మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శివసేన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న బి.జె.పి లక్ష్యం, ఆరు నూరైనా మహారాష్ట్ర వరకు తనదే పై చేయి కావాలని భావిస్తున్న శివసేన… వెరసి రాష్ట్ర ప్రజల ముందు ఓ వింత నాటకం ఆవిష్కృతం అవుతోంది. బి.జె.పికి బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా ఎన్.సి.పి, శివసేన బేరసారాల శక్తిని దారుణంగా దిగ్గోయడంతో బి.జె.పికి అదనపు శక్తి వచ్చినట్లయింది. కానీ బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్.సి.పి అంత తేలిగ్గా సరెండర్ కాదని, సమయం చూసి తగిన దెబ్బ వేయడం ఖాయమని, అందుకే బి.జె.పి-శివసేనలు ఎంత పంతం పట్టినా తెగేదాకా వెళ్ళడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
బి.జె.పికి తాను ఇస్తున్న మద్దతు ఎవరు అడగనిదని, బేషరతుగా, ఏకపక్షంగా ఇస్తున్నదని ఎన్.సి.పి నేత శరద్ పవార్ సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మరొకసారి ప్రకటించారు. ఆయన సమావేశం ముగిసిన గంట సేపటికే తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అనంత్ కలాసేకు తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశామని శివసేన తెలిపింది. తమ ఎం.ఎల్.ఏల నాయకుడు ఏక్ నాధ్ షిండేను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరామని తెలిపింది. ఇన్ని జరిగినప్పటికీ బి.జె.పి-శివసేనల ఎడబాటు అంతిమం అని పత్రికలు నిర్ణయించుకోలేక పోతున్నాయి. దానికి కారణం ఎన్.సి.పి, శివసేనలు స్ధిరమైన నిర్ణయాన్ని ప్రకటించకపోవడమే.
ఉదాహరణకి తమ మద్దతు బేషరతుగా ఇస్తున్నదేనని చెబుతున్న ఎన్.సి.పి, అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో అనుసరించే వ్యూహం ఏమిటో చెప్పడం లేదు. తమ వ్యూహంపై సస్పెన్స్ ని కొనసాగించడానికే ఎన్.సి.పి నేత శరద్ పవార్ నిర్ణయించుకున్నారని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. “ఫడ్నవిస్ ప్రభుత్వం నిలకడ విషయంలో మేము ఒక అంచనాకు వస్తాము. ఆ అంచనాపై ఆధారపడి మాత్రమే విశ్వాస పరీక్షలో ఏ విధంగా ఓటు వేసేదీ నిర్ణయిస్తాము” అని శరద్ పవార్ ప్రకటించారు. విలేఖరుల సమావేశం 45 నిమిషాలు సాగినప్పటికీ శరద్ పవార్ ఏ విషయాన్ని తేల్చి చెబుతున్నారో విలేఖరులకు అర్ధం కానీ పరిస్ధితి!
“రాష్ట్రం స్ధిరంగా ఉండాలన్న ఆసక్తితో ఎన్.సి.పి ఒక నిర్ణయం తీసుకుంది. మద్దతు కావాలని మమ్మల్ని ఎవరూ అడగలేదు. మేము కూడా మద్దతు ఇచ్చే విషయం ఎవరితో చర్చించింది లేదు” అని శరద్ పవార్ చెప్పాడు. ఎన్.సి.పి మద్దతు విషయంలో బి.జె.పి నిర్ణయం ఏమిటో చెప్పాలని శివసేన నిలదీస్తుండగా, ఆ పార్టీ ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు. ఎన్.సి.పి మద్దతును పాచికగా ప్రయోగిస్తూ శివసేనను లొంగదీసుకోవాలని బి.జె.పి చూస్తోందని దీని ద్వారా అర్ధం అవుతోంది. అలాగని శివసేనను కాదని పూర్తిగా ఎన్.సి.పి పై ఆధారపడే ధైర్యానికి బి.జె.పి కి లేదు. పదవీ రాజకీయాల్లో తలపండిన శరద్ పవార్ మద్దతు తమను ఎక్కడకు కొనిపోతుందో అన్న భయం బి.జె.పి ని వెన్నాడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అనగా బి.జె.పికి మరో 22 మంది ఎం.ఎల్.ఏ ల మద్దతు అవసరం. శివసేనకు 63 మంది ఎం.ఎల్.ఏ లు ఉండగా, ఎన్.సి.పి కి 41 మంది ఎం.ఎల్.ఏ లు ఉన్నారు. కనుక ఏ పార్టీ మద్దతు ఇచ్చినా బి.జె.పికి బెంగలేదు. కానీ ఆ తర్వాత పరిస్ధితి ఏమిటన్నదే అసలు విషయం. సోదర హిందూత్వ పార్టీతో జత కలిసి తమ భావజాలానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పడమా లేక శివసేన బ్లాక్ మెయిలింగ్ కు లొంగకూడదని నిర్ణయించుకుని హిందూత్వను పక్కనబెట్టి తమను ‘కాషాయ ఉగ్రవాదం’గా అభివర్ణించిన ఎన్.సి.పి తో జట్టు కట్టడమా అన్నది బి.జె.పి తీసుకోవలసిన నిర్ణయం.
బి.జె.పి-శివసేన లది అంత తేలికగా తెగిపోయే స్నేహం కాదు. ఇరు పార్టీలు కలిసి ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ను పాలిస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇతర నగరాల్లోనూ వారు ఉమ్మడిగా అధికారం చెలాయిస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో ఇప్పటికే ఒక శివసేన ఎం.పి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయనను రాజీనామా చేయమని శివసేన ఇంతవరకు కోరింది లేదు. ఆదివారం నాటి మంత్రివర్గ విస్తరణలో తమ ఎం.పి అనిల్ దేశాయ్ కు కేబినెట్ పదవి ఇవ్వకుండా ఉపమంత్రి పదవి ఇవ్వజూపినందుకు అసలు మంత్రి పదవినే శివసేన నిరాకరించింది. అదే సమయంలో మరో శివసేన ఎం.పి (సురేష్ ప్రభు) కి కేబినెట్ పదవి ఇస్తూనే ఆయనను బి.జె.పి సభ్యత్వం ఇచ్చింది. మిత్రపార్టీగా ఉంటూనే ఇలా రెండు విధాలుగా దెబ్బ తీయడం శివసేనకు సహజంగానే ఆగ్రహం కలిగించింది. ఫలితంగా బి.జె.పి.-శివసేన ల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి.
మొత్తం మీద బి.జె.పి, శివసేన ఇరు పార్టీలు ఒకరి పై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో స్నేహం తెగిపోతుందా అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఎన్.సి.పి మద్దతు బి.జె.పి కి కలిసి రాగా, ఎన్.సి.పి బేరసారాల శక్తిని బాగా బలహీనపరిచింది. ఎంత అరుచుకున్నా బి.జె.పి, శివసేనలు పూర్తిగా విడిపోయేందుకు సిద్ధంగా లేవు. విడిపోతే వారి మౌలిక భావజాలానికి కట్టుబడి లేరన్న సందేశం జనంలోకి వెళ్తుంది. అదే జరిగితే వారి రాజకీయ పునాదికి దెబ్బ తగులుతుంది. దానితో ఇరువురు ఒకరినొకరు బెదిరించుకుంటూనే సాధ్యమైనంతగా పై చేయి సాధించేందుకు ఇరువురూ ప్రయత్నిస్తున్నారు.
రాజకీయ బేరసారాలకు తావిచ్చే విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయవద్దని పాలక వర్గాలు (సామ్రాజ్యవాద కంపెనీలు, స్ధానిక దళారీ పెట్టుబడిదారులు, భూస్వామ్య శక్తులు) బి.జె.పికి ఇచ్చిన అప్రకటిత మాండేట్. ఈ మాండేట్ అమలు చేయాలంటే శివసేనను జూనియర్ పార్టనర్ గా, తమ మాట వినే భాగస్వామిగా మలుచుకోవడం బి.జె.పి అవసరం. ఇందుకు శివసేన అంగీకరించక ప్రతిఘటిస్తోంది. బహుశా, అంతిమంగా ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ లోపు జరిగే పనికిమాలిన రాజకీయ నాటకం పత్రికలకు పని కల్పిస్తుండగా, ప్రజలకు అసహ్యం కలిగిస్తుంది.