(బ్రెట్టన్ వుడ్ కవలలుగా అభివర్ణించబడే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మరో బ్యాంకు ఆసియా ఖండం కోసం ఆవిష్కృతం అయింది. ఇది కూడా చైనా చొరవతో, అత్యధిక చైనా నిధులతో, ఇండియా దన్నుతో రూపుదిద్దుకోవడం గమనార్హం. బీజింగ్ లో 21 దేశాల వ్యవస్ధాపక భాగస్వామ్యంతో ఆసియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు బీజింగ్ లో ప్రారంభం అయింది. బ్యాంకుకు పురిట్లోనే సంధి కొట్టడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించినా ఆటంకం అధిగమిస్తూ ఎ.ఐ.ఐ.బి ని స్ధాపించారు. ఈ పరిణామంపై ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్)
**********
మొదటిసారిగా ప్రస్తావించబడిన సంవత్సర కాలానికే ఆసియాలో ఓ కొత్త బహుళ పక్ష బ్యాంకు -ఆసియా మౌలిక నిర్మాణాల పెట్టుబడుల బ్యాంకు (Asian Infrastructure Investment Bank – AIIB)- గత వారం బీజింగ్ లో పురుడు పోసుకుంది. బ్యాంకు ఏర్పాటు క్రమంలో, బ్యాంకు ఆవిర్భావానికి వ్యతిరేకంగా అమెరికా సాగించిన తీవ్రస్ధాయి లాబీయింగు విఫలం అయిందని దీనితో స్పష్టం అయింది. బ్యాంకు కోసం 21 దేశాలు సంతకాలు చేశాయి. చైనా కాకుండా వీటిలో అతి పెద్ద దేశం ఇండియాయే. మిగిలినవి అన్నీ ఆసియాలోని చిన్న ఆర్ధిక వ్యవస్ధలు. బ్యాంకు ఆవిర్భావం నాటకీయ పరిణామాలు లేకుండా ఏమీ జరగలేదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ కొరియాలు చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నాయి. దీని వెనుక అమెరికా ఒత్తిడి ఉందన్నది స్పష్టమే. అయినప్పటికీ ఆ మూడు దేశాలకు చెందిన కొందరు దౌత్యవేత్తల ప్రకటనలను బట్టి చూసినా తమ నిర్ణయం తేలికగా తీసుకున్నదేమీ కాదని అర్ధం అవుతుంది.
మూడు దేశాలకు చైనాతో విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. దానితో ఆసియా మహాకాయ దేశంతో సంబంధాలు కాపాడుకోవడానికీ, అమెరికా అప్రసన్నం కాకుండా చూసుకోవడానికీ మధ్య ఇప్పటికీ నలుగుతున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకు అభివృద్ధి పరిణామాన్ని కొంతకాలం పక్కన నిలబడి పరిశీలించిన తర్వాత ఈ మూడు దేశాలు కూడా (ఎ.ఐ.ఐ.బి పరిధిలోకి) దూకేసినా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికా నేతృత్వంలోని ప్రపంచ వ్యవస్ధకూ, 70 యేళ్ళ ఎదురులేని బ్రెట్టన్ వుడ్ కవలల (ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు) హయాంనకూ ఎదురైన మొట్టమొదటి బడా సవాలుకు చైనా నుండే పని చేసే బ్రిక్స్ బ్యాంకు, ఎ.ఐ.ఐ.బిలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు తమ ఆధిపత్యానికి ప్రమాదం ఎదురయిందని భావిస్తే, ఒక విధంగా, అందుకు తమను తామే నిందించుకోవాలి. ఎందుకంటే నానాటికీ పెరిగిపోతున్న ఆసియా నిధుల సేకరణ అవసరాలను, ఆ సంస్ధల చేతగానితనం నుండే లేదా అసలు ఇష్టమే లేకపోవడం నుండే లేక ఈ రెండింటి నుండే కొత్త బ్యాంకుకు సంబంధించిన విత్తనం మొలక వేసింది.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) చేసిన నిర్ధారణ ప్రకారం మౌలిక నిర్మాణాల కోసం ఆసియా దేశాలకు ఇప్పటి నుండి 2020 లోపల సంవత్సరానికి 800 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ఇంత మొత్తానికి గాను, జపాన్ ఆధిపత్యం వహిస్తున్న ఎడిబి సంవత్సరానికి 10 బిలియన్ డాలర్లు మాత్రమే ఇవ్వగలుగుతోంది. అమెరికా ఆధిపత్యంలోని ప్రపంచ బ్యాంకు, ఐరోపా నేతృత్వంలోని ఐ.ఎం.ఎఫ్ లు సైతం కుదేలైన పరిస్ధితిలో ఉండడంతో, ప్రపంచంలో వృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉన్న ఆసియా ఆర్ధిక అవసరాలు తీర్చేందుకు ఒక బహుళపక్ష సంస్ధ అవసరం తీవ్రంగా ఉందన్నది వాస్తవం. ఎడిబి చాలా జాగ్రత్తగా మాటలు కూడదీసుకుని వ్యాఖ్యలు చేసింది. అది అర్ధం చేసుకోదగిందే. మౌలిక నిర్మాణాల కోసం రుణాలు ఇవ్వడంలో తానూ మద్దతుగా ఉంటానని చెప్పింది. అయినప్పటికీ తన రంగాన్ని కాపాడుకోక ఆ సంస్ధకు తప్పదు.
తానూ భాగస్వామ్యం వహించడం ద్వారా ఇండియా, ఎ.ఐ.ఐ.బికి దృఢత్వాన్ని సమకూర్చింది. లేనట్లయితే ఏవో కొన్ని చిన్న దేశాలతో కూడిన చైనా బ్యాంకుగానే ఎ.ఐ.ఐ.బి పరిగణించబడేది. బ్యాంకులో రెండో అతి పెద్ద వాటా కలిగి ఉన్న దేశంగా ఇండియా చైనాతో కలిసి పని చేయడం ద్వారా వనరుల సమీకరణ మరియు సామాగ్రి సేకరణలలోనూ కార్మిక మరియు పర్యావరణ ప్రమాణాలలోనూ అత్యంత మెరుగైన ప్రక్రియలను అనుసరించేలా చూడాల్సి ఉంటుంది. ప్రపంచ స్ధాయిలో ఆర్ధిక సమతూకం ఆసియా వైపు మొగ్గుతున్న నేపధ్యంలో బ్యాంకు స్ధాపన వెనుక భౌగోళిక రాజకీయ కోణం ఉండడంలో ఎటువంటి అనుమానమూ లేదు, అది సహజం కూడా. అయితే బ్యాంకు పనిలో ఈ కోణం ప్రధాన చోదక శక్తిగా మారకుండా జాగ్రత్త వహించాలి. బ్యాంకును ఎందుకోసం స్ధాపించారో ఆ పనే చేయాలి – ఆసియా మౌలిక నిర్మాణాలకు నిధులు సమకూర్చడం.
its a welcoming sign to Asian countries. instead depending on world bank better to depend on our resources
సమీకరణలు మారుతున్నాయి.బాగుంది. ప్రపంచ రాజకీయచిత్రం లో ప్రజలు కనిపిస్తారా లేక అధికార మార్పిడి ఇంకో వైపు మొగ్గుచూపుతున్నదా? వేచిచూడాల్సిందే!
Dollar ఆధిపత్యాన్ని సవాలు చెయ్యనంతవరకూ, దానికి ప్రతిగా ఇంకొక కరెన్సీని నిలబెట్టలేనంతవరకూ ఇలాంటివాటికి మనం విలువనివ్వాల్సిన అవసరంలేదు.
ప్రపంచ బ్యాక్ ఒక సామ్రాజ్యవాద సంస్థే కానీ అభివృద్ధిపై తప్పుడు లెక్కలు చూపించి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు పుట్టించగల చంద్రబాబు నాయుడు లాంటి మోసగాళ్ళకి మోసగాళ్ళు కూడా ఉంటారు.
బ్యాంక్ ఎకరం భూమి ఉన్న రైతుకైనా ఋణం ఇస్తుంది (పట్టాదార్ పాస్‌బుక్ ఆధారంగా) కానీ ఏమీ లేని వ్యవసాయ కార్మికునికి ఏ బ్యాంక్ ఋణం ఇవ్వదు. ప్రపంచ బ్యాంకైనా ఆదాయ వనరులు లేని దేశాలకి ఋణాలు ఇవ్వదు. హైదరాబాద్‌లో IT కంపెనీలు తప్ప ఏమీ లేని ఒక రాష్ట్రంలో ఏ ఆదాయ వనరుని చూసి ప్రపంచ బ్యాంక్ చంద్రబాబు నాయుడి గత 9 ఏళ్ళ పాలనలో (1995 నుంచి 2004 వరకు) రాష్ట్రానికి డబ్బై వేల కోట్లు అప్పు ఇచ్చింది?
పూణా-వాడీ రైల్వే దబ్లింగ్ ప్రాజెక్త్‌కి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఋణం ఇచ్చింది, ఆ రైలు మార్గాన్ని దబల్ చెయ్యడం వల్ల వచ్చిన ఆదాయంతో ఆ అప్పు తీర్చొచ్చని. పైసా ఆదాయం రాని ఉచిత విద్యుత్ లాంటి పథకాలకైతే ఏ బ్యాంక్ ఋణం ఇవ్వదు.
నాకు తెలిసినంత వరకు అప్పుల వల్ల ఏ దేశం అభివృద్ధి చెందదు. 1917కి ముందు జార్ చక్రవర్తుల ప్రభుత్వం చేసిన అప్పులని లెనిన్ రద్దు చేసాడు. జార్ చక్రవర్తులకి అప్పులు ఇచ్చిన విదేశీ సంస్థలకి లెనిన్ పైసా కూడా బాకీ కట్టలేదు. అందువల్ల కూడా రష్యన్ సివిల్ వార్‌లో కమ్యూనిస్త్ వ్యతిరేక వర్గానికి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి. స్వదేశీ ద్రోహులూ, విదేశీ ద్రోహులూ, పార్తీలోనే పని చేసిన అంతర్గత ద్రోహులూ వీళ్ళందరినీ కమ్యూనిస్త్ పార్తీ ప్రభుత్వం GULAG (కారాగార శిబిరాలు)లో పెట్టింది. స్తాలిన్ చెయ్యించిన బలవంతపు వ్యవసాయ సమిష్ఠీకరణతో పాటు GULAG బందీల చేత పనులు చెయ్యించడం వల్ల కూడా రష్యా అభివృద్ధి చెందింది. 1933కి ముందు అమెరికాలో 20 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం ఉంటే 1940లో రష్యాలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. అప్పట్లో సోవియత్ సమాఖ్యలో అంత అభివృద్ధి ఉండేది. అదేమీ అప్పుల వల్ల రాలేదు. ఒక వైపు కార్మికుల శ్రమ, మరో వైపు రాజకీయ ఖైదీల చేత చెయ్యించిన బలవంతపు శ్రమ వల్ల జరిగిన అభివృద్ధి అది.