ఢిల్లీ ఎన్నికలు ఖాయం అయ్యాయి. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బి.జె.పి సుముఖంగా లేకపోవడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేశారు. అది కూడా సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశాకనే సాధ్యపడిందన్నది వేరే సంగతి. జంగ్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.
కానీ ఎఎపి పరిస్ధితి అప్పటిలాగా లేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి రాజకీయాలలోకి దూకినప్పుడు ఆనాడు అనేక చేతులు రారమ్మని ఆహ్వానించాయని, ఇప్పుడు ఉద్యమ తడి లేక ఆ చేతులన్నీ అదృశ్యం అయ్యాయనీ కార్టూన్ సూచిస్తోంది.
నిజంగా ఇప్పుడు ఎఎపి పరిస్ధితి ఇంత ఘోరంగా ఉందా అన్నది ప్రశ్న. సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేశారని, ఎఎపి కూడా ఢిల్లీ తమ జేబులోనే ఉందన్న భరోసాతో ప్రచారంపై కేంద్రీకరించలేదని, ఈసారి జరిగేది శాసన సభ ఎన్నికలే గనుక ఎఎపికి మళ్ళీ ఆదరణ లభిస్తుందని వాదించేవారూ ఉన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం బి.జె.పికి దక్కి బలమైన ప్రతిపక్షంగా ఎఎపి నిలవొచ్చన్న అంచనాలు ప్రస్తుతం షికారు చేస్తున్నాయి. వీరు కాంగ్రెస్ ని అసలు పరిగణించడం లేదు.
ఏమో గుర్రం ఎగరా వచ్చు, రాష్ట్ర ఎన్నికలన్న దృష్టితో జనం ఎఎపికే మెజారిటీ సీట్లు కట్టబెట్టవచ్చు. కొద్ది రోజుల పాలనలోనే ముఖ్యమైన ప్రజానుకూల నిర్ణయాలు చేయగల కమిట్ మెంట్ తనకు ఉన్నదని ఎఎపి నిరూపించుకుంది గనుకనే ఈ ఆశ!