లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో దారుణమైన ఫలితాలు ఎదురైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవిలో లేకపోయినా ప్రభుత్వాన్ని నడుపుతూనే ఉన్నారని అప్పటి నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి “నేను స్వల్పకాలిక ముఖ్యమంత్రినే” అని ప్రకటించడంతో ఈ వార్తలు నిజమే అని స్పష్టం అవుతోంది.
ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి 6గురు కేబినెట్ మంత్రులు హాజరు కాకుండాపోయేంతవరకు బీహార్ పరిస్ధితి దిగజారిందని తెలుస్తోంది. మంఝీ, నితీశ్ ల మధ్య సయోధ్య కుదిర్చదానికి ఢిల్లీ నుండి పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా వచ్చారు. ఆ సందర్భంగానే మంఝి తాను కొద్ది కాలపు ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నారు.
శరద్ యాదవ్ వచ్చి జరిపిన చర్చల్లో మంఝిని తొలగించి మళ్ళీ నితీశ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అంశాన్ని చర్చించారని బి.జె.పి నాయకులు ఆరోపిస్తున్నారు. జె.డి(యు)లో ఊపిరి ఆడకపోతే బి.జె.పిలో చేరవచ్చని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడి ఆహ్వానించడంతో ఇరు పార్టీలు అప్పుడే ఎన్నికల ప్రయత్నాలు ఆరంభించినట్లు కనిపిస్తోంది. బి.జె.పి ఆహ్వానాన్ని ప్రస్తుతానికి మంఝి తిరస్కరించారు.
మంఝిని తొలగించి మళ్ళీ నితీశ్ ను పదవిలోకి తెచ్చే ఆలోచన నిజం కాదని జె.డి(యు) నాయకులు చెబుతున్నారు. 2015లో ఎన్నికల వరకు మంఝియే ముఖ్యమంత్రి అని అయితే నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని జె.డి(యు) నాయకులు చెప్పడం విశేషం. మంఝి కేవలం దిష్టి బొమ్మే అని వారు కూడా ఆ విధంగా ధృవీకరించారు అన్నట్లే.