కాశ్మీర్: మిగిలిన వారినీ చంపాలని చూశారా?


Basim

Basim

కాశ్మీరులో కారుపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు బులెట్ గాయాలతో తప్పించుకున్న సంగతి తెలిసిందే. గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం పరుగెత్తి పారిపోవడం వల్ల బతికిపోయాడే తప్ప సైన్యం కాల్పులు జరపడం ఆపడం వల్లనో లేదా కారు ఆపడం వల్లనో కాదని తెలుస్తోంది.

దుర్ఘటన నుండి గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం అహ్మద్ చెప్పిన వివరాలను బట్టి కారు విద్యుత్ స్తంబానికి గుద్దుకుని ఆగిపోయిన తర్వాత కూడా సైనికులు కాల్పులు కొనసాగించారు. కారు తలుపు తీసుకుని పాక్కుంటూ కిందికి దిగి పొలాలకు అడ్డం పడి పరుగెత్తుతున్న బాసిం పైన కూడా సైనికులు కాల్పులు జరిపారు. కానీ బాసిం శక్తి కొలదీ పరుగెత్తడంతో బతికిపోయాడు.

బాసిం అహ్మద్ గత మూడు రోజులుగా తన ఇంటి గది నుండి బైటికి రాలేదు. చనిపోయిన ఫైజల్ ఇంటికి వెళ్ళి అతని తల్లి దండ్రులను ఓదారుద్దామని బలంగా కోరుకుంటున్నప్పటికీ సైనికుల భయంతో గది నుండి బైటికి రావడానికే భయపడుతున్నాడు.

నలుగురు మిత్రులు కారులో ప్రయాణిస్తున్న దారిలో మూడు చెక్ పోస్టులు ఉన్నాయని కారు రెండు చెక్ పోస్టుల దగ్గర ఆపకుండా వెళ్లిపోయిందని మూడో చెక్ పోస్ట్ గుండా దూసుకెళ్లిందని ఆర్మీ ఆరోపించింది. ఆర్మీ కధనాన్ని బాసిం అబద్ధంగా కొట్టిపారేశాడు. అసలు చెక్ పోస్టులు ఎక్కడా లేవని, కేవలం కొద్ది మంది సైనికులు మాత్రమే ఒక చోట ఉన్నారని బాసిం చెప్పడం విశేషం.

“అక్కడ మూడు చెక్ పోస్టులు ఏమీ లేవు. కొద్ది మంది సైనికులు రోడ్డు పైన ఉన్నారంతే. వాళ్ళు మమ్మల్ని చూసి విజిల్ వేస్తూ ఆపమని కోరారు. కానీ కారు నడుపుతున్న ఫైజల్ వారి విజిల్ వినలేదు. అంతకు కొద్ది నిమిషాల క్రితమే ఒక టిప్పర్ ని రాసుకుంటూ వచ్చాము. ఫైజల్ అప్పటికే ఆందోళనలో ఉన్నాడు. టిప్పర్ డ్రైవర్ ఫైజల్ ని ఆగమని అరుస్తున్నాడు. ఇది గమనించి మేమే అతన్ని కారు ఆపాలని చెప్పాము. దాంతో ఫైజల్, కారు ఆపే ఉద్దేశ్యంతో అక్కడికక్కడే బ్రేకులు వేశాడు” అని బాసిం వివరించాడని ది హిందు తెలిపింది.

బ్రేకులు వేస్తుండగానే బులెట్ల వర్షం కురవడం మొదలైందని బాసిం తెలిపాడు. ఫైజల్ చేతికి బులెట్ తగలడంతో అతను పెద్దగా అరుస్తూ స్టీరింగ్ వదిలేశాడు. దానితో కారు ఒక విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి ఆగిపోయింది. “మొదటి బులెట్ ఫైజల్ చేతిని తాకింది. వెంటనే ‘హతై మొజై’ (ఆహ్, అమ్మా) అని అరిచాడు. నెప్పితో స్టీరింగ్ వదిలేశాడు. దానితో కారు రోడు పక్కన విద్యుత్ స్తంభానికి గుద్దుకుని ఆగిపోయిది” అని బాసిం తెలిపాడు.

సన్నగా, పీలగా ఉండే బాసిం కాల్పుల శబ్దంతో కారు డాష్ బోర్డు కిందకు వంగి నక్కుతూ బులెట్లు తగలకుండా రక్షణ పొందాడు.  సైనికుల సంగతి ఎలాగూ తెలుసు గనుక,  అతను చప్పుడు చేయకుండా మెల్లగా నక్కి ఉంటూనే కారు తలుపు తెరుచుకుని పరుగెట్టడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన సైనికులు అతనిని లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు.

“బులెట్ కాల్పులు ఆగిపోయాక నేను ఎలాగో కారు అద్దాన్ని కిందికి దించి పాక్కుంటూ మెల్లగా బైటికి వచ్చాను. సైనికులు నన్ను చూసి కాల్పులు మొదలు పెట్టారు. కానీ నేను పరుగెట్టడం ఆపలేదు. రోడ్డు దిగి పొలాల్లోకి శక్తి కొద్దీ పరుగెత్తాను. నాకు సాధ్యమైనంత శక్తినంతా ఉపయోగించి పరుగెత్తాను. ఎవరో ఒకరి ఇంటి దగ్గరకు చేరుకున్నాను. వాళ్ళు నాకు మంచి నీళ్ళు ఇచ్చారు. నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు బస్సు ఛార్జీలకు రు. 10 లు ఇచ్చారు” అని చెప్పాడు బాసిం.

తెల్లారేటప్పటికల్లా బాసిం ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతని కుటుంబ సభ్యులు ఏడుస్తూ కనిపించారు. అతని స్నేహితుల్లాగే బాసిం కూడా చనిపోయి ఉంటాడని వారు భావించారు. ఇంటి నుండి వెళ్ళిన యువకులు మాయమై పోవడం కాశ్మీర్ లో మామూలే. ఆ తర్వాత వారు తీవ్రవాదుల ముద్రతో శవాలై తేలడమూ మామూలే. ఇటువంటి దుర్మార్గాల వల్లనే కాశ్మీరులో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఒక దశలో మహిళల సంఖ్య సమాధానం చెప్పలేనంత ఎక్కువగా ఉండడంతో 2001 జనాభా లెక్కల్లో కాశ్మీరు జనాభాను ప్రకటించకుండా నిలిపివేశారు.

“గత మూడు రోజులుగా నేను ఈ గది దాటి కదల్లేదు. ఫైజల్ ఇంటికి వెళ్ళి అతని తల్లిని ఓదార్చాలని అనిపిస్తోంది. కళ్ళు మూస్తే స్టీరింగ్ ముందు కూర్చున్న ఫైజల్ కనిపిస్తున్నాడు” అంటూ బాసిం తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. కనీసం స్నేహితుడు చనిపోయిన దుఃఖాన్ని కూడా వ్యక్తం చేయలేని స్ధితిలో బాసిం ఉండిపోయాడు.

బాసిం మొదటి వాడు కాదు. కాశ్మీర్ చరిత్ర పరికిస్తే అతను చివరి వాడు కాబోడని గ్యారంటీ ఏమీ లేదని తెలుస్తుంది.

డెక్కన్ హెరాల్డ్ పత్రిక ప్రకారం సంఘటన జరిగినప్పుడు 14 యేళ్ళ ఫైజల్ కారు నడుపుతున్నాడు. (పత్రికలు మొదట చెప్పినట్లు అతను చదువుతున్నది 7 కాదు 9వ తరగతి.) కారులో 5గురు మిత్రులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయాలు కాకుండా బైటపడింది బాసిం ఒక్కడే. అందుకే అతను ఇంటి వద్ద ఉన్నాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీద్ నుండి డెక్కన్ హెరాల్డ్ సమాచారం సేకరించింది. కారు ఆపాలని కోరుతూ ఆర్మీ సంకేతం చూపినప్పుడు కారు వేగంగా వెళ్తోంది. ఆ సంకేతాన్ని చూసింది జహీద్ ఒక్కడే. ఆ విషయాన్ని కారు నడుపుతున్న ఫైజల్ కు జహీద్ చెప్పాడు. వెనక సీట్లో కూర్చొని ఉన్న జహీద్ ఏమి చెబుతున్నాడో వినపడని ఫైజల్ ఏమిటని అడుగుతూ వెనక్కి తిరిగి చూశాడు. అలా వెనక్కి తిరిగి చూస్తుండగా కారు టిప్పర్ ని రాసుకుంటూ వెళ్లింది. దానితో టిప్పర్ డ్రైవర్ కేకలు వేశాడు. కారును సైనికులు ఆపమంటున్నారని జహీద్ చెప్పడం, మరో పక్క టిప్పర్ డ్రైవర్ అరుపులు.. ఈ గందరగోళం మధ్యనే కాల్పులు జరగడం, ఫైజల్ చేతికి బులెట్ తగలడం స్టీరింగ్ వదిలేయడం, కారు వెళ్ళి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆగిపోవడం జరిగాయి. కాల్పులు జరిపే ముందు కనీసం హెచ్చరిక కూడా చేయకపోవడంతో రక్షణ పొందే అవకాశం కూడా హతులకు లేకపోయింది.

(Article edited once for a factual error. -Visekhar)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s