రష్యాపై ఆంక్షలు: ఫ్రెంచి రైతుల సమరభేరి -ఫోటోలు


రష్యాపై తాము విధించిన  వాణిజ్య, రాజకీయ ఆంక్షలు రష్యాను కుంగ దీస్తున్నాయని పశ్చిమ దేశాలు, వాటి పత్రికలు సందర్భం వచ్చినప్పుడల్లా చంకలు గుద్దుకుంతుంటాయి. ‘అబ్బ, భలే పీడిస్తున్నాం లే’ అంటూ సంతోషం ప్రకటిస్తాయి. ‘తిక్క కుదిరింది, మనతోనా పెట్టుకునేది’ అన్నట్లుగా రాక్షసానందం పొందుతాయి. కానీ రష్యాపై ఆంక్షలు పశ్చిమ దేశాల ప్రజలను, రైతులను ఎంతగా బాధిస్తున్నాయో నవంబర్ 5 తేదీన ఫ్రాన్స్ వ్యాపితంగా చెలరేగిన రైతుల ఆందోళనలు స్పష్టం చేస్తాయి.

రష్యాపై విధించిన ఆంక్షలు తమకే ఎదురు తిరిగిన సంగతిని పశ్చిమ పత్రికలు చాలా అరుదుగా గుర్తిస్తాయి. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే అంగీకరిస్తాయి. ఫ్రెంచి రైతులు తమ తీవ్ర, వినూత్న ఆందోళనలతో అటువంటి తప్పని పరిస్ధితిని గత బుధవారం నాడు కల్పించాయి. రైతుల ఆందోళనలకు రష్యాపై ఆంక్షలు కాకుండా ఇంకేవో కారణాలను చూపడానికి శతధా ప్రయత్నించినప్పటికీ సన్నాయి నొక్కుల ద్వారానైనా వాటిని ప్రస్తావించక తప్పలేదు. రైతులే స్వయంగా రష్యాపై ఆంక్షల వల్లనే తమ సరుకులకు గిరాకీ లేకుండా పోయిందని చెబుతుండడంతో రష్యా కారణాన్ని బలహీన స్వరంలో అంగీకరిస్తున్నారు.

దేశవ్యాపితంగా రైతులు తమ ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర భారీ యంత్రవాహనాలతో నగరాలలో చొరబడి వీధులను నింపడం ఒక ఎత్తైతే తమ పంట పొలాల్లో వాడే వివిధ దినుసులను, ధర పలకని కూరగాయలను భారీ మొత్తంలో తెచ్చి రోడ్లను ముంచెయ్యడం మరో ఎత్తు. ఆహార పంటల ధరలు అత్యంత ఘోరమైన స్ధాయికి పడిపోయాయని రష్యాపై విధించిన ఆంక్షల వల్లనే తమ పంటలకు గిరాకీ లేకుండా చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.

రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిగా ఆ దేశం కూడా యూరోపియన్ దేశాల నుండి ఆహార దిగుమతులను తగ్గించుకుంది. పలు ఆంక్షలు విధించింది. దానితో ఎగుమతులు పడిపోయి సరుకు అంతా దేశంలోనే పేరుకుపోయింది. ఫలితంగా స్ధానిక మార్కెట్లను సరుకులు ముంచెత్తడంతో ధరలు పడిపోయి పెట్టుబడి కూడా దక్కలేదని రైతులు ఆరోపించారు. రష్యాపై ఆంక్షల వలన ముఖ్యంగా ఆహార ధాన్యం, పాలు, తృణ ధాన్యాల ధరలు బాగా పడిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకాయని, దానితో ఉత్పత్తి ఖర్చు పెరిగిపోగా, అమ్మకంలో కనీస ధర కూడా దక్కలేదని నిరసించారు.

తమ ఆందోళన తీవ్రతను తెలియజేయడానికి తీవ్రమైన ఆందోళన రూపాలను రైతులు ఎంచుకున్నారు. పొలాల్లో ఉపయోగించే పశు విసర్జక ఎరువులను ట్రక్కులపై తెచ్చి రోడ్లపై కుప్పలు పోశారు. ధరలు లేని టమోటా, గుమ్మడి తదితర అనేక కూరగాయలను పెద్ద మొత్తంలో తెచ్చి నగర కూడళ్లను నింపేశారు. ట్రక్కులు, ట్రాక్టర్లు, వివిధ వ్యవసాయ యంత్ర సాధనాలతో ప్రదర్శనలు నిర్వహించారు. చిక్కటి, మురికి ద్రావకాలను తెచ్చి ప్రభుత్వ ఆసులపై విరజిమ్మారు.

కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టారు కూడా. ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి విభాగాల భవనాలను టార్గెట్ చేసుకున్నారు. కునారిల్లుతున్న ఫ్రెంచి ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు ‘ఈట్ ఫ్రెంచ్’ నినాదం ఇచ్చారు. విదేశీ సరుకులను వదిలే ఫ్రెంచి ఆహారాన్నే తినాలని తద్వారా ఆర్ధిక వ్యవస్ధకు బలం చేకూర్చాలని రైతుల సంఘాలు పిలుపు ఇచ్చాయి. బయో దైవర్సిటీ కాపాడే పేరుతోనూ, నీటి క్వాలిటీ పరిరక్షణ పేరుతోనూ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకించడానికే ప్రధానంగా రైతులు ఆందోళన చేశారని పశ్చిమ వార్తా సంస్ధలు చెప్పినప్పటికీ రైతులు, రైతు సంఘాలు మాత్రం రష్యాపై ఆంక్షలనే ప్రధాన దోషిగా ఎంచి చెప్పాయి.

రైతు సంఘాలైన ఫ్రెంచి ఫార్మర్స్ యూనియన్ (ఎఫ్‌ఎన్‌ఎస్‌ఈ‌ఏ), యంగ్ ఫార్మర్స్ యూనియన్ (వై‌ఏ) లు కూడా రైతుల ఆందోళనలో పాల్గొన్నాయి. దేశవ్యాపితంగా 40,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం, పోలీసులు మాత్రం అంతమంది లేరని చెప్పారు. కింది ఫోటోలను చూస్తే రైతులు ఏ స్ధాయిలో ఆందోళన చేశారో అర్ధం అవుతుంది.

ప్యారిస్ నగరంలో చాట్రెస్ అనే ఏరియాలో దాదాపు 100 టన్నుల పశు విసర్జక ఎరువులను తెచ్చి రైతులు కుమ్మరించారు. నగరంలో ప్రభుత్వ కార్యాలాయాలు ఉన్న అనేక చోట్ల కుళ్ళిపోయిన కూరగాయలను తెచ్చి పోశారు. టోన్ హాలు, అగ్రికల్చర్ విభాగ భవనాలు ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో టన్నుల కొద్దీ కూరగాయలు, ద్రావకాలు తెచ్చి పోసారని డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. ప్యారిస్ మొత్తం మీద 50 టన్నుల కూరగాయలను రైతులు కుప్పలు పోసారని పత్రికలు తెలిపాయి. ప్యారిస్ ప్రజలకు తాము తెచ్చిన కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. రైతుల ఆందోళన మీదికి వచ్చిన పోలీసులతో రైతులు తలపడిన ఘటనలు అనేకచోట్ల జరిగాయి. కూరగాయలు, యాపిల్ పళ్ళు పోలీసులపై విసిరి తమ ఆగ్రహం ప్రకటించారు రైతులు.

కొత్త చట్టాలు తెచ్చి రైతులకు అర్ధం కానీ పాలనా ప్రక్రియలను వారి నెత్తిపై రుద్దుతున్నారని రైతు సంఘాలు ఆరోపించాయి. “ఈ రోజు రైతులు తమ సమయంలో ఎక్కువ భాగం జనానికి తిండి పెట్టే ఉత్పత్తులను పండించడానికి బదులు పాలనా, పేపర్ వర్క్ లపైనా కేటాయించాల్సి వస్తోంది. ఇది పూర్తిగా అసంబద్ధం” అని ఎఫ్‌ఎన్‌ఈ‌ఎస్‌ఏ నాయకులు ఆరోపించారు.

దేశంలో పండే పండ్లు, కూరగాయలకు బదులు విదేశాల నుండి తెప్పించిన పండ్లు, కూరగాయలను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలు వినియోగిస్తున్నాయని ఆరోపించిన రైతులు పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే సరఫరాల లారీలను, ఇతర వాహనాలను తనిఖీలు చేశారు. తమ తనిఖీల్లో మొరాకో నుండి తెచ్చిన టమాటోలు, ఇటలీ నుండి తెచ్చిన యాపిల్ పళ్ళు దొరికాయని అనంతరం రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రైతుల ఆందోళనలకు ప్రజల నుండి సైతం విశేష మద్దతు లభించింది.

రైతుల ఆందోళన న్యాయమైనదే అని వ్యవసాయ మంత్రి ప్రకటించడం విశేషం. రష్యా మార్కెట్ కు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుకుతామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఆ విధంగా రష్యా ఆంక్షలు తమ రైతులకు నష్టకరంగా పరిణమించాయని ఆయన అంగీకరించారు. రైతులను మంచి చేసుకోవడానికి కొన్ని తాయిలాలు ప్రకటించారు. వార్షిక ఈ.యు సబ్సిడీలను గతంలో ప్రకటించిన తేదీకి ముందే ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఫ్రెంచి వ్యవసాయ దిగుమతులకు ఉత్తర ఆఫ్రికా దేశాలను ఒప్పిస్తామని చెప్పారు.

ఫోటోలను ది అట్లాంటిక్, డెయిలీ మెయిల్ పత్రికలు అందించాయి.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s