కాశ్మీర్: కారు ఆపలేదని పిల్లల్ని చంపేశారు


దేశసేవలో మునిగి తేలుతున్నారని, వారు లేనిదే దేశం లేదనీ పొగడ్తలు పొందే మన సైనికులు కాశ్మీర్ లో అమాయక పౌరులపై ఏ విధంగా రెచ్చిపోతారో తెలిపే దుర్ఘటన సోమవారం జరిగింది. సైన్యం నెలకొల్పిన చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్ చూపించినా ఆగకుండా వెళ్లిపోయారని కారుపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారు. కారు ఆగకుండా వెళ్తే టైర్లను కాల్చవచ్చు. టైర్లకు బదులు కారు విండ్ స్క్రీన్స్ కి గురిపెట్టి కాల్చడంతోనే సైనికుల ఉద్దేశం స్పష్టం అవుతోంది.

అది సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయం. 7వ తరగతి చదువుతున్న ఫైజల్ తన మిత్రుడు మెహ్రాజుద్దీన్ మరో ఇద్దరు పొరుగువారితో కలిసి కారులో బజారు వెళ్తున్నారు. తెల్లవారితే మొహరం పండగ. పండగ ఎక్కడ, ఎలా జరుపుకోవాలో ప్లాన్ రచించుకుని అందుకోసం అవసరమైన సామాన్లు కొనేందుకు వారు కారులో బయలుదేరారు.

వారు వెళ్ళే దారిలో పొరబాటున ఒక టిప్పర్ ని రాసుకుంటూ వెళ్లారు. దానితో వారికి భయం పట్టుకుంది. టిప్పర్ యజమాని తమను వెన్నాడుతున్నాడని, అతనికి దొరికిపోతే పట్టుకుని చావబాదుతాడని వారు భయపడ్డారు. దాంతో కారుని వేగంగా తోలడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో వాళ్ళు సైనిక చెక్ పోస్ట్ వద్ద చూపిన ఎర్ర సిగ్నల్ ని వారు చూసుకోలేదు. సిగ్నల్ ని చూసుకోకుండా వేగంగా వెళ్ళిపోయారు.

అంతే! సైన్యం పులైపోయింది. విచక్షణారహితంగా ఇష్టా రీతిన కారుపై గుళ్ళ వర్షం కురిపించారు. అవి కారు కిటికీల గుండా దూసుకు వెళ్లడంతో ఫైజల్, మెహ్రాజుద్దీన్ ఇద్దరూ చనిపోయారు. మిగిలిన ఇద్దరు గాయాలతో బైటపడ గలిగారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆర్మీ హడావుడిగా ఒక ప్రకటన చేసింది. మిలిటెంట్లు సైనికులపై కాల్పులు జరిపారని ఇద్దరు సైనికులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారని ఆ ప్రకటన తెలిపింది.

ఆ తర్వాత ఆర్మీ తన ప్రకటనను సవరించుకుంది. “మా సైనికుల నుండి, పోలీసుల నుండి మాకు అనేక కధనాలు అందుతున్నాయి. ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. తెలిసిన వెంటనే వివరాలు వెల్లడిస్తాము” అని ఆర్మీ ప్రతినిధి కల్నల్ ఎన్.ఎన్.జోషి సమాచారం ఇచ్చారని ది హిందు పత్రిక తెలిపింది.

ఈ ఘోరంతో కాశ్మీరు లోయ మరోసారి మండి పడింది. మరణించిన ఇద్దరూ స్కూల్ పిల్లలే కావడంతో ప్రజల ఆగ్రహం మిన్నంటింది. నిజానికి సైనికుల జులుం కాశ్మీరు ప్రజలకు కొత్త కాదు. అనునిత్యం సైనికుల పదఘట్టనల కింద వారు గడుపుతూ ఉంటారు. మొహరం పండగ ఉత్సాహంలో ఇంటినుండి బైటికి వెళ్ళిన పిల్లలు శవాలై గుర్తు పట్టలేని స్ధితిలో ఇంటికి తిరిగి రావడం ఎవరు మాత్రం సహించగలరు?

“ఆ బాబు ఇంటి నుండి వెళ్తుండగా నేను చూశాను. ఈ రోజు అతని శవాన్ని ఇంటికి తెచ్చారు. ఆ శవం నేను చూసిన ఫైజల్ దే అని నేను గుర్తు పట్టలేకపోయాను” అని ఫైజల్ ఇంటి వద్ద ఉండే ఒక షాపు యజమాని చెప్పారని పత్రికలు తెలిపాయి. ఫైజల్ తమ్ముడు ఫైజన్ (9 సం.లు) కి ఆగకుండా వెళ్తున్న కారును ఆపడానికి అంతోసి సైనికులు టైర్లకు బదులు కిటికీల గుండా ఎందుకు కాల్చారో అంతుబట్ట లేదు. “వాళ్ళు కిటికీల వైపుకి ఎందుకు కాల్చారు?” అని ఫైజన్ ప్రశ్నిస్తున్నాడని పత్రికలు తెలిపాయి.

సైనికుల దుశ్చర్యతో కాశ్మీరు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు తెగబడ్డారు. యువకులు రాళ్ళతో సైనికులు, పోలీసులతో తలపడ్డారు. దానితో శ్రీనగర్ లో కొన్ని చోట్ల కర్ఫ్యూ ప్రకటించారు. పిల్లలు నివసించే నౌగాం లో మంగళవారం రోజంతా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో అంతటా ఉద్రిక్తత అలుముకుంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వీధుల్లోకి వచ్చి జరిగిన ఘోరంపై ఆగ్రహం ప్రకటించారు.

జరిగిన సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు స్వాంతన ప్రకటనలు జారీ చేస్తున్నారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని, సంఘటన వివరాలు, ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఏ చర్య తీసుకుంది తదితరాలు ఇవ్వాలని కోరామని హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ఫ్యూ మాత్రం బుధవారం కూడా కొనసాగడంతో ప్రజా జీవనానికి తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. తప్పు చేసింది సైనికులే, దాని ఫలితాన్ని అనుభవించింది జనమే, మళ్ళీ దాని పరిణామాలు ఎదుర్కోవలసింది కూడా జనమే. ధనిక వర్గాల కొమ్ము కాసే ప్రభుత్వాల ఏలుబడిలో జనం పరిస్ధితి ఇంతకంటే వేరుగా ఎక్కడా ఉండదు.

కాశ్మీరు పిల్లల హత్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జమ్ము&కాశ్మీర్ రాష్ట్ర అధికారులను, రక్షణ శాఖను కోరామని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది. రక్షణ శాఖకు, హత్యలు జరిగిన బుద్గాం పోలీసులకు, బుద్గామ్ జిల్లా ఎస్.పికి, రాష్ట్ర ప్రభుత్వానికి వేరు వేరు నోటీసులు జారీ చేశామని ప్రకటన పేర్కొంది. రెండు వారాల లోపు నివేదికలు ఇవ్వాలని కోరామని తెలిపింది. హురియత్ కాన్వరెన్స్ ఫిర్యాదుతోనే మానవహక్కుల కమిషన్ స్పందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు తాము కూడా ఆర్మీ కోర్టు విచారణకు ఆదేశించామని సైన్యం ప్రకటించింది. జరిగిన దుర్ఘటన దురదృష్టకరం అని ఆర్ధిక, రక్షణ మంత్రి జైట్లీ ప్రకటించారు. ఇలాంటి విచారణలు గతంలో ఎన్నో జరిగాయి. ఏమీ తేలకుండానో లేదా ఆర్మీది తప్పేమీ లేదని చెబుతూనో ముగిసిపోయాయి తప్ప బాధితులకు న్యాయం జరిగిన ఉదాహరణ లేదు.

8 thoughts on “కాశ్మీర్: కారు ఆపలేదని పిల్లల్ని చంపేశారు

  1. What if they are terrorists ???
    ఇక్కడ కూర్చుని రాయడం బాగానే ఉంటుంది , కాని పని చేస్తే అసలు బాధ అర్ధం అవుతుంది .
    జనం చస్తే అప్పుడు గవర్నమెంట్ పని చేయడం లేదు అంటారు .
    బాధ్యత గా రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగి చెక్ చేసుకోవడం చెయ్యాలి .
    ఇది కాశ్మీర్ అయినా, బెంగుళూరు అయినా ఒక్కటే

  2. అవున్నిజం. ఇక్కడ కూర్చొని 15 యేళ్ళ బాలుడు టెర్రరిస్టు అయితే? అని అనుమానించడం బాగానే ఉంటుంది. అక్కడ బతికి అయినదానికీ, కానిదానికీ ఆర్మీ రోజూ మన ఇళ్ళల్లో దూరి చావబాదుతుంటే అప్పుడు తెలుస్తుంది, కాశ్మీర్ బతుకంటే ఏమిటో!

    వెటకారాలకేమి ఎన్నయినా చేసుకోవచ్చు. విషయాసక్తి ఉంటే తదనుగుణంగా వ్యాఖ్యలు రాయండి. ఇలా వెటకారం చేసినందుకే మీ వ్యాఖ్యలను ప్రచురించలేదు. ఇలాగే రాస్తే ప్రచురించడం కష్టం అవుతుంది. గమనించగలరు.

  3. మీకింకా తెలిసినట్లు లేదు. మా వూళ్ళో అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా కారులో వెళ్లొచ్చు, వెనక సీట్లో అమ్మ ఒళ్ళో పడుకుని. 7th క్లాస్ పిల్లాడైతే అమ్మ ఒడి లేకుండానే వెనక సీట్లోనో, డ్రైవర్ పక్క సీట్లోనో కూర్చుని వెళ్తుంటారు. బహుశా కాశ్మీర్ వాళ్ళు మా ఊరు చూసి నేర్చుకుని ఉంటార్లెండి.

    కాశ్మీర్ గురించి ఓనమాలు కూడా తెలియని ప్రతోడూ ‘కాశ్మీర్ నా తల్లి నుదుటి సింధూరం’ అని పిచ్చి కూతలు కూయొచ్చు గానీ అక్కడి జనం గురించి పట్టించుకునేవారు ఎవరూ మాట్లాడకూడదేం?!

    కాశ్మీర్ లో జనం ఉన్నారని, వారికి ఒక బతుకు ఏడ్చిందని అది బాగుండాలని వారు కోరుకుంటారని గుర్తించలేని మనుషులు ఉండడమే ఓ విచిత్రం.

  4. కాశ్మీర్ జనాభాలో 30 నుంచి 40% మంది హిందువులే. చనిపోయినవాళ్ళు హిందువులు అయ్యుంటే అప్పుడు కూడా “వాళ్ళు ఉగ్రవాదులైతే” అనేవాళ్ళా?

  5. ఇదే ప్రశ్న నేనూ అడగగలను. కొంత మంది ముస్లింలు పాకిస్తాన్‌కి అనుకూలురుగా ఉన్నారని కారులో ముస్లింలు కనిపిస్తే వాళ్ళని ఉగ్రవాదులుగా అనుమానించడం అవసరమా?

  6. జమ్ము & కశ్మీర్‌లో మూడు ప్రాంతాలు ఉన్నాయి. అవి జమ్ము, కశ్మీర్ మరియు లద్దఖ్. జమ్ము ప్రాంతంలో హిందువులు ఎక్కువ, కశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ, లద్దఖ్ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ. కశ్మీరీయులందరినీ ఉగ్రవాదులుగా అనుమానిస్తే జమ్ము ప్రాంతంలోని హిందువులని కూడా అలాగే అనుమానించాల్సి వస్తుంది. కశ్మీర్ ప్రాంతంలో కూడా ఒకప్పుడు అందరూ హిందువులే. ముఘల్ చక్రవర్తుల కాలంలో వీళ్ళు ఇస్లాంలోకి మారారు. కశ్మీర్ ముఖ్తమంత్రి ఉమర్ అబ్దుల్లాహ్ పూర్వికులు ఆంగ్లేయుల కాలంలో ఇస్లాంలోకి మారారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s