నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది.
ఎన్.డి.ఏ మొదటిసారి అధికారంలోకి రాకముందు కూడా బి.జె.పి పెద్దలు అవినీతి కాంగ్రెస్ పైన ఆగ్రహ జ్వాలలు విరజిమ్మారు. తీరా 1999లో అధికారంలోకి వచ్చాక వాళ్ళే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. వారి తర్వాత వచ్చిన కాంగ్రెస్/యు.పి.ఏ ప్రభుత్వం అవినీతితో పుచ్చిపోయిందని, దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని మోడి కాలికి బలపం కట్టుకుని మరీ జనానికి చెప్పారు.
1999లో బి.జె.పి “మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి” అని బతిమాలుకుంటే మొన్న మోడి గారు “నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, స్వర్గం దింపుతాను” అంటూ సుడిగాలి మాదిరి దేశాన్ని చుట్టేశారు. మళ్ళీ ఆయన (ప్రభుత్వం) కూడా పాత ఎన్.డి.ఏ, యు.పి.ఏ ప్రభుత్వాలు చెప్పిన సూత్రాలే వల్లిస్తోంది. కాంగ్రెస్ నుండి ఎన్.డి.ఏ-1 కి ఒక చుట్టు తిరిగొచ్చిన నల్లడబ్బు కధ మళ్ళీ యు.పి.ఏ-1&2 ల నుండి ఎన్.డి.ఏ-2 కి ఇంకో చుట్టు తిరిగొచ్చింది.
నల్ల డబ్బు పైన పిట్ట కతలు చెప్పడం మన పాలకులకి ఎంత వల్లమాలిన ఇష్టమో కదా!
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విదేశాల్లోని నల్లడబ్బు వెనక్కి తెచ్చేందుకు ఒక కమిటీ వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడి అట్టహాసంగా ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టులోనే నాలిక మడతేసి వాదన మొదలు పెట్టింది.
విదేశీ ప్రభుత్వాలతో మనకి ఏవో ఒప్పందాలు ఉన్నాయిట. ఆ ఒప్పందాల వల్ల మన నల్లడబ్బు వీరుల వివరాలన్నీ బైటికి వెల్లడి చేయడం సాధ్యం కాదట. వాళ్ళ వివరాలు వెల్లడి చేస్తే ఇతర దేశాలు ఇక మనతో ఒప్పందానికి సిద్ధం కావట. దానివల్ల దేశానికి నష్టకరం అట. ఎంత నష్టం అంటే కోటి కోట్ల నల్లడబ్బు కంటే ఎక్కువేనేమో అని మనకి మనం సర్ది చెప్పుకోవడమే ఇక!
యు.పి.ఏ పాలన సాగినన్నాళ్లూ అవినీతిపై వీర ధీర పోరాటం చేసిన సుబ్రమణ్య స్వామి గారు ఇప్పుడు బి.జె.పి నాయకులు. జయలలిత అవినీతి పైన పోరాటం చేసి ఆమెను జైలుకు పంపిన ఘనత కూడా ఆయన కీర్తి కిరీటంలో ఇటీవలనే ఒక కలికితురాయిగా చేరింది. మోడి ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేస్తున్న డొంక తిరుగుడు వాదనపైన ఆయనగారు ఏమంటారో చూడాలిక! అనేదేముంది, స్వామికి కూడా ఇప్పుడు అవినీతికి బదులు దేశ ప్రతిష్ట, అంతర్జాతీయ ఒప్పందాలను పాటించవలసిన ఆవశ్యకత, గాడిద గుడ్డూ, మన్నూ, మశానం… ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి చూడండి!
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక విన్నపం లాంటి దరఖాస్తు దాఖలు చేసుకుంది. దీని ప్రకారం ఇండియాకి ఇతర దేశాలతో DTA ఒప్పందాలను చేసుకుంది. డబుల్ టాక్స్ ఎవాయిడెన్స్ అగ్రిమెంట్ గా చెప్పే ఈ ఒప్పందం ప్రకారం విదేశీ బ్యాంకుల్లోని నల్ల డబ్బు ఖాతాల వివరాలను మన దేశానికి ఇస్తారు; కానీ వాటిని బహిరంగం చేయకూడదని షరతు పెడతారట! అలాంటి సమాచారాన్ని వెల్లడి చేయడం పట్ల విదేశాలు అభ్యంతరం చెబుతున్నాయట. అందుకని నల్లడబ్బు వివరాలన్నీ బహిరంగం చేయడం కుదరదని మోడి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పేసింది.
ఇది కదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది! నల్ల ఖాతాల వివరాలు వెల్లడికి నిరాకరించిన యు.పి.ఏ ప్రభుత్వం అందుకు చెప్పిన కారణం ఇదే కాదా? తాము చెప్పిందీ ఇదేనని కాంగ్రెస్ నాయకులు అప్పుడే చెబుతున్నారు కూడా. అంతేకాదు. దమ్ముంటే, నిజంగా మీరు అవినీతి వ్యతిరేకులే అయితే వెంటనే మోడి ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని హజారే, కిరణ్ బేడీ, బాబా రాందేవ్ లకు సవాలు విసిరారు కూడా. మోడి అయితే దేశానికి క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు.
“ఏ కొంచెం రాజకీయ నిజాయితీ ఆయనకి ఉన్నట్లయితే ప్రధాని వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలి. నల్లడబ్బు వెనక్కి తేవడంలో ఆసక్తి లేదని యు.పి.ఏ ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పించిన పార్టీ నాయకులే ఈ రోజు ఉన్నత న్యాయ స్ధానం ముందు నల్లడబ్బు వివరాలు వెల్లడించలేమని చెబుతున్నారు. రామ్ దేవ్, బేడీ, హజారేలు వెంటనే ప్రధాని నివాసం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలి. అలా చేయకపోతే ఒక ప్రభుత్వ క్రియారాహిత్యానికీ, మరో ప్రభుత్వ క్రియా రాహిత్యానికి మధ్య తేడా ఎందుకు చూస్తున్నారో వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదో రకం హిపోక్రసీ. ఇదో రకం ద్వంద్వ ప్రమాణం” అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి బి.జె.పిని, అవినీతి వ్యతిరేక ఛాంపియన్లను గేలి చేశారు.
ఏప్రిల్ 3 తేదీన హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మోడి చెప్పిన మాటలు చూడండి:
“నల్లడబ్బు (వెనక్కి తేవడానికి) నిరాకరించేది ఎవరంటే, అది కాంగ్రెస్ పార్టీయే… ఎవరైతే దేశాన్ని నిలువు దోపిడి చేసి నాశనం చేశారో వారే ఈ ఆటలు ఆడుతున్నారు.”
“నేను హామీ ఇస్తున్నాను. కొత్త చట్టం అవసరం ఐతే అది చేస్తాం. ఇతర దేశాలతో కొత్త ఒప్పందం అవసరమైతే అదీ చేసుకుంటాం. ఆ నల్లడబ్బును మాత్రం ఖచ్చితంగా ఇండియాకు తెచ్చి తీరుతామని హామీ ఇస్తున్నాను.”
“ఢిల్లీలో (కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చాక దేశాన్ని దోచుకుతిన్న వారి గతి ఏమవుతుంది… వారు ఎంత పెద్దవారైనా సరే, వారు ఈ దేశానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.”
నల్లడబ్బు వెనక్కి తేవడానికి అవసరం అయితే కొత్త చట్టం తెస్తామని, విదేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటామని హామీ ఇచ్చిన మోడీ ఈ రోజు కొత్త ఒప్పందం సంగతి పక్కన బెట్టి కాంగ్రెస్ చేసిన పాత ఒప్పందాన్నే అడ్డం పెట్టుకుని నల్లడబ్బు వీరుల వివరాలను వెల్లడి చేయలేమని సుప్రీం కోర్టుకు చెబుతోంది. నల్లడబ్బు విషయంలో కాంగ్రెస్ చెప్పిన మాటల్ని ఆటలుగా కొట్టిపారేసిన మోడి అధికారంలోకి వచ్చాక అవే ఆటలు జనంతో ఆడుతున్నారు. ఇది మోసం అనాలా, నయ వంచన అనాలా? లేక మోడి మాటల్నే అరువు తెచ్చుకుని ‘నిలువు దోపిడీ’ అనాలా?
బి.జె.పి పార్టీ నల్లడబ్బు విషయంలో ప్రతిపక్షంలో ఉండగా ఏ డిమాండ్ చేసిందో అధికారంలోకి వచ్చాక ఏమి చెబుతున్నదో వివరించే స్క్రీన్ షాట్లను కింద చూడొచ్చు.
జెనీవా (స్విట్జర్లాండ్ రాజధాని) లోని ఒక బ్యాంకులో భారత దేశ సంపదని దాచిన 700 మంది పేర్లను యు.పి.ఏ ప్రభుత్వం వెల్లడి చేయాలని బి.జె.పి 2011లో డిమాండ్ చేసింది. అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అలా చేయడానికి DPA అగ్రిమెంట్ ఆటంకంగా ఉందని చెప్పారు. ఆ ఒప్పందాన్ని చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. నల్ల డబ్బు వెనక్కి తెచ్చే ఉద్దేశ్యమే ఉంటే కొత్త చట్టం చేయడం పెద్ద పనేమీ కాదు. మోడి కూడా అదే చెప్పారు, అవసరం అయితే కొత్త చట్టం తెస్తామని.
కొత్త చట్టం తెస్తామని, కొత్త ఒప్పందాలు చేసుకుంటామని హామీ ఇచ్చిన మోడి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంది కూడా. కాబట్టి వారు తలపెడితే చట్టం తేవడం పెద్ద పని కాదు. మోడి ఎందుకు ఆ పని చేయరు? దానికి బదులు కాంగ్రెస్ చేసిన చట్టాన్నే సాకుగా ఎందుకు చూపుతున్నారు? అవినీతి, నల్లడబ్బుల గురించి ఆయన దంచిన ఉపన్యాసాలు, చెప్పిన కబుర్లూ అన్నీ ఎన్నికల కోసమేనా? ఇది మోసం కాదా? దేశ ప్రజలను దగా చేయడం కాదా? మోడీ భక్తాగ్రేసరులకు ఈ సంగతి అర్ధం అవుతుందా?
గొర్రెలకూ తెలివి ఉంది. ముందుపోయే గొర్రెను అనుసరించడం. అదే మాస్ సైకాలజీ.నల్లడబ్బుకు రక్షకులు నల్లడబ్బును బయటకు తెస్తామంటే గొర్రెలు తలలూపుతాయి.
సుబ్రమణ్యస్వామి గారు ప్రాశ్చాత్య దేశాలు రాసిన చరిత్రను తగలబెట్టి కొత్త చరిత్రను రాయాలన్నట్లుగానే నల్ల డబ్బంతా వదిలేసి మనం తెల్ల నోట్లు ముద్రించుకుందామంటారు!
shame less MODI. people again became fools. sir your prediction is true. all the politicians sail in the same boat. may be the boat colour, name changes. but their direction is same.
అవినీతి నిర్మూలన తమ లక్ష్యమని పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నడూ చెప్పుకోదు. కానీ నరేంద్ర మోదీ అభిమానులు అనవసరంగా నాటకాలు ఆడారు.
బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉన్న కంపెనీల గనుల లీజ్‌ని సుప్రీమ్ కోర్త్ రద్దు చేసిందని stock marketలో ఇనుము, ఉక్కు, అల్యుమినియం కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. ఉక్కు కర్మాగారాల్లో బొగ్గు మండిస్తారని అందరికీ తెలుసు. బొగ్గు అవినీతి లేకపోతే ఉక్కు కంపెనీలకి నష్టమని ఇన్వెస్తర్లు ఉక్కు కంపెనీలలో షేర్లు ఉపసంహరించుకున్నారు. అవినీతికీ, పెట్టుబడిదారీ విధానానికీ సంబంధం ఉందని తెలిసి కూడా నరేంద్ర మోదీ అభిమానులు నాటకాలు ఆడుతున్నారు.
అన్నా హజారే పొరపాటున కూడా మోదీ ఇంటి ముందు నిరాహార దీక్ష చెయ్యడు. ఇంతకు ముందు అన్నా హహారే నిరాహార దీక్ష శిబిరానికి జనాన్ని తరలించింది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలే. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసినప్పుడు అతని సహచరులే అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అన్నా హజారే, రాం దేవ్ లాంటివాళ్ళు నిరాహార దీక్ష చేసినప్పుడు మాత్రం దేశంలోని ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు.
ఇదీ మోది భారతం….Must Read Article by Katta Shekar Reddy sir..నరేంద్ర మోదీ ప్రభుత్వం గత వారం రోజుల వ్యవధిలో పలు మౌలికమైన అంశాలపై తన వైఖరిని బట్టబయలు చేసింది. నల్లధనం సంపాదించి విదేశాల్లో దాచుకున్న కుబేరుల పేర్లు వెల్లడించలేమని కేంద్ర హోంశాఖ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జాబితా బయటపెట్టడానికి ద్వంద్వపన్నుల నివారణ ఒప్పందాలు(డీటీఎఎ) అడ్డం వస్తున్నాయని జైట్లీ చెబుతున్నారు. ఈ కారణం పాతదే. ఇంతకుముందు యూపీఏ కూడా ఇదే కారణం చెప్పింది. ఈ విషయం ఎన్నికలకు ముందు కూడా బీజేపీ నాయకత్వానికి తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో జాబితా బయటపెడతామని, విదేశాల్లో మగ్గుతున్న ధనాన్ని జాతికి అంకితం చేస్తామని సెలవిచ్చారు. మోదీ మొండి వారని, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని అందరూ ఆశించారు. ఇంత తొందరగా ఆ భ్రమలు తొలగిస్తారని ఎవరూ అనుకోలేదు. శ్రమేవ జయతే పథకం ప్రారంభించిన రోజు కార్మికులకు ఏదో చేస్తున్నారని అందరూ భావించారు. ఆయన చేసిన ప్రసంగం విన్న తర్వాత అసలు విషయం బోధపడింది. ఇది యాజమాన్యాలను కార్మిక చట్టాల నుంచి విముక్తి చేసే పథకం అని ఆయన స్పష్టంగానే చెప్పారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించి యాజమాన్యాలు ఇప్పటిదాకా మోస్తున్న బాధ్యతలనుంచి మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. పరిశ్రమల అధికారులు, కార్మిక శాఖ అధికారులు ఇక నుంచి పరిశ్రమలు సందర్శించాల్సిన పనిలేదట. తనిఖీ చేయాల్సిన పనిలేదట. యాజమాన్యాలు స్వయం ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే చాలని చెబుతున్నారు. కార్మికలోకం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను, భద్రతలను అన్నింటినీ తొలగించే పనిని మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని అర్థమవుతున్నది. ఇది శ్రమేవ జయతే కాదు, శ్రమదోపిడీ జయతేగా చెబితే బాగుండేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం మరో విధాన నిర్ణయమూ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు త్వరలో షెడ్యూలు ప్రకటిస్తామని, మరో 42,000 కోట్లు సేకరిస్తామని జైట్లీ చెప్పారు. ఇప్పటిదాకా వదిలేసిన మరికొన్ని సంస్థలను కూడా ఉపసంహరణ విధానంలోకి తీసుకువస్తామని కూడా జైట్లీ చెప్పారు. ఇంకా దారుణమైన అంశం మరొకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్య సేకరణ సందర్భంగా రైతులకు మద్దతు ధరపై ఎటువంటి బోనస్‌లు ప్రకటించరాదని కూడా కేంద్రం రాష్ర్టాలకు తాఖీదు పంపింది. ఈ పరిణామాలన్నీ ఒక సందేశాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అదేమంటే కేంద్రంలో పార్టీలు మారాయి. ఫ్రంటులు మారాయి. ప్రధాని మారారు. మంత్రులు మారారు. కానీ విధానాలు మారలేదు. ప్రభుత్వం స్వభావం మారలేదు. రూపం మారింది, సారం ఒక్కటే.యూపీఏ గత దశాబ్దకాలంలో అమలు చేసిన విధానాలను మోదీ కొనసాగిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు మలి దశను మరింత వేగవంతం చేసేందుకు ఆయన ద్వారాలు బార్లా తెరుస్తున్నారు. అందుకు అందమైన నినాదాలు ఇస్తున్నారు. ఆకర్శణీయమైన పేర్లు పెడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం అంటే పరిశ్రమలకు స్వేచ్ఛనివ్వడం, కార్మికులను గాలికి వదిలేయడం కాకూడదు. దేశంలో ఇప్పటికే కార్మికుల పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది. సంఘటిత రంగం బలహీనపడి, అసంఘటిత రంగం పెరుగుతున్నది. కార్మికులకు భద్రత లేదు. పనిగంటలపై అదుపు లేదు. పరిశ్రమలను తనిఖీ చేసే అధికారం ఉన్నా, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖలు ఎప్పుడూ వాటి ఛాయల్లోకి వెళిన్ల దాఖలాలు ఉండవు. కొన్ని పరిశ్రమలు కోటగోడల్లాంటి దుర్భేద్యమైన ప్రాకారాల్లో ఉంటాయి. అక్కడికి వెళ్లడం, తిరిగి రావడం అంతతేలికగా అయ్యేపనికాదు. కోట్లాది మంది కార్మికులు ఇప్పటికీ భవిష్యనిధి, ఉద్యోగ బీమాలకు దూరంగానే ఉన్నారు. చాలా పేరు పొందిన కంపెనీలు కూడా కార్మికులకు భవిష్యనిధి, ఉద్యోగ బీమాలు చెల్లించడం లేదు. ప్రత్యేక ఎగుమతి జోన్ల(ఎస్‌ఈజడ్)లోనయితే ప్రభుత్వమే లేదు. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఎస్‌ఈజడ్‌గా మార్చే కుట్రకు మోదీ తెరలేపారు. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే పరిశ్రమలకు స్వేచ్ఛ ఉండాలట. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. దేశం సుసంపన్నంగా ఎదగడమంటే మనుషులతో ఎదగాలి. కేవలం పరిశ్రమలతో, ఉత్పత్తులతో కాదు. అందులో పనిచేసే కార్మికులు కూడా సుసంపన్నంగా ఎదిగితేనే అభివృద్ధికి సార్థకత. సరైన జీతాలు లేక, ఉద్యోగ భద్రత లేక, కునారిల్లే కార్మికలోకం ఉంటే దేశంలో శాంతి ఉంటుందా? దేశం సుభిక్షంగా ఉంటుందా?నల్లధనం విషయంలో మోదీ ప్రభుత్వం పాత పాట పాడడంలో వింతేమీ లేదు. నల్ల కుబేరులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలలో ఉన్నారు. నల్ల కుబేరుల జాబితాలో ఈ ప్రభుత్వాలను వెనుక ఉండి నడిపించే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారని చెబుతారు. కాంగ్రెస్ అందుకే సాహసం చేయలేదు. డీటీఏఏ ఒప్పందం అన్నది సాకు మాత్రమే. జర్మనీతో డీటీఏఏ ఉంటే స్విస్ ఖాతాలకు ఏమి అడ్డమో అర్థం కాదు. యూపీఏ ఇదే కారణం చెప్పి తప్పించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీయే కూడా ఇదే కారణం చెబుతున్నది. కాంగ్రెస్ పాప పంకిలమైపోయిందని, తాము దేశాన్ని ప్రక్షాళన చేస్తామని గంభీర ప్రకటనలు చేసిన ఎన్డీయే ఓడదాటి తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా ఇచ్చినమాటను చెత్తబుట్టలో పడేసింది. ఓట్లకోసం చెప్పేవన్నీ నిజాలు కావని మరోసారి రుజువు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల విధానమే. ఎన్డీయే దానిని ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేయాలనుకోవడమే కొత్త. ఇది ఆర్థిక సంస్కరణలకు కొనసాగింపు మాత్రమే. ఎన్డీయేకు ప్రత్యేకించి దేశీయ ఎజెండా ఏదీ లేదని ప్రపంచ బ్యాంకు నిర్దేశాల ప్రకారమే ఎన్డీయే కూడా నడుచుకుంటుందని 1999-2004లో రుజవయింది. ఇప్పుడు మోదీ కూడా అదే రుజువు చేస్తున్నారు. ఆయన మరో అడుగు ముందుకు వేస్తున్నారు. వ్యవసాయ సబ్సిడీలపై కత్తెర వేసేందుకు ఆయన పూనుకుంటున్నారు. ధాన్యానికి కేంద్రం ప్రకటించే మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత బోనస్ ప్రకటించి కొనుగోలు చేయడం ఇప్పటిదాకా అమలవుతున్న విధానం. ధాన్యం ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయాన్ని ఎంతోకొంత లాభసాటిగా మార్చడానికి ఉద్దేశించి ఈ బోనస్ ప్రకటిస్తున్నారు. ఇక నుంచి ఈ బోనస్‌లు ప్రకటించవద్దంటూ కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి రాష్ర్టాలకు లేఖ వచ్చింది.ఈ లేఖ బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కే నచ్చలేదు. ఇలా అయితే వ్యవసాయోత్పత్తి పడిపోతుందని, రైతులు నిరుత్సాహపడతారని, ఆహారభద్రతకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయని ఆయన తిరుగుటపాలో లేఖ రాశారు. కానీ ఇది మోదీ సొంత ఆలోచన కాదు. ప్రపంచబ్యాంకు, అమెరికా భారత్‌కు అదేపనిగా నిర్దేశిస్తున్న ప్రిస్క్రిప్షన్. భారత్‌లో వ్యవసాయానికి సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై కోతపెట్టాలని వారు చాలాకాలంగా రొదపెడుతున్నారు. ఆ సబ్సిడీల ఉపసంహరణలో భాగంగానే ఇప్పటికే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పారిశ్రామిక రుణాల వడ్డీ కంటే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రుణాల వడ్డీయే అధికంగా ఉంటున్నది. పెట్టుబడులు పెరిగి, తగినంత దిగుబడి రాక, కాలం కలసిరాక రైతులు వీధినపడుతున్నారు. వ్యవసాయ రంగానికి ఇప్పుడున్న సబ్సిడీలను ఉపసంహరిస్తే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయి. అభివృద్ధికి మోదీ చూపెడుతున్న ప్రమాణాలేవీ ప్రజలను కలుపుకునేవిగా లేవు. ప్రజలు ఏమైనా కానీ ఉత్పత్తి పెరగాలి, లాభాలు రావాలి, ఆర్థిక సూచీలు ఊర్ధముఖ ప్రయాణం సాగించాలి అన్ని ధోరణి మోదీ మోడల్‌గా కనిపిస్తున్నది. ఈ తరహా అభివృద్ధి మనజాలదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవు. సమాజంలో పైవర్గాలు పైపైకి ఎదుగుతాయి. పేదలు ఇంకా ఇంకా కిందికి జారిపోతారు. మధ్యతరగతి, కార్మిక ప్రజానీకం మరింత కునారిల్లే ప్రమాదం ఉంది.
నరేంద్ర మోదీ అభిమానులకి వర్గ స్వభావం తెలియదో, లేదా తెలియనట్టు నటిస్తున్నారో? పెట్టుబడిదారీ సమాజంలో స్వార్థమే సహజ స్వభావంగా ఉంటుంది. పెట్టుబడిదారుడు కేవలం అవినీతి లేకుండా (అనగా చట్టం అనుమతించిన పద్దతుల్లో) సంపాదించాలనుకుంటాడా? స్వార్థానికి అలాంటి పరిమితులు ఉంటాయా? స్వార్థమే శ్రేష్ఠమైన మానవ స్వభావం అని నమ్మే పెట్టుబడిదారులే దీనికి సమాధానం చెప్పాలి.
బాగా చెప్పారు సార్ మీరు
భాజపా అవినీతి వ్యతిరేక పార్తీ కాదని నాకు ఎప్పటి నుంచో తెలుసు. “అవినీతిపరులు మనం పన్నులుగా కట్టిన డబ్బుల్నే భోంచేస్తారు” అనేది భాజపా అభిమానులు పత్రికల్లో ఇచ్చే స్తేత్‌మెంత్ మాత్రమే. నిజజీవితంలో భాజపా అభిమానులు అలా అనుకోరు. భాజపా అధికారంలో లేని రోజుల్లోనే రైలులో నాకు పరిచయమైన ఒక భాజపా అభిమాని పది, ఇరవై రూపాయలు ఎక్కువ అడిగే రిక్షావాళ్ళ మీద ఏడుస్తూ మాట్లాడాడు. “రిక్షావాళ్ళు పది, ఇరవై మాత్రమే ఎక్కువ అడుగుతారు. వాళ్ళ కంటే కోట్లు భోంచేసే రాజకీయ నాయకులు ప్రమాదకారులు కాదా?” అని నేను ఆయన్ని అడిగాను. “రాజకీయ నాయకులు నీ జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తియ్యరు కదా” అని ఆయన అన్నాడు. “రాజకీయ నాయకులు భోంచేసేవి ప్రజలు పన్నులుగా కట్టే డబ్బులు కాదా?” అని నేను ఆయన్ని అడిగితే, “ఆ లెక్కలన్నీ ఎవరు చూస్తారు?” అని ఆయన నన్ను అడిగాడు.
మనిషి సంఘ జీవి కనుక మనం సమాజం గురించి ఆలోచించాలి. సమాజంపై మనకి బాధ్యత ఉంది కనుక మనం అవినీతి లాంటి అసామాజిక పనుల్ని వ్యతిరేకించాలి. అంతే కానీ కేవలం మనం కట్టే పన్నుల డబ్బుల కోసం అవినీతిని వ్యతిరేకించాలని చెపితే ఎక్కువ మంది కదలరు. అందరూ పన్నులు కడుతున్నారు కాబట్టి తాము కూడా పన్నులు కడుతున్నామనుకుంటారు కానీ పన్నుల డబ్బు దుర్వినియోగ లెక్క చూసేవాళ్ళు తక్కువగానే ఉంటారు.
ఇకనైనా అన్నా హజారే అభిమానులు, భాజపా అనుకూలురు “అవినీతిపరులు మనం కట్టే పన్నుల డబ్బు భోంచేస్తారు” అనే పాచిపళ్ళ పాట పాడడం మానేస్తే మంచిది. ఆర్థిక అసమానతలు ఉన్న సమాజంలో ప్రజలకి కావలసినది వర్గ చైతన్యమే కానీ పన్ను వసూళ్ళ లెక్కలు కాదు.
అవినీతి కంటే పెద్ద సమస్యలు దేశంలో చాలా ఉన్నాయి. ఫించన్‌ల పథకంలో అవినీతి జరుగుతోందని అందరికీ తెలుసు. భర్త ఉన్న స్త్రీలు కూడా భర్త చనిపోయాడని చెప్పి ఫించన్‌లు తీసుకుంటున్నారు. సర్పంచ్ భర్త ఉన్న స్త్రీ దగ్గర 1500 లంచం తీసుకుని ఆమె భర్త చనిపోయాడని అధికారులకి ఉత్తరం వ్రాస్తాడు. అధికారులు దాని ఆధారంగా సర్తిఫికేత్ వ్రాసి ఆమెకి ఫించన్ ఇస్తారు. మనుషుల్ని పుట్టుక పేరుతో వెలివేసే కుల వ్యవస్థ, అంటరానితనం లాంటి సమస్యలతో పోలిస్తే అబద్దాలు చెప్పి నెలకి వెయ్యి రూపాయలు ఫించన్ తీసుకోవడం చాలా చిన్న సమస్య.
అవినీతి అంతరించినంతమాత్రాన కార్మికుల జీతాలు పెరగవు, పని గంటలు తగ్గవు. అయినా పెట్టుబడిదారుడు అవిన్నీతి లేకుండా (అనగా చట్టం అనునతించిన పద్దతుల్లో) మాత్రమే డబ్బు సంపాదించాలనుకుంటాడనే భ్రమలు అనవసరం. మనిషి జీవితాన్ని భౌతిక పరిస్థితులు నిర్దేశిస్తాయి కానీ కాగితాల మీద వ్రాసిన చట్టాలు కాదు.
వాస్తవంగా పెట్టుబడిదారులు భయపడేది “అవినీతి నిర్మూలన”కే కానీ “అవినీతి కొనసాగింపు”కి కాదు. కేవలం ముగ్గురు నల్ల ధన కుబేరుల పేర్లు బయటపడ్డాయని ఈ రోజు స్తాక్ మార్కెత్‌లు పడిపోయాయి.