మహారాష్ట్రలో శివసేన పరిస్ధితి మరీ దిగజారిపోయింది.
ప్రభుత్వంలో చేరాలని ఉంది, కానీ ఎన్నికల్లో బి.జె.పి సాధించిన ఆధిక్యం ద్వారా సంక్రమించిన ఆధిపత్యాన్ని తట్టుకోలేరు. కనీసం 2 మంత్రి పదవులైనా దక్కుతాయనుకుంటే అవీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని బి.జె.పి నిర్మొహమాటంగా స్పష్టం చేసింది.
అలాగని అధికారానికి దూరంగానూ ఉండలేరు. సహజ మిత్రులుగా మొన్ననే తమను తాము అభివర్ణించుకుంటిరి. అలాంటి మిత్ర పార్టీ మొట్ట మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే అందులో భాగస్వామ్యం లేకపోవడం వారికి అవమానం. బి.జె.పి దూరం నెట్టిందన్న అపప్రధ భరించాలి.
ఇక బి.జె.పి విషయానికి వస్తే శివసేనను రమ్మన లేరు. అలాగని పొమ్మననూ లేరు.
బి.జె.పికి ఇప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యం కావాలి. ఎన్.డి.ఏ-1, యు.పి.ఏ-1, 2 ప్రభుత్వాలను బలహీన పరిచిన ‘కూటమి ధర్మం’ ఇక తమ జోలికి రాకూడదని బి.జె.పి బలీయమైన కోరిక.
బి.జె.పి కోరిక అనడం కంటే పారిశ్రామిక వర్గాలు, బహుళజాతి కంపెనీలు జారీ చేసిన మ్యాండేట్ అనడం సరైనదేమో! ఎందుకంటే ‘కూటమి ధర్మం’ పేరుతో ఎన్.డి.ఏ-1, బి.జె.పి-1, 2 ప్రభుత్వాలు నూతన ఆర్ధిక విధానాలను, ఆర్ధిక సంస్కరణలను శక్తివంతంగా అమలు చేయలేకపోయాయని స్వదేశీ, విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి.
కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది జూనియర్ భాగస్వామి విధించే షరతుల కంటే, సీనియర్ భాగస్వామి విధించే షరతులపై ఆధారపడే ఉండాలన్నది అధికార పార్టీ వెనుక ఉన్న పాలకవర్గాల నిశ్చయం.
కానీ మొదటి నుండి ఆజ్ఞలు జారీ చేయడానికి అలవాటు పడ్డ శివసేన, మరొకరి ఆజ్ఞలకు బద్ధులై ఉండగలదా? ఉండేలా చేయాలి. అందుకే ఎన్.సి.పి బేషరతు మద్దతును పక్కన పెట్టుకుని మద్దతు తీసుకుంటూనే శివసేనను నియంత్రించాలని బి.జె.పి ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే రమ్మని ఆహ్వానిస్తూనే సంతోషంగా లోపలికి రావడానికి వీలు లేకుండా మంత్రి పదవులు ఇవ్వను పొమ్మంది. దానితో శివ సేన ఆగ్రహించి ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు పొమ్మంది.
మళ్ళీ బి.జె.పి పెద్దలు ఏమి చెప్పి ఒప్పించారో తెలియదు గానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి శివ సేన నేత ఉద్ధవ్ ఢాకరే అంగీకరించారు. ఫలితంగా, అంతిమంగా, బి.జె.పి షరతుల దారికే శివసేన రావలసి వచ్చింది.
‘కూటమి ధర్మం’ ప్రజలపై పాలకవర్గాల తీవ్ర దాడిని ఏదో మేరకు పదును కోల్పోవడానికి సహకరిస్తే, ఏకచ్ఛత్రాధిపత్యం ప్రజల పాలిట యమగండంగా మారుతుందని జనం నేర్వవలసిన పాఠం.
//ఏకచ్ఛత్రాధిపత్యం ప్రజల పాలిట యమగండంగా మారుతుందని జనం నేర్వవలసిన పాఠం.//
బాగుంది. ముఖ్యంగా కొత్త తరం ఓటర్లు నేర్వాల్సిన గుణపాఠం.
/‘కూటమి ధర్మం’ ప్రజలపై పాలకవర్గాల తీవ్ర దాడిని ఏదో మేరకు పదును కోల్పోవడానికి సహకరిస్తే, ఏకచ్ఛత్రాధిపత్యం ప్రజల పాలిట యమగండంగా మారుతుందని జనం నేర్వవలసిన పాఠం./
…తిరుపాలు గారు…ఇదీ మరీ అన్యాయమండీ…
ఓట్లేయకపోతే…ఓట్లేయండీ…అంటూ సినిమా తారలు…, క్రికెట్ స్టార్లు, టెన్నిస్ స్టార్లు, ఆకాశంలో స్టార్లు తప్ప అన్ని రకాల స్టార్లు…. “ఓటేయండహో….” అని ఊదరగొడతారు. (మరి వాళ్లు ఓట్లేస్తారా అని అడగకండి.!)
…పోనీ గంటల కొద్ది క్యూలో నిలబడి ఓటేద్దామని వెళితే…నిజాయతీ పరునికే ఓటేయమని ఓ నాయకుడంటాడు.
( డైరెక్టుగా నాకే ఓటేయమని కూడా అడగలేడు పాపం.) అక్కడ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లలో ఒక్కడూ నిజాయతీ పరుడూ కనపడడు.
……………ఇక అసలు మ్యాటర్ కొస్తే, సంకీర్ణానికి వేస్తే పదును తగ్గుతోంది అంటారు….
ఒక్క పార్టీకే ఓటు వేస్తే…యమగండం అంటారు.
అసలు లోపం ఎక్కడుంది…? ఓటర్లలోనా…? నాయకుల్లోనా….? లేక…..?