మోడి రెండు ముఖాలు -కరణ్ ధాపర్


HN Reliance Foundation Hospital inaugaration

HN Reliance Foundation Hospital inaugaration

(సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం నిర్వాకులు గానూ, హెడ్ లైన్స్ టుడే న్యూస్ ఛానెల్ లో ‘టు ద పాయింట్’ కార్యక్రమం సంధానకర్తగానూ జర్నలిస్టు కరణ్ ధాపర్ సుప్రసిద్ధులు. ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ సంస్ధలు బోధించే అశాస్త్రీయ నమ్మకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏకంగా ఒక అత్యాధునిక పరిశోధనా ఆసుపత్రి ప్రారంభంలో వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ ఆయన ది హిందు పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

*****************

ప్రధాన మంత్రుల నుండి మనం ఏం ఆశిస్తాము. ఇదేమీ చాతుర్యంకోసం వేస్తున్న ప్రశ్న కాదు. ఆ సంగతి కొద్ది సేపట్లోనే మీరు చూస్తారు. సమగ్రత, నిబద్ధత, అంకితభావం, పాలనా నైపుణ్యం, ఇంకా… మరీ కాకపోయినా రవంత తెలివి.. ఇవన్నీ ఉండాలని ఆశిస్తాము. కానీ ఇవే సరిపోతాయా?

ఇతర సుగుణాలన్నీ ఎంత ముఖ్యమో హేతుబద్ధత కూడా ఉండాలని మనం ఆశిస్తాము. మన ప్రధాన మంత్రులు చెప్పేదానికి గానీ, వారు చేస్తానన్నదానికి గానీ మనం అన్ని వేళలా అంగీకరించకపోవచ్చు. కానీ వారి ఆలోచనలు, చర్యలు హేతుబద్ధంగా ఉండాలని, బాగా ఆలోచించి చేయాలని, విశ్వసనీయంగా ఉండాలని మనం ఆశిస్తాము. మరో మాటలో చెప్పాలంటే వారి నిర్ణయాలు తప్పని తెలినప్పటికీ -అది తరచుగా జరిగేదే- సాధారణ పరిజ్ఞానంతో పోటీ పెడితే అవి తక్కువగా ఉండకూడదని ఆశిస్తాము.

karan Thaparనరేంద్ర మోడికి సంబంధించి సరిగ్గా ఈ అంశంలోనే నేను తప్పు ఎత్తి చూపించదలిచాను. సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఇలా అన్నారు: “కర్ణుడు ఆమె తల్లి గర్భం నుండి జన్మించలేదని మహాభారతంలో చెప్పారు. ఈ మహాకావ్యం రాయబడిన కాలంలో జన్యు శాస్త్రం అభివృద్ధి చెంది ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది. మనమందరం గణేశుడిని పూజిస్తాం; ఆ కాలంలో, మనిషి దేహంపై ఏనుగు తలను అమర్చగల ఒక విధమైన ప్లాస్టిక్ సర్జరీ శాస్త్రం సైతం అభివృద్ధి చెందిందని మనం రూఢిపరుచుకోవచ్చు.”

చరిత్ర పూర్వకాలం నాటి పురాణ కాలంలో భారత దేశం జన్యు శాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీలలో నైపుణ్యం సాధించిందన్న మోడి అంచనాతో అనేకమంది హిందువులు ఏకీభవిస్తారనడంలో సందేహం లేదు. వ్యక్తులుగా ఏమి కావాలంటే అది నమ్మే స్వేచ్ఛ వారికి ఉన్నది. కానీ ఒక భారత దేశ ప్రధాన మంత్రి ఈ నమ్మకాన్ని నిజంగా ప్రకటిస్తున్నారంటే -అది కూడా ఒక ఆసుపత్రి ప్రారంభం సందర్భంలో- అది పూర్తిగా వేరే సంగతి!

ఎందుకు? శాస్త్ర భద్ధ ఆవిష్కరణలను సాధించామని చెప్పుకునేందుకు పురాణ గాధలను ఆధారంగా చూపించడం హేతు బద్ధత కానే కాదు గనుక. మొదటిది, ఆ నమ్మకం నిజమే అనడానికి ఊహ తప్ప మరో రుజువు లేదు. అది అవాంఛనీయమైన ఊహ. రెండవది, అలాంటివి జరిగాయని నిర్ధారించేందుకు, ఏనాడో మర్చిపోయిన సంగతి అటుంచి, ఏ విధమైన రికార్డు ఆనవాలు కూడా లేని పరిస్ధితిలో,  మీరు గొప్పగా చాటుకునే శాస్త్రీయ పరిజ్ఞానం, ఆవిష్కరణలు నిజమే అని మీరు ఎలా చెప్పగలరు?

ఇంకా ఘోరం ఏమిటంటే, మోడి అభిప్రాయాలు దీనానాధ్ బాత్ర అభిప్రాయాలనే ప్రతిధ్వనింపజేస్తున్నాయి. ఆయన పుస్తకాలు ఇప్పుడు గుజరాత్ వ్యాపితంగా ఉన్న 42,000 పాఠశాలల్లో పాఠ్య బోధనల్లో భాగంగా ఉన్నాయి. మోడి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇచ్చిన సందేశాన్ని ఈ పాఠ్య బోధనలన్నీ మోస్తున్నాయి. కుంతి మరియు కౌరవుల కాలంలో స్టెమ్ సెల్ పరిశోధనలు జరిగాయని అవి బోధిస్తున్నాయి. మహా భారతం కాలంలోనే టెలివిజన్ ని కనిపెట్టారని, వేద కాలంలోనే మోటారు కారు ఉనికిలో ఉందని బోధిస్తున్నాయి. ఇది అర్ధం లేనిదిగా కొద్ది మందే కొట్టిపారేయవచ్చు. (ఇవన్నీ చెప్పినపుడు, ఇక) ఇండియా చరిత్ర పూర్వకాలంలోనే జన్యు శాస్త్రంలో, ప్లాస్టిక్ సర్జరీలో నైపుణ్యం సాధించిందని ఎందుకు చెప్పుకోరు?

నేను చెప్పాల్సినవి మరో రెండు అంశాలున్నాయి. మొదటిది, స్మార్ట్ సిటీలు నిర్మించాలని మోడి భావిస్తున్నారు. విద్య అవసరం గురించి నొక్కి చెబుతున్నారు. మార్స్ మిషన్ విజయవంతం అయినందుకు గర్విస్తున్నారు. డిజిటల్ ఇండియాను ఆయన నమ్ముతున్నారు. బులెట్ రైళ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో ‘స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్’ రక్షణ ఆయుధాలు తయారు చేయాలని (మేక్ ఇన్ ఇండియా) ఆశిస్తున్నారు. ఇవి 21 శతాబ్దపు ఆశయాలు. నిరూపణకు గురికాని పురాణాల చెంత ఇవన్నీ ఎలా కూర్చోగలవు? ఇవి వైరుధ్యాంశాలు కాదా?

Two faces

రెండవది, గ్రీకు పురాణాల్లో గుర్రపు మానవులు -మానవ శిరస్సు కలిగిన గుర్రాలు- (సెంటార్లు), ఎద్దుతల రాకాసులు (మినోటార్లు) ఉన్నారు. పర్షియన్లకు గ్రిఫిన్ (గద్ద తల సింహం) ఉంది. బ్రిటిషర్లకు యూనికార్న్ (ఎగిరే ఒంటి కొమ్ము తెల్ల గుర్రం), చేప సుందరీమణులు (mermaids), తోడేలు మనుషులు (werewolves) ఉన్నారు. మోడి అంచనాను బట్టి ఇవన్నీ కూడా ఉనికిలో ఉన్నాయని మనం భావించవలసి వస్తోంది. కానీ అవి నిజంగా ఉన్నాయని ఎవరన్నా నమ్ముతారా? కేవలం కలల్లో మాత్రమే నమ్మవచ్చు. లేదా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నమ్మి ఉండవచ్చు.

చివరిగా ప్రధాన మంత్రి వ్యాఖ్యతో నాకున్న సమస్య మరో అడుగు ముందుకు వెళ్తుంది. కానీ అన్నింటికంటే ఇదే అత్యంత కీలకమైనది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 A (h) కింద శాస్త్రీయ ఉత్సుకత (సైంటిఫిక్ టెంపర్) ను అభివృద్ధి చేసుకోవడం ప్రతిఒక్క పౌరుడి కర్తవ్యం. నిరూపణకు నిలబడని మూఢ నమ్మకాల ప్రాతిపదికన వైద్య ప్రగతి ఎన్నడో సాధించామని చెబుతున్న ప్రధాన మంత్రి దీన్ని ఎలా పాటిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఈ రాజ్యాంగ బద్ధ ఆవశ్యకతను ఆయన అభిప్రాయాలు స్పష్టంగా, వివాదరహితంగా విభేదిస్తున్నాయి. నిజానికి ఆయన ఈ విషయం ఆలోచిస్తే మోడి సైతం నాతో విభేదించరని నేను భావిస్తున్నాను.

ఇవి సమస్యాపూర్వకమైన అనుమానాలు. వీటికి ప్రధాన మంత్రి కారకులు కావడం మరింత బాధిస్తున్న విషయం. చివరిగా, ఈ అంశం మీడియాలో పెద్దగా ప్రస్తావనకు నోచుకోకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాకు మరింత నిశ్చేష్టతను కలిగిస్తూ ఏ ఒక్క భారతీయ శాస్త్రవేత్త కూడా ప్రధాన మంత్రి అంచనాలతో విభేదిస్తూ ముందుకు రాలేదు. వారి మౌనం కలవరపాటును కలిగిస్తోంది. మీడియా మౌనం తీవ్రంగా కలతపరుస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే దాన్ని అందరూ విస్మరించారని బలంగా అనిపిస్తోంది.

11 thoughts on “మోడి రెండు ముఖాలు -కరణ్ ధాపర్

 1. మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయని వాదించేవాళ్ళు మన తెలుగు బ్లాగర్లలో కూడా ఉన్నారు. మనం ఎక్కడో నరేంద్ర మోదీ వరకు వెళ్ళడం ఎందుకు? “దగ్గర బంధువులు పెళ్ళి చేసుకుంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుడతారు కనుకనే హిందూ మతంలో కజిన్ మేరేజెస్‌ని నిషేధించారు” అని వాదించినవాళ్ళని మన తెలుగు బ్లాగుల్లోనే చూసాను. హిందూ మతంలో certain types of cousins (చిన్నాన్న, పెదనాన్నల పిల్లలు) మధ్య వివాహాలు నిషిద్ధమే కానీ మేనమామ పిల్లల మధ్య పెళ్ళిళ్ళు నిషిద్ధం కాదు. కులాంతర వివాహాలు లేదా జాత్యాంతర వివాహాలు చేసుకుంటే జన్యుపరంగా మరింత ఆరోగ్యకరమైన సంతానం పుడుతుంది. అయినా హిందువులు కులాంతర వివాహాలు ఎందుకు చేసుకోవడం లేదు?

  ఏనుగుకి ఉపయోగించే vetetinary medicines మనుషులకి వేసినా మనుషులు చస్తారు. ఏనుగు శరీర ధర్మం వేరు, మనుషుల శరీర ధర్మం వేరు అని నిరూపించడానికి ఇది చాలు. ఏనుగు తలని మనిషి అంటించడం సాధ్యం అని చెపితే ఏ MBBS వైద్యుడైనా నవ్వుతాడు. ఆ వైద్యుడు ప్లాస్తిక్ సర్జనే కానక్కరలేదు. ప్రధాన మంత్రి మీద నవ్వే ధైర్యం లేక అక్కడి వైద్యులు నోరు మూసుకుని ఉంటారు.

 2. here i remember late prime minister Mr.P.V.Narsimharao who always keep silent. as a lecturer i came to know the importance of silence. many a times i keep silent if i didnt prepare even for a causal talk or else i prepare well before i go for a speech. perhaps prime minister didnt have time to prepare out of his busy schedule. or else he might kept two points in his mind. that common people (Hindus) also watch this program and these words will make them happy. and he is not a doctor by profession to have a very serious talk.

 3. //ఏ ఒక్క భారతీయ శాస్త్రవేత్త కూడా ప్రధాన మంత్రి అంచనాలతో విభేదిస్తూ ముందుకు రాలేదు. //

  రారు. వాళ్లేమన్న ప్రదాన మంత్రులా? వాళ్లూ జీవితం, బ్రతుకు తెరువుకోసం చదువుకొనే సైన్స్‌ వేరు వేరని వాళ్ల మెదడులో నిక్షిప్తమై ఉండెనాయా? ఎంత శాస్త్రవేత్తలైతే మాత్రం ప్రధానమంత్రితో పోటీపడి మళ్లీ ఈ భూమి మీద బ్రతక గలరా? ఎలా వస్తారు? అధికారం చెప్పిందే భావజాలం! కాదు కాదు వేదజాలం. అదీ ఎదురు ప్రశ్న వేసే ఎగస్పార్టీ వాళ్లు లేకపోయినారాయా? అధికారం చెప్పిందానికి తలలూపక పోతే రేపు బట్ట గట్టి బతకొద్దూ?

  అన్నట్టు చెప్పటం మరిచి పోయాను. మైరావణుని కాలంలోనే ఇంటెర్నెట్‌ మాయాజాలం ఉండేదట! కాకపోతే పేరు మార్పొక్కటే! అప్పుడు అరచేతిలో అంజనం పసరు వేసుక చూస్తే ఇప్పుడు టాబ్లెట్‌ నో, సెల్ఫోన్‌ నో అరచేతిలో పెట్టుక చూస్తూన్నాము. ఇప్పటికంటే అప్పుడే మంది అభివృద్దిలో ఉండేది. ఇప్పుడైతే ఎక్విప్మెంట్లు అన్ని అవసరం గాని అప్పుడు కాస్తంత ఆకుపసరు అరచేతికి రాసుక చూస్తే సరిపోయేది. ప్రపంచమంతా పగటికలలా కనిపించేది. అయినా అధికారం చెప్పింది ఈ జర్నలిస్టు కాదంట మేంటండీ. అన్నీ వేదాల్లో ఉంటే.

  పుక్కిట పురాణాలంటే ఇప్పటి అర్దంలో మార్పొచ్చింది గాని, పురాణాలు అంటే శాస్త్రాలన్ని పుక్కిట పట్టిన వారని అర్ధం. -అవపోసన పట్టినారని.

 4. పుక్కిట పురాణాల్ని సైన్స్‌తో పోలిస్తే బోడి గుండుని మోకాలితో పోల్చినట్టు ఉంటుంది. మంత్రాలు వేరు, వైద్య శాస్త్రం వేరు. గుఱ్ఱం తల తీసి గాడిదకి పెట్టినా గాడిద బతకదు, ఆవు తల తీసి బఱ్ఱెకి పెట్టినా బఱ్ఱె బతకదు. మంత్రాలని నమ్మేవాళ్ళు అలా అతికించడం సాధ్యమని నమ్ముతారు. దానికి వైద్య శాస్త్ర రంగు అవసరం లేదు.

 5. enduku anni vyakhyaanaalu? .vaidyulanu, sastravetta lanu encourage cheyadaaniki anukovachchu kadaa? mana moolaallone science imidi undi ani cheppadaaniki ivi cheppaarani anukovachchu kadaa? mataanni nirasiste sajeeva dahanaalu sikshagaa vidhinche samaajaaniki ,mana desam lo devuni unikini prasninchina vaarini chaarvaakulane perutho protsahinchina mana bharateeyatha ku tedaa gamaninchandi.

 6. సైన్స్‌ని ప్రోత్సహించడానికి కట్టుకథలు చెప్పక్కరలేదు. ఏనుగు తలతో మనిషిలా మాట్లాడడం సాధ్యం కాదు. ఏనుగు యొక్క larynx (స్వర పేటిక) మనిషిలా మాట్లాడడానికి support చెయ్యదు. వినాయకుడు నిజంగా లేడనడానికి ఆ ఆధారం చాలు. గాలిలో మేడలు కట్టడానికి సైన్స్ పేరు చెప్పుకోకూడదు. అది సైన్స్‌కే ద్రోహం అవుతుంది.

 7. తిరుపాలు గారు, మీరు ఇచ్చిన లింక్ చూసాను. ఎల్.కె. అద్వానీ అనే పెళ్ళైన పురుషుడు సుష్మా స్వరాజ్ అనే పెళ్ళైన స్త్రీని హత్తుకోగా లేని అభ్యంతరం పార్క్‌లలో ముద్దు పెట్టుకునేవాళ్ళ విషయంలో మాత్రమే ఈ హిందూత్వవాదులకి ఎందుకు వచ్చిందో?

  బహిరంగంగ ముద్దులు పెట్టుకునేవాళ్ళు మా వైజాగ్ కంబాలకొండ పార్క్‌లో కూడా కనిపిస్తారు. అలా ప్రవర్తించేవాళ్ళు కూడా కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని వదులుకోరు. పాత భావజాలాన్ని మార్చలేని so called కొత్త సంస్కృతి అంటే హిందూత్వవాదులకి ఎందుకంత భయం?

 8. తిరుపాలు గారు, మోరల్ పోలిసింగ్ విషయానికి వస్తే, ఏ దేశంలోనూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం అంత సీరియస్ విషయం కాదు. మరీ వ్యక్తిగతమైన విషయలాల్లో చట్టాలు జోక్యం చేసుకోవు. పార్లమెంత్‌లో బిల్ పెట్టి బహిరంగ ముద్దుల్ని నిషేధిస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఉంటుందని భాజపావాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే మూకల్ని పంపించి ఉంటారు. ఆ మూకలు చెయ్యకూడని పనులు చేస్తే వాళ్ళకీ, తమకీ సంబంధం లేదని చెప్పి భాజపావాళ్ళు తప్పించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s