హుద్ హుద్ పెను తుఫాను వల్ల మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడం సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నష్టం 60 వేల కోట్లా లేక 70 వేల కోట్లా అన్నది తేల్చలేమని, అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే వ్యవహారం కాదని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిశీలకులు, విశ్లేషకులు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.
“నష్టం 60,000 కోట్లా లేక 70,000 కోట్లా అన్నది చెప్పడం చాలా కష్టం. సీనియర్ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. వారి అంచనా ప్రక్రియ పూర్తయితే గాని ఏ స్ధాయిలో నష్టం వాటిల్లిందో ఒక కనీస అంచనాకు రాలేము. నష్టం అంత తీవ్రంగా ఉంది” అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
మానవ ప్రయత్నాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేయడం ద్వారా త్వరితగతిన ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తున్నామని కానీ అది అంత తేలికగా కనిపించడం లేదని ముఖ్యమంత్రి వివరించారు.
చివరి బాధితుడికి ఉపశమనం కలిగేవరకు తాను విశాఖపట్నంలోనే ఉంటానని ముఖ్యమంత్రి ప్రతిన బూనారు. అయితే ఆయన తరచుగా చేస్తున్న పర్యటనలు బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నాయా లేక బాధితులకు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నాయా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
ఈ నేపధ్యంలో ఆయన తన వెంట ఏ అధికారి ఉండకూడదని హెచ్చరించారు. సహాయ కార్యక్రమాలు వదిలిపెట్టి తన వెంట తిరిగే అధికారులను అరెస్టు చేయిస్తానని కూడా ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. హుద్ హుద్ తుఫాను తీరం దాటిన తర్వాత తాను విశాఖ నగరంలో ప్రవేశించడానికి చాలా కష్టపడవలసి వచ్చిందని సి.ఎం తెలిపారు.
సి.ఎం ప్రకారం ఒక నగరం ఇంత భారీ స్ధాయిలో తుఫాను వల్ల దెబ్బతినడం ఇదే మొదటిసారి. సాధారణంగా తుఫానులకు దెబ్బతినేది, నష్టపోయేది ప్రధానంగా పేదవారే. వారి పూరి గుడిసెలు, తాత్మాలికంగా అడ్డం పెట్టుకునే రేకుల షెడ్లు తుఫానులకు తేలికపాటి లక్ష్యంగా అందుబాటులో ఉంటాయి. ఈసారి మాత్రం కాంక్రీటు నిర్మాణాలను సైతం హుద్ హుద్ వదలిపెట్టలేదని విశాఖ విమానాశ్రయంను చూస్తే అర్ధం అవుతుంది.
ఇప్పటివరకూ పట్టణాల్లో 20 శాతం విద్యుత్ ను పునరుద్ధరించామని, గ్రామాల్లో 10 శాతం విద్యుత్ పునరుద్ధరించామని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన విద్యుత్ సిబ్బంది సైతం విద్యుత్ పునరుద్ధరణలో నిమగ్నమై ఉన్నారు. భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి కనీసం 3 నెలలు పడుతుందని కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. అయితే ఈ లోపు తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా శుక్రవారం నుండి విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. 200 కి.మీ వేగంతో వీచిన గాలులు విమానాశ్రయంలోని పలు నిర్మాణాల పైకప్పులను కూల్చివేశాయి.
నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారుస్తామని సి.ఎం చంద్రబాబు ఊరిస్తూ వచ్చారు. అందులో భాగంగా ‘స్టార్టప్ విలేజ్’ పేరుతో ఆయన ఐ.టి కంపెనీల కోసం ఒక వ్యవస్ధకు ప్రారంభోత్సవం జరిపారు కూడా. కానీ స్టార్టప్ విలేజి కోసం కేటాయించిన భవనం హుద్ హుద్ దెబ్బకు రూపు రేఖలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఐ.టి హబ్ గా చేస్తామని ప్రకటించడంతో విశాఖ నగరానికి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల రాకపోకలు ఇటీవల పెరిగాయి. దానితో విమానాశ్రయానికి మరిన్ని కొత్త హంగులను చేర్చడంలో విమానాశ్రయ అధికారులు నిమగ్నం అయ్యారు. హుద్ హుద్ తో వారి ఉత్సాహంపై తుఫాను నీళ్ళు జల్లినట్లయింది. పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు అసౌకర్యాలతో కాస్త ఓపిక పట్టాలని వారు ఇప్పుడు ప్రయాణీకులను వేడుకుంటున్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం ఎయిర్ పోర్టుకు రు. 500 కోట్లు నాశం వాటిల్లిందని అధికారులు చెప్పారు.
గురువారం టెలిఫోన్ కంపెనీలతో సమీక్ష సమావేశం జరిపిన ముఖ్యమంత్రి, సమావేశానికి పలు కంపెనీలు హాజరు కాకపోవడంపై మండిపడ్డారు. జనానికి అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండడం కంటే డీజిల్ ఖర్చులు పొదుపు చేసుకోవడంలోనే కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ఆయన ఎత్తిపొడిచారు. ప్రధాని నరేంద్ర మోడి పర్యటన విషయమై తాను తన అధికారులతో కూడా మాట్లాడలేకపోయాయని, టెలికాం కంపెనీల తీరు వల్ల తన పని సామర్ధ్యం 50 శాతం తగ్గిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశానికి ఎయిర్ టెల్ కంపెనీ అధినేత సునీల్ మిట్టల్ హాజరయ్యారు. ఆయన తమవైపు నుండి లోపాలున్నాయని అంగీకరిస్తూనే నెపాన్ని రాష్ట్ర విభాగాలపై నేట్టేందుకు ప్రయత్నించారు. విద్యు లేదని, డీజెల్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదని, రోడ్లపై చెట్లు తొలగించకపోవడంతో వెళ్లవలసిన చోటుకు వెళ్లలేకపోయామని ఆయన చెప్పారు.
సునీల్ మిట్టల్ కారణాలను చంద్రబాబు తోసిపుచ్చారు. డీజెల్ ట్యాంకర్లను కేవలం టెలికాం కంపెనీల కోసమే తమ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టిందని, కానీ డీజెల్ కోసం డబ్బు వెచ్చించడానికి కంపెనీలే ముందుకు రాలేదని తన వద్ద అధికారుల నివేదికలు ఉన్నాయని స్పష్టం చేశారు. టెలికాం ఆపరేటర్లు అవసరం అయినప్పుడు అందుబాటులో ఉండాలని చెబుతూ సమావేశానికి రాని ఆపరేటర్ల కోసం పోలీసులను పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుఫాను పీడిత ప్రాంతాల్లో ఉచిత రోమింగ్ సౌకర్యం కల్పించాలని ఆయన కంపెనీలను కోరారు.
వ్యాపార కంపెనీలు ఎట్టి పరిస్ధుతుల్లోనూ తమ లాభాలను మాత్రమే చూసుకుంటాయని, వారికి ప్రజల బాగోగులు, వారి సౌకర్యాలు, సమస్యలు, సంక్షేమం ఏ మాత్రం పట్టవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి తెలియదనుకోవాలా?!