కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు


Micheal

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా భారత దేశంలో జాతి విద్వేషం (రేసిజం) లేదని గర్వంగా చెబుతుంటారు. (తద్వారా జాతి విద్వేషాన్ని తలదన్నే కులవివక్ష ఉనికిని నిరాకరిస్తారు.) ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షతో పాటు భాషా వివక్ష కూడా అమలు చేయవచ్చని బెంగుళూరులోని ముగ్గురు భాషా పరిరక్షకులు చాటారు. తద్వారా జాతి వివక్షలోని ఒక వింత రూపాన్ని ఆవిష్కరించారు.

మంగళవారం రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో జరిగిందీ ఘటన. బెంగుళూరు (నార్త్-ఈస్ట్) డి.సి.పి వికాస్ కుమార్ ప్రకారం మణిపూర్ కి చెందిన విద్యార్ధులు కొందరు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ జరిగిన గొడవలో మణిపురి యువకులు కన్నడంలో మాట్లాడకుండా ఆంగ్లంలో మాట్లాడారని కోపం తెచ్చుకుని ముగ్గురు కన్నడిగులు దాడి చేసి కొట్టారు.

భోజనానికి వచ్చిన మణిపూర్ యువకులు తమలో తాము పెద్దగొంతుతో మాట్లాడుకుంటున్నారట. హోటల్ లో అరుపులు ఏమిటని హోటల్ కి వచ్చిన ఇతరులు వారిని ప్రశ్నించారు. గొంతు తగ్గించి మాట్లాడుకోమని సలహా ఇచ్చారు.

వారి సలహాను పాటించాలనుకున్నారో లేదో తెలియదు గానీ అలా చెప్పినవారితో ఆంగ్లంలో ఏదో చెప్పారు. “ఈశాన్య విద్యార్ధులు ఆంగ్లంలో జవాబు చెప్పడంతో స్ధానికులకు అది అర్ధం కాక కన్నడంలో మాట్లాడమని చెప్పారు” అని డి.సి.పి చెప్పారని పి.టి.ఐ తెలిపింది.

మణిపూర్ విద్యార్ధుల్లో మైఖేల్ అనే అతనికి ఎక్కువ గాయాలు తగిలాయి. అతని నుదురు, చేతులపై గాయాలు అయ్యాయి. తాను తన మిత్రులం తర్వాత జరపబోయే ఒక వేడుక గురించి మాట్లాడుకుంటున్నామని మైఖేల్ చెప్పినట్లు తెలుస్తోంది.

“మీరు కర్ణాటక తిండి తింటున్నారు. మీరు కర్ణాటకలో నివసిస్తున్నారు. కాబట్టి కన్నడంలోనే మాట్లాడాలి. మీరు కన్నడంలో ఎందుకు మాట్లాడరు? అలా మాట్లాడకపోతే రాష్ట్రం నుండి వెళ్లిపోండని తిట్టారు. ఆ తర్వాత మాపై దాడి చేశారు. దాడిని నేనే ఎదుర్కోవడంతో నాకు గాయాలయ్యాయి” అని మైఖేల్ చెప్పారని ది హిందు తెలిపింది. 26 సం.ల మైఖేల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది.

కన్నడంలో మాట్లాడడానికి నిరాకరించడంతో తమపై కొంతమంది రాళ్ళు విసిరారని దాంతో తనకు గాయాలయ్యాయని మైఖేల్ చెప్పినట్లుగా ఫస్ట్ పోస్ట్ తెలిపింది. “నేను ధాడో భాషలో మాట్లాడుతున్నాను. అందుకని నన్ను రాళ్ళతో కొట్టారు. గాయానికి 5 కుట్లు పడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇది రేసిస్టు దాడి” అని మైఖేల్ అన్నారని పత్రిక తెలిపింది.

మైఖేల్ తో పాటు అతనితో ఉన్న జ్ఞాంఖోలెన్ హావోకిప్ (28), రాకీ కిప్ గెన్ (25) లకు కూడా స్వల్ప గాయాలయ్యాయని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ ఛానెల్ వెబ్ సైట్ తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులపై దాడులకు బెంగుళూరు ఇప్పటికే పేరు గాంచింది. అస్సాంలో బోడో-ముస్లిం ఘర్షణల నేపధ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఈశాన్య ప్రజలపై దాడులు జరగబోతున్నాయని కొన్ని మతసంస్ధలు పుకార్లు వ్యాపింపజేయడంతో ఈశాన్య ప్రజలు పెద్ద ఎత్తున స్వస్ధలాలకు తరలి వెళ్లారు. రైళ్లలో రద్దీ ఏర్పడి కొన్ని వారాలపాటు సంక్షోభం కొనసాగింది.

ఆ సందర్భంగా పార్లమెంటు ఉభయసభల్లో వాడి, వేడి చర్చలు సాగాయి. కారణం మీరంటే మీరేనని పార్టీలు వాదులాడుకున్నాయి. మీకొచ్చిన భయం ఏమీ లేదని చివరికి అందరూ కలిసి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు హామీలు ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో దాడులు కొనసాగాయే తప్ప ఆగలేదు.

గత జులైలో గుర్గావ్ లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక జంటపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని వార్తలు వచ్చాయి. మే నెలలో ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య చదువుతున్న నాగాలాండ్ విద్యార్ధినిపై మరో లాయర్ లైంగిక దాడి జరిగింది. ఆమె తన మిత్రులతో కలిసి ఫిర్యాదు చేయబోగా మరింతమంది లాయర్లు చేరి వారిని చితకబాదారు. కేసు పెడితే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు కూడా. చివరికి కేసు నమోదయిందీ లేనిదీ అతీ గతీ లేదు.

ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోనే మణిపురి మహిళలు కొందరిని నలుగురు యువకులు కొట్టారు. మహిళలపై రేసిస్టు వ్యాఖ్యలు చేయడంతో మహిళలు గట్టిగా బదులిచ్చారు. బదులివ్వడం సహించలేని యువకులు మహిళలను కొట్టారని పోలీసులు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ కొడుకు నిడో తనియంను ఇనప రాడ్లతో కొట్టడంతో అతను చనిపోయాడు.

తాజాగా బెంగుళూరు తన ప్రభ ఏమీ తగ్గలేదని చాటింది.

పశ్చిమ దేశాల్లో రేసిజం అన్న పదాన్ని విస్తృత అవగాహనలో వినియోగిస్తారు. కుల వివక్షను కూడా వారు రేసిజంలో భాగంగా చెబుతారు. ఇది ఒక విధంగా సబబుగానే చెప్పవచ్చు. ఎందుకంటే వివక్షలన్నీ ఆర్ధిక అంతరాల యొక్క సామాజిక రూపాలు. ఆర్ధిక పెత్తనాన్ని సాగించుకోవడానికి ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగానూ వివక్షలను పెంచి పోషించడం పాలక వర్గాలకు అవసరం. ఆర్ధిక అవసరాల కోసం ఆచరణలోకి వచ్చాక ఆయా సామాజిక రూపాలు తమకంటూ సొంత ప్రయాణం మొదలు పెడతాయి. ఈ ప్రయాణం అప్పుడప్పుడూ ఆర్ధిక పునాదికి అతీతంగా సాగినట్లు కనిపిస్తుంది. కానీ అది పైకి మాత్రమే. ఆర్ధిక అంతరాల ప్రతిబింబాలు ఉపరితలంలో సొంత నడక నేర్చినప్పటికీ అది ఎన్నటికీ ఆర్ధిక పరిమితులను మాత్రం దాటి వెళ్లవు.

6 thoughts on “కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు

  1. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు జాతీయ వాధం ముదిరి పాసిజంగా తయారైంది. వ్యామోహాలన్ని అతి వ్యామోహలైతే ఇంతే. దానికి ఎన్ని పేరులైనా పె ట్టుకోవచ్చు. రేసిజం, భాష దుహాంకారం, ప్రాంతీ దురహంకారం ఏమైనా కావచ్చు.

  2. అసహనంలో మనంకూడా తీవ్రవాదులకు తక్కువకాకుండా ప్రవర్తిస్తున్నాం. ఓపక్క భిన్న సంస్కృతులూ, ఆచారాలకు భారతదేశం మూలమని ప్రపంచవేదికలపైన, పుస్తకాలలోనూ, బ్లాగుల్లోనూ గొప్పలుపోతుంటాం. ఇంకోప్రక్క మనకన్నా భిన్నంగా ప్రవర్తించినవాడిపైన చేయిచేసుకుంటాం. ఈ కన్నడరక్షణవేదిక రౌడీమూకతప్ప ఇంకొకటికాదు. వీళ్ళకు అభిప్రాయాలేతప్ప, విశ్లేషణ ఉండదు. కనీసం ఆ అభిప్రాయాలుకూడా వీళ్ళ సొంతమైనవికావు. వారి నాయకులుంగారివి.

    ఇకపోతే ఆ కుర్రాళ్ళుమాత్రం పెద్దగా అరవడం ఎందుకు? వాళ్ళూ భారతీయులే కాబట్టీ, civic sense ఉండదు అనుకున్నా, ఇంగ్లీషులో మాట్లాడుకొనేంత చదువుకున్నారుకదా. మరి ఆ బుధ్ధి ఏమయ్యింది? విదేశాలవాళ్ళకీ, మనకీ ప్రస్ఫుటమైన తేడా అక్కడ కనబడుతుందినాకు. వాళ్ళు ఇళ్ళలో మాట్లాడుకొని, బయట మౌనంగా ఉంటారు. మనం ఇళ్ళలో timepassచేసి వీధుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లలోనూ మాట్లాడుకుంటాం. ఈమధ్య సెల్‌ఫోనొకటి తోడయ్యిందిమనకు.

  3. మా పక్కింటిలో ఉండే ఆంగ్లో-ఇందియన్స్ రోజూ ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు. ఎవరికైనా ఇంటిలో మాట్లాడే భాష వచ్చినంతగా పరాయి భాష రాదు.

  4. i think it is just a normal issue just like happen in res truants. because people involved from one particular regions, create such issues. i hope people to protect themselves claim their regions, caste, religion (as Md Azahah ruddin claimed) and take advantage of it. through inquiry has to take place to know the facts. dispute between people should not be generalized. i received good reception in banglore many a times. is this news attract viewers?

  5. కర్ణాటకలో కూడా కొంత మందికి కన్నడ రాదు. వాళ్ళు కోంకణీ, తుళువ భాషల్లో మాట్లాడుతారు. కర్ణాటకలో ఒక MLC సభలో కోంకణీ మాట్లాడాడని స్పీకర్ అతన్ని మాట్లాడనివ్వలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s