అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన హవాయి ద్వీపకల్పంలో కిలౌయీ అనే అగ్ని పర్వతం ఒకటుంది. అవడానికి పర్వతమే గానీ చూడడానికి పర్వతంలాగా కనిపించదు. భూ మట్టానికి పెద్దగా ఎత్తు లేకుండా మొత్తం లావాతోనే ఏర్పడి ఉండే ఇలాంటి అగ్ని పర్వతాలను షీల్డ్ వోల్కనో అంటారు.
షీల్డ్ వోల్కనో బద్దలయినప్పుడు లావా అన్ని వైపులకీ ప్రవహిస్తుంది. తక్కువ చిక్కదనం (viscosity) కలిగి ఉండడం వలన ఈ లావా ప్రవాహ వేగం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి లావా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా అన్ని దిక్కులకూ లావా ప్రవహించడం వలన అది గట్టి పడ్డాక అక్కడ పెద్ద షీల్డ్ (డాలు) ఏర్పడినట్లు అవుతుంది. అందుకే వీటిని షీల్డ్ వోల్కనో అంటారు.
అసలు హవాయి ద్వీప కల్పమే మొత్తం ఐదు షీల్డ్ వోల్కనోల వల్ల ఏర్పడిందని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 3 లక్షల నుండి 6 లక్షల సంవత్సరాల వయసు ఉన్న ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి ఎగువకు రావడం లక్ష యేళ్ళ క్రితం మొదలయిందని జియాలజిస్టులు అంచనా వేశారు.
అయిదు వోల్కనోలలో కిలౌయి అగ్నిపర్వతమే అత్యంత చురుకైనది. గత జూన్ నెల 27 తేదీన ఈ వోల్కనో లో ఓ భాగం బద్దలై లావా ప్రవహించడం మొదలు పెట్టింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ లావా ప్రవహిస్తూనే ఉంది. తనకు అడ్డు వచ్చిన అటవీ వృక్షాలను కాల్చేస్తూ, రోడ్లను మింగేస్తూ చివరికి జనావాస గ్రామం అయిన పహోవాకు ప్రమాదకరంగా మారింది.
గంటకు 2 మీటర్ల నుండి 15 మీటర్ల వరకు వేగంతో ప్రవహిస్తూ ఇప్పటికీ 12 మైళ్ళకు పైనే లావా ప్రయాణించింది. “జూన్ 27 బ్రేక్ ఔట్” గా పిలుస్తున్న ఈ లావా వెల్లడి అనేక ఎకరాల అడవిని కాల్చేసింది. అనేక రోడ్లను దాటుతూ ఆ రోడ్లను కబళించింది. చిన్న చిన్న ఫార్మ్ హౌస్ లను సమాధి చేసింది. చివరికి పహోవా గ్రామ సమాధులను కూడా సమాధి చేసింది. క్రమంగా ఆ ఊరిలోని ఇళ్లవైపుగా పయనిస్తోంది.
దానితో పహోవాలోని జనం కొన్ని డజన్ల మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. రాష్ట్ర, ఫెడరల్ అధికారులు లావా ప్రవాహాన్ని గమనిస్తూ, దానిని చేసేదేమీ లేక జనాన్ని హెచ్చరిస్తూ గడుపుతున్నారు. ఈ ప్రవాహం అనుకున్నన్ని రోజులు ఇలాగే కొనసాగితే మరిన్ని డజన్ల ఇళ్ళు ఖాళీ చేయవలసి ఉంటుందని, వ్యాపారాలు కూడా దెబ్బ తింటాయని భావిస్తున్నారు.
కిలోయీ వోల్కనో సముద్ర తీరానికి సమీపంలో ఉంది. అందువలన లావా ప్రవాహం సముద్రంలో కలిసినా కలవొచ్చు. సముద్రంలో కలిసే వరకూ లావా ప్రవాహం చురుగ్గా ఉన్నట్లయితే పహోవా గ్రామం లోని ఒక భాగంతో ఇతర ప్రాంతానికి సంబంధాలు తెగిపోతాయని భయపడుతున్నారు.
లావా ప్రవాహ మార్గంలో విద్యుత్ స్తంభాలు ఉన్నట్లయితే వాటి చుట్టూ ముందుగానే మందపాటి ఇన్సులేషన్ పరికరాలను అమర్చుతున్నారు. తద్వారా లావా వల్ల విద్యుత్ స్తంబాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
హవాయన్ భాషలో కిలౌయీ అంటే ‘విరజిమ్మే’ అని అర్ధం అట. నిరంతరం లావా విరజిమ్ముతూ ఉండడం వలన దానికా పేరు వచ్చిందని తెలుస్తోంది.
లావా ప్రవాహం, అది మిగిల్చిన శిధిలాలను చూడడం మనకు ఆసక్తికరంగా ఉంటుంది.
సర్,హవాయి దీవులు కదా!(దీవుల సముదాయము)