మెక్సికో మాఫియా: ‘మిస్సింగ్ 43’ కోసం ఆందోళనలు -ఫోటోలు


మెక్సికో డ్రగ్స్ మాఫియా ముఠాల అరాచకాలకు పెట్టింది పేరు. మెక్సికో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలు నడిపే స్ధాయిలో అక్కడి డ్రగ్స్ మాఫియాలు విలసిల్లుతున్నాయి. పోలీసు విభాగాలు కూడా బహిరంగంగానే మాఫియా ముఠాలకు దన్నుగా నిలుస్తాయి.  మాఫియా ముఠాల పెత్తనానికి సవాలుగా పరిణమించారో, మరే కారణమో తెలియదు గానీ గత సెప్టెంబర్ 26 తేదీన ఇగువాల అనే పట్టణంలో పోలీసులు, ముసుగులు ధరించిన మాఫియా బలగాలు మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులు ఉపాధ్యాయులపై తుపాకులతో దాడి చేసి 6 గురిని చంపేయడమే కాకుండా 43 మందిని మాయం చేశారు.

మిస్సింగ్ 43! ఇప్పుడు మెక్సికోను పట్టి కుదిపేస్తున్న సమస్య ఇది. గుయెర్రెరో రాష్ట్రంలో నార్మల్ స్కూల్స్ గా పిలిచే పాఠశాలలు లోతట్టు గ్రామాల్లో నెలకొల్పారు. ఇవి గ్రామాల ప్రజలకు విద్యాపరంగా మెరుగైన సేవలు అందిస్తున్నాయని ప్రశంసలు అందుకున్నాయి. వీటిల్లో కొన్ని కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ పాఠశాలలకు నిధులు ఇవ్వడం తగ్గించేశారు. క్రమంగా రద్దు చేసే ఆలోచనలు చేయడం మొదలు పెట్టారు. దానితో పాఠశాలల విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు.

నార్మల్ స్కూల్స్ విద్యార్ధుల పోరాట పటిమ చాలా గట్టిది. వారు సాగించే మిలిటెంట్ పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, స్ధానిక ప్రభుత్వాలకు కూడా సవాలుగా పరిణమించాయి. వారు ఆందోళన తలపెడితే బస్సులను తమ ఆధీనంలోకి తీసుకుని గ్రామాల నుండి ఆందోళన చేయదలిచిన చోటికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు. తమకు నిధులు ఇవ్వకుండా పాఠశాలలను రద్దు చేసేందుకు చూస్తున్నందుకు సెప్టెంబర్ 26 న వారు ఆందోళన తలపెట్టారు. ఇగువాల నగరంలో ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇగువాల నగర మేయర్ ఒక డ్రగ్ మాఫియా ముఠా పోషకుడన్నది బహిరంగ రహస్యం. ఆ మాఫియా ముఠాను స్ధానికంగా గుయెర్రోస్ యునిడోస్ అని పిలుస్తారు. మేయర్ ఆధీనంలో పోలీసులలో అనేకమంది ఈ ముఠాలో సభ్యులు. పోలీసు విభాగం లోకి మాత్రమే కాకుండా ఇంకా అనేక ఇతర ప్రభుత్వ విభాగాల లోకి ఈ ముఠా చొచ్చుకుని వెళ్లింది. తద్వారా మొత్తం ప్రభుత్వాన్నే తన అదుపులోకి తెచ్చుకుంది. అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన తలపెట్టడంతో పోలీసులతో పాటు మాఫియా కూడా విద్యార్ధుల ఆందోళనను ఉక్కు పాదంతో అణచివేయడానికి పూనుకుంది.

ఆరోజు తమ ధోరణిలో విద్యార్ధులు (నార్మల్ స్కూల్స్ కు చెందినవారు గనుక వారిని నార్మలిస్టాలు అంటారు) బస్సులను స్వాధీనం చేసుకుని విద్యార్ధులను ఇగువాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై దాడి చేయాలని, వారికి తగిన గుణపాఠం నేర్పాలని మేయర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మేయర్ ఆదేశాల పేరకు పోలీసులు, ముసుగులు వేసుకున్న మాఫియా సభ్యులు విద్యార్ధులపై దాడి చేశారు. వారు ప్రయాణిస్తున్న బస్సులపై భీకరంగా కాల్పులు సాగించారు. కొంతమందిని కిడ్నాప్ చేశారు. నగరంలో కాల్పులకు బలై 6గురు చనిపోయారు. నగరం అంతటా ఏకపక్ష హింసాకాండ చెలరేగింది.

ఆందోళనకు విద్యార్ధులు చెల్లాచెదురైపోయారు. అంతా సర్దుకున్నాక 43 మంది అదృశ్యం అయ్యారని గ్రహించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా చూశామని పలువురు విద్యార్ధులు, సాక్షులు చెప్పారు. అదృశ్యం అయినవారి జాడ ఇంతవరకు తెలియలేదు. ఈ దుర్ఘటనపై దేశం అంతటా నిరసనలు చెలరేగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. పోలీసుల్లో అనుమానితులను అరెస్టు చేసి విచారించగా వారు నగరం బయట సామూహిక సమాధులకు దారి చూపారు. ఈ సమాధుల్లో 28 శవాలను వెలికి తీశారు. కానీ అవి మాయమైన విద్యార్ధుల శవాలు కావని తెలియడంతో మరింత ఆందోళన నెలకొంది. విచారణ కొనసాగే కొద్దీ మరిన్ని సామూహిక సమాధుల జాడలను అరెస్టయిన పోలీసులు చూపుతున్నారు.

మెక్సికోలో మాఫియా ముఠాలు ఏ మేరకు రాజ్యం చేస్తున్నాయో, ప్రజల జీవనాన్ని వారు ఏ స్ధాయిలో ఛిద్రం చేస్తున్నారో ఇగువాలా మారణకాండ మరోసారి చర్చకు తెచ్చింది. నిజానికి మాఫియాల చేతుల్లో పౌరులు మూకుమ్మడిగా అదృశ్యం కావడం మెక్సికోలో సర్వ సాధారణం. ప్రభుత్వాల్లోనే మాఫియాలు తిష్ట వేయడంతో ఈ అదృశ్యాలపై సీరియస్ విచారణలు జరగవు. దానితో మాఫియా ముఠాలు మరింతగా రెచ్చిపోతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు-మాఫియాల కుమ్మక్కును నిరసిస్తూ మెక్సికో ప్రజలు భారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇగువాల మేయర్ ఇప్పుడు చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందని జనం అనుమానిస్తున్నారు. అదృశ్యమైన 43 మంది విద్యార్ధుల జాడ చెప్పినవారికి లక్ష డాలర్ల బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాఫియా సభ్యులుగా అనుమానిస్తూ 50 మంది పోలీసులను అరెస్టు చేశామని ప్రకటించింది. వారు ఇచ్చిన సమాచారం తోనే సమాధుల జాడ తెలిసిందని చెప్పింది. కానీ విద్యార్ధుల జాడ మాత్రం ఇంకా తెలియలేదు.

ఈ నేపధ్యంలో మెక్సికోలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్ధుల అదృశ్యం, ప్రజల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలివి. వీటిని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

One thought on “మెక్సికో మాఫియా: ‘మిస్సింగ్ 43’ కోసం ఆందోళనలు -ఫోటోలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s