ఉగ్రవాదానికి కెనడా కొత్తది ఏమీ కాదు. ఆ దేశ పార్లమెంటుపై దాడి గతంలో ఎన్నడూ ఎరగనట్టిదిగా కనిపించవచ్చు గానీ -కెనడా అమాయకత్వపు ముగింపుగా కూడా దాడిని అభివర్ణించారు- ఉగ్రవాదంతో ఆ దేశానికి, మరే ఇతర పశ్చిమ దేశం కంటే ముందునుండీ, సుదీర్ఘ అనుభవమే ఉంది. 1970లో క్విబెక్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎల్.క్యూ) బ్రిటిష్ దౌత్యవేత్తను, కెనడియన్ కార్మిక మంత్రిని కిడ్నాప్ చేసి రెండున్నర నెలలపాటు తన అదుపులో ఉంచుకుంది. అప్పటి ప్రధాన మంత్రి పియర్రే ట్రుడ్యూ క్విబెక్ లోకి సైన్యాన్ని పంపి పౌర హక్కులను సైతం సస్పెండ్ చేశాడు. (కిడ్నాప్ కు) ఒక సంవత్సరం ముందు ఎఫ్.ఎల్.క్యూ మాంట్రియల్ స్టాక్ ఎక్ఛేంజీలో శక్తివంతమైన బాంబు పేల్చింది. 1985లో మాంట్రియల్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒకటి గాలిలో పేలిపోవడంతో అందులో ఉన్న మొత్తం 329 మంది చనిపోయారు. వారిలో అత్యధికులు భారతీయ సంతతికి చెందిన కెనడా పౌరులు. కెనడా నుండి పని చేస్తున్న బబ్బర్ ఖల్సాను ఈ పేలుడుకు బాధ్యురాలుగా కెనడా పరిశోధకులు ప్రకటించారు.
తుపాకి ధరించిన ఒక ఒంటరి వ్యక్తి సమీపంలోని యుద్ధ మృతుల స్మారక మందిరం వద్ద ఒక గార్డుని చంపిన తర్వాత, పార్లమెంటు భవనం యొక్క పలచని రక్షణను దాటుకుని, ‘హౌస్ ఆఫ్ కామన్స్’ పై చేసిన దాడి, 1984లో చపలచిత్తుడయిన ఓ సైనికుడు క్విబెక్ నేషనల్ అసెంబ్లీలో ముగ్గురిని కాల్చి చంపిన ఘటనను గుర్తుకు తెచ్చింది. పార్లమెంటు అధికారి ఒకరు కాల్చి చంపిన గన్ మేన్ లక్ష్యాలు ఏమిటో ఇంకా స్పష్టం కానప్పటికీ, కెనడా తత్తరపాటుకు గురి కావడం అర్ధం చేసుకోదగినదే. ముఖ్యంగా తాజా దాడికి సరిగ్గా రెండు రోజుల క్రితమే మాంట్రియల్ వద్ద ఇద్దరు సైనికులపై ఓ కారు దూసుకుపోగా ఒకరు చనిపోయిన ఘటన జరిగింది. కారు తోలరి ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్) నుండి స్ఫూర్తి పొందిన జిహాదిస్టుగా కెనడా పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇరాక్, సిరియాలలో ఐ.ఎస్ కు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన మిలట్రీ దాడులలో పాల్గొనాలని ఈ నెలలోనే కెనడా పార్లమెంటు చేసిన నిర్ణయంతో తాజా దాడికి సంబంధం కలుపుతున్నారు. కానీ ఈ రెండు ఘటనల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని చెప్పేందుకు ఇంతవరకు ఎలాంటి సాక్ష్యమూ లేదు.
ఇప్పుడిక కెనడా భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తంగా మారడం అనివార్యం. బుధవారం దాడి ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్ అభివర్ణించారు. కెనడాను భయపెట్టలేరని ఆయన ప్రతిజ్ఞా పూర్వకంగా ప్రకటించారు. దాడికి ఒక రోజు తర్వాత పార్లమెంటులో మాట్లాడుతూ హార్పర్ కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం కోసం పిలుపు ఇచ్చారు. నిజానికి, ఉగ్రవాద అనుమానితులను ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడంతో సహా మరిన్ని అధికారాలను కెనడియన్ భద్రతా గూఢచార సంస్ధకు అప్పజెప్పే చట్టం అప్పటికే తయారవుతోంది. దాడి జరిగిన రోజు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ చట్టం ఆమోదాన్ని ఇక ప్రభుత్వం మరింత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా వృద్ధి చెందిన ఉగ్రవాదంతో సహా ఉగ్రవాద నీడలో బ్రతికే దేశాలలో, ఉగ్రవాద వ్యతిరేకంగా అంటూ తీసుకునే చర్యలు చివరికి తమ వ్యక్తిగత స్వేచ్ఛలనే హరిస్తాయన్న సంగతి అక్కడి ప్రజలకు బాగా తెలుసు. అంతే కాకుండా, అలాంటి చర్యలు అంతిమంగా భద్రతా సంస్ధలు ఒక మతానికి చెందినవారిపై కేంద్రీకరించడానికే దారి తీస్తాయి. కెనడాలో అత్యధిక సంఖ్యలో వలస వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. వారిలో ముస్లిం మతానికి చెందినవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. కావున కెనడా ప్రభుత్వం సున్నితంగా, ఎంచుకుని మరీ స్పందించగలిగితేనే అది అందరికీ ఉపయోగకరం.
(ఈ సంపాదకీయంలో గుర్తించవలసిన అంశాలను ఎర్ర రంగుతో హైలైట్ చేశాను. సంపాదకీయంలో యధార్ధతకు సంబంధించి ఒక తప్పు కనిపిస్తోంది. పార్లమెంటు వద్ద పలచని భద్రత ఉందని చెప్పడం ఒక తప్పు. అక్కడ ఉన్నది చిక్కనైన భద్రత. ఆ రోజు చర్చించనున్న ఉగ్రవాద వ్యతిరేక చట్టం రీత్యా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాంటి భద్రతా వలయం లోకి ముస్లింగా మతం మార్చుకున్న, అరబ్ మూలాలు ఉన్న క్రైస్తవుడు ఆయుధంతో ఎలా చొరబడ్డాడు అన్నది ఒక మిస్టరీ. కారు కింద పడి సైనికుడు చనిపోయిన ఘటన, పార్లమెంటుపై దాడిగా చెపుతున్న ఘటన రెండూ ఒకదానికొకటి సంబంధం లేనివి. అయినా సంబంధం ఉందని చెప్పడం ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి -ప్రజలకు కాదు- అవసరం. ఈ అంశాలను మరో ఆర్టికల్ లో చూద్దాం. -విశేఖర్)
సర్ నా పేరు సుదీర్ మీ వ్యాసాలు రెగ్యులర్ గా ఫాలో అవుతాను మీరు చేస్తున్న సహాయానికి థాంక్స్
Reyhaneh_Jabbari gurinchi emanna rayagalaraa meeru ?