(మహారాష్ట్రలో కొనసా…….. గుతున్న బి.జె.పి-శివసేనల రాజకీయ స్నేహ క్రీడ యొక్క తెర ముందు, వెనకల భాగోతాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ నాటి ది హిందు సంపాదకీయం ఉపయోగపడుతుంది. -విశేఖర్)
****************
రెండడుగులు ముందుకి, ఒకడుగు వెనక్కి. ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీతో శివసేన సంబంధ బాంధవ్యాలు నెమ్మదిగా కొనసాగడం మాత్రమే కాదు, ఇరు పక్షాలకు బాధాకరంగానూ మారుతోంది. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేలా సేన ప్రముఖ్ ఉద్ధవ్ ధాకరేకు నచ్చజెప్పిన తర్వాత, ఇరు పార్టీలూ అధికార పంపిణీ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేస్తాయని ఆశించారు. కానీ సేన, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం తన డిమాండ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు; శివసేన మూడు వంతుల మంత్రి పదవులే కాకుండా కీలకమైన శాఖలు ఇవ్వాలని కూడా కోరింది. నిజానికి మంత్రివర్గ పదవుల సంఖ్య కంటే ఎక్కువే ఈ వ్యవహారంలో ఇమిడి ఉంది: మాజీ మిత్రులయిన ఇరువురూ తమ రాజకీయ స్నేహంలోని నియమాలను పునర్నిర్వచించాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్వేషంతో వేరు దారులు చూసుకున్న తర్వాత బి.జె.పి, శివ సేనలు ఒకే రాజకీయ ఆవరణ (space) కోసం పోరాడుతున్నాయి.
ఎటువంటి రాజకీయ రాయితీ ఇవ్వబడినా అది చివరికి మంత్రి పదవుల సంఖ్యకు, మంత్రిత్వ శాఖలకూ మించి మరింత దూరం పోయే అవకాశం పొంచి ఉంది. బి.జె.పి 122 సీట్లు, సేన 63 సీట్లు గెలుచుకున్నందున మంత్రి పదవులు కూడా 1:2 నిష్పత్తిలో పంచుకోవాలని సీట్ల సంఖ్యే చెబుతోంది. కానీ అత్యంత గొప్ప సంకేతాత్మక విలువ కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవి, మరియు హోమ్, ఫైనాన్స్, పట్టణాభివృద్ధి శాఖ లాంటి కీలకమైన శాఖలు ఇంకా కొరకరానివిగానే మిగిలాయి. అధికారంలో తన వాటాగా వచ్చిన భాగాన్ని తన రాజకీయ ప్రతిష్టను విస్తరించడానికి వినియోగించుకునేందుకు ఎదురు చూస్తోందని స్పష్టంగానే అగుపిస్తోంది. సీట్ల పంపిణీ ఒప్పంద చర్చలలోనూ, తదనంతరం సంభవించిన ఎడబాటులోనూ బి.జె.పి తమను మించిపోయే ఎత్తులు వేసిందని ధాకరేకు బాగానే తెలుసు. కానీ రాబోయే కాలం అంతటికీ జూనియర్ భాగస్వామిగానే కొనసాగేందుకు ఆయన సిద్ధంగా లేరు. అధికార పంపిణీ అంటూ జరిగితే మహారాష్ట్రలో ఆధిక్యపూర్వక రాజకీయ పార్టీగా తనను తాను సుస్ధిరం కావించుకునే క్రమంలో అదొక వ్యూహాత్మక వెనుకడగుగానే పరిగణిస్తున్నారు.
ప్రభుత్వంపై తనదైన ముద్ర వేసేందుకు అంతే పట్టుదలతో ఉన్న బి.జె.పికి సేన డిమాండ్లన్నింటికీ తల ఒగ్గడం అంటే, తాను ఒంటరిగా పోటీ చేయడం ద్వారా పొందిన లాభాలలో కొన్నింటిని తనకు తానుగా సరెండర్ చేయడమే అవుతుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అందించిన ‘బేషరతు మద్దతు’ తీసుకోగల లగ్జరీ బి.జె.పికి ఉంటే ఉండొచ్చు గాక! కానీ ఈ ఆఫర్ ను సేనపై మరింత ఒత్తిడి పెంచడానికి మించి ఉపయోగించడం విషయానికొస్తే… పవార్ ల తో సన్నిహిత సంబంధాలను బి.జె.పి కోరుకోబోదు. అధికారంలో ఉన్న సంవత్సరాలలో అనేక కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్.సి.పి, ఎన్నికల ప్రచారంలో బి.జె.పి ప్రధాన టార్గెట్ లలో ఒకటి. బి.జె.పి కోర్ బృందం మాత్రమే ప్రమాణ స్వీకారం చేసినందున, హోమ్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆరోగ్యం తదితర అనేక శాఖలను ఫడ్నవిస్ తనవద్దనే అట్టిపెట్టుకున్నందున… సేనకు జాతీయ పార్టీ తలుపులు తెరిచిపెట్టి ఉంచిందని భావించేందుకు ఇవి గట్టి సంకేతాలు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సేనతో కూడిన జీవితం సేన లేని జీవితంతో సమానమైన కష్టాలతో కూడి ఉంటుందన్న స్పష్టమైన ఎరుకతోనే తీసుకుంటుంది.