27 యేళ్ళ పాటు తమను పట్టి పీడించిన సో కాల్డ్ ప్రజాస్వామ్య నియంత బ్లైసే కంపోరే, మరో 15 యేళ్లపాటు దేశాన్ని ఏలడానికి ఏర్పాట్లు చేసుకోవడంతో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం బర్కినా ఫాసో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. గురువారం (అక్టోబర్ 30) రాజధాని ఔగాడౌగౌ వీధులను ముంచెత్తుతూ తీవ్ర స్ధాయిలో నిరసన ప్రకటించారు.
కంపోరేకు పదవీకాలం పొడిగింపుకు అవకాశం ఇచ్చే చట్టం ఆమోదం పొందకుండా ఉండేందుకు జనం మూకుమ్మడిగా పార్లమెంటుపై దాడి చేశారు. పార్లమెంటు, ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టారు. జనాగ్రహ ధాటికి అమెరికా, ఫ్రాన్స్ ల సేవకుడు కంపోరే రాజీనామా ప్రకటించాడు.
ప్రజల ఆందోళనల్లో కొందరు సైనికులు కూడా పాల్గొనడం విశేషం. అయితే వీరు కంపోరే ప్రభుత్వంలో మాజీ డిఫెన్స్ మంత్రి, జనరల్ కౌమే లౌగే కు అధ్యక్ష పీఠాన్ని అప్పజెప్పాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. నిరసనకారుల్లో కూడా కొందరు ఈ డిమాండ్ కు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడు కంపోరే మునుపటి అధ్యక్షుడు ధామస్ సంకారా మంత్రివర్గంలో విదేశీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. 1987లో ధామస్ సంకారా నిగూఢ పరిస్ధితుల్లో హత్యకు గురయ్యాడు. కొద్ది మంది సైనికులు ఆయనను హత్య చేశారని మాత్రమే జనానికి చెప్పారు. ఈ హత్య వెనుక కంపోరే హస్తం, అమెరికా, ఫ్రాన్స్ సామ్రాజ్యవాదుల ఆశీర్వాదం ఉందన్నది బహిరంగ రహస్యం.
ధామస్ హత్యతో అధికారం చేపట్టిన కంపోరే 27 సంవత్సరాలుగా బర్కినా ఫాసో దేశాన్ని ఏలుతున్నాడు. 1991లో ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించుకున్నాడు. 1998లో మరోసారి తానే అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు ప్రకటించాడు. అప్పటికి అధ్యక్షుని పదవీ కాలం 7 సం.లు. 2000 సం.లో ఎన్నికల సంస్కరణల పేరుతో అధ్యక్షుని పదవీ కాలాన్ని 5 సం.లకు తగ్గించినప్పటికీ మరో 2 సార్లు అధ్యక్షుడిగా గెలిచినట్లు ప్రకటించుకుని పదవిలో కొనసాగాడు. ఈ ఎన్నికలన్నీ రిగ్గింగ్ కు గురైనవే అని ఆరోపణలు వచ్చినప్పటికి పశ్చిమ సామ్రాజ్యవాదుల అండతో కంపోరే అధికారంలో కొనసాగాడు.
తాజా పదవీకాలం 2015తో పూర్తి కానుంది. 2005లో చేసిన మరో సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవి నిర్వహించడానికి అర్హుడు. ఆ రెండు విడతల కాలం పూర్తయింది. అయినప్పటికీ తానే మరో సారి పదవిలో కొనసాగేందుకు వీలుగా కొత్త చట్టాన్ని ఆమోదించేందుకు పార్లమెంటు ఉద్యుక్తమ్ అయింది. చట్టంపై గురువారం ఓటింగు జరగాల్సి ఉంది. ఈ చట్టాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పిలుపు ఇవ్వడంతో ప్రజలు తక్షణమే స్పందించారు.
బర్కినో ఫాసో ప్రజల్లో మెజారిటీ యువకులే. కనీసం 60 శాతం మంది 25 సం.ల వయసు లోపువారే. వీరంతా తాము పుట్టినప్పటి నుండి కంపోరే తప్ప మరో అధ్యక్షుడిని ఎరుగరు. జీవన వ్యయం రోజు రోజుకీ తీవ్రం అవుతుండడంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫలితంగా ఎన్నికల రిగ్గింగు ద్వారా ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కంపోరే పై ప్రతిపక్షాలు ప్రకటించిన తిరుగుబాటుకు జనం స్పందించారు.
జనం పెద్ద ఎత్తున పార్లమెంటు, అధికార భవనాలను చేరుకుని భద్రతా బలగాలను తోసుకుంటూ లోపలికి చొరబడి అందినది అందినట్లు ధ్వంసం చేశారు. పార్లమెంటు (నేషనల్ అసెంబ్లీ) భవనానికి నిప్పు పెట్టి అనంతరం అధ్యక్ష భవనం మీదికి సైతం దండు వెళ్లారు. అయితే భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అధ్యక్ష భవనం మీదికి జనం వెళ్లలేకపోయారు.
కాల్పుల్లో కనీసం 6 గురు చనిపోయారని వార్తల ద్వారా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎంతమంది చనిపోయింది లెక్కించి చెప్పేవారు కరువయ్యారు. రాజధాని ఔగాడౌగౌలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. ప్రజలు పోలీసులు, సైనికులతో తలపడ్డారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్పులు జరిగాయని కొద్ది మంది మరణించారని పత్రికలు తెలిపాయి.
ఈ సంవత్సరం ఆరంభం నుండి ప్రజలు వివిధ కారణాలతో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారం మాని పదవీకాలం పొడిగింపుకు దిగడంతో జనంలో నిరసన పెల్లుబుకింది. ప్రజల నిరసన తీవ్రత పెరిగిపోవడంతో కంపోరే రాజీనామా ప్రకటించాడు. మరో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించాడు.
ఈ లోపు అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. మధ్యంతర ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తాడా లేక ఇతరులకు అప్పగిస్తాడా అన్నది తేలలేదు. సైనికాధిపతులు మాత్రం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఎమర్జెన్సీని అంగీకరించేది లేదని ప్రకటించారు. దీన్ని బట్టి ఆందోళనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.
జాస్మిన్ విప్లవం ఆగిపోలేదన్న మాట….