అమెరికాలో మన ఐ.టి ఉద్యోగులకు 6 రెట్లు తక్కువ జీతం


O)ffice of 'Electronics for Imaging' in California

O)ffice of ‘Electronics for Imaging’ in California

ప్రపంచ ఐ.టి ఉత్పత్తులకు కేంద్రంగా పేరు పొందిన సిలికాన్ వాలీ (అమెరికా) లో ఓ కంపెనీ, ఇండియా నుండి వచ్చిన ఐ.టి ఉద్యోగులకు అమెరికా ఉద్యోగుల కంటే 6 రెట్లు తక్కువ వేతనం చెల్లిస్తోంది. బెంగుళూరు నుండి తెచ్చుకున్న భారతీయ ఐ.టి ఉద్యోగుల పట్ల చూపుతున్న ఈ వివక్ష గురించి అజ్ఞాత వ్యక్తుల ద్వారా ఫిర్యాదు అందుకున్న లేబర్ డిపార్టుమెంటు వారు తనిఖీ చేసి ఫిర్యాదు నిజమే అని తెలుసుకున్నారు.

భారీ తేడాతో తక్కువ వేతనం చెల్లించడమే కాకుండా కనీస పనిగంటలకు మించి రెండు రెట్లకు పైగా గంటలపాటు పని చేస్తున్నా ఓవర్ టైమ్ వేతనం భారతీయ ఐ.టి ఉద్యోగులకు చెల్లించడం లేదని అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ లోని వేజ్ అండ్ అవర్ డివిజన్ వారు కనుగొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ వేతనం చెల్లించినందుకు గాను ఐ.టి కంపెనీకి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. భారతీయ ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.

ఈ వ్యవహారానికి అమెరికా, పశ్చిమ దేశాల పత్రికలు విస్తృత ప్రచారం కల్పించాయి. తద్వారా అమెరికాలో కార్మిక చట్టాలను గట్టిగా, మొహమాటం లేకుండా అమలు చేస్తామని అమెరికా ఈ ఘటన ద్వారా ప్రపంచానికి చాటుతోంది. కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయవలసిందే. అనుమానం లేదు. కానీ అవే కార్మిక చట్టాలను సడలీకరించాలని, సరళీకరించాలని, నియంత్రణలు ఎత్తివేయాలని ఇండియాపై అమెరికా బహుళజాతి కంపెనీలు ఎందుకు వత్తిడి చేస్తున్నట్లు? కొద్ది రోజుల క్రితం భారత ప్రధాని మోడి ప్రకటించిన కార్మిక సంస్కరణలు కేవలం పశ్చిమ బహుళజాతి కార్పొరేషన్ ల ఒత్తిడికి తలఒగ్గి చేసినవేనని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.

సిలికాన్ వ్యాలీలో ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇమేజింగ్’ పేరుతో ఓ ఐ.టి కంపెనీ ఉందని ఈ వార్త ద్వారా తెలుస్తున్నది. ఈ కంపెనీ బెంగుళూరులోని తమ కార్యాలయం నుండి 8 మంది భారతీయ ఉద్యోగులను అమెరికా రప్పించుకుంది. అమెరికా అనగానే ఎగిరి గంతేయడం మన బుద్ధి జీవుల అలవాటు కదా! అలాగే ఎన్నో కలలతో వారు అమెరికా వెళ్లారు. కానీ అక్కడ వారికి సరిగ్గా ఇండియాలో ఎంత చెల్లించారో అంతే చెల్లించారు. బహుశా తక్కువ కూడా కావచ్చు.

అమెరికా కనీస వేతన చట్టం ప్రకారం గంటకు 7.25 డాలర్లు చెల్లించాలి. గంటకు 2 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్న అష్టదరిద్రులు ప్రపంచంలో వందల కోట్లమంది ఉన్నారని ఐరాస కార్మిక సంస్ధ సంవత్సరానికి ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అలాంటి వారి జాబితాలో మన భారతీయ మేధావులను కూడా చేర్చుతూ కంపెనీ గంటకు కేవలం 1.21 డాలర్లు మాత్రమే చెల్లించింది. అంటే ఐరాస చెప్పే అష్ట దరిద్రుల కంటే ఘోరమైన వేతనం అన్నమాట!

గంటకు కేవలం 1.21 డాలర్లు మాత్రమే చెల్లించడమే ఘోరం అనుకుంటే ఇమేజింగ్ కంపెనీ అంతటితో ఆగకుండా మరో ఘోరాతి ఘోరాన్ని మనవాళ్లపై అమలు చేసింది. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం వారానికి గరిష్టంగా 40 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి. (అనగా వారానికి 290 డాలర్ల కనీస వేతనం. నెలకు నాలుగు వారాలు అనుకుంటే నెల కనీస వేతనం 1160 డాలర్లు. దీనిని రూపాయల్లోకి మార్చితే (డాలర్ =  రు. 60 చొప్పున) నెలకి రు. 69600/-) కానీ మనవాళ్ళ చేత వారానికి 122 గంటలు పని చేయించుకుంది. అనగా ఏకంగా మూడు రెట్లు కంటే ఎక్కువ. ఆదివారం కూడా పని దినం అయితే రోజుకి 17 గంటల పని. మన ఇండియాలో కూడా ఇంత ఘోరం జరగదు.

వారానికి 122 గంటల పాటు పని చేసినందుకు మనవారికి ఎంత చెల్లించి ఉండాలి? మొదటి 40 గంటలకు గంటకు 7.25 డాలర్ల చొప్పునా, ఆ తదుపరి గంటలకు గంటకు ఒకటిన్నర రెట్లు ఓవర్ టైమ్ లెక్కన గంటకు 10.875 డాలర్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని లెక్కిస్తే వారానికి  1181.75 డాలర్లుగా తేలుతుంది. నెలకు 4 వారాలు అనుకుంటే నెలకు చెల్లించవలసిన మొత్తం 4727 డాలర్లుగా (రు. 283620/-) తేలుతుంది. కానీ వారికి చెల్లించింది గంటకు 1.21 డాలర్ల చొప్పున నెలకు 590.48 డాలర్లు (రు. 35430/-) మాత్రమే. తక్కువ చెల్లించింది నెలకు ఏకంగా రు. 248190/-. ఇంతకంటే నిలువు దోపిడి, అత్యంత ఘోరమైన శ్రమ దోపిడి మరొకటి వర్తమాన ప్రపంచంలో ఉంటుందా అన్నది అనుమానమే.

డాలర్ల నుండి రూపాయలలోకి మార్చి పోల్చడం భావ్యమేనా అని అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పని చేసింది మనం కాదు, కంపెనీయే. వారికి ఇండియాలో చెల్లించే మొత్తాన్ని డాలర్లలోకి మార్చి ఎంత వస్తుందో చూసి సరిగ్గా అదే మొత్తాన్ని మనవాళ్ళకి చెల్లించారు.

ఈ ఘోరానికి పాల్పడ్డందుకు గాను కంపెనీకి 3,5000 డాలర్లు జరిమానా విధించామని అమెరికా లేబర్ డిపార్టుమెంటు అట్టహాసంగా ప్రకటించింది. ఉద్యోగులకు పాత బాకీల కింద 40,000 డాలర్లు (రు 24 లక్షలు) చెల్లించాలని ఆదేశించామని తెలిపింది. అయితే ఇది 8 మంది ఉద్యోగులకు కలిపా లేక ఒక్కొక్కరికా అన్నది తెలియలేదు. కలిపి అయితే అది ఇంకో ఘోరం అవుతుంది.

ఈ అంశంపైన ది హిందు పత్రిక అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ ని సంప్రదించింది. పత్రికకు ఈ మెయిల్ లో సమాధానం ఇస్తూ అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ లోని వెజ్ అండ్ అవర్ విభాగం జిల్లా డైరెక్టర్ సుసాన బ్లాంకో గొప్పలు పోయారు. “కార్మికుల చేత వారానికి 100 గంటలకు పైన దాదాపు రోజంతా పని చేయించుకోవడాన్ని, అది కూడా అత్యంత తక్కువ వేతనాలకు, మేము అనుమతించం. వ్యాపార యాజమాన్యాలు ఒక సంగతి అర్ధం చేసుకోవాలి. ఉద్యోగులను వారు మరోచోటి నుండి అమెరికాకు తెచ్చుకుంటే గనక అలాంటి వారికి అమెరికా కనీస వేతనాల చట్టం ప్రకారమే వేతనాలు చెల్లించాలి. అమెరికా కార్మిక చట్టాలను పొల్లు పోకుండా అమలు చేయడానికి వేజ్ అండ్ అవర్ డివిజన్ కట్టుబడి ఉంది. ఈ ఒక్క కార్మికుడిని దోపిడి చేయడానికి మేము అంగీకరించేది లేదు” అని ఆమె ఘనంగా సమాధానం ఇచ్చారు.

కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నందుకు చప్పట్లు కొడదాం. కానీ అదే అమెరికా కంపెనీలు భారత దేశంలో కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయని ఎందుకు ఆరోపిస్తున్నాయి? కఠిన చట్టాలను ఎత్తివేయాలని అంతవరకు పెట్టుబడులు పెట్టేది లేదని భారత ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాయి? అమెరికా వర్కర్ కి ఒక న్యాయమూ ఇతర దేశాల వర్కర్లకు మరొక న్యాయమూనా? మళ్ళీ ఇదే అమెరికా ఐరాస కార్మిక సంస్ధలో కూర్చుని ప్రపంచ దేశాలు కార్మిక సంక్షేమం పట్టించుకోవడం లేదని బడాయి పోతుంది. కార్మికుల కనీస వేతనాలు విషయం పట్టించుకోవాలని సుద్దులు చెబుతుంది. ఉపదేశాలు బోధిస్తుంది.

ఐరాస బైటికి వచ్చాక తన బోధనలను తానే అడ్డంగా ఉల్లంఘిస్తుంది. తమ కంపెనీల తరపున ప్రపంచ దేశాల ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడులు తెస్తుంది. సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలలో భాగంగా కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రైవేటు కంపెనీలకు ఇష్టారాజ్యం కల్పించాలని ఆంక్షలు విధిస్తుంది. సదరు ఆంక్షలకు భారత ప్రధాని మోడి తల ఒగ్గిన ఫలితమే ఆయన ప్రకటించిన కార్మిక సంస్కరణలు. ‘శ్రమయేవ జయతే’ అంటూ అందమైన పేరు పెట్టి ఆ పేరు మాటున పశ్చిమ దేశాల కంపెనీల కోసం కార్మికులకు నామమాత్రంగా మేలు చేసే నిబంధనలకు, చట్టాలకు చెల్లుచీటీ చెబుతున్నారు మన ప్రధాని.

 

10 thoughts on “అమెరికాలో మన ఐ.టి ఉద్యోగులకు 6 రెట్లు తక్కువ జీతం

 1. భారతీయులు గినీ పిగ్ లు కనక ఎక్స్‌-పెరిమెంట్లన్నీ వాళ్ళమీదనే చేయాలని కోరుకుంటారు పశ్చిమ దేశాల వాళ్ళు.

 2. excellent analysis sir,but I think who earns less than 2 US dollars per day (not per hour) in terms of purchasing power parity are considered as poor(moderate poverty) and 1.25 US dollars per day are considered as suffering from exterme poverty according to world bank report.

 3. పవన్ గారు, పేదరికానికి ఇద్దరు ఆర్థికవేత్తలు ఇచ్చే దెఫినిషన్స్ ఒకేలా ఉండవు. రోజుకి 33 రూపాయలు సంపాదించేవాళ్ళు పేదలు కారని దెఫినిషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మట్టి కరిచిందో మనకి తెలుసు కదా. ఏ పెట్టుబడిదారుడైనా లాభాల కోసమే వ్యాపారం చేస్తాడు కానీ కేవలం తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవడానికి కాదు. అమెరికావాళ్ళు స్వదేశీయులకి ఒకలా, విదేశీయులకి ఇంకోలా విధానాలు ఎలా అమలు చేస్తారో ఈ పోస్త్ బయట పెట్టింది. ఇదంతా పాత పద్దతే. మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చినవాళ్ళని అమెరికాలోని రెస్తారెంత్‌లలో తక్కువ జీతానికి పని చెయ్యించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది.

 4. @Marxist Leninist garu

  I just have doubt regarding a factual information

  “గంటకు 2 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్న అష్టదరిద్రులు ప్రపంచంలో వందల కోట్లమంది ఉన్నారని ఐరాస కార్మిక సంస్ధ సంవత్సరానికి ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.”

  I does not have any conflicting views regarding ideology concerning to exploitation of labour.

  But regarding poverty estimations of the India,Is rangarajan committee estimates and lakkadwala committee estimates are that much far away from the original scenario??… I am always confused with that numbers… MPCCE calculated for a five member family,Rs 4,860 in villages and Rs 7,035 for cities seems to me a better estimation….. but when converting those numbers to daily basis, Rs 47 per day in cities and Rs 32 in villages found to me those estimates are far away from reality.

 5. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఆ అయిదుగురూ సంపాదనలోనే ఉంటారన్న అంచనాలో ఏ తప్పూ కనిపించడం లేదా? కుటుంబాల్లో ఇక పసి పిల్లలూ, చదువుకునే పిల్లలూ, పని కోసం చూస్తూ ఖాళీగా ఉండే పిల్లలూ ఉండరా? వయసు మీద పడి ఇక పని చేయలేని స్ధితిలో ఉండే ముసలి వాళ్ళు ఉండరా? ఇదొక అంశం.

  మరో అంశం. మనిషికి తినడానికి తిండి ఉంటే ఇక దరిద్రం లేనట్లేనా? దుస్తులు, విద్య, వైద్యం, ఆనందం (రిక్రియేషన్) ఇవేవీ అవసరం లేదా? డబ్బు మూలిగే వాడికి 500 పెట్టి వెళ్లగల మల్టీప్లెక్స్ ధియేటర్ కావాలి. దరిద్రుడు కనీసం నేల టికెట్ కు కూడా నోచుకోడా? ఇంతా చేసి ఆ నేల టికెట్ గాళ్ళు ఒళ్ళు వంచితే తప్ప ఒక్క పనీ నడవదు.

  ఇన్ని లోపాలు పెట్టుకుని పర్చేసింగ్ పవర్ పారిటీ అంటూ చచ్చు లెక్కలు ఎన్ని చెబితే దరిద్రం లేకుండా పోవాలి?

 6. @విశేఖర్ garu
  yes sir, it clarified me, some of fundamental flaws in the estimation of the poverty,although minimum expenditure on food and non food items are calculated,but the freedom to spend that money in extreme conditions is completely restricted,lacking of economic freedom…but what can be the correct and reliable method to calculate poverty..

 7. “what can be the correct and reliable method to calculate poverty”

  This is not the question we have to ask. Our questions have to be:

  “Why should we still calculate poverty?

  “When the world can produce many times to it’s requirement, why should poverty continue to be unresolved?

  “When lots and lots of exchange value is reserved in value reservoirs, why should lots and lots of people still remain in a pathetic poverty?”

  The point is, there is no need of poverty to continue. Poverty is thrust upon working people, so that they can offer their labour for a meagre payment.

  And, measuring poverty itself is a measure of where the civilization of mankind stands.

 8. The problem lies with the corruption plagued public distribution system and pilferages in the distribution patterns.

  Lack of storage facilities and unwilling nature of the politicians to develop the infrastructural facilities which are not updated from last 25 years.

  Bumper crop productivity for nearly half a decade with more than 200 million tonnes average of wheat and rice but still more than 350 million people are below the poverty line.

  while writing the above points I did not face any dilemma

  but sir, what I think the conundrum comes, when several broader aspects like Minimum support price to farmers, rotting of million tonnes of food grains, poverty, and fiscal deficit to the government are seen in single prism.

  “Welfare of Farmers,Welfare of poor people,economy of the country” these all thinks are integral part of the broader Indian democratic system.

  sir, please give me some light regarding, Is the concerns raised by the government on MSP to farmers and rotting of million tons of food grains is a reality? are any other angle behind that?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s