(ఐరోపా దేశాల్లో మితవాద శక్తుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ శక్తులు వలస ప్రజలకు వ్యతిరేకంగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కు కూడా వీరు వ్యతిరేకం. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అయ్యేకొద్దీ వాటినుండి బైటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు తిరుగుబాటు భావజాలం వైపుకి మరలకుండా ఉండేందుకు ప్రస్తుత పాలక వర్గాల పార్టీలు తామే ఒక తీవ్రవాద ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తెస్తారు. ప్రజలు తమలో తాము ఘర్షణ పడేవిధంగా తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తారు. ఈ భావజాలం నిజంగా ప్రజల సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపించడానికి బదులు పక్కదారి పట్టిస్తుంది. అయోమయంలోకి నెట్టివేస్తుంది. ఐరోపా దేశాల్లో ప్రస్తుతం ఈ ప్రహసనం నడుస్తోంది. అది అతిమిత భావజాల రూపం ధరిస్తోంది. ఈ పరిణామాలపై ది హిందు ఎడిటోరియల్ అందించిన ఓ చిన్న అవగాహన ఇది. ఈ ఎడిటోరియల్ పరిణామాలను మాత్రమే గుర్తిస్తూ కొద్దిపాటి అవగాహన ఇచ్చిందే తప్ప సంపూర్ణ అవగాహన ఇవ్వలేదని గమనించాలి. -విశేఖర్)
ఇటీవలి వరకూ రాజకీయంగా ఎక్కడో అంచున ఉన్నదిగా భావించిన పార్టీ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు (బ్రిటిష్ పార్లమెంటు) లో మొదటిసారి ప్రవేశించిన పరిణామాన్ని బహుశా అతిగా చూడవలసిన అవసరం లేకపోవచ్చు. అయినప్పటికీ నిగెల్ ఫారేజ్ నాయకత్వంలోని యు.కె. ఇండిపెండెంట్ పార్టీ (Ukip) గత వారం జరిగిన ఉప ఎన్నికలో సాధించిన గెలుపు యూరోపియన్ పార్లమెంటులో ఇ.యు వ్యతిరేక అతి మిత (far-right) వాద పార్టీలకు క్రమంగా పెరుగుతున్న మద్దతు గురించి ఎంతో కొంత సందేశం ఇస్తోందని చెప్పవచ్చు. మే 2014 నాటి యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల నుండి ఈ విధమైన మద్దతు పెరుగుతూ వస్తోంది. బ్రిటన్ లో మధ్యేవాద పార్టీలను అక్కడి ప్రధాన స్రవంతి పార్టీలు స్ధిరంగా బలహీనపరిచిన క్రమంలో ఇదొక ముఖ్యమైన పరిణామంగా చూడవలసి ఉంటుంది. (ఇలా బలహీనపడిన మధ్యేవాద) పార్టీల స్ధానాన్ని వలస వ్యతిరేక మరియు ఇ.యు వ్యతిరేక శక్తులు భర్తీ చేయడం పెరుగుతూ వస్తోంది.
ఫ్రాన్స్ లో లీ పెన్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్, డెన్మార్క్ లోని డేనిష్ పీపుల్స్ పార్టీ లాంటి అతి మితవాద పార్టీలకు మల్లేనే, బ్రిటన్ లోని Ukip, స్ట్రాస్ బర్గ్ (రాష్ట్ర) శాసన సభలో 24 సీట్లు, 27.5 శాతం ఓట్లు సాధించడం ద్వారా బ్రిటన్ లో పై స్ధాయికి చేరింది. (యూరప్ లో) ఇతర తీవ్ర మితవాద పార్టీలు కూడా తమ తమ బలాలను పెంచుకున్నాయి. ఫిన్లాండ్, ఆస్ట్రియా, ద నెదర్లాండ్స్, గ్రీసు దేశాలలో అవి మూడో స్ధానాన్ని సంపాదించాయి. 2013లో స్ధాపించబడిన జర్మనీ యూరో వ్యతిరేక పార్టీ ఇ.యు పార్లమెంటులో కొన్ని సీట్లు గెలుచుకుంది; జర్మనీలో 3 రాష్ట్రాల్లో అది ఉనికిని సంపాదించింది కూడా. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీ మాజీ సభ్యుడైన డగ్లస్ కార్స్ వెల్ యుకిప్ పార్టీ కోసం క్లాక్టన్-అన్-సీ నియోజకవర్గంలో గెలుపు సాధించిపెట్టాడు. గ్రేటర్ మాంచెస్టర్ సీటులో లేబర్ పార్టీ వెనుకనే ప్రమాదకరంగా రెండో స్ధానంలో ఆ పార్టీ నిలిచింది. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మరో సభ్యుడు పార్టీ మారడంతో మూడో ఉప ఎన్నిక త్వరలోనే జరగవచ్చు. తదుపరి సాధారణ ఎన్నికలు మరో 200 రోజుల దూరంలోనే ఉన్న నేపధ్యంలో ఈ ఫలితాలు రాజకీయ అస్ధిర పరిస్ధితులకు ఒక సూచన.
యుకిప్ మరింత బలం సంపాదించిన పక్షంలో ఎక్కువగా నష్టపోయేది టోరీలా (కన్సర్వేటివ్ పార్టీ) లేక లేబర్ పార్టీయా అన్న తీవ్ర ఊహాగానాలకు తాజా ఫలితాలు పని కల్పించాయి. ఓటర్లు ఎదురు చూస్తున్న నిజమైన ప్రత్యామ్నాయం తామేనని తాజా ఫలితం చెబుతోందని ఫారేజ్ అప్పుడే ప్రచారం చేసుకుంటున్నాడు. కన్సర్వేటివ్ పార్టీలో సాంప్రదాయకంగా అనుసరిస్తూ వచ్చిన మితవాద భావజాలాన్ని పరిత్యజించి కొద్ది సంవత్సరాలుగా మరింత తీవ్రమైన వలస-వ్యతిరేక, ఇ.యు-వ్యతిరేక పంధా చేపట్టిన కన్సర్వేటివ్ సభ్యులు ఇప్పుడు అదే పంధాకు ఊపిరి పోస్తున్న యుకిప్ పార్టీని ఎదుర్కొంటున్నారు.
లిబరల్ డెమొక్రాట్ పార్టీతో కలిసి నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ ధోరణిలో బిగ్గరగా గొంతు విప్పింది టోరి పార్టీలోని వెనుక బల్లల సభ్యులే. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశంగా కొనసాగాలా వద్దా అన్న అంశంపై రిఫరెండం నిర్వహిస్తామని ప్రధాని డేవిడ్ కామెరాన్ హామీ ఇచ్చేవిధంగా ఒత్తిడి తెచ్చింది కూడా వాళ్ళే. 2009లో బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీని, యూరోపియన్ పార్లమెంటులో యూరోపియన్ పీపుల్స్ పార్టీతో కలిసి ఏర్పరిచిన సెంటర్-రైట్ కూటమి నుండి బైటికి నడిపించింది ఆయన నేతృత్వంలోనే కావడం గమనార్హం. 1946లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ లో అప్పటి కన్సర్వేటివ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఇచ్చిన ప్రఖ్యాత ప్రసంగంలో ముందుకు తెచ్చిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్’ ఐడియాకు ఇది సరిగ్గా వ్యతిరేకం. వివిధ అంశాలు ఈ విధంగా సాధారణ ప్రవాహ గతిని మార్చుకోవడం బ్రిటిష్ వ్యాపారాలకు సంతోషం కలిగించేదేమీ కాదు. ఎన్నికల ధోరణిలో పడిపోయిన లేబర్ పార్టీ (యూరోపియన్) సమగ్రతకు విరుద్ధమైన శక్తులతో సంబంధాలు పెట్టుకునే అవకాశం లేదు.