మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. నల్ల డబ్బు ఖాతాల వివరాలను దాచి పెట్టడానికి గోప్యతా నిబంధనలను (confidentiality clause) అడ్డం పెట్టవద్దని ఘాటుగా సూచించింది. నల్ల డబ్బు యాజమానుల వివరాలను వెల్లడించకుండా ఉండడానికి గోప్యతా నిబంధనలను శరణు వేడడం తగదని, ఎన్ని రహస్య నిబంధనలు ఉన్నప్పటికీ నల్ల డబ్బు ఖాతాల పేర్లన్నీ తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారిని ఏంచేయాలో తాము చూసుకుంటామని ప్రభుత్వానికి హైరానా అవసరం లేదని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదిస్తూ అసలు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ను ఏర్పాటు చేసిందే తామని (కేంద్ర ప్రభుత్వం అని) కనుక నల్ల డబ్బు ఖాతాదారుల పేర్లను దాచిపెట్టే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్రం తరపున చెప్పుకున్నారు. డిసెంబర్ లో విదేశాలతో తాము ఒప్పందం చేసుకోవాల్సి ఉందని, విదేశీ ఖాతాదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని తాము సర్టిఫికేట్ ఇవ్వనిదే ఈ ఒప్పందంపై సంతకం చేయడం వీలు కాదని (కాబట్టి విదేశీ ఖాతాదారుల వివరాలను రహస్యంగా ఉంచాలని) కోర్టుకు విన్నవించారు.
“కోర్టు నుండి ఎటువంటి సమాచారాన్ని దాచి ఉంచడంలో మాకు ఎలాంటి ఆసక్తి లేదు. అసలు మొదట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసిందే మేము. జర్మనీ లాంటి వివిధ దేశాల నుండి విదేశీ ఖాతాదారుల పేర్లు 500 వరకూ ప్రభుత్వానికి అందాయి. ఈ వివరాలను మేము ఇప్పటికే సిట్ కు అప్పగించాము. రహస్య ప్రకటనా సర్టిఫికేట్ మేము జారీ చేయనిదే డిసెంబర్ లో ఒప్పందంపై సంతకం చేయడం వీలు కాదు. మేము చెప్పేదేమిటంటే విచారణ పూర్తయ్యి, ప్రాసిక్యూషన్ మొదలు పెట్టిన వారి పేర్లను మేమే వెల్లడి చేస్తాము” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనం ముందు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వాదనను చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం గట్టిగా తిరస్కరించింది. దేశ ప్రజలకు చెందవలసిన సొమ్ము విదేశాలకు తరలి వెళ్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే వాదనలు కొన్ని దశలు దాటిపోగా తిరిగి మొదటికి వచ్చి కొత్తగా వాదనలు మొదలు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. ఒకరిద్దరు పేర్లు ఇవ్వడం కాదని మొత్తం జాబితాను తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
“గోప్యతా నిబంధనల కింద ఆశ్రయం పొందవద్దు. మీరు అలాంటి సర్టిఫికేట్ ఏమీ ఇవ్వవద్దు. గోప్యతా నిబంధనలు ఉన్నప్పటికీ మీకు అందిన మొత్తం పేర్లు మాకు ఇవ్వాల్సిందేనని కోర్టు అడగవచ్చు. ఈ దేశ ప్రజలకు చెందిన డబ్బు విదేశాలకు తరలి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మీరు కేసును తిరిగి వాదించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుమతించలేము. పేర్లన్నీ చెప్పడానికి ఏమిటి మీకున్న కష్టం? ఏవో ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు ఖాతాదారుల పేర్లు ఇవ్వడం కాదు. విదేశాల మీకు అందజేసిన జాబితా మొత్తాన్ని మాకు ఇవ్వాలి. ఆ తర్వాత మీరేమి చేయాలో మేము చెబుతాము. పరిశోధనా సంస్ధ నెల రోజుల లోపల విచారణ పూర్తి చేయాలని మేము ఆదేశిస్తాము” అని ధర్మాసనం నేత, చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్పష్టం చేశారు.
విదేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖాతాదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చామని, ఖాతాదారుల పేర్లు వెల్లడి చేస్తే ఆ హామీని ఉల్లంఘించినట్లు అవుతుందని, దాని వల్ల ఇతర దేశాలు నల్ల డబ్బు ఖాతాదారుల వివరాలను ఇవ్వకుండా వెనక్కి తగ్గుతాయని పాత యు.పి.ఏ ప్రభుత్వం వాదించింది. యు.పి.ఏ వాదనను బి.జె.పి తీవ్రంగా విమర్శించింది. గోప్యతా చట్టాన్ని కాంగ్రెస్ సాకుగా తెచ్చుకుంటోందని మండిపడింది. జనం సొమ్ము విదేశాలకు తరలించుకెళ్తుంటే వారిని కట్టడి చేయడం మాని, వారికే మద్దతుగా వస్తారా అంటూ నిలదీసింది. తీరా అధికారంలోకి వచ్చాక బి.జె.పి, నరేంద్ర మోడీల ప్రభుత్వం సైతం తిరిగి కాంగ్రెస్ చెప్పిన సాకులనే చెప్పడం ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు.
విదేశాలలో న్యాయబద్ధమైన ఖాతాలు ఉన్నవారు కూడా ఉంటారని, వారి పేర్లను వెల్లడి చేసినట్లయితే వారి ఏకాంత హక్కుకు భంగం వాటిల్లినట్లు అవుతుందని అటార్నీ జనరల్ వాదించడం విశేషం. పన్నులు ఉల్లంఘన జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణ అయిన ఖాతాల పేర్లనే వెల్లడిస్తామని ఆయన సుప్రీం కోర్టుకు ఆఫర్ ఇచ్చారు. ఆరు నూరయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విదేశాలలో దాచిన డబ్బు వెనక్కి తెచ్చి తీరతాం, దానిని ప్రజలకు వెచ్చిస్తాము అని బల్లలు గుద్ది ప్రచారం చేసిన బి.జె.పి/మోడి ప్రభుత్వానికి ఇప్పుడు నల్ల కుబేరుల ఏకాంత హక్కు పైన బెంగ పట్టుకుందన్నమాట!
ఈ బెంగ ఏదో ఎన్నికల ముందే ఎందుకు చెప్పలేదు? న్యాయబద్ధమైన ఖాతాలు కూడా ఉండవచ్చని ఎన్నికల ప్రచారంలో ఎందుకు వాదించలేదు. ఎన్నికల్లో అలా చెబుతారా? అంటూ కొందరు వాదించవచ్చు. అలా వాదించేవారు బి.జె.పి కీ, కాంగ్రెస్ కీ తేడా లేదని అంగీకరించాల్సి ఉంటుంది. బి.జె.పి కూడా ఎన్నికలలో గెలవడానికి నెరవేర్చే ఉద్దేశ్యం లేని హామీలు ఇచ్చిందని ఒప్పుకోవాల్సి ఉంటుంది. మోడి అవినీతి పాలిట గండర గండడు, అరివీర భయంకరుడు అంటూ చేసిన ప్రచారం ఒట్టిదే అనీ, అది కేవలం ఎన్నికల కోసం చేసిన ప్రచారమే అని ఒప్పుకోవలసి ఉంటుంది.
పిటిషన్ దారు రామ్ జేఠ్మలాని తరపు లాయర్ అనీల్ దివాన్ సైతం కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరడాన్ని ఆయన విమర్శించారు. ఇది చట్టాన్ని దురుపయోగం చేయడమేనని, గత ఆదేశాలను సమీక్షించాలని ప్రభుత్వం కోరుతోందని అది అనుమతించడానికి వీలు లేదని వాదించారు.
ఆం ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ వాదనలో మరో వాదిగా చేరతామంటూ జోక్యందారి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ విదేశాల్లో నల్ల డబ్బు ఖాతాలు నిర్వహిస్తున్నవారిలో కోందరి పేర్లు తమకు తెలుసునని, సదరు వివరాలను కోర్టుకు అప్పగించే అవకాశం తమకు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయ పన్ను అధికారుల ముందు సదరు వ్యక్తులు ఇచ్చిన స్టేట్ మెంట్ల కాపీలు కూడా తమకు ఒక విజిల్ బ్లోయర్ ద్వారా అందాయని వాటిని కోర్టుకు అందించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్టు ముందు తాము ఉంచగల పేర్లపై పూర్తిస్ధాయి విచారణ జరిగేలా ఆదేశించవచ్చని సూచించారు. అనంతరం కేసు ఈ రోజు (బుధవారం) కు ధర్మాసనం వాయిదా వేసింది.
ఏకాంత హక్కు పేరుతో హత్యలు, రేప్‌లు చేసినవాళ్ళ పేర్లు వ్రాయకుండా పత్రికలు ఉంటున్నాయా?
మనం బ్యాంక్‌లో ఖాతా తెరవాలనుకుంటే అద్రెస్ ప్రూఫ్‌లు, ఇంత్రదక్షన్ అడుగుతారు కానీ నల్ల కుబేరులు స్విస్ బ్యాంక్‌లూ, మారిషస్ బ్యాంక్‌లలో దాచిన డబ్బు వివరాలు తెలిసినా బయట పెట్టరు.
https://teluguvartalu.com/2013/07/15/22-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-50-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8/