స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు


“పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్” అంటాడు గిరీశం మహాకవి గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నాటకంలో. పొగ తాగడం అనివార్యం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆనక ఆ ప్రాతిపదికన తన అలవాటును గొప్పదిగా ఎస్టాబ్లిష్ చేయడానికి గిరీశం ఆ మాట చెప్పాడు.

అప్పు సంగతి దాదాపు అలాంటిదే. పొగ అవసరం లేకపోయినా ఉందని గిరీశం ఎస్టాబ్లిష్ చెయ్యబోయాడు. అప్పు అవసరం మాత్రం నిజంగానే అనివార్యం. ఎందుకని అనివార్యం?

నిజానికి ఎవరి శ్రమకు తగిన సంపాదన వారికి న్యాయంగా దక్కితే అప్పు అవసరమే ఉండదు. సహజ వనరులను/ఉత్పత్తి సాధనాలను సమాజంలో  కొద్ది మంది తమ నియంత్రణలో ఉంచుకుని తద్వారా మెజారిటీ ప్రజల శ్రమను దోపిడి చేయడం వల్ల సమాజంలో తీవ్రమైన ఆర్ధిక పరిస్ధితులు నెలకొన్నాయి. అనగా కొద్ది మంది ఆదాయం తరాలు తిన్నా తరగనంత పేరుకుపోగా అనేకమంది కనీస అవసరాలు కూడా తీరక అప్పు చేయని అనివార్య పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదంతా వ్యక్తుల ఆర్ధిక అవసరాలను పరిశీలించే సూక్ష్మ ఆర్ధిక కోణం.

స్ధూల ఆర్ధిక పరిశీలనలో చూసినా ఇదే పరిస్ధితి నెలకొని ఉంది. పెత్తందారీ దేశాలు ఇతర దేశాల ఆర్ధిక వనరులను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. గతంలో సైన్యం ద్వారా దేశాలను ప్రత్యక్షంగా ఆక్రమించుకుని వలస దోపిడీ చేశాయి. వలస దోపిడీ ద్వారా దోచుకున్న భారీ సంపదలను ఫైనాన్స్ పెట్టుబడిగా పోగేసుకున్న పెత్తందారీ దేశాలు ఇప్పుడు ఆ ఫైనాన్స్ పెట్టుబడినే ఇతర దేశాలకు అప్పుగా ఇస్తూ ఆ దేశాల జీవ నాడులను తమ అదుపులో ఉంచుకుని శాసిస్తున్నాయి.

ఈ రోజుల్లో ఫైనాన్స్ పెట్టుబడే అన్నింటా రాజ్యం ఏలుతోంది. ఒక కంపెనీ స్ధాపించాలన్నా, స్వయంగా ఉపాధి కల్పించుకోవాలన్నా, ఒక ప్రభుత్వం ఒక మౌలిక నిర్మాణం చేపట్టాలన్నా ఓం ప్రధమం ఫైనాన్స్ పెట్టుబడి ముఖ్య అవసరంగా కనిపిస్తోంది. నిజానికి ఈ అవసరం కృత్రిమమైనదే. పెట్టుబడిదారీ వ్యవస్ధ కల్పించిన కృత్రిమ అవసరం ఇది.

ఫైనాన్స్ పెట్టుబడి లేకుండా ఒక దేశం తన అవసరాలు తీర్చుకోగలదా? దేశ ఆర్ధిక వ్యవస్ధలను నిర్వహించుకోగలవా? అన్న ప్రశ్నలకు సమాధానం: శుభ్రంగా తీర్చుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు అన్నదే. ఎందుకంటే గత వారం ఆర్టికల్ లో చెప్పినట్లు డబ్బు దానికదే విలువ కలిగినది కాదు. శ్రామికులు తమ శ్రమతో తయారు చేసిన ఉత్పత్తి విలువను మాత్రమే డబ్బు వ్యక్తీకరిస్తుంది తప్పితే అసలు విలువ డబ్బులో లేదు.

అసలు విలువ ఉన్నది ముడి వనరులు మరియు మానవుడి శ్రమలోనే.

ముడి వనరులు అంటే ప్రకృతిలో మనిషికి అందుబాటులో ఉండే వనరులు. ఆ వనరులపై మనిషి శ్రమ చేస్తే ఉత్పత్తి/సరుకు/వస్తువు పుడుతుంది. వీటిని ఉపయోగించుకోవడమే ఒక మనిషి లేదా దేశం యొక్క ఆర్ధిక జీవనం. కనుక పెట్టుబడి లేకుండా వ్యక్తులు, సమాజాలు, దేశాలు ఎందుకు బతకలేవు?

ఉదాహరణకి మన దేశాన్నే తీసుకుంటే పుష్కలంగా వనరులు ఉన్నాయి. మనిషికి ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్నింటిని తీర్చగల వనరులు దేశంలో ఉన్నాయి. చివరికి శక్తి వనరులు లేవు అనేందుకు కూడా లేదు. ఎందుకంటే చమురు, సహజ వాయువులకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా గాలి, సూర్య రశ్మి ఇప్పుడు ఘనంగా మన ఆధీనంలో ఉన్నాయి.

పైగా మన దేశంలో బోలెడు మంది జనం. ప్రతి ఒక్కరికీ రోజుకి కనీసం 4 గంటలు పని కల్పించినా దేశానికి పదింతలు సరిపడా ఉత్పత్తి చేయగల జనం దేశంలో ఉన్నారు. కావలసిందల్లా జనంపై నమ్మకం ఉంచగల సామాజిక, పాలనా వ్యవస్ధలు మాత్రమే.

దేశంలోనూ, ప్రపంచంలోనూ ఉన్నది పెట్టుబడిదారీ, అర్ధ భూస్వామ్య వ్యవస్ధలు. ఇవి మనిషిని గౌరవించవు. కేవలం డబ్బును, సంపదలను మాత్రమే గౌరవిస్తాయి. వాటి వెనుక ఉండే మనిషి శ్రమని ఈసడించుకునే వ్యవస్ధలివి. డబ్బును లేదా లక్ష్మీ దేవిని నెత్తిన పెట్టుకుని పూజిస్తూ తోటి మనిషిని అనేక కులాల పేరిటా, మతాల పేరిటా, ప్రాంతాల పేరిటా, జెండర్ పేరిటా తిరస్కారంగా చూసే వ్యవస్ధలివి. అందుకే అవి డబ్బు/పెట్టుబడి లేకపోతే ఏదీ సాధ్యం కాదని నమ్ముతాయి. జనాన్ని కూడా అదే నమ్మమని బోధిస్తాయి. ఆ విధంగా పెట్టుబడి మన నెత్తిపై కూర్చొని స్వారీ చేయగలుగుతోంది.

పెట్టుబడి లేకపోతే అది ఉన్న వాడి దగ్గర్నుండి తీసుకోవాలి. ఊరికే ఇస్తే అది పెట్టుబడిదారీ వ్యవస్ధో మరో దోపిడీ వ్యవస్ధో ఎందుకు అవుతుంది. వడ్డీ, లాభం, డివిడెండ్, అద్దె, కౌలు… ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా అది ప్రాధమికంగా శ్రామికుడి నుండి పిండే అదనపు విలువే (surplus value). ఈ అదనపు విలువను ధనికులు, కంపెనీలు, పెత్తందారీ దేశాలు నియంత్రిస్తూ ఫైనాన్స్ పెట్టుబడిని రుణాలుగా ఇస్తూ దేశాలనూ, వ్యవస్ధలనూ, శ్రామికులనూ శాసిస్తున్నాయి.

(పాఠకులు వీలయితే హాలీవుడ్ సినిమా ‘ద ఇంటర్నేషనల్’ ను చూడవచ్చు. ఇందులో ఫైనాన్స్ పెట్టుబడి ద్వారా పశ్చిమ దేశాల బహుళజాతి బ్యాంకులు మూడో ప్రపంచ దేశాలలోని వ్యవస్ధలనూ, ఘర్షణలనూ, యుద్ధాలనూ, ఉగ్రవాదాన్నీ ఎలా పోషిస్తున్నాయో చర్చించబడింది. ఫైనాన్స్ పెట్టుబడి ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో, మనిషి ప్రాణాన్ని ఎంత చులకన ప్రాయంగా చూస్తుందో, సామూహిక హత్యాకాండలను సైతం ఎంత తేలికగా ఒక కాంట్రాక్టు తరహాలో చేసిపారేస్తుందో రేఖా మాత్రంగా చర్చించారు. ‘షూటర్’, ‘జాక్ రీచర్” అనే మరో రెండు హాలీవుడ్ సినిమాలు కూడా వీటిలో కొన్ని అంశాలను వివరిస్తాయి.

ఈ అంశాలనే క్లుప్తంగా ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించాను.

ఆర్టికల్ ను నేరుగా ఈనాడులో చూడాలని భావిస్తే కింది లింక్ లోకి వెళ్ళండి.

రుణాలూ..  పరిణామాలూ

పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా చదవాలనుకుంటే కింది బొమ్మను క్లిక్ చేయండి.

Eenadu 2014.11.03

5 thoughts on “స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు

 1. 1940లో రష్యాలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. అప్పట్లో ప్రపంచంలోని వ్యవసాయ ఉత్పత్తి 40% రష్యా నుంచే ఎగుమతి అయ్యేది. అప్పట్లో రష్యాకి రూపాయి అప్పు కూడా లేదు కానీ రష్యా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. స్తాలిన్ చెయ్యించిన బలవంతపు వ్యవసాయ సమిష్ఠీకరణ ఫలితం అది.

  రష్యాలో అప్పులు లెనిన్ కాలంలోనే రద్దు అయ్యాయి. లెనిన్ విదేశాలకి రూపాయి కూడా బాకీ కట్టలేదు. స్తాలిన్ నాయకుడైన తరువాత పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్ఠీకరణ జరిగాయి. చివరికి ఆవుల్నీ, బఱ్ఱెల్ని కూడా సమిష్ఠి ఆస్తులుగా మార్చడం జరిగింది. స్త్లాలిన్ కాలంలో ప్రైవేత్ ఆస్తిని పూర్తిగా నిషేధించినా కార్మికుల కంటే మేనేజర్‌లకి జీతాలు ఎక్కువ ఇవ్వడం లాంటి తప్పుడు విధానాలు కొనసాగాయి. అందుకే సోవియత్ రష్యాలో వర్గాలు మాయమవ్వలేదు.

 2. ప్రవీణ్ గారూ

  అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుంది మీ వ్యవహారం. స్టాలిన్ బలవంతపు వ్యవసాయ సమిష్టీకరణ చెయ్యించడం ఏమిటి? మీరు ఎక్కడ చదివారు? సోషలిస్టు వ్యవస్ధల్లో ప్రతి అంశాన్ని కింది నుండి మీది వరకూ సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాల్లో అందరి భాగస్వామ్యం ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధలో అమలయ్యేది కార్మికవర్గ నియంతృత్వమే గానీ వ్యక్తుల నియంతృత్వం కాదు. రష్యాలో జరిగిన నిర్ణయాలకు కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీసుకుంటుంది తప్ప స్టాలిన్ కాదు. స్టాలిన్ అందులో ఒక ఓటు మాత్రమే కలిగి ఉంటాడు. ఒక నిర్ణయం నెగ్గాలంటే కమిటీలు, జనరల్ బాడీలు, కాన్ఫరెన్స్ లూ అన్నీ చర్చించిగానీ నెగ్గవు. అలాంటి నిర్ణయాలకు అందరికి మల్లే మీరూ స్టాలిన్ ని బాధ్యుడ్ని చెయ్యడం అంటే మిలియన్ ల మందిని చంపించాడన్న దుష్ప్రచారాన్ని మీరు మరో విధంగా చేస్తున్నారంతే.

  ఇలాంటి స్వకపోల కల్పితాలను, సొంత బుర్రతో సవ్యంగా అర్ధం చేసుకోని అంశాలను చిత్తానుసారం రాసేసి, అదీ మార్క్సిస్ట్-లెనినిస్ట్ పేరుతో, పెద్ద సేవ చేస్తున్నానని మీరు భావిస్తే అది పొరబాటు. ఈ సంగతి మీకు ఇంకా ఎన్ని రకాలుగా చెబితే అర్ధం కావాలో నాకు అంతు బట్టకుండా ఉంది.

  వ్యవసాయ సమిష్టీకరణలో కేంద్ర కమిటీ నిర్ణయాలను బలవంతంగా అమలు చేసినప్పుడు స్టాలిన్ స్వయంగా కలుగ జేసుకుని సవరించడానికి ప్రయత్నించిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ సవరణ పని కూడా స్టాలిన్ స్వయంగా చేయలేడు. అది కూడా మళ్ళీ కమిటీల ద్వారా, కార్యకర్తల ద్వారా, ప్రభుత్వం ద్వారానే చేయించాలి. స్టాలిన్ అమలు చేస్తున్న సోషలిస్టు విధానాలను తిరగదోడాలని అడుగడుగునా ప్రయత్నించిన ప్రత్యర్ధి వర్గాలు కమ్యూనిస్టు పార్టీలోనే తిష్ట వేసుకున్న పరిస్ధితిలో ఆయన పేరుతో సవా లక్షా జరిగాయి.

  ఇదొక అంశం అయితే రష్యన్ సోషలిస్టు వ్యవస్ధని అప్రతిష్ట పాలు చేయాలని మొదటి నుండీ హిట్లర్, అమెరికా, ఐరోపాలు చేసిన ప్రయత్నాలు మరో పెద్ద అంశం. నిజంగా ఏం జరిగిందో మనకు తెలియడానికి మధ్య అనేక సంవత్సరాల అంతరం ఉంది. అనేక వ్యవస్ధల దూరం ఉంది. అనేకమంది శత్రువుల నిరంతర విద్రోహ, విద్వేష ప్రచారం ఉంది. వీటన్నింటిని దాటుకుని నిజం యధాతధంగా మనవరకు చేరాలంటే మనం చాలా కష్టపడాలి. వీటన్నింటి కంటే ముందు సోషలిస్టు వ్యవస్ధలోని విధానాలను వాటి డైనమిక్స్ నీ స్పష్టంగా వివరంగా అర్ధం చేసుకుని ఉండాలి. ఇవేవీ లేకుండా అలవోకగా స్టాలిన్ అలా చేశాడు, ఇలా చేశాడు, అందుకే వర్గాలు అని రాసెయ్యడం… ఏమిటి మీ ధైర్యం?

  “కార్మికుల కంటే మేనేజర్‌లకి జీతాలు ఎక్కువ ఇవ్వడం లాంటి తప్పుడు విధానాలు కొనసాగాయి. అందుకే సోవియత్ రష్యాలో వర్గాలు మాయమవ్వలేదు.”

  ఈ ఒక్క వాక్యం చాలు రష్యన్ సోషలిస్టు వ్యవస్ధలో వర్గాలు కొనసాగడాన్ని మీరు ఎంత అవకతవకగా అర్ధం చేసుకున్నారో చెప్పడానికి. సోషలిస్టు వ్యవస్ధలో కార్మికులకి, మేనేజర్ లకీ ఉండే వైరుధ్యం వర్గ వైరుధ్యం కాదు, అది మేధో-శారీరక శ్రమల వైరుధ్యం. వర్గాలు కొనసాగడం వెనుక పరిస్ధితిని వివరించడానికి మీరు చూసిన అతి చిన్న అర్ధం సరిపోదు. అదసలు కారణమే కాదు. వర్గాల కొనసాగింపును వివరిస్తూ స్టాలిన్ స్వయంగా ఓ భారీ పుస్తకం (Class struggle under socialism) రాశారు. వీలైతే అది చదవండి. సోషలిస్టు రష్యాలో వర్గ పోరాటం ఏ రూపంలో కొనసాగిందో అర్ధం అవుతుంది.

  చదవకుండా, తెలుసుకోకుండా మీరు సొంత ప్రకటనలు ఇవ్వడం చాలా ప్రమాదకరం. మీరు అలాంటి ప్రమాదాల్ని తేకండి దయచేసి.

 3. స్టాలిన్‌ ను అంచనా వేయడం లో వివిధ కమ్యునిష్టుల మధ్య వైరుధ్యాలున్నాయి. ఒకరు స్టాలిన్‌ కు తోక ఉందంటే ఒకరు లేదంటారు. ఇవి వర్గ వైరుధ్యాలు తప్ప అభి ప్రాయాలు కాదు.

 4. 1922లో సామ్రాజ్యవాదుల సేనలు రష్యా నుంచి వెనుదిరిగాయి. సామ్రాజ్యవాదులు మళ్ళీ రష్యాపై దాడి చేస్తారని భావించి రష్యాని ఆర్థికంగా బలోపేతం చెయ్యడానికి స్తాలిన్ వేగవంతమైన పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్ఠీకరణ విధానాన్ని ఎంచుకున్నాడు. 1927 నుంచి రష్యాలో వేగవంతమైన పారిశ్రామీకరణ జరగడానికి కారణం అదే. రష్యాలో సొంత వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎక్కువగా, వ్యవసాయ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కార్మికులు కాకుండా పార్తీ కార్యకర్తల చేత వ్యవసాయ సమిష్ఠీకరణ కార్యక్రమం చెయ్యించాల్సి వచ్చింది. ఆ వ్యవసాయ సమిష్ఠీకరణ సమయంలో కరువు రాలేదు, ఎవరూ చావలేదు. ఉక్రెయిన్ కరువులో లక్షల మంది చనిపోయారంటూ పెట్టుబడిదారీ పత్రికల్లో ప్రచురితమైన ఫొతోలు వోల్గా కరువుకి సంబంధించినవి. 1930లలో పెట్టుబడిదారీ పత్రికలు కూడా ప్రచురించడానికి నిరాకరించిన ఫొతోలు అవి. అప్పట్లో విలియం రాందాల్ఫ్ హెర్స్త్ అనే media tycoon మాత్రమే తన పత్రికల్లో ఆ ఫొతోలు ప్రచురించాడు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా గెలవడం వల్ల రష్యాపై దుష్ప్రచారాన్ని తీవ్రతరం చెయ్యడానికి ఇతర పత్రికలు కూడా ఆ ఫొతోలని ప్రచురించాయి. ఇప్పుడు కొన్ని వెబ్‌సైత్‌లు కూడా వోల్గా కరువు ఫొతోలని చూపిస్తూ అవి ఉక్రెయిన్ కరువు ఫొతోలని నమ్మిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s