల మేర ఎఫ్.డి.ఐ లు (జపాన్ కంపెనీలు) ఇండియాకు తరలి వస్తాయని జపాన్ ఆర్భాటంగా ప్రకటించింది. ఆ ప్రకటని కార్యరూపం దాల్చాలంటే తమకున్న గొంతెమ్మ కోర్కెలు ఏమిటో జపాన్ ఇప్పుడు చెబుతోంది.

పెట్టుబడి వాతావరణ పేరుతో భారత ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్ని అంతటినీ తనకు అనుకూలంగా మార్చాలని లేకపోతే పెట్టుబడులు రావడం కష్టమని జపాన్ ప్రధాని షింజో అబే కార్యాలయంలోని మంత్రి యసుతోషు నిషిమూర షరతు విధించాడు. ఆర్ధిక సంస్కరణలు వేగవంతం చేయడం, మౌలిక సౌకర్యాలు నిర్మించడం, రెడ్ టేపిజాన్ని నిర్మూలించడం… ఇవీ యసుతోషి కోరిన కోర్కెలు.

ఆర్ధిక సంస్కరణలు అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు. భారత ప్రభుత్వానికి తద్వారా ప్రజలకు ఆదాయం ఇస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను విదేశీ కంపెనీలకు అమ్మిపారేయడం, భారత కార్మిక వర్గ హక్కులను కాపాడే చట్టాలను రద్దు చేసి విదేశీ కంపెనీలకు ఇష్టానురీతిన హైర్ & ఫైర్ చేసుకునే అవకాశం ఇవ్వడం, రెడ్ టేప్ నిర్మూలన పేరుతో భారత ప్రజల, ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని పక్కనబెట్టి ఎలాంటి చెకింగ్ లేకుండా వనరులన్నీ విదేశీ కంపెనీలకు అప్పగించడం… ఇవే యసుతోషి షరతుల/కోర్కెల అర్ధం.

“ఒక అడుగు వెంట మరో అడుగు వేస్తూ కదలికలో ఉన్నంతవరకూ మా అంచనాలు చేరుకోవడం సులభం అవుతుందని మేము భావిస్తున్నాము” అని యసుతోషి వాకృచ్చారు. “జపాన్ కంపెనీలు తమ పెట్టుబడులతో ముందుకు వస్తాయి. కానీ ఈ సంస్కరణలకు సంబంధించి స్పష్టమైన కదలిక ఉంటేనే” అని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు. తాము హామీ ఇచ్చిన 35 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కలిసి ఉంటాయని యశుతోష్ చెప్పారు.

జపాన్ ప్రభుత్వ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం 100 బిలియన్ డాలర్ల ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్, మెట్రో రవాణా, బులెట్ ట్రైన్ టెక్నాలజీ రంగాల్లో ఉంటుందని యశుతోష్ వివరించారు. మిగిలిన మొత్తాన్ని తమ ప్రైవేటు కంపెనీల నుండి వస్తుందని తాము అంచనాగా చెప్పామని తెలిపారు. అనగా జపాన్ ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించి ఇదమిద్ధమైన హామీ ఏమీ లేదు. జపాన్ ప్రభుత్వమే ఒక అంచనాగా తామే అనుకుని ప్రభుత్వ పెట్టుబడులతో కలిపి 35 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వస్తాయని ఊరించారు.

ఇంతోసి ఊరింపుకే దేశ ఆర్ధిక వ్యవస్ధను అంతటినీ తిరగేసి తమకు అప్పజెప్పాలని జపాన్ మంత్రి దాదాపు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ పెట్టుబడులే వరదలా వచ్చేస్తాయని మన ప్రధాని, మంత్రులు జనాన్ని ఉబ్బిస్తున్నారు. పెట్టుబడులు వచ్చేది లాభాల కోసమేనని, మనల్ని ఉద్ధరించడానికి ఏమీ కాదని తెలిసీ అందుకు విరుద్ధంగా జనాన్ని నమ్మించ జూడడమే పరమ ఆక్షేపణీయం.

ఐ.ఐ.ఎస్.ఎస్, ఓ.ఆర్.ఎఫ్ సంస్ధల ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ యసుతోషి ఈ కోర్కెలను/షరతులను వినిపించారు. తాము భారీ పెట్టుబడులు తెస్తున్నప్పటికీ దానికి తగినట్లుగా మౌలిక వసతుల నిర్మాణం వేగం పుంజుకోలేదని ఆయన నిరసించారు. “ఒకింత భారీ మొత్తంలోనే పెట్టుబడులు వచ్చాయి. అయినా ఆర్ధిక వృద్ధికి తగినట్లుగా మౌలిక వసతులను నిర్మించలేదు. ఆర్ధిక వృద్ధికి ఇది పెద్ద ఆటంకం” అని యూసుతోష్ సమావేశంలో గొప్పలు పోయారు.

భారత ప్రభుత్వమే మౌలిక వసతులు నిర్మిస్తే మరీ వీళ్లొచ్చి ఉద్ధరించేది ఏమిటో అర్ధం కాకుండా ఉంది. రోడ్లు, వంతెనలు, రవాణా వసతులు, విమానాశ్రయాలు, రైలు పట్టాలు, ఎక్స్ ప్రెస్ హైవే రోడ్లు, భారీ శీతల గిడ్డంగులు… ఇత్యాది మౌలిక వసతులన్నీ మనమే నిర్మించి పెడితే ఇక ఎఫ్.డి.ఐ లు ఎందుకట? మౌలిక వసతుల నిర్మాణానికి మన వద్ద నిధులు లేవని, ఎఫ్.ది.ఐ లను ఆహ్వానిస్తే వారే అన్నీ కట్టి పెడతారని కదా మన ప్రభుత్వ నేతలు చెబుతున్నది? అన్నీ మనమే కట్టుకుని, మనం దశాబ్దాల తరబడి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వ రంగాన్ని వాళ్ళకి రాసిచ్చేసి, మన దేశ ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం చేసుకున్నా చట్టాలన్నీ రద్దు చేసేసి ‘రండి బాబు దోచు కెళ్ళండి’ అని బొట్టు పెట్టి, ఎర్ర తివాచీ పరిచి పిలిస్తే వాళ్ళు వచ్చి మనల్ని కొత్తగా ఉద్దరించేది ఏమిటి?

మన బంగారం మంచిదవ్వాలే గాని…

 

5 thoughts on “పెట్టుబడి వాతావరణం సరిగా లేదు -జపాన్

  1. ఆంగ్లేయులు మన దేశంలో 55,000 కి.మి. వరకు రైలు మార్గాలు నిర్మిస్తే స్వాతంత్ర్యానంతరం మన పాలకులు దేశంలో కొత్తగా 10,000 కి.మి. వరకే రైలు మార్గాలే నిర్మించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు చేసి మనం సాధించిన మౌలిక సౌకర్యాలు ఇలా ఏడ్చాయి. మన నాయకులు సిగ్గు లేకుండా ఈ మౌలిక సౌకర్యాలని చూసి విదేశీ పెట్టుబడులు వస్తాయని జనాన్ని నమ్మిస్తున్నారు.

  2. రాక ముందే అన్నేసి హెచ్చరికలు ఇక వచ్చింతరువాత చెప్పాలా? ఉన్నదొంగను వదిలేసి, కొత్త దొంగను బొట్టుపెట్టీ మరి పిలవడం లాగే ఉంది? డబ్బులతోటి డబ్బులు పండించడానికి వాడొస్తుంటే మేమెసినపంట కోతకొచ్చింది కోసుక పోండి అన్నట్లుంది.

  3. తాము అధికారంలో కొనసాగితే సామ్రాజ్యవాదులు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందనే భయంతో కాంగ్రెస్ కావాలని ఎన్నికల్లో ఓడిపోయిందేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s