ఫ్లోరిడా: అక్కడ అన్నదానం చేస్తే జైల్లో తోస్తారు


Arnold Abbot being arrested

Arnold Abbot being arrested

పెట్టుబడిదారీ వ్యవస్ధ కనిపించే ప్రతి వస్తువునీ వ్యాపారమయం చేస్తుందని కారల్ మార్క్స్ 19వ శతాబ్దంలో చెప్పారు. ఆ మాటలు ఎంతటి ప్రత్యక్షర సత్యమో అప్పటి నుండి రుజువు కాని చోటంటూ లేదు. చివరికి ఆకలిని కూడా వ్యాపారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఫ్లోరిడా రాష్ట్రం లోని ఫోర్ట్ లాడర్ డేల్ పట్టణ ప్రభుత్వం మరింత ముందుకెళ్లింది. వ్యాపారాలు చల్లగా ఉండాలన్న ఏకైక దృష్టితో అది అన్నదానాన్ని చట్ట విరుద్ధం చేసిపారేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 90 యేళ్ళ రిటైర్డ్ మిలట్రీ అధికారి యధావిధిగా అన్నదానం కొనసాగించినందుకు కేసు కూడా బనాయించింది.

మనకు తెలియని విషయం ఏమిటంటే రెండు, మూడు దశాబ్దాల క్రితమే లాడర్ డేల్ పట్టణ ప్రభుత్వం అన్నదానం చేయకూడదని శాసనం చేసింది. ఈ శాసనాన్ని అప్పుడు కూడా ఇదే రిటైర్డ్ మిలట్రీ అధికారి ఉల్లంఘించి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆయన అనేక కోర్టుల్లో, అనేక యేళ్లపాటు పోరాటం చేసారు. చట్టాన్ని రద్దు చేసేవరకు నిద్ర పోలేదు. ఇప్పుడు మళ్ళీ వారం క్రితం స్ధానిక ప్రభుత్వం అదే చట్టాన్ని రంగం మీదికి తెచ్చి ఆమోదించింది.

ఆ రిటైర్డ్ మిలట్రీ అధికారి పేరు ఆర్నాల్డ్ అబ్బాట్. ఆయన వయసు 90 యేళ్ళు. అన్నదానం చేయడం ఆయనకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా ఇల్లూ వాకిలీ లేని వారికి కాసింత కూడు పెట్టడం ఆయన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఇందులో మానవత్వం తప్ప మరో అంశమే లేదు. లాభాపేక్ష లేకుండా ఆయన 23 యేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణానికి అవసరం రీత్యా వచ్చిపోయే వారు, ఉండడానికి ఇల్లు లేక రోడ్ల పక్కనా, పార్కుల్లోనూ తలదాచుకునేవారూ, పెద్దగా సంపాదన లేనివారు ఆర్నాల్డ్ అన్నదానం ద్వారా లబ్ది పొందుతారు. ప్రతి రోజూ తిన్నవారే తింటారని ఏమీ లేదు. ఆయన నిర్వహించే శిబిరాల్లో అన్నం తినేవారు నిరంతరం మారుతూ ఉంటారు.

ఈ వ్యవహారం స్ధానిక వ్యాపారులకు నచ్చలేదు. అర్నాల్డ్ నిస్వార్ధంగా, లాభాపేక్ష లేకుండా అన్నదానం చేస్తే తమ వ్యాపారాలు ఏం కావాలి? వారి వ్యాపారాలు సజావుగా కొనసాగాలంటే అన్నదానాన్ని ఆపేయించాలని కంకణం కట్టుకున్నారు. తీవ్ర స్ధాయిలో లాబీయింగ్ జరిపారు. పట్టణ ప్రభుత్వ సభ్యులను ప్రభావితం చేశారు. అంతే! కోర్టులు రద్దు చేసిన చట్టం మళ్ళీ మరో రూపంలో చట్టమై కోరలు చాచింది. అన్నదానం చేస్తే 60 రోజుల జైలు, 500 డాలర్ల జరిమానా విధించే విధంగా చట్టాన్ని ఆమోదించారు.

స్ధానిక వ్యాపారాలకు నష్టం కలిగిస్తూ ప్రభుత్వ స్ధలాల్లో అన్నదానం నిర్వహిస్తున్నందుకు ఆర్నాల్డ్ పై సిటీ ప్రభుత్వం కేసు మోపింది. తనపై కేసు పెట్టినా జడిసేది లేదు పొమ్మని ఆర్నాల్డ్ స్పష్టం చేస్తున్నాడు. బైబిల్ లో దేవుడు చెప్పిందే తాను చేస్తున్నానని, పొరుగువారిని ప్రేమించమని, సాయం చెయ్యమని బోదించారని తాను చేస్తోంది అదేనని ఆర్నాల్డ్ స్పష్టం చేస్తున్నారు.

“నాకేమీ భయం లేదు. నేను రెండున్నరేళ్లు ఇన్ఫాంట్రీ పోరాట దళాల్లో పని చేశాను. ఈ దేశంలో మైనారిటీల పౌర హక్కుల కోసం 50 యేళ్ళ పాటు పోరాటం చేస్తూ గడిపాను. అరెస్టు చేస్తారన్న భయం నాకు ఇసుమంత కూడా లేదు. నాకున్న భయమల్లా ఒక్కటే. (నన్ను జైల్లో వేస్తే) బహిరంగ స్ధలాల్లో అన్నదానం చేసేవారు ఎవరూ ఉండరు. అది చేసేది నేనే. నా శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ నేను అది చేస్తాను” అని ఆర్నాల్డ్ చెప్పారని రష్యా టుడే పత్రిక తెలిపింది.

గత వారం ఆర్నాల్డ్ తో పాటు మరో ఇద్దరు దారిద్ర్య వ్యతిరేక కార్యకర్తలు, డ్వేన్ బ్లాక్, మార్క్ సిమ్స్ లను పోలీసులు అరెస్టు చేశారు. చట్టం అమలులోకి వచ్చిన రోజే అన్నదానం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్ళు లేని నిరాశ్రయులకు బహిరంగ స్ధలాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారని వారిపై నేరారోపణ చేశారు. అయితే చట్టంలోనే ‘సహాయ నిరాకరణ’ అభియోగాన్ని పోలీసులు బనాయించలేదు. విషయం అప్పటికే దేశం అంతా పొక్కడంతో నిరసన వ్యాపిస్తుందన్న భయంతో పోలీసులు వెనక్కి తగ్గారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక్క లాడర్ టేల్ పట్టణం అనే కాదు. అమెరికాలో నిజమైన ఛారిటీ కార్యక్రమాలపై అధికార వ్యవస్ధలు విరుచుకుపడే ధోరణి రోజు రోజుకీ పెరుగుతోంది. దానికి కారణం స్పష్టమే. ఆదాయ అంతరాలు పెరిగిపోయి, దరిద్రం పెరిగే కొద్దీ అమెరికాలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. కొనుగోలు శక్తి తగిన మొత్తంలో ఉండే జనం సాంద్రత తగ్గిపోతోంది. ఫలితంగా మిగిలిన కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ ప్రయత్నాలకు ఛారిటీ కార్యక్రమాలు ఆటంకంగా మారాయని వ్యాపార సంస్ధలు భావిస్తున్నాయి. ఆర్నాల్డ్ లాంటివారు పూనుకుని ఉచిత ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇక తమ సరుకులు కొనేవారు ఎవరని వారు ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా దరిద్రం పెరిగే కొందీ వేతనాలు పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే దరిద్రుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువకు వర్కర్లు దొరుకుతారు. ఎంత తక్కువ ఇచ్చినా సరే, అదే పదివేలు అని భావిస్తూ పని చేయడానికి ముందుకు వచ్చేవారు పెరుగుతారు. అనగా కార్మికుల బేరమాడే శక్తి తగ్గిపోయి పెట్టుబడిదారులు, వ్యాపారస్ధూల బేరమాడే శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్ధితిని ఉచిత పంపిణీ కార్యక్రమాలు బలహీనపరుస్తాయని, తక్కువ వేతనానికి పని చేయడానికి ముందుకు రాకుండా ఆర్నాల్డ్ లాంటి వారి వద్ద భోజనం కానిచ్చేసి మరింత వేతనం దొరికే పని కోసం వెతుకుతారని వ్యాపారస్ధులు భావిస్తారు.

అన్నదానంకు వ్యతిరేకంగా సిగ్గు లేకుండా ఏకంగా నగర ప్రభుత్వమే చట్టం చేయడానికి కారణం ఇదే. పైకి మాత్రం బహిరంగ స్ధలాలు నిండిపోతున్నాయని, పార్కుల్లో ఖాళీ ఉండడం లేదనీ, ఇళ్ళు లేనివారు ఎక్కువగా వీధుల్లో తిరగడంతో టూరిస్టులు నగర ఛాయాలకు రావడం లేదని, దానితో ఆదాయం పడిపోతోందని కారణాలు చెబుతున్నారు. ఆకలికి నకనకలాడుతూ తిరిగే పౌరులను ఆదుకోకపోగా, వారు నగర

ఫోర్ట్ లాడర్ డేల్ నగర మేయర్ జాక్ సీలర్ ప్రకారం నగర ప్రభుత్వం వ్యాపారుల ప్రయోజనాలు చూడాల్సిన అవసరం ఉంది. (నిరాశ్రయుల ప్రయోజనాలను మాత్రం గాలికి వదిలేయాలి!) పార్కులన్నీ నిరాశ్రయులతో నిండిపోవడంతో అవి జనానికి, వ్యాపారస్ధులకు అందుబాటులో ఉండడం లేదు. పైగా నగర ఆదాయం నగర సౌందర్యానికి ఆకర్షితులై వచ్చే టూరిస్టుల పైన ఆధారపడి ఉంది. కాబట్టి నగర సౌందర్యానికి మచ్చలుగా పరిణమిస్తున్న నిరాశ్రయులను నగరంలో తిరగకుండా చేయాలి. అందుకు ఆర్నాల్డ్ కార్యక్రమం ఆటంకం అయింది.

మేయర్ విషయాన్ని నేరుగా సిగ్గు లేకుండా చెప్పేశాడన్నమాట! మనం ఊహించుకోవడానికీ, వాదులాడుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు మరి!

3 thoughts on “ఫ్లోరిడా: అక్కడ అన్నదానం చేస్తే జైల్లో తోస్తారు

  1. ఆ మిలిట్రీ ఆఫీసర్ గారికి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో…..ఎవరూ చెప్పినట్లు లేదు.
    – అటువంటి తిక్కచట్టాల తిక్క కుదర్చాలంటే పావలా కే భోజనం…, ఒక సారి తింటే ఎన్నిసార్లైనా ఫ్రీ…లాంటి ఆఫర్లు పెట్టాలి. డబ్బులు ( !? ) తీసుకుంటున్నాను కాబట్టి…నేరం కాదని వాదించవచ్చు. పాపం ఈ విషయం ఆ అధికారికి ఎవరైనా చెప్పరా….?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s