ప్రశ్న: సోవియట్ రష్యా ఎందుకు కూలింది?


ఎస్.రామ కృష్ణా రావు:

Two three decades ago there was cold war between America & Russia. Both were competing for no1 position. But down the line Russia faded away and USA is actively participating in almost all parts of the world’s politics. Russia became neutral & insignificant. I would like to know what went wrong with USSR? In spite of having huge natural resources why USSR is not able to compete with USA. What are the main factors which let down Russia politically & financially and because of which USSR is not able to show it’s presence in world’s politics to the deserved extent​.

రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. రెండూ నెంబర్ 1 స్ధానం కోసం పోటీ పడేవి. అనంతర కాలంలో రష్యా (ప్రాభవం) మాసిపోగా, అమెరికా దాదాపు ప్రపంచంలోని అన్నిచోట్లా రాజకీయాలు సాగిస్తోంది. రష్యా తటస్ధంగానూ, నిరర్ధకంగానూ అయిపోయింది. USSR కి అసలు ఏమైందో తెలుసుకోగోరుచున్నాను. భారీ మొత్తంలో సహజ వనరులు ఉన్నా, USAతో USSR ఎందుకు పోటీపడలేకపోతోంది? రష్యా రాజకీయంగానూ, ఆర్ధికంగానూ బలహీనపడడానికి దారితీసిన కారణాలూ, తద్వారా ప్రపంచ రాజకీయాల్లో USSR తన ఉనికిని తగిన విధంగా రుజువు చేసుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి?

సమాధానం:

ఈ అంశాన్ని నేను గత ఆర్టికల్స్ లో ఒకే చోట రాయకపోయినప్పటికీ, ఆయా సందర్భాలు వచ్చినప్పుడు కొంత కొంత కవర్ చేశాను. ఒకే చోట ఉంటే పాఠకులకు కూడా ఉపయోగం.

USSR పూర్తి రూపం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. 1917లో లెనిన్, ట్రాట్స్కీ తదితర నేతల నాయకత్వంలో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో (ఆర్.ఎస్.డి.ఎల్.పి) ఒక అర్ధ భాగంగా ఉన్న బోల్షివిక్కులు (రెండో అర్ధ భాగం మెన్షివిక్కులు) జార్ చక్రవర్తి పాలనపై తిరుగుబాటు చేసి సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసుకున్నారు. వాస్తవానికి 1917లో అక్కడ రెండు విప్లవాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఫిబ్రవరి విప్లవం. రెండోది అక్టోబర్ విప్లవం.

ఫిబ్రవరి విప్లవం, జార్ చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా రష్యాలోని పెట్టుబడిదారీ శక్తులు, కార్మికవర్గం, రైతులు, ఇతర మధ్యతరగతి వర్గాలు నిర్వహించి విజయవంతం చేసిన విప్లవం. ఫిబ్రవరి విప్లవంతోటే రాజ్యాధికారం కార్మిక వర్గం (శ్రామికులు) చేతికి రాలేదు. ఫిబ్రవరి విప్లవానంతరం బూర్జువా వర్గం లేదా పెట్టుబడిదారీ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. బూర్జువా వర్గానికి మెన్షివిక్కులు పరోక్ష మద్దతు ఇచ్చారు. కార్మిక వర్గం రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న లెనిన్ వాదనను మెన్షివిక్కులు తృణీకరించారు. మొరటువాళ్ళకు రాజ్యాధికారం ఏమిటని ఈసడించారు.

తీవ్ర నిర్బంధం రీత్యా, అప్పటికి ప్రవాసంలో ఉన్న లెనిన్ రష్యా వచ్చి కార్మిక వర్గం తరపున, అశేష శ్రామిక ప్రజా వాహిని తరపున అత్యంత తెలివైన, అత్యంత సాహసోపేతమైన, అత్యంత అనూహ్యమైన రాజకీయ, మిలట్రీ, విప్లవకర ఎత్తుగడలు పన్నాడు. ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకూ దేశంలో చిక్కనైన అశాంతి, అలజడి, తిరుగుబాట్లు కొనసాగాయి. చేతికి చిక్కిన అధికారం నిలబెట్టుకోవడానికి బూర్జువావర్గం, వారికి మద్దతుగా అమెరికన్, యూరోపియన్ సామ్రాజ్యవాద ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. కానీ లెనిన్ ఇచ్చిన ప్రజా నినాదాల ముందు వారి ఎత్తుగడలు సాగలేదు. ఆర్.ఎస్.డి.ఎల్.పిలో మెన్షివిక్కులతో పోలిస్తే అప్పటివరకూ మైనారిటీగా ఉన్నప్పటికీ దేశంలో విస్తారమైన ప్రజా పునాదిని బోల్షివిక్కులు కలిగి ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో లెనిన్ అక్టోబర్ లో సోషలిస్టు తిరుగుబాటుకు కార్మికవర్గానికి పిలుపు ఇచ్చారు.

అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తీరు, మొరటు-సంస్కారవిహీన-నిరక్షర కుక్షులైన అశేష కార్మిక జనులు అత్యంత సాహసోపేతంగా నగరాలను వశం చేసుకున్న విధము, అత్యంత సమయ స్ఫూర్తితో లెనిన్ ఇచ్చిన రాజకీయ నినాదాలు ప్రజల్ని మూకుమ్మడిగా బోల్శీవిక్కుల వెంట నడిపించిన తీరు… ఇవన్నీ తెలుసుకోవాలంటే అప్పటి అమెరికా విలేఖరి జాన్ రీడ్ రాసిన ‘ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు’ (Ten Days That Shook the World) పుస్తకాన్ని చదవాల్సిందే.

[విప్లవం సాగినన్నాళ్లూ మాస్కోలోను, ఇతర నగరాల్లోనూ గడిపి ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన జాన్ రీడ్, అమెరికాకు తిరిగి వెళ్ళాక ఆయన తయారు చేసుకున్న నోట్సు, వివిధ రాత ప్రతుల భాగాలు, ఇంటర్వ్యూలు అన్నింటినీ అమెరికా ప్రభుత్వం లాగేసుకుంది. అప్పటికే ఆయన పని చేసిన పత్రికను కూడా మూసేసింది. జాన్ రీడ్ దాదాపు ఏడెనిమిది నెలలు పోరాడితే గానీ ఆయన నోట్సులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వలేదు. నోట్సు తన చేతికి వచ్చిన వెంటనే పది రోజుల పాటు రాత్రింబవళ్లూ కూర్చొని ఏకధాటిగా రాసి పుస్తకం పూర్తి చేశాడు. ఆయన పత్రిక పని చేయనందున మరో పబ్లిషర్ సహాయంతో పుస్తకాన్ని తీసుకురాగలిగాడు. ఈ పుస్తకం ఎంతగా ప్రజాదరణ పొందిందంటే కరడుగట్టిన పచ్చి పెట్టుబడిదారీ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సైతం టాప్ 100 పుస్తకాల్లో 7వ పుస్తకంగా 1999లో ప్రకటించింది. లెక్కలేనన్ని ముద్రణలు పొందిందా పుస్తకం. అనేక భాషల్లోకి తర్జుమా చేయబడింది. తెలుగులోకి కూడా. తెలుగు పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో ఉందో లేదో తెలియదు గానీ ఆంగ్ల ప్రతిని ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.]

పది రోజులపాటు సాగిన అక్టోబర్ సోషలిస్టు విప్లవంతో రష్యాలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం ప్రతిష్టించబడింది. పసికూనగా ఉండగానే సోషలిస్టు దేశం గొంతు నులిమి చంపేయడానికి ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలూ, రవి అస్తమించని దుర్మార్గపూరిత వలస రాజ్యాలూ కంటికి కునుకు లేకుండా ప్రయత్నాలు సాగించాయి. 3 సంవత్సరాల పాటు రష్యాను అన్నిరకాలుగా చుట్టుముట్టి తీవ్ర కష్టాలకు గురి చేశాయి. వ్యాపారం చేయడానికి నిరాకరించాయి. దేశం నిండా గూఢచారులను దింపి బోల్శివిక్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపించాయి. ఆంక్షలు విధించి రష్యా ప్రజలను ఆకలికి మలమల మాడేలా చేశాయి. లెనిన్ తదితర విప్లవ నాయకులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అనేక కట్టుకధలు అల్లి ప్రచారం చేశాయి. కృత్రిమ కరువు సృష్టించి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాయి. కానీ జనం మెజారిటీ బోల్షివిక్కుల పక్షానే నిలవడంతో పెట్టుబడిదారీ దేశాలే విసిగిపోయాయి. ఆ విధంగా ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం బాలారిష్టాలను (నిజానికి కఠిన కంటక ప్రాయ కాలాన్ని) అధిగమించింది.

లెనిన్ అనంతరం సోషలిస్టు సోవియట్ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ బోల్షివిక్కు పార్టీలోనే పెట్టుబడిదారీ అనుకూల శక్తులు ప్రవేశించాయని పసిగట్టాడు. ప్రవేశించడమే కాకుండా దేశాన్ని తమ గుప్పెట్లో తీసుకుని సోషలిస్టు నిర్మాణాన్ని నాశనం చేయాలని, దేశాన్ని తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి మళ్ళించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని గ్రహించాడు. దానితో ఆయన పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ క్రమంలో లెనిన్ నుండి కొన్ని విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. లెనిన్ మరణంతో విప్లవ ప్రతీఘాతక శక్తులు విజృంభించకుండా ఉన్నాయంటే అది స్టాలిన్ చలవే. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ రష్యా అనతికాలంలోనే సుసంపన్నమైన దేశంగా ఎదిగింది. అమెరికా అభివృద్ధి చెందడానికి 300 యేళ్ళు పడితే సోవియట్ రష్యా అభివృద్ధి చెందడానికి కేవలం 30 సంవత్సరాలు మాత్రమే పట్టిందంటే కారణం సోవియట్ రష్యా ఎంచుకున్న మార్గమే.

ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేందుకు ఎటువంటి అవకాశం లేకుండా కార్మికవర్గ నియంతృత్వాన్ని (ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతోనూ, వివిధ ఆటోక్రాట్ల నేతృత్వంలోనూ నడుస్తున్న రాజ్యాలన్నీ వాస్తవానికి బూర్జువా నియంతృత్వ రాజ్యాలు.) స్టాలిన్ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. పెట్టుబడిదారీ దేశాలు నిరంతరం కుట్రలు సాగిస్తున్న నేపధ్యంలో కూడా స్టాలిన్, సోవియట్ కమ్యూనిస్టు పార్టీలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాయి. జర్మనీ నియంత హిట్లర్ మొదట ఆక్రమించింది చేకొస్లోవేకియా, పోలాండ్ ఫ్రాన్స్ దేశాలనే అయినా అతని అంతిమ లక్ష్యం సోవియట్ రష్యాయే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర రాజ్యాలు కూడా హిట్లర్ మొదట సోవియట్ రష్యా మీదికే వెళ్లాలని ఆశించాయి. ఈ సంగతి గ్రహించిన స్టాలిన్ తెలివిగా హిట్లర్ తో నిర్యుద్ధ సంధి చేసుకున్నాడు. ఆ సంధిని తుంగలో తొక్కిన హిట్లర్, కొద్దికాలానికి సోవియట్ రష్యా మీదికి దండు వెళ్ళి తన మరణశాసనాన్ని తానే లిఖించుకున్నాడు.

యుద్ధంలో సైనికులు, సైనికాధిపతులు యుద్ధరంగంలో తలమునకలై గాయాల పాలవుతుంటే దేశాధినేతలు ఏం చేస్తారు? తమ తమ రాజ మందిరాల్లో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటారు. ఆజ్ఞలు జారీ చేస్తారు. ఆజ్ఞలు అమలు చేయని సైనికాధికారుల్ని శిక్షలకు గురి చేస్తుంటారు. సైనికుల వందనాలు స్వీకరిస్తూ ఉంటారు. కానీ స్టాలిన్ చేసింది అది కాదు. ఆయన స్వయంగా యుద్ధరంగంలోకి దుమికాడు. స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ సైనికులతో కదం కలిపాడు. స్వయంగా మిలట్రీ ఎత్తుగడలను రచించాడు. స్వయంగా సైన్యాలను పరామర్శించాడు. స్వయంగా కందకాల వద్దకు వెళ్ళి సైన్యానికి ప్రోత్సాహం అందించాడు. మొత్తం దేశాన్నే ఉత్తేజితం కావించి ప్రతి పౌరుడిని ఒక్కొక్క కరడుగట్టిన దేశ భక్తుడిగా మార్చాడు.

సోవియట్ రష్యాపై దాడిలో నిజానికి రష్యా పనైపోయిందనే ప్రారంభంలో అనుకున్నారు. ఉక్రెయిన్ లో తనకు అనుకూలమైన నాజీ శక్తులను తయారు చేసుకుని (వారి వారసులే ఇప్పుడు ఉక్రెయిన్ ని వినాశనం వైపుకి తీసుకెళ్తున్నారు) తన సైన్యాన్ని ఉక్రెయిన్ ని దాటించాడు హిట్లర్. వారిని మాస్కో వరకూ స్టాలిన్ రానిచ్చాడు. ఇకనేముంది మాస్కో వశం కావడమే తరువాయి అని పశ్చిమ రాజ్యాలు (అమెరికాతో సహా) చంకలు గుద్దుకున్నారు. కానీ మాస్కోలో అద్వితీయమైన యుద్ధ కళాకౌశలాన్ని నాజీలకు రుచి చూపాడు స్టాలిన్. స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి ప్రజల సహాయంతో హిట్లర్ సైన్యాన్ని రెండుగా చీలిపోయేలా చేశాడు. ఆయన నేతృత్వంలోని సైన్యం సమారోత్సాహంతో హిట్లర్ సాయినికులని నిలువునా చీల్చితే వెనుకవైపు నుండి కుడి, ఎడమల నుండి దాడి చేయించాడు. ఆ దెబ్బతో హిట్లర్ సైన్యం నిలువునా నీరుగారిపోయింది. అంతులేని మానవ విధ్వంసం ఆనాడు మాస్కోలో చోటు చేసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ నిర్వహించిన మరో బృహత్కార్యం దేశ ఆర్ధిక వ్యవస్ధకు పట్టుగొమ్మలయిన మహా మహా భారీ పరిశ్రమలను లోపలికి తరలించడం. ఇది సాధ్యమని బహుశా అప్పటివరకూ ఎవరూ ఊహించి ఉండరు. కానీ అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం రాజుల చేతగాదు గానీ ప్రజలకు చిటికెలో పని. అశేష శ్రామికజన సమూహం తోడు నిలవగా ఐరోపా సరిహద్దుల్లో కేంద్రీకరించబడిన పరిశ్రమలను లోపలికి తరలించి అక్కడ పునర్నిర్మాణం కావించాడు. ఇదంతా ఎందుకంటే హిట్లర్ ప్రధాన లక్ష్యం తామే అని, కమ్యూనిస్టు రాజ్యాల నిర్మూలనే హిట్లర్-ముసోలినిల లక్ష్యం అనీ, అందుకోసం వారికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర రాజ్యాలు కూడా దన్నుగా ఉంటాయని స్టాలిన్ కి తెలుసు గనుక.

నాజీలు దాడి చేస్తే, ఆ దాడిలో పరిశ్రమలు నాశనం అయితే ఆర్ధిక వ్యవస్ధ నష్టపోతుంది. ఆర్ధిక వనరులైన పారిశ్రామిక శక్తి అందుబాటులో లేకపోతే యుద్ధంలో సరఫరాలు లేక త్వరలోనే ఓటమి తధ్యం అవుతుంది. ఈ ముందు చూపుతో ఒక పక్క హిట్లర్ ఐరోపాలో జైత్రయాత్ర సాగిస్తుంటే మరో పక్క రష్యాలో ఆర్ధిక వ్యవస్ధకు ప్రాణాధారమైన పారిశ్రామిక రంగాన్ని మరోచోట పునర్మించడంలో స్టాలిన్ దృష్టి పెట్టాడు. ఇది ప్రజలవల్లనే సాధ్యపడింది తప్ప మరొకరి వల్ల కాదు. అప్పుడు రష్యాలు పెట్టుబడిదారీ వర్గాలు లేవు. ఉన్నదంతా ప్రజలే. సోషలిస్టు వ్యవస్ధలో తిని కూర్చునే వెధవలు ఉండరు. ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో నిమగ్నమై ఉంటారు. ఆ విధంగా ప్రజలు మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని పెట్టుబడిదారీ నియంతృత్వ దాడి నుండి కాపాడుకున్నారు.

………………….ఇంకా ఉంది

 

3 thoughts on “ప్రశ్న: సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

  1. USSR పూర్తి పేరు “Union of Soviet Socialist Republics” అని గుర్తు! పేరు అంత పెద్ద విషయం కాదు గానీ, ఒకసారి సరిచూడండి.

    సోవియెట్ యూనియన్ ఏర్పాటు నుంచీ మొదలుపెట్టి క్లుప్తంగా వివరిస్తున్న మీ ప్రయత్నం బాగుంది. ధన్యవాదాలు! మాకు తెలియని చాలా విషయాలు తెలిశాయి. ఫిబ్రవరి విప్లవం సంగతీ, మెన్షెవిక్కులూ, బొల్షెవిక్కులూ ఒకే పార్టీలోని రెండు వర్గాలన్న సంగతీ ఆశ్చర్యపరిచాయి. 🙂

    రెండో ప్రపంచయుద్ధ కాలంలో స్టాలిన్ పోషించిన చతురత, ముందుచూపు చాలా గొప్పవి. అయినా, స్టాలిన్ నిరంకుశ నియంత అనీ, సోవియెట్ యూనియన్ లో లక్షల చావులకు ఆయన కారకుడనీ, పార్టీలోని నాయకులను ఎందరినో కూడా చంపించాడనీ – ఇట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వీటిలోని సత్యాసత్యాలను వివరించగలరు.

  2. అవినాష్ గారూ, మీరు చెప్పింది నిజమే. రాసేప్పుడే అనుమానం తొంగి చూసింది. రాయడం ముగిశాక కన్ఫర్మ్ చేసుకోవచ్చులే అనుకున్నాను. రెండో భాగం రాయవలసి వచ్చేసరికి అది వెనక్కి వెళ్లిపోయింది. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s