పాలస్తీనాకు బ్రిటిష్ పార్లమెంటు గుర్తింపు


U.K. Commons

పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటంలో ఒక చిన్న మలుపు లాంటి పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కామన్స్ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చర్యను మలుపుగా నిర్ధారించలేము గానీ సంకేతాత్మక మలుపు అనవచ్చు. ఒక దేశం ఇచ్చిన గుర్తింపుతో ప్రోత్సాహం పొంది ఇతర దేశాలు కూడా ఇలాంటి సంకేతాత్మక గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవచ్చు.

పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాలు సమాంతరంగా ఉనికిలోకి రావడమే పరిష్కారం అని మెజారిటీ పక్షాలు భావిస్తున్నాయి. ఇలా రెండు రాజ్యాల పరిష్కారానికి బదులు ఒకేఒక రాజ్యం పరిష్కారంగా చెప్పేవారు కూడా ఉన్నారు. వారి ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలను కలిపి ఒకే రాజ్యాన్ని ఏర్పాటు చేసి అందులో పాలస్తీనీయులకు, యూదులకు సమాన హక్కులు కల్పించాలి.

కానీ అలాంటి ఏర్పాటుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందన్న హామీ లేదు. ఇప్పటి ఇజ్రాయెల్ భూభాగంలో కూడా పాలస్తీనా అరబ్బు పౌరులు ఉన్నారు. కానీ వారు ఇజ్రాయెల్ ప్రభుత్వ జాత్యహంకార వివక్షను నిత్యం ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులుగా ఉన్న పాలస్తీనా అరబ్బులు సైతం వివక్షను ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఒకే రాజ్యంలో ఇజ్రాయెలీల పక్కన పాలస్తీనా అరబ్బులను సమాన స్ధాయిలో బతకనివ్వడం సాధ్యం అవుతుందని ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు.

ఇండియా లాంటి చోట్ల నిమ్న కులాల ప్రజలు ఇప్పటికీ తీవ్ర సామాజిక, ఆర్ధిక, రాజకీయ వివక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు గానీ, అంతర్జాతీయ సమాజం గానీ, ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్ధలు గానీ చేసిందేమీ లేదు. వివక్ష కూడదని తీర్మానాలు చేయడం, సుబోధలు చేయడమే వారు చేసేది. ఆ మాత్రం బోధనలు మన దేశంలోనూ వివక్ష పాటించే పెత్తందార్లే చేస్తుంటారు.

ఈ నేపధ్యంలో రెండు రాజ్యాల పరిష్కారానికి బ్రిటన్ పార్లమెంటు తీసుకున్న చర్య ఒక సానుకూల అంశంగా భావించవచ్చు. మొత్తం 650 మంది సభ్యులు ఉండే కామన్స్ సభలో తీర్మానానికి అనుకూలంగా 274 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 12 ఓట్లు వచ్చాయి. మిగిలిన వారంతా ఓటింగులో పాల్గొనలేదు.

“ఇజ్రాయెల్ రాజ్యానికి సమాంతరంగా పాలస్తీనా రాజ్యం ఉనికిని గుర్తించాలని” బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఓటు వేసినవారిలో బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా ఉన్నారు. పలు ఇతర ప్రభుత్వ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయగా పాలక, ప్రతిపక్షాలకు చెందిన రెండు పార్టీలలోనూ అనుకూలంగా ఓటు వేసినవారు ఉన్నారు.

తమ తీర్మానం పాలస్తీనా శాంతి ప్రక్రియను పునః ప్రారంభం కావడానికి దోహదం చేస్తుందని తాము భావిస్తున్నామని పార్లమెంటు సభ్యులు కొందరు పేర్కొన్నారు. ఇటీవలి గాజా యుద్ధంలో 2,1000 మంది పాలస్తీనీయులు మరణించగా 70 మంది ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. గాజా యుద్ధానంతరం శాంతికోసం ప్రయత్నిస్తామని అమెరికా, ఐరోపాలు చెప్పినప్పటికీ ఆ వైపుగా ఒక్క చర్యా తీసుకోలేదు.

పార్లమెంటు ఓటు బ్రిటన్ అధికారిక అవగాహనలో ఎటువంటి మార్పు కలిగించబోదని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పడం గమనార్హం. శాంతి స్ధాపన జరిగిన అనంతరం తాము పాలస్తీనా రాజ్యం ఉనికిని గుర్తిస్తామని ప్రభుత్వ అవగాహనగా మధ్య ప్రాచ్యం వ్యవహారాల మంత్రి తోబియస్ ఎల్వుడ్ తెలిపారు.

1967 నాటి యూదు-అరబ్ యుద్ధం ముందరి నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా రాజ్యానికి పరిశీలక సభ్య దేశ హోదా ఇస్తూ ఐరాస సర్వసభ్య సభ (జనరల్ అసెంబ్లీ) ఒక తీర్మానం ఆమోదించింది. సాధారణంగా జనరల్ అసెంబ్లీ తీర్మానం చట్టబద్ధం కానప్పటికీ ఏకగ్రీవ తీర్మానం అయితే గనుక ఆయా దేశాలు కూడా తమ తమ చట్టసభల్లో తదనుగుణమైన చర్యలు చేపడతాయి. పాలస్తీనా తీర్మానంపై అమెరికా, ఐరోపా రాజ్యాలు ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదు.

ఈ లోపు పాలస్తీనా భూభాగాలను మరిన్ని ఆక్రమించుకోవడం ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. మరిన్ని సెటిల్ మెంట్ల నిర్మాణాన్ని ప్రకటిస్తోంది. పాలస్తీనా ప్రజలకు అందుబాటులో ఉన్న పరిమిత నీటి వనరులను స్వాధీనం చేసుకుంటోంది.

స్వీడన్ నూతన ప్రధాని స్టెఫాన్ లోఫ్వెన్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ తమ ప్రభుత్వం త్వరలో పాలస్తీనా రాజ్యానికి గుర్తింపు ఇస్తుందని ప్రకటించాడు. పాలస్తీనా నుండి ప్రశంసలు, ఇజ్రాయెల్ నుండి విమర్శలు ఎదుర్కొన్న ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు.

4 thoughts on “పాలస్తీనాకు బ్రిటిష్ పార్లమెంటు గుర్తింపు

 1. “వ్యతిరేకంగా ఓటు వేసినవారిలో బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా ఉన్నారు. పలు ఇతర ప్రభుత్వ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయగా పాలక, ప్రతిపక్షాలకు చెందిన రెండు పార్టీలలోనూ అనుకూలంగా ఓటు వేసినవారు ఉన్నారు…”

  పాలక ప్రతిపక్షాలలోని సభ్యులు తమ మనస్సాక్షి ప్రకారం (ఇష్టానుసారం) ఓటు ని వినియోగించుకున్నారన్నమాట. Democratic country అని పిలుచుకునే మన లాంటి దేశంలో ఈ విధమైన వోటింగ్ (ఒక పార్టీకి చెందిన నాయకుడు ఆ పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని విప్ కూడ జారీ చేస్తారు. ) ని చూడగలమా?

  “ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలను కలిపి ఒకే రాజ్యాన్ని ఏర్పాటు చేసి అందులో పాలస్తీనీయులకు, యూదులకు సమాన హక్కులు కల్పించాలి….”

  తమకంటూ సొంత అస్తిత్వం \ ఆదిపత్యం (ఒకరిది బ్రతుకు పోరు ఇంకొకరిది బలుపు పోరు ) కోసం పోరాటాలు జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో, విబిన్న ద్రువాలు లాంటి రెండు దేశాలు కలిసి ఒకే రాజ్యంగా ఏర్పడటం అనేది అసాద్యంగానే అనిపిస్తోంది. for eg:
  ( >కొత్తగా ఏర్పడిన south sudan …
  >కొద్ది శాతం తేడాతో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించలేకపొయిన scotland .. ..
  >china మీద అపనమ్మకంతో తమ నాయకున్ని తామే ఎన్నుకుంటామంటున్న హంగెరి ప్రజలు ..
  > మా పాలన మాదే అని కొత్తగా ఏర్పడిన Telangana State…) .
  బలవంతుడిదే రాజ్యం అయిన ఈ రొజుల్లో, ఒక వేల అంతర్జాతియ సమాజం ఒత్తిడితో ఒకటిగా కలిసినా (కలిపినా)… కసాయి వాడి చేతికి గొర్రె పిల్లని అప్పగించడమే అవుతుందేమో.. ..

  మెజారిటి పక్షాలు చెప్పినట్టుగా
  “పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాలు సమాంతరంగా ఉనికిలోకి రావడమే పరిష్కారం ”.

 2. “పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాలు సమాంతరంగా ఉనికిలోకి రావడమే పరిష్కారం ”.

  How true!!

  విశేఖర్ గారు : పాలస్తీనా సమస్యపై మూలాలనుండీ అవగాహన పెంచుకోవడానికి పుస్తకాలేమైనా సూచించగలరా?

 3. విశేషజ్ఞ గారూ

  నోమ్ చోమ్ స్కీ పేరు వినే ఉంటారు. ఆయన రాసిన ‘Fateful Triangle’ పుస్తకం ఈ సమస్యపై విస్తృత సమాచారం ఇస్తుంది. కాస్త పెద్ద పుస్తకం. నెట్ లో తెప్పించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s