డ్రోన్ లను కూల్చగల చైనా లేజర్ వెపన్ సిద్ధం


Drone

‘తాడిని తన్నేవాడు ఉంటే, వాడి తలను తన్నేవాడూ ఉంటాడ’ని సామెత! ప్రపంచంలో అత్యంత అధునాతనమైన మానవ రహిత యుద్ధ విమాణాలైన డ్రోన్ లను లెక్కకు మిక్కిలిగా తయారు చేసుకుని విర్ర వీగుతున్న అమెరికాకు చైనా నుండి దుర్వార్త ఎదురయింది. డ్రోన్ విమానాలను, అవి ఎంత చిన్నవైనా సరే, పసిగట్టిన 5 సెకన్లలో కూల్చగల లేజర్ ఆయుధాలను తయారు చేశామని చైనా ప్రకటించింది.

తయారు చేయడమే కాదు విజయవంతంగా పరీక్షించామని కూడా చైనా తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని చైనా వార్తా సంస్ధ జిన్ హువా లోకానికి వెల్లడించింది. చైనా తన సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ ఆయుధం అత్యంత సవ్యమైనది (accurate) గా పరీక్షల్లో రుజువైందని తెలుస్తోంది.

లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసిన సంస్ధల్లో చైనా అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ (సి.ఎ.ఇ.పి) కూడా ఒకటి. ఈ సంస్ధ నుండి జిన్ హువా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం లేజర్ ఆయుధం అత్యంత వేగవంతమైనది. తక్కువ శబ్దం కలిగినట్టిది. చిన్న తరహా డ్రోన్ విమానాలను కూల్చడానికి ఉద్దేశించినది. 500 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో సేకన్ కు 50 మీటర్ల కంటే తక్కువ వేగంతో ఎగిరే డ్రోన్ లను పసిగట్టి మెరుపు వేగంతో నాశనం చేయగల శక్తి లేజర్ ఆయుధానికి ఉంది.

లేజర్ ఆయుధాన్ని 30 డ్రోన్ లపై పరీక్షించి చూశామని, పరీక్షించిన ప్రతిసారీ విజయవంతం అయిందని సి.ఎ.ఇ.పి సంస్ధ ఒక ప్రకటనలో తెలియజేసినట్లుగా రష్యా టుడే తెలిపింది. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ ల కూల్చివేత వలన తక్కువ నష్టం జరిగేందుకు లేజర్ వ్యవస్ధ కీలకంగా పని చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

“అలాంటి డ్రోన్ లను అడ్డుకుని కూల్చడం నిజానికి స్నైపర్లు (తుపాకి గురి కాళ్ళు), హెలికాప్టర్ల పని. కానీ వారి విజయాల రేటు అంత ఎక్కువగా ఏమీ లేదు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎ చిన్న పొరబాటు జరిగినా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది” అని చైనాకు చెందిన జియుయువాన్ హైటెక్ ఎక్విప్ మెంట్ కార్పొరేషన్ సంస్ధ నిపుణుడు వ్యాఖ్యానించారని, దాన్ని బట్టి లేజర్ ఆయుధం ప్రత్యేకత తెలుస్తుందని ఆర్.టి తెలిపింది.

అత్యంత చిన్న తరహా డ్రోన్ విమానాలను ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు, బడా కార్పొరేషన్ లు, బహుళజాతి కంపెనీలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నాయి. ఇవి సాపేక్షికంగా చౌకగా కూడా లభించే పరిస్ధితి ఉండడంతో ఉగ్రవాదులకు ఆకర్షణీయంగా అయ్యాయన్న ఆందోళన సైతం నెలకొని ఉంది.

మానవ రహిత డ్రోన్ లకు సంబంధించి ఇదొక కోణం అయితే, కంప్యూటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ ల కోసం మేపింగ్ సేవలు అందిస్తున్న కంపెనీలది మరో కోణం. ఈ కంపెనీలు ఇలాంటి డ్రోన్ లను వినియోగిస్తూ ప్రతి దేశంలోనూ మారు మూల ప్రాంతాలకు సైతం వెళ్ళి మేప్ లు తయారు చేస్తున్నాయి. వీటిని వినియోగదారుడికి అందించడం మాటేమో గానీ ప్రత్యర్ధి దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు తమ మిలట్రీ అవసరాల కోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆయా దేశాల పౌర, మిలట్రీ ప్రయోజనాలకు తీవ్ర భంగకరంగా డ్రోన్ విమానాలు పరిణమించాయి.

డ్రోన్ విమానాలు సాధ్యమైనంత చిన్నవిగా, పసిగట్టడానికి వీలు లేనట్టివిగా తయారు చేయడంలో అమెరికా, పశ్చిమ దేశాలు నిండా మునిగి ఉన్నాయి. ఒక సమాచారం ప్రకారం సైనికులు జేబులో పెట్టుకుని పోగల చిన్న డ్రోన్ విమానాలను అమెరికా అభివృద్ధి చేస్తోంది. ఇవి త్వరలోనే అమెరికా మిలట్రీకి అందనున్నాయి. వీటిని మడిచి జేబులో పెట్టుకుని అవసరమైన చోట ప్రయోగించే అవకాశం ఉండేలా తయారు చేశారు. కేవలం 80 గ్రాములు మాత్రమే బరువు తూగే ఈ డ్రోన్ లు కనీసం 2 గంటల పాటు ఎగరగలవు. ఎగురుతూ, వై-ఫై అవసరం లేకుండానే, HD క్వాలిటీ వీడియోలను తమ బేస్ లకు ప్రసారం చేస్తాయి. ఇక ఏ దేశమూ కప్పి పెట్టుకోగల రహస్యం ఉండడానికి వీలు లేదు.

స్టింసన్ అనే విధానాల పరిశీలన మరియు రూపకల్పనా సంస్ధ ప్రకారం అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాయుధ మానవరహిత విమానాలు (Unmanned Arial Vehicles) ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో డ్రోన్ లు కలిగి ఉన్న దేశమూ అమెరికాయే. (గార్డియన్ పత్రిక సమాచారం.) అయితే యు.ఎ.వి పరిజ్ఞానంలో అమెరికా ఎల్లకాలం నాయకుడిగా ఉండే అవకాశం లేదని అదే సంస్ధ చెప్పడం విశేషం. అందుకు తార్కాణం చైనా తయారు చేసిన లేజర్ ఆయుద్ధమే కావచ్చు.

అమెరికాకు పోటీగా చైనా ఎదుగుతోందని సంతోషించడానికి ఏమీ లేదు. సమీప భవిష్యత్తులో అమెరికా అరాచకాలను నిలువరించగల అవకాశాన్ని చైనా ఎదుగుదల కల్పిస్తుంది. కానీ దీర్ఘకాలికంగా చూస్తే అప్పటి మరో అమెరికాగా ఇప్పటి చైనా తయారు కాగల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ లక్షణమే అంత!

 

2 thoughts on “డ్రోన్ లను కూల్చగల చైనా లేజర్ వెపన్ సిద్ధం

  1. పోనీ సర్. అమెరికా అరాచకాలకు అంతో ఇంతో అడ్డుకట్ట ఐనా పడుతుందని సంతోషిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s