మానవ వైద్య పరిజ్ఞానానికి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్ లు ఇప్పటికీ కొరకరాని కొయ్యలుగానే ఉంటున్నాయని ఎబోలా వైరస్ విస్తృతి తెలియజేస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. శత్రు దేశాలను లొంగ దీసుకోవడానికీ, సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న దేశాలను దారికి తెచ్చుకోవడానికీ సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రాణాంతక వైరస్ లను తమ ప్రయోగశాలల్లో భద్రపరచడమే కాకుండా, జెనెటిక్ ప్రక్రియల ద్వారా సరికొత్త ప్రాణాంతక వైరస్ లను సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం నాణేనికి మరో పార్శ్వం.
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో కొత్త, ఆధునిక చికిత్సా పద్ధతులకు ప్రాణం పోస్తుండగా మరోవైపు బహుళజాతి కంపెనీల లాభాపేక్ష వైద్యరంగం అభివృద్ధి, అందుబాటులపై పరిమితి విధించడం ఆధునిక యుగపు ఖండనార్హ వైరుధ్యంగా మనమధ్య నెలకొని ఉంది.
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమై ఆఫ్రికా దేశాలకు విస్తరించడమే కాకుండా ఆ దేశాల్లో వైద్యం కోసం వెళ్ళిన పశ్చిమ దేశాల డాక్టర్లకు, నర్సులకు కూడా సోకిన ఎబోలా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఎబోలా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఐరాస, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎబోలా రోగులు, మరణాల సంఖ్య పెరుగుతోదే గానీ తగ్గడం లేదు.
రోగిని గానీ రోగుల వస్తువులను గానీ, ఎబోలా వైరస్ ని మోస్తున్న జంతువులను గానీ లేదా ఎబోలా వ్యాప్తికి కారణంగా చెబుతున్న గబ్బిలాలను గానీ తాకితేనే ఎబోలా వ్యాధి సోకుతుందని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. ఐరాస కూడా అదే చెబుతోంది. కానీ రోగులు తుమ్మడం, దగ్గడం లాంటి చర్యల వలన ఎబోలా క్రిములు గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నాయని, ఈ అంశాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని పలువురు స్వతంత్ర వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందని చెప్పడానికి ఆధారాలు లేవని చెబుతున్న పశ్చిమ దేశాలు, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు రోగులకు చికిత్స, ఇతర సేవలు అందించే తమ సిబ్బందికి మాత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సూట్లను అమర్చి, చికిత్సకోసం తీవ్రమైన శిక్షణలను కూడా ఇస్తున్నాయి. ఈ చర్యలన్నీ గాలి ద్వారా వ్యాప్తిని నిరోధించడానికి ఉద్దేశించినవే అని విమర్శకులు తమకు మద్దతుగా చూపుతున్నారు.
నిజం చెప్పాలంటే ఒంటినిండా ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్న వైద్య సిబ్బంది ఎబోలా వ్యాధి విస్తరణకు బ్రాండ్ ఇమేజ్ గా మారారంటే అతిశయోక్తి కాదు. ఎబోలా తమా దేశంలో కూడా ప్రవేశిస్తుందేమోనన్న భయంతో పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండే కాకుండా ఇతర ఆఫ్రికా దేశాల నుండి కూడా దిగుమతి అయ్యే వివిధ సరుకులను శల్య పరీక్ష చేసిగాని అనుమతించడం లేదు. ఇలా శల్య పరీక్ష చేసేందుకు కూడా ప్రత్యేక దుస్తులను ధరించడం ఆనవాయితీగా మారింది.
ఎబోలాకు ఎంతగా భయపడుతున్నారంటే రోగులను అత్యంత దూరంగా పెడుతూ, ఎవరూ చొరకూడని ఒంటరి గదుల్లో వారిని నిర్బంధిస్తున్నారు. రోగులను చూసేందుకు వెళ్ళి వచ్చే వారి బంధువులను కూడా వారి శరీరాలపై క్రిమి దూరీకరణ మందులు జల్లిగాని బైటికి వదలడం లేదు. ఎబోలా వ్యాధి సోకితే వారికిక ఏకాంత కారాగార శిక్ష పడినట్లే. చివరికి ఎబోలాతో మరణించిన వారి దేహాలను ఖననం చేయడానికి సైతం వంటినిండా రక్షణ దుస్తులు ధరించి వెళ్తున్నారు. విచిత్రం ఏమిటంటే రోగులు లేదా విగత జీవులైన రోగులను సమీపించే వైద్య సిబ్బంది ఒంటినిండా ప్రత్యేక దుస్తులు, గ్లౌజులు, రబ్బరు బూట్లు, హెల్మెట్లు ధరిస్తుంటే వారి చుట్టూ గుమిగూడే జనానికి మాత్రం ఎటువంటి రక్షణలు ఇవ్వకపోవడం. ఈ సంగతిని కింది ఫొటోల్లో స్పష్టంగా గమనించవచ్చు.
ఎబోలా వైరస్ సోకిన 2 నుండి 21 రోజుల లోపల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాగా అలసినట్లు అవడం, జ్వరం రావడం, నరాలు కీళ్ళలో తీవ్ర నెప్పి కలగడం, తీవ్ర తలనొప్పి, గొంతు నెప్పి ఇవన్నీ ఎబోలా లక్షణాలు. క్రమంగా వాంతులు, విరోచనాలు, పొత్తికడుపు నొప్పి సోకుతాయి. ఊపిరి వ్యవధి తగ్గిపోవడం ఛాతీ నొప్పి అనంతర దశలో కనిపిస్తాయి. వంటినిండా బొబ్బలు, దద్దుర్లు వచ్చి రోగిలో అయోమయం కనిపిస్తుంది. క్రమంగా 5 నుండి 7 రోజుల్లో కొందరు రోగుల్లో శరీరం లోపలా, బైటా రక్తస్రావం అవుతుంది. ఇంజెక్షన్ రంధ్రాల నుండి కూడా రక్తస్రావం కనిపిస్తుంది. రక్తం వాంతులు, రక్తపు దగ్గు కనిపిస్తాయి. రోగి చనిపోతే గనుక 6 నుండి 16 రోజుల లోపల చనిపోవచ్చు. చికిత్సకు స్పందించి కోలుకోవడం జరిగితే మొదటి లక్షణం కనపడిన 7 నుండి 14 రోజుల లోపల ఆ రికవరీ మొదలవుతుంది. రక్త స్రావం మొదలైతే రోగి చావును సమీపించినట్లే.
ఎబోలా వ్యాధికి నేరుగా చికిత్స లేదు.లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తారు. లక్షణాల వైద్యం పని చేయవచ్చు, చేయకపోవచ్చు. మొత్తం 5 రకాల వైరస్ లు ఎబోలా వ్యాధికి కారకులు. వాటిలో ఒకటి మనుషులకు సోకదు. మనుషులకు సోకే నాలుగింటిలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది జైరే ఎబోలా వైరస్. ఇదే అత్యంత ప్రాణాంతక వైరస్.
ఎబోలా వ్యాధి చికిత్సలోనూ, రోగులను గుర్తించడంలోనూ, మరణించిన రోగులను ఖననం చేయడంలోనూ వైద్య సిబ్బంది ఎంత కట్టుదిట్టమైన చర్యలు పాటిస్తున్నారో కింది ఫోటోలు తెలియజేస్తాయి.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: ఎబోలా: వణికిపోతున్న ఆధునిక ప్రపంచం -ఫోటోలు | ugiridharaprasad