(ఇవా మొరేల్స్ వరుసగా మూడో సారి బొలీవియా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు దక్కాయి. బొలీవియాలోని స్ధానిక ఆదిమ జాతుల సంతతికి చెందిన వ్యక్తి మొట్టమొదటిసారి అధ్యక్షుడు కావడం మొరేల్స్ సాధించిన ఘనత కాగా, వరుసగా మూడోసారి కూడా అధికారంలో కొనసాగడం మరో ఘనత. దేశ సంపదలను దేశ ప్రజలకే వినియోగపెట్టాలన్న సూత్రాన్ని కాస్త అటు ఇటుగా అమలు చేస్తున్న దేశాల్లో బొలీవియా ఒకటి. మొరేల్స్ విజయంపై ది హిందూ రాసిన సంపాదకీయం ఇది. ఇందులో వ్యక్తం అయిన తాత్విక అవగాహనతో నాకు ఏకీభావం లేదని గమనించగలరు -విశేఖర్)
(బొలీవియా) అధ్యక్షుడు ఇవా మొరేల్స్ వరుసగా మూడో పర్యాయం విజయం సాధించారు. ఆదివారం (ఎన్నికల్లో) ఆయన సంపాదించిన 60 శాతం ఓట్ల శాసనం, 2005లో మొదటి పర్యాయం పొందిన 54 శాతం కంటే గణనీయ మొత్తంలో అధికం. 1990ల నాటి ఆర్ధిక విధానాలపై ఆ దేశ ప్రజల్లో ఇప్పటికీ కొనసాగుతున్న తీవ్ర వ్యక్తిరేకతకు ఇది ఒక కొలమానం. దక్షిణ అమెరికా ఖండంలో కెల్లా పేద దేశాల్లో ఒకటయిన బొలీవియాలో ఆ దేశ మొట్టమొదటి స్ధానిక జాతి అధ్యక్షుడు దాదాపు దశాబ్దకాలం పాటు తన సంక్షేమాత్మక పునః పంపిణీ ఎజెండాను ఎంతటి ఉత్సుకతతో అమలు చేశారన్న విషయాన్ని కూడా తాజా తీర్పు వెల్లడిస్తోంది. మొరేల్స్ సాధించిన ఆర్ధిక విజయానికి ఆండియన్ దేశపు సహజ సంపదల ఉధృత జాతీయకరణ వెన్నెముకగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో బొలీవియా ఆర్ధిక వ్యవస్ధ మూడింతలు వృద్ధి చెందింది. ఈ సంవత్సరం ప్రాంతీయంగా అత్యంత వేగంతో వృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.
మొరేల్స్ యుగం లక్షణాలుగా భాసిల్లుతున్న అధిక వేతనాలు, ముసలివారికి మరియు పిల్లలకు అందజేస్తున్న నగదు బదిలీ… తదితర విధానాలు, అధ్యక్షుడు మొరేల్స్ ఉల్లేఖించే పెట్టుబడిదారీ వ్యతిరేక విధానం, సామ్రాజ్యవాద వ్యతిరేకతలు ఒట్టి గాలి మూటలు కావని స్పష్టం చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఇతర ప్రాంతీయ దేశాలకు మల్లేనే, గత దశాబ్దంలోని కమోడిటీస్ (ముడి ఖనిజాలు, ప్రాధమిక వ్యవసాయ ఉత్పత్తులు మొ.వి) బూమ్ త్వరలో సన్నగిల్లిపోవచ్చన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. వృద్ధిని పెంచి ఉద్యోగాలను సృష్టించడానికి పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బొలీవియా జి.డి.పిలో పెట్టుబడుల వాటా 19 శాతమే ఉన్నందున, లా పాజ్ (బొలీవియా రాజధాని) కు ఇది సరైన వ్యూహమే కావచ్చు. అమెరికాలోనూ, లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల్లోనూ షేల్ గ్యాస్ అన్వేషణలు పెరుగుతున్నందున, పెట్టుబడుల కోసం దేశీయంగా లభించే సహజవాయువు పైననే పూర్తిగా ఆధారపడడం నుండి దృష్టి మళ్లించడం సరైనదే.
రాజకీయ రంగంలో చూస్తే లాటిన్ అమెరికాలోని వివిధ దేశాలలోని నేతలు వరుసగా ప్రభుత్వాలు నెలకొల్పడం సర్వవిదితంగా మారింది. బొలీవియా కూడా ఈ కోవలో చక్కగా ఇమిడిపోయింది. 2002 నుండి బ్రెజిల్ ను ఏలుతున్న వర్కర్స్ పార్టీ తమ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ కు మరో పదవీ కాలం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజాస్వామిక చట్టబద్ధ పాలన సాపేక్షికంగా ఇటీవలి ధోరణిగా ఉన్న దేశాలలో శక్తివంతమైన నాయకుడు కేంద్రంగా రాజకీయ పార్టీలు ఏర్పడడం, ఎన్నికల్లో ఆ నాయకులు భారీ ఎత్తున ప్రజామోదం సంపాదించడం చాలా సహజమైనది. వారి పద్ధతులవల్ల ఒక్కోసారి రాజ్యాంగ బద్ధ తనిఖీల వ్యవస్ధలకు భంగం వాటిల్లవచ్చన్న ఆందోళన అప్పుడప్పుడూ రేకెత్తవచ్చు.
ఉదాహరణకి ఇవా మొరేల్స్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు గత సంవత్సరం అక్కడి రాజ్యాంగ న్యాయస్ధానం మార్గం సుగమం చేసింది. అప్పటికే అధికారంలో ఉన్న అధ్యక్షుడు మళ్ళీ ఒక్కసారి మాత్రమే పునః ఎన్నిక కోరవచ్చన్న నిబంధనను, మొదటి పర్యాయం అధికారంలో ఉండగా మొరేల్స్ సవరించారని, అధ్యక్ష పదవీ కాలాన్ని నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి లెక్కించాలని కోర్టు (తన తీర్పుకు) కారణంగా చెప్పింది. కోర్టు అవగాహనను ఓటర్లు ప్రశ్నించలేదని ఆదివారం నాటి ఎన్నిక స్పష్టం చేసింది. మొరేల్స్ ప్రభుత్వం అనుసరించిన స్ధూల-ఆర్ధిక విధానాలే ఆయన ప్రభుత్వం యొక్క నిలకడకు ప్రధాన వనరు. ఆయన భవిష్యత్తులో విజయవంతం కావాలంటే ప్రజాస్వామిక జవాబుదారీతనం మరియు పెట్టుబడి-స్నేహిత వాతావరణం కీలకం కావచ్చు.