వాహన తోలకం (డ్రైవింగ్) నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? తోలకం నేర్చుకుంటున్న వాహనానికి L-బోర్డు తగిలిస్తాం. రోడ్డు రవాణా విభాగం వాళ్ళు ఈ మేరకు నిబంధన విధిస్తారు. తోలకం నేర్చునేవారు తమ దరిదాపుల్లో ఉన్నప్పుడు ఇతర వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎల్-బోర్డు సూచిస్తుంది.
విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక ఆశలు కల్పించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని కొన్నాళ్లు చెప్పారు. నయా రాయపూర్ నిర్మాణం బాగుందని కొన్నాళ్లు చెప్పారు.
ల్యాండ్ పూలింగా లేక ల్యాండ్ అక్విజిషనా ఏది కావాలో తేల్చుకొమ్మని రైతులకే బాధ్యత అప్పజెప్పారు.
విజయవాడ వెళ్ళి విజయవాడకు దగ్గరగానే రాజధాని అన్నారు. గుంటూరు వెళ్ళి గుంటూరుకు సమీపంలోనే రాజధాని అన్నారు. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి నగర సముదాయమే మన రాజధాని అని మరి కొన్నాళ్లు చెప్పారు.
మంత్రులు కూడా యధాశక్తిగా ఈ అయోమయంలో తలా ఒక ప్రకటన రాయి వేస్తూ రాజధానిని మేమూ నిర్మిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇన్ని ప్రకటనల మధ్యలో అసలు రాజధాని సరిగ్గా ఎక్కడ ఉంటుందో ఇంకా స్పష్టత రాలేదు.
ఈ లోపు రాష్ట్రాన్ని హుద్ హుద్ విలయం తాకింది. రాజధాని నిర్మాణంపై ఉన్న కేంద్రీకరణ అంతటినీ తనవైపు తిప్పేసుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి వాతావరణ విభాగం వారి లెక్క పొల్లుకూడా తప్పలేదు. సరిగ్గా నగరం మీదుగా తీరం తాకడంతో విశాఖపట్నం నగరం చెల్లాచెదురై భోరుమనడంతో రాజధాని నిర్మాణం పక్కకు వెళ్ళి విశాఖ పునర్నిర్మాణం రంగం మీదికి వచ్చింది.
ముఖ్యమంత్రి స్వయంగా ఇస్తున్న వివరాలను బట్టి చూసినా విశాఖ నగరం తీవ్రాతితీవ్రంగా నష్టపోయింది. కనీసం 40,000 విద్యుత్ స్తంబాలు కూలిపోయాయని ఆయన చెప్పారు. స్తంబాలు నిలబెట్టడానికి, అవసరం అయితే కొత్త స్తంభాలు వేయడానికి దాదాపు ప్రతి రాష్ట్రాన్ని ఆయన సహాయం కోరారట.
ఆయన విజ్ఞప్తి మేరకు ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్ధల సిబ్బంది వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో రాత్రింబగళ్ళు పని చేస్తున్నారని ఛానెళ్లు చెబుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అయితే ఏకంగా విద్యుత్ స్తంబాలనే పంపిందని పత్రికలు చెబుతున్నాయి.
విద్యుత్ తో పాటు విశాఖ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య నీరు. తాగడానికి, వాడకానికి కూడా నీరు దొరక్క నానా కష్టాలు పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో అపార్ట్ మెంట్లలో పై అంతస్ధుల్లో నివసించేవారి అవస్ధలు వర్ణనాతీతం. డబ్బిచ్చి నీళ్ళు పైకి చేరవేద్దామన్నా వచ్చేవారు లేరు. వాళ్ళు కూడా తమ సొంత అవస్ధల్లో ఉన్నారు మరి.
వాహనాలపైన కాస్త తేలికపాటి పాత్రలను తీసుకెళ్లి జనం నీటి వేటలో నిమగ్నం అవుతున్నారు. ఎక్కడ నీరు దొరికితే, అది ఏ నీరయినా సరే, పాత్రల్లో నింపుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు.
సందట్లో సడేమియాగా స్వార్ధపర వ్యాపారులు పెట్రోలుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను బ్లాక్ లో విపరీతంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. దానితో ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఒక స్కీము ప్రకటించేశారు. దానిపేరు “ఏ సరుకైనా కిలో రు. 3 కే.” పేద గొప్ప తేడా లేకుండా ఈ సరుకులు ఇస్తామని ఎవరైనా వద్దనుకుంటే తప్ప ప్రతి ఒక్కరికీ తక్కువ రేటుకు సరుకులు ఇస్తామని సి.ఎం చెబుతున్నారు.
దీనికోసం ఇతర రాష్ట్రాల నుండి వివిధ సరుకులను, కూరగాయలను దిగుమతి చేసుకున్నామని ఆయన చెబుతున్నారు. నిలవ ఉండేవైతే కిలో 5/- నిలవ ఉండనివైతే కిలో 3/- కు ఇవ్వాలని ఆదేశించామని ఆయన చెప్పారు.
కొన్ని తెలుగు దినపత్రికలు, ఛానెళ్లు ముఖ్యమంత్రి కృషిని వేనోళ్ళా కొనియాడుతున్నాయి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి తుఫాను పీడిత ప్రాంతంలో తిష్ట వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం గతంలో ఎన్నడూ ఎరగం. రాజధానిలో కూర్చొని ఆ ఆదేశం ఇచ్చాం, ఈ ఆదేశం ఇచ్చాం, ఆందోళన వద్దు అని ప్రకటనలు ఇవ్వడమే తప్ప, మహా అయితే విమానంలో వచ్చి ఏరియల్ సర్వే చేయడం తప్ప ఈ విధంగా వరుసగా బాధిత ప్రాంతంలో ఉండడమే కాకుండా తాను కూడా దాదాపు రాంత్రింబవళ్ళు శ్రమించడం మెచ్చదగిన విషయం.
అయితే ఆయన చేస్తున్నారని చెబుతున్న కృషి ఏ మేరకు ఆచరణలో బాధితులవరకు చేరుతోంది అన్నది అక్కడి జనం తేల్చవలసిన సంగతి.
విశాఖపట్నం దాదాపు 60 వేల నుండి 70 వేల కోట్ల వరకూ హుద్ హుద్ వల్ల నష్టపోయిందని సాధారణ అంచనాగా చెబుతున్నారు. ఒక్క నావికాబలగమే తాము రు. 2,000/- కోట్లు నష్టపోయామని చెప్పారని సి.ఎం తెలియజేశారు. ఈ నష్టం అంతటినీ పూడ్చడం ఎవరివల్లా కాదు. కానీ మొదట మౌలిక అవసరాలను తీర్చవలసి ఉంది. అది కూడా పెను సవాలుగా మారిందని నష్ట తీవ్రతను బట్టి అర్ధం అవుతోంది.
రాజధాని నిర్మాణానికి పధకాల మీద పధకాలు, ఐడియాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రికి ఆ లోపు ప్రాక్టీస్ చేయడానికి హుద్ హుద్ తుఫాను ఈ విధంగా తప్పించుకోలేని అవకాశం కల్పించిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు.
విశాఖ పునర్నిర్మాణం కన్నా అదే ఖర్చుతో వైజాగ్‌ను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుంది. ఖర్చు కలిసి వస్తుంది. ఎలాగూ కష్టపడుతున్నారు కాబట్టి రాజధాని పూర్తవుతుంది. ఇందుకు తెలుగు దేశం పార్టీ నేతలు ఒప్పుకోరేమే…
c.m, gaarini english nerchukomanandi