జి.కె.గణేష్:
టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా?
సమాధానం:
ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.
ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ఉగ్రవాదం వెనుక అమెరికా హస్తం ఎందుకు ఉంటుందో, దాని వెనుక ఉండే రాజకీయాలు ఏమిటో ఒక అవగాహన ఇస్తే ఉపయోగం అనే ఉద్దేశ్యంతో మీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. సమాధానం ఈ కోణంలోనే ఉంటుంది.
అమెరికా అతి పెద్ద పెత్తందారీ దేశం. ఇటీవలి వరకు అమెరికా ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం. ఇప్పుడు కాదా అంటే కాదు-అవును. అని రెండు రకాలుగా చెప్పాల్సి ఉంటుంది.
కాదు అని ఎందుకంటే గతంలో వలే అమెరికా ఇప్పుడు ఇతర దేశాలపై పెత్తనం చేయలేకపోతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజకీయంగా, ఆర్ధికంగా తన మాట నెగ్గించుకునే అమెరికా ఇప్పుడు అలా చేయలేకపోతోంది. ఐరోపా రాజ్యాలను కూడా మునుపటివలే శాసించలేకపోతోంది. అమెరికా ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణ సామ్రాజ్యవాద సంక్షోభంలో భాగంగానే అలా జరుగుతోంది. నిజానికి పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలన్నీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయి. సంక్షోభం అంటే, ఒక్క మాటలో: వాటి సరుకులకు గిరాకీ లేకపోవడం. అక్కడి కొనుగోలు శక్తి పడిపోయి మార్కెట్ కుచించుకుపోతూ ఉండడం.
అవును అని ఎందుకంటే అమెరికా స్ధాయిలో సైనిక శక్తి గల దేశం ప్రపంచంలో మరొకటి ఇప్పటికీ లేదు. ప్రపంచ వ్యాపితంగా సైనిక స్ధావరాలను, గతంలో వలే పెద్ద పెద్దవి కాకపోయినా, కొనసాగిస్తున్న దేశం అమెరికాయే. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల శిబిరానికి అమెరికా ఇప్పటికీ నాయకత్వం వహిస్తోంది. మరోవైపు అమెరికా స్ధాయిలో పెత్తనం అందిపుచ్చుకున్న పోటీ దేశం మరొకటి లేదు. అమెరికా ప్రభ పడిపోయింది అని నిర్ధారిస్తే ఆ స్ధానాన్ని భర్తీ చేయగల దేశం మరొకటి లేదు. చైనా ప్రధానంగా ఆర్ధిక శక్తియే తప్ప సైనిక శక్తి కాదు. ఇతర దేశాల సైనిక బడ్జెట్ అంతా కలిపినా అమెరికా సైనిక బడ్జెట్ తో సరితూగవు. కానీ ఇది క్రమంగా తగ్గుతోందన్నది నిస్సందేహం. చైనా సైనిక శక్తి పెరుగుతుండగా అమెరికా శక్తి పెరుగుదల తగ్గుతోంది.
అమెరికాకు చెందిన మిలట్రీ-పారిశ్రామిక బలగం (Military Industrial Complex) ఒక మహా మదపుటేనుగు. కానీ సైనిక శక్తి దండిగా ఉండగానే సరిపోదు. దానికి తగిన ఆర్ధిక శక్తి ఉంటేనే సైనిక శక్తి అక్కరకు వస్తుంది. ఆర్ధిక శక్తి లేకుండా ఎంత సైనిక శక్తి ఉన్నా, దాని వినియోగానికి అనేక పరిమితులు వచ్చి చేరతాయి. అమెరికా ప్రాభవం తగ్గుదలలో రహస్యం ఇదే.
ఇది ఇప్పటి పరిస్ధితి. కానీ గతంలో ఇది కాదు పరిస్ధితి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి 1990 వరకు అమెరికా, రష్యాలు రెండు పోటీ శిబిరాలు నడుపుతూ రెండు అగ్ర రాజ్యాలుగా కొనసాగాయి. ప్రచ్చన్న యుద్ధం సాగించాయి. స్టాలిన్ ఉన్నంతవరకు సోషలిస్టు రష్యా కొనసాగగా, ఆయన మరణంతో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద సోవియట్ రష్యా అవతరించింది. అప్పటి నుండి ఇరు అగ్ర రాజ్యాలు ప్రపంచ ప్రజలకు, దేశాలకు పెను భారంగా పరిణమించాయి. 1990లో సోవియట్ రష్యా పతనం అనంతరం అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. (పెట్టుబడిదారీ విధానమే నెగ్గిందని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సీనియర్ 1990లో ప్రకటించినప్పుడు ఇక్కడ తెలుగు నేలపై తెలుగు పత్రికలు కూడా సంబరం చేసుకున్నాయి.)
ఈ వివరణ ద్వారా గహించవలసిన అంశం: సామ్రాజ్యవాద దేశాలకు రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యం కావాలి. ఆర్ధిక ఆధిపత్యం కొనసాగడానికి రాజకీయ ఆధిపత్యం కావాలి.
రాజకీయ ఆధిపత్యం ఎలా వస్తుంది? ఇందుకు వచ్చే సమాధానాల్లో ఒకానొకటి టెర్రరిజం.
ఐక్య రాజ్య సమితి, భద్రతా సమితి (UNSC), యునెస్కో, ఐరాస మానవ హక్కుల సంస్ధ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు… ఇవన్నీ అమెరికా, పశ్చిమ రాజ్యాల పెత్తనాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఉపయోగపడే రాజకీయ సాధనాలు. [పశ్చిమ రాజ్యాల పక్షం వహిస్తున్నాయి కదాని వాటి ఉనికిని తిరస్కరించే పనికి ప్రత్యర్ధి దేశాలయిన రష్యా, చైనాలు దిగవచ్చు. కానీ దానివల్ల మొదటికే మోసం వస్తుంది. ప్రపంచ స్ధాయి నియంత్రణా సంస్ధలు అంటూ కొన్ని ఉంటే అవి ఈ రోజు కాకపోయినా రేపయినా తమకు ఉపయోగపడతాయన్న ఎరుక ప్రత్యర్ధి దేశాలకు ఉంటుంది.]
ప్రపంచ స్ధాయి సంస్ధలతో పాటు ఇంకా ఇతర ద్వైపాక్షిక, బహుళపక్ష సంస్ధల ద్వారా కూడా రాజకీయ ఆధిపత్యాన్ని అమెరికా కొనసాగిస్తుంది. అయితే ఐరాస తదితర అనుబంధ సంస్ధలు ప్రపంచ ప్రభుత్వంతో సమానం. దీని నియమ నిబంధనలను అతిక్రమించే హక్కును వీటో ద్వారా సంపాదించినప్పటికీ ఒక ప్రభుత్వం చేసే నిర్ణయాలను ఉల్లంఘించే అవసరం పెత్తందారీ శక్తులకు నిరంతరం వస్తుంది. అనగా ప్రపంచ చట్టాలకు దొరక కుండా అంతర్జాతీయ చట్ట విరుద్ధ కార్యకలాపాల ద్వారా రాజకీయ ఆధిపత్యం కొనసాగించే చర్యల్లో టెర్రరిజం ప్రధానమైనది.
ఆరంభంలో తన మాట వినని దేశ భక్త ప్రభుత్వాలను, జాతీయ ప్రభుత్వాలను కూల్చేందుకు అమెరికా ఉగ్రవాదాన్ని పోషించింది. ఇతర ప్రధాన ఎత్తుగడలు పని చేయని చోట ప్రయోగించిన ఉగ్రవాదాన్ని క్రమంగా కేంద్ర స్ధానంలోకి తెచ్చి దానినే ప్రధాన ఎత్తుగడగా అమెరికా మార్చివేసింది.
ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే అమెరికా ప్రతిష్ట నానాటికీ మసకబారుతూ వచ్చింది. అది ప్రజాస్వామ్య సంస్ధాపన గురించి చెప్పేవన్నీ పోచుకోలు కబుర్లేనని ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా అమెరికా ప్రజలకు అర్ధం అవుతూ వస్తోంది. అమెరికాలో వేతనాలు పెరుగుతూ పోయినంతవరకూ, కనీసం స్తంభనలో ఉన్నంతవరకూ అమెరికన్లు తమ పాలకులు ఏది చెబితే అది నమ్మారు. సంక్షోభం ఏర్పడి ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి, కొత్త ఉద్యోగాలు దొరకక, దరిద్రం పెరిగిపోయి బతుకు కనాకష్టంగా మారడంతో కొన్ని నిజాలను వారు చూడడం ప్రారంభించారు. అందుకే ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలకు వచ్చిన మద్దతు సిరియాపై దాడికి అందలేదు. లిబియా దాడి కూడా తాను వెనక ఉన్నానని ప్రధాన స్ధానంలో లేనని చెప్పి తమ ప్రజలను ఒప్పించారు అమెరికా పాలకులు. ఆ మోసం కూడా బట్టబయలు కావడంతో అమెరికా పాలకుల ప్రతిష్ట ఇంకా కొడిగట్టింది.
ఫలితంగా చట్టబద్ధ దాడులకు బదులుగా ప్రాక్సీ (పరోక్ష) యుద్ధాలను అమెరికా ఎంచుకుంది. ఇస్లామిక్ ఉగ్రవాదం ఇలాంటి ప్రాక్సీ యుద్ధాలకు ప్రధాన వనరుగా అమెరికాకు ఉపయోగపడుతోంది. అమెరికా తలచుకోవడంతోనే ఇస్లామిక్ ఉగ్రవాదానికి కార్యకర్తలు ఎలా లభిస్తారు? నిజానికి అలా లభించరు. జనంలో కొందరు ఉగ్రవాదంవైపు ఆకర్షితులు కావడానికి కూడా తగిన సామాజికార్ధిక పరిస్ధితులు నిజంగా నెలకొని ఉండాలి. అలాంటి పరిస్ధితిని మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా సమస్య కల్పిస్తోంది. ప్రపంచవ్యాపితంగా ఉన్న ముస్లింలకు పాలస్తీనా ఒక రాజకీయ అయస్కాంతం. అది న్యాయమైనది కూడా.
యూదు దురహంకార రాజ్యం చరిత్రాత్మక పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుని పాలస్తీనా ప్రజలకు వారి స్వంత నేలపై నిలువ నీడ లేకుండా చేసిన పరిస్ధితిని తెలుసుకున్నవారు ఎవరైనా చలించకుండా ఉండలేరు. వారు ముస్లింలు కాకపోయినా చలిస్తారు. అలాంటిది ముస్లింలే అయితే స్పందించకుండా ఉండడం సాధ్యం కాదు. ఇస్లాం మతంలో అందుకు తగినట్లుగా ఉన్న జిహాద్ అన్న పదాన్ని తమకు అనుకూలంగా మార్చి చెప్పించుకున్న సామ్రాజ్యవాద దేశాలు, మతోన్మాద ఫండమెంటలిస్టు అరబ్ రాచరిక పాలకులు అమాయక ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో సఫలం అవుతున్నారు.
ఇందుకు సిరియా తిరుగుబాటే ఒక సాక్ష్యం. సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వంపై పోరాడుతున్న ఉగ్రవాద సంస్ధల కార్యకర్తలను అరెస్టు చేసి ప్రశ్నిస్తే తేలిన విషయం ఏమిటంటే వారు తాము పాలస్తీనా భూభాగంపై యూదు ఇజ్రాయెల్ పై పోరాడుతున్నామని భావిస్తున్నారని. తాము సిరియాలో ఉన్నామని, తమను తెచ్చినవారు అబద్ధం చెప్పి తెచ్చారని తెలిసి అనేకమంది స్వస్ధలాలకు వెళ్లడమో, జైళ్లలోనే ఉండిపోవడమో జరిగిన ఉదంతాలు ఉన్నాయి.
కనుక అమెరికా ఎంచుకున్న ప్రాక్సీ యుద్ధ పద్ధతులకు సాధనమైన ఉగ్రవాదానికి పాలస్తీనా సమస్య ఒక ప్రధాన ప్రేరణ. [భారత ఉపఖండంలో కాశ్మీరు సమస్య కూడా అలాంటి ప్రేరణే. కాశ్మీరులో ఉగ్రవాదం కొనసాగితేనే భారత ప్రజల ఆలోచనలను హిందూ మతం పేరుతో మళ్లించగల సౌలభ్యం భారత పాలకులకు, ముఖ్యంగా మతోన్మాద పాలకులకు ఉంటుంది.] ఇక సున్నీ-షియా సెక్టేరియన్ భావనలు, ముస్లిం యువతలో భారీ మొత్తంలో పెరుకుపోయిన నిరుద్యోగం… ఇలాంటి సమస్యలు కూడా యువతను ఉగ్రవాదం వైపుకి మళ్లించే తక్షణ కారణాలుగా పని చేస్తున్నాయి. వీరు తేరుకుని నిజం తెలుసుకునే లోపు అదే ఉగ్రవాదానికి వారు బలైపోతున్నారు.
1990ల వరకూ ఆఫ్ఘనిస్ధాన్ ను సోవియట్ రష్యా ఆక్రమించుకోవడం కోవడం కూడా అమెరికా నీడలో, శిక్షణలో ఉగ్రవాద సంస్ధల ఎదుగుదల, విస్తరణలకు ప్రధాన హేతువుగా నిలిచింది. అమెరికా ఏలుబడిలో ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాద నేత తయారీ ఆఫ్ఘన్ దురాక్రమణ వల్లనే సాధ్యపడింది. సోవియట్ రష్యాను ఓడించడానికి సాయం చేస్తున్నట్లు నటించిన అమెరికా ఆ క్రమంలో అనేకమంది ఉగ్రవాద నాయకులను, కార్యకర్తలను తయారు చేసుకుని ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేసింది.
ప్రస్తుతం ప్రధాన ఉగ్రవాద ప్రమాదంగా అమెరియే చెబుతున్న ఆల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ సంస్ధలు కూడా అమెరికా సృష్టే. ఆల్-ఖైదా అనేది నిజానికి ఆరంభంలో సంస్ధ కాదు. ఖైదా అంటే అరబిక్ ఇస్లాం లో జాబితా అని అర్ధం. తాము పెంచి పోషించిన ఉగ్రవాద నేతలు, కార్యకర్తలతో జాబితా నిర్వహించిన సి.ఐ.ఏ, సెప్టెంబర్ 11 నాటి WTO టెర్రరిస్టు దాడుల సందర్భంగా ఆ జాబితానే టెర్రరిస్టు సంస్ధగా ఉనికిలోకి తెచ్చింది. కనుక ఆల్-ఖైదాకు కర్త, కర్మ, క్రియ అన్నీ అమెరికాయే, ఇప్పటికీ. ప్రపంచంలో ఏమూల ఉగ్రవాద దాడి జరిగినా ఆ సమాచారం తమ వద్ద ముందే ఉన్నదని అమెరికా చెప్పడం కాకతాళీయమో, వారి గూఢచారుల సామర్ధ్యమో కాదని ఇందు మూలంగా అర్ధం చేసుకోవచ్చు.
ఆల్-ఖైదాకు ఇక బొంద పెట్టాలని భావిస్తూ ఇసిస్ కు అమెరికా (రాజ్యం, ప్రజలు కాదు) ప్రాణం పోసింది. సిరియా నియంత బాషర్ అస్సాద్ పై వీరోచితంగా పోరాడుతున్న తిరుగుబాటు దారులుగా అమెరికా, ఐరోపా రాజ్యాలు పేర్కొన్న నేతలు, కార్యకర్తలే ఇప్పుడు ఇసిస్ పేరుతో చెలామణిలో ఉన్నారు.
‘సత్య హరిశ్చంద్ర’ నాటకంలో వారణాసి సీన్ లో హరిశ్చంద్రుడు అంటాడు “కింకరుడే రాజగు, రాజే కింకరుడగు; కాలానుగూణంబుగా…” అని. అలాగే వివిధ టెర్రరిస్టు సంస్ధలు ఒకసారి మంచి టెర్రరిస్టులుగానూ, మరో సారి అత్యంత క్రూరమైన చరిత్ర కల రక్తాపిపాస టెర్రరిస్టులుగానూ ముద్ర పొందుతు ఉంటారు. ఉదాహరణకి మన 2008లో ముంబైలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడులకు పధకం సిద్ధం చేసి రెక్కీ నిర్వహించిన జేమ్స్ కోలమాన్ హేడ్లీ ఇప్పుడు సి.ఐ.ఏ, అమెరికాల కట్టుదిట్టమైన రక్షణలో భద్రంగా బతుకు తున్నాడు. ఆయనను ముట్టుకోవడం అటుంచి కనీసం ప్రశ్నించేందుకు కూడా ఇండియాకు అమెరికా అనుమతి ఇవ్వలేదు. ఓసారి ప్రశ్నిస్తాం అని చెబుతూ వెళ్ళినవారు టూర్ వెళ్ళి వచ్చినట్లు వెళ్లొచ్చారే గానీ ఒక్క ముక్క న్యాయ పరిశోధనా విలువను తేలేకపోయారు.
అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అతి పెద్ద వ్యూహాత్మక అసెట్ గా ఉండే టెర్రరిస్టు నేతలకు అమెరికా పాలకుల దృష్టిలో వీసమెత్తు విలువ ఉండదు. వారికి ఇక అవసరం లేదనుకుంటే లేదా చంపితేనే ఎక్కువ ప్రయోజనం అనుకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. దానిని మనం పత్రికల్లో “అమెరికా డ్రోన్ దాడిలో కరుడుగట్టిన ‘ఆల్-ఖైదా/ఇసిస్/ఆల్ నూస్రా/ఏడి కోరుకుంటే అది’ నేత మరణం” అంటూ చూస్తాము.