అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన ఒక కోణాన్ని ఈ కార్టూన్ అద్దం పడుతోంది.
ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై దాడి చేసేందుకు ఏ ఒక్క రాయినీ వృధా పోనీయని శివ సేన, ఎన్నికల అనంతరం ఆ పార్టీతోనే జట్టు కట్టి అధికారం పంచుకునేందుకు ఆత్రపడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం చూపుతూనే ప్రభుత్వంలో చేరేందుకు తహతహలాడుతోంది.
ఇక ఎన్.సి.పి సంగతి సరే సరి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బి.జె.పి కి సైగలు చేయడం మొదలు పెట్టిన ఎన్.సి.పి అప్పుడప్పుడూ తనకూ ఆత్మ గౌరవం ఉందన్న ప్రకటనలు చేస్తూ వచ్చింది. తీరా ఎన్నికలు ముగిశాక బి.జె.పి పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించింది. అది కూడా ఏకపక్షంగా. కానీ బి.జె.పి శివసేన వైపే మొగ్గు చూపడంతో ఎన్.సి.పి మద్దతుకు ఎర్ర ఏగాని విలువ లేకుండా పోయింది.
బి.జె.పికి మాత్రం ఎంచక్కా ఒకే ఔటుకు రెండు వత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఒక వత్తు తుస్సుమన్నా రెండో వత్తుతో అధికారాన్ని అందుకోవచ్చు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే కాబోలు!