(స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ సాధనాలలో వినియోగించే నేవిగేషన్ సంకేతాల ప్రసారం కోసం ఇండియా సొంతగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అందిస్తున్న జి.పి.ఎస్ సేవల తరహాలో సొంత వ్యవస్ధను ఏర్పరుచుకునే క్రమంలో మూడవ ఉపగ్రహాన్ని ఇండియా గురువారం ప్రయోగించింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత ప్రజలకు స్వయంగా వివిధ ప్రయాణ నేవిగేషన్ సేవలను అందించే తాజా ఉపగ్రహ ప్రయోగంపై ది హిందూ అందించిన ఎడిటోరియల్.)
అత్యంత సులభంగా రాకెట్లను ప్రయోగించడం భారత దేశానికి చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి)కు ప్రమాణ చిహ్నంగా మారింది. ఈ ఉపగ్రహ ప్రయోగ వాహకం మూడవ ‘భారత ప్రాంతీయ ప్రయాణ అన్వేషక ఉపగ్రహ వ్యవస్ధ’ (Indian Regional Navigation Satellite System -IRNSS) రోదసీ నౌకను గురువారం తెల్లవారు ఝామున (భూ) కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారత రోదసీ పరిశోధనా సంస్ధ (ఇస్రో) అనేక యేళ్లపాటు శ్రమించి ఈ రాకెట్ సామర్ధ్యాలను క్రమంగా పెంచుతూ వచ్చింది. పి.ఎస్.ఎల్.విని, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి మొదట ఉద్దేశించారు.
ఈ వాహకాన్ని మరింత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే విధంగానూ, వాటిని గతంలో కంటే మరింత మెరుగైన ఖచ్చితత్వంతో ఉద్దేశించిన కక్ష్యలోకి చొప్పించే విధంగానూ అభివృద్ధి చేశారు. చంద్రయాన్-1 లాంటి చంద్రుని పరిశోధనా మిషన్ లనూ, MOM (మార్స్ ఆర్బిటర్ మిషన్) లాంటి మిషన్ లను సైతం దిగ్విజయంగా పూర్తి చేసేలా మెరుగులు దిద్దారు. వరుసగా 27 సార్లు విజయవంతంగా ప్రయోగాలను పూర్తిచేయడం అంటే అది ప్రతి ఒక్క ప్రయోగానికి తెరవెనుక సాగే క్షుణ్ణమైన ఏర్పాట్లకు, ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించి నిర్ధారించుకునే జాగరూక నైపుణ్యాలకు నివాళి అనడం సరైనది. నిజానికి తాజా ప్రయోగం చివరి పరిశీలనలో తలెత్తిన ఒక సాంకేతిక అవాంతరం వలన దాదాపు వారం రోజులపాటు వాయిదా పడింది.
IRNSS ఉపగ్రహ మండలం వల్ల భారత దేశం ఈ రోజుల్లో కీలక సేవగా అవతరించిన రోదసీయాన ఉపగ్రహ సంకేతాలకు నిశ్చయాత్మక ప్రవేశాన్ని అందజేస్తుంది. ఈ రంగంలో ప్రపంచ వ్యాపిత కవరేజి కలిగి ఉన్న అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జి.పి.ఎస్) ప్రస్తుతం నాయకుడుగా చెలామణిలో ఉంది. రష్యా కూడా తన ‘గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం (GLONASS) ద్వారా ఇదే తరహా సామర్ధ్యాలను సొంతంగా అభివృద్ధి చేసుకుంది. మిలటరీ ఆపరేషన్లతో పాటు అనేక రకాల పౌర రంగాలలో సైతం కీలకంగా మారిన ఈ సేవల కోసం పూర్తిగా ఆ దేశాలపైనే ఆధారపడవలసివస్తుందన్న ఆందోళనలో ఇతర దేశాలు ఉన్నాయి. (ఈ నేపధ్యంలో) ఐరోపా తన సొంత ఉపగ్రహ మండల వ్యవస్ధ అయిన ‘గెలీలియో నేవిగేషన్ ఉపగ్రహాలను’ ఇప్పటికే ప్రయోగించింది; అదే తరహాలో చైనా బీడౌ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం (BDNSS) ను అభివృద్ధి చేసుకుంటోంది. ఈ వ్యవస్ధ ఇప్పటికే ప్రాంతీయ సేవలను అందజేయడం ప్రారంభించింది. 2020 నాటికి ప్రపంచవ్యాపితంగా సేవలు అందించాలని చైనా తలపోస్తున్నది.
ఏడు ఉపగ్రహాలతో కూడిన IRNSS వ్యవస్ధ ఇండియాపైనా ఇండియా సరిహద్దుల నుండి 1500 కి.మీ వరకూ ఖచ్చితమైన నేవిగేషన్ సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఏడింటిలో మూడు ఉపగ్రహాలను ఇప్పటివరకూ ప్రయోగించారు. మిగిలిన నాలుగింటిని వచ్చే సంవత్సరం మధ్యకల్లా ప్రయోగించాలని ఇస్రో పధకం వేసుకుంది. మరో నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇండియా తన నేవిగేషన్ వ్యవస్ధ పరిధి కిందికి వచ్చే ఏరియాను విస్తృతం చేసుకునే అవకాశం పొందుతుంది. ఈ లోపు IRNSS పంపించే సంకేతాలను అందుకునేందుకు వినియోగించే రిసీవర్లను అభివృద్ధి చేసేందుకు అహ్మదాబాద్ లోని ఇస్రో స్పేష్ అప్లికేషన్స్ సెంటర్ పూనుకుంటోంది. ఈ రిసీవర్లపై మొదటి ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. (ఎలక్ట్రానిక్) సాధనాల కోసం నేవిగేషన్ సంకేతాలను వినియోగించగల చిప్ సెట్ లను అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఓ పేరుపొందిన కన్సల్టెన్సీ కంపెనీ వేసిన అంచనా ప్రకారం ఉపఖండంలో ఈ సేవల వినియోగానికి భారీ మార్కెట్ అందుబాటులో ఉంది. ఈ అంచనాను వాస్తవంలోకి మలుచుకోవడం మరో సవాలు కానుంది. ఇందులో ఇస్రో తప్పనిసరిగా నాయకత్వ పాత్ర పోషించవలసి ఉంటుంది.
ఇది భారత్ అనేకాదు చాలా కంపెనీల విషయంలోనూ జరుగుతుంది. ఇతరులకు software services అందించడంలో పేరుమోసిన కంపెనీలు, తమ అవసరాల దగ్గరకు వచ్చేసరికి ఇంకొకరి productsని వాడుతాయి. స్వయం సంవృధ్ధి అన్నివేళలా అభిలషణీయం కాకపోయినా, అన్ని విషయాల్లోనూ దానిని కాదనడం తప్పు.
స్నోడెన్ ఉదంతం నేపధ్యంలో భారత్ ఇప్పటికైనా మేలుకొని కొన్నింటివిషయంలోనైనా ఇతరులపై ఆధాపడకూదదని నిర్ణయించుకోవడం ముదావహం. ఇది ఇలాంటి మరెన్నో మార్పులకి శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాను.
P.S.: కొంపదీసి ఇది విడీసే కంపెనీలనుంది private information అప్పగింతలో ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యాలకై ఉద్దేశ్యించిన నివారణోపాయం కాదుకదా?