
Brazil’s President and Workers’ Party presidential candidate Rousseff celebrates after the disclosure of election results, in Brasilia
(బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత దిల్మా రౌసెఫ్ రెండో సారి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపధ్యంలో ఆమెకు ప్రత్యర్ధుల నుండి గట్టి సవాలు ఎదురయింది. అయినప్పటికీ రనాఫ్ ఎన్నికల్లో కొద్ది తేడాతో గట్టెక్కారు. మొదటిసారి జరిగే ఎన్నికల్లో ఎవరికీ సాధారణ మెజారిటీ రాకపోతే, ముందు నిలిచిన ఇద్దరు అభ్యర్ధుల మధ్య రెండో సారి తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఇలా రెండో సారి జరిగే ఎన్నికలను రనాఫ్ ఎన్నికలు అంటారు. బ్రెజిల్ ఎన్నికల ఫలితంపై ది హిందు మంగళవారం ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్)
************************
ఆదివారం నాటి నాటకీయ రన్-ఆఫ్ ఎన్నికల్లో వరుసగా రెండవ సారి బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ సాధించిన విజయం, లాటిన్ అమెరికాలో రాజకీయ స్క్రిప్టు ఒకటి కంటే ఎక్కువ విధాలుగా జరిగిన పునఃప్రదర్శనకు ప్రాతినిధ్యం వహిస్తోంది. (దీనికి సంబంధించి) వివరణలోకి వస్తే, ఈ ప్రాంతంలోని రాజ్యాధిపతులు వరుసగా అధికారంలో కొనసాగడం సర్వసాధారణం కావడం, ఒక్కోసారి (చట్టం) నిర్దేశించిన రెండు పర్యాయాల కంటే కూడా ఎక్కువ సార్లు, రాజ్యాంగాన్ని సరిదిద్దడం ద్వారానైనా సరే, అధికారంలో కొనసాగడం ఒక సంగతి. అయితే, తమ నాయకులను అతి తేలికగా క్షమించెయ్యగల ఓటర్ల కధను ఇది పూర్తిగా వివరించదు. ఈ దేశాలకు ఆర్ధిక సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ భారీ ఎన్నికల విజయాలు మళ్ళీ మళ్ళీ కట్టబెట్టడం…, ఈ ప్రాంత లెఫ్టిస్టు పార్టీల నాయకత్వం పట్ల జనానికి ఉన్న నమ్మకాన్ని అంతే సమానంగా నిర్ధారిస్తోంది.
లాటిన్ అమెరికన్ నిఘంటువుకు ప్రభుత్వ వ్యతిరేకత అన్న పదం దాదాపు పరదేశీయంలాగా కనిపిస్తోంది. మరో 4 యేళ్ళు అధికారంలో కొనసాగేందుకు రౌసెఫ్ పొందిన ప్రజా తీర్పు అన్నింటికంటే మిన్నగా సెంటర్-లెఫ్ట్ (రాజకీయ భావాలు కలిగి ఉన్న) వర్కర్స్ పార్టీ 12 యేళ్ళ పాలనలో అమలు చేసిన సామాజిక రక్షక పధకాలకు ఉన్న జనాదరణకు కొలమానంగా భావించవచ్చు. బ్రెజిల్ లో బిగ్గర గొంతు కలిగిన అసహనపూరిత మధ్య తరగతి వర్గం ఎన్నికల ప్రచారం అంతటా ఇద్దరు ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధుల వెనుక జమకూడిన విధానం నుండే ఈ అవగాహన మన పరిశీలనలోకి వస్తున్నది.
అక్టోబర్ 6 తేదీన జరిగిన మొదటి విడత ఎన్నికల్లో పదవిలో ఉన్న నేతకు మద్దతు పెరుగుతోందన్న అంచనాలను స్ధిరంగా ఎదురొడ్డినది జన బాహుళ్యం అభిమానం చూరగొన్న పర్యావరణవేత్త మెరీనా సిల్వా. చివరికి రేసులో నుండి ఆమె తొలగింపే, అప్పటివరకూ రంగంలో లేని,సెంట్రిస్టు బ్రెజిలియన్ సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఎసియో నెవెస్ పోటీలో దూసుకుని వచ్చేందుకు దోహదం చేసింది. అదే తరహాలో రనాఫ్ ఎన్నికల్లోనూ గెలుపుకు 3 శాతం పాయింట్ల సమీపం లోపలే నెవెస్ వెంటాడుతూ వచ్చారు. స్పష్టం అయిన విషయం ఏమిటంటే ప్రభుత్వానికి చెందిన పెద్ద చమురు శుద్ధి కర్మాగారంలో వెల్లడైన కుంభకోణం ఎన్నికల ప్రచారంలో సృష్టించిన ప్రకంపనలు పార్టీయొక్క పేద ప్రజల అనుకూల ఇమేజిని ఏ మాత్రం దెబ్బ తీయలేకపోయింది. మాంద్యంలో ఉన్న ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి కూడా ఓటర్లను దూరంగా నెట్టివేయలేకపోయింది.
ఈ ప్రాంతంలోని ఇతర దేశాల వలెనే బ్రెజిల్ కూడా ఇటీవల సంవత్సరాలలోని కమోడిటీస్-బూమ్ (ప్రాధమిక, ముడి సరుకుల డిమాండ్ పెరగడం) దాదాపు ముగిసిపోయిన దశను ఎదుర్కొంటూ ఉండవచ్చు. తన రాజకీయ మద్దతుదారులను కాపాడుకుంటూనే, స్ధూల-ఆర్ధిక వ్యవస్ధ నిలకడగా పురోగమించేలా చేయడానికి అధ్యక్షురాలు తన రెండో పదవీ కాలంలో నేర్పుగా సమతూకం పాటించాల్సి ఉంటుంది. నూతన ప్రారంభం సమీపంలోనే ఉండి ఉండవచ్చు. ప్రచారంలోనూ, విజయానంతరమూ కూడా ప్రభుత్వ కంపెనీ పెట్రోబాస్ లో తీవ్రమైన తప్పులు జరిగాయని రౌసెఫ్ అంగీకరించారు. కంపెనీలో ఆమె కొంతకాలం డైరెక్టర్ గా కూడా పని చేశారు. ప్రపంచంలో నానాటికీ వృద్ధి చెందుతున్న బ్రెజిల్ ఆర్ధిక, రాజకీయ ప్రతిష్ట మరింత వృద్ధి చెందేందుకు మెరుగైన పారదర్శకత దోహదం చేయగలదు. సమానత్వ సూత్రాలపై శక్తివంతంగా కేంద్రీకరించడం ద్వారా లాటిన్ అమెరికా నాయకులు గొప్ప ప్రజాస్వామ్య ఛాంపియన్లుగా అవతరించారు. ఈ విలువలను కాపాడుకునేందుకు వారు మరింత పాటుపడవచ్చు. మంచి ఉద్దేశ్యాలు ఉన్నాయని చెప్పి మౌలిక సంస్ధల నిర్మూలనను సమర్ధించుకోలేరు.