(కాశ్మీరు లోయలో సైనికులు కాల్పులు జరిపి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరించిన ఘటనపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్)
**********************
ఇద్దరు టీనేజి బాలురు చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో క్లిష్ట పరిస్ధితిలో ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద ఉన్న సైనికులు వారిని కాల్చి చంపగా జరిగిన ఘటనపై విరుద్ధ కధనాలు వినబడుతున్నాయి. కనుక అది ఎవరు చేశారన్న ప్రశ్న లేదు. ఎందుకు చేశారన్నదే ప్రశ్న. కాశ్మీర్ లో పౌర ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులు అంత తేలికగా చంపడానికే ఎందుకు కాల్పులు జరుపుతారు? దీనికి సమాధానం అయిదక్షరాలు, ఏఎఫ్‌ఎస్‌పిఏ. సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం ద్వారా సైన్యం పొందిన మినహాయింపు ఏ ఎంపికనైతే చివరిసారిగా ఎంచుకోవాలో దానిని మొదటే ఎంచుకుని ఉపయోగించేందుకు తగిన శిక్షలేమిని కల్పిస్తున్నది. చట్టాన్ని ఉల్లంఘించేవారు “చనిపోయేందుకు దారి తీసినా సరే, కాల్పులు జరపడానికి లేదా ఇతర విధాలుగా బలప్రయోగం చేయడానికి” సైనికులను ఏఎఫ్‌ఎస్‌పిఏ అనుమతిస్తుంది. (కాల్పులు జరిపిన సైనికులపై) “కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప, ప్రాసిక్యూషన్ గానీ, దావా గానీ, మరే ఇతర చట్టబద్ధ ప్రక్రియ గానీ ఆరంభించబడదు” అని కూడా చట్టం చెబుతుంది.
ఈ సంరక్షణాత్మక గొడుగు కల్పించనట్లయితే కారును ఆపడానికి సైనికులు తక్కువ తీవ్రత కలిగిన పద్ధతులు అవలంబించి ఉండేవారు. బహుశా వాహనం కదలకుండా చేసేందుకు టైర్లపై గురి చూసి కాల్చేవారు. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, సైన్యమూ వేగవంతమైన విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ కాశ్మీర్ ప్రజలకు బాగా తెలిసినట్లే, బాధితులకు న్యాయం జరగడం తధ్యం ఏమీ కాదు. పత్రిబాల్ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, సి.బి.ఐ అభియోగాలు మోపిన 5గురు రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులు కోర్టుల్లో తమపై మోపబడిన అభియోగాలను సవాలు చేశారు. చివరికి సుప్రీం కోర్టు వారి పక్షమే వహిస్తూ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతించాలని లేదా వారిని కోర్టు-మార్షల్ అయినా చేయాలని సూచించింది. సైన్యం అలవోకగా రెండో అవకాశాన్నే ఎంచుకుంది.
జనవరిలో 13 యేళ్లపాటు న్యాయపోరాటాలు సాగినాక, వారికి వ్యతిరేకంగా కేసును మూసివేస్తూ “రికార్డు చేయబడిన సాక్ష్యాలు నిందితుల్లో ఎవరికి వ్యతిరేకంగానూ ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లు చూపలేకపోయాయి” అని చెప్పి చేతులు దులుపుకుంది. ఏఎఫ్‌ఎస్‌పిఏ ను రద్దు చేయాలని జీవన్ రెడ్డి కమిషన్ సిఫారసు చేసింది. అందులో కొన్ని అంశాలను ఇతర చట్టాలలో పొందుపరచాలని చెప్పింది. పౌర అధికార వ్యవస్ధలో అనేకమంది, చట్టం అమలులో ఉన్న కల్లోలిత ప్రాంతాల్లో సాధారణ పరిస్ధుతులు నెలకొనడానికి ఈ చట్టం ఆటంకంగా పరిగణిస్తున్నారు. కనీసం సవరణాలైనా చేయాలని కోరుతున్నారు. అటువంటి సూచనలు అన్నింటినీ సైన్యం కొట్టిపారేస్తోంది. కానీ సోమవారం నాటి ఘటన ఏఎఫ్‌ఎస్‌పిఏ ఇక ఎంతమాత్రం కొనసాగేందుకు వీలు లేదని, ఇప్పటి రూపంలో అయితే ఖచ్చితంగా వీల్లేదని స్పష్టం చేస్తోంది.
ఇటీవలి వరదల వల్ల ఇప్పటికే బాధలో మునిగి ఉన్న (కాశ్మీరు) లోయలో, ఓ పక్క రాష్ట్ర ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ ఘటన మళ్ళీ అలజడి రేకెత్తించింది. సకల పార్టీలకు చెందిన హురియత్ కాన్ఫరెన్స్ లోని వివిధ ముఠాలు బుధవారం లోయ బంద్ కు పిలుపు ఇచ్చాయి. ఎన్నికలను బహిష్కరించాలని హురియత్ ఇప్పటికే పిలుపు ఇచ్చింది. కౌమార వయసులో ఉన్న ఇద్దరు పౌరుల హత్య వారి పిలుపును మరింతగా శక్తివంతం కావించింది. తీవ్రంగా ఆందోళన చెందవలసిన విషయం ఏమిటంటే ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లో పరాయీకరణ భావానలను మరింత పెంచుతాయి. సరిహద్దు ఆవలనున్న మిలిటెంట్ గ్రూపులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి. కాశ్మీర్ లో భారత దేశానికి ఉన్న అల్పస్ధాయి హక్కుల రికార్డును వేలెత్తి చూపేందుకు, సరిహద్దు తగాదాను అంతర్జాతీయం చేసేందుకు ఇటీవల జరిపిన ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. కానీ న్యూ ఢిల్లీ చేసే ప్రతి తప్పూ ఆ ప్రయత్నాలకు సహాయమే చేస్తాయి.
కాశ్మిర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో ఈ ప్రత్యేక సైనిక చట్టాలను గూర్చి మిగతా ప్రాంతాలలోని కనీసం ప్రాంతీయ పార్టీలైనా ప్రశ్నించవు ఎందుకు?