హుద్ హుద్ పెను తుఫాను ఉత్తరాంద్రలోని మూడు జిల్లాలను అతలాకుతలం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ కదిలించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కేవలం ముగ్గురంటే ముగ్గురే మరణించారని ప్రతిపక్ష నాయకులతో సహా పత్రికలు రిపోర్ట్ చేసినప్పటికీ వాస్తవ మరణాల సంఖ్య సోమవారం నాటికి గాని తేలలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకారం తుఫాను తాకిడికి మరణించినవారి సంఖ్య 21కి పెరిగింది.
మరణించినవారిలో అత్యధికులు చెట్లు కూలడం వల్లనే మరణించారని ప్రభాకర్ తెలిపారు. విశాఖపట్నం జిలాలో 15 మంది, విజయనగరం జిల్లాలో 5గురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారని రాష్ట్ర విపత్తుల నిర్వహణాధికారి హైమావతి చెప్పారని పి.టి.ఐ తెలిపింది. ఆదివారం రాత్రికి ముగ్గురు మరణించారని చెప్పగా వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి 5కు పెరిగింది. సహాయ కార్యక్రమాలు జనానికి చేరేకోందీ మరణాల సంఖ్య పెరుగుతూ పోయి సోమవారం సాయంత్రానికల్లా 21 మంది మరణించినట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
హుద్ హుద్ పెను తుఫాను ప్రధానంగా విశాఖపట్నం జిల్లాపై ప్రభావం చూపింది. విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాపితంగా పలు గ్రామాలు తుఫాను తాకిడికి తీవ్రంగా నష్టపోయాయి. గంటకు 200 కి.మీ వేగంతో వీచిన గాలులు పలు విద్యుత్ స్తంబాలను, భారీ వృక్షాలను నేలమట్టం చేశాయి. అనేక రహదారులు కూలిపోయిన చెట్లవలన మూసుకుపోవడంతో వాహనాలు వివిధ చోట్ల ఇరుక్కుపోయాయి.
విశాఖ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోందని పత్రికలు అభివర్ణిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ప్రచండ వేగంతో వీచిన గాలులకు చివరికి వాతావరణ కేంద్రం సైతం పని చేయడం ఆగిపోయింది. సెల్ టవర్లు కూలిపోవడమో, ఇతర ఆటంకాలు ఎదురుకావడమో జరగడంతో సెల్ ఫోన్లు పని చేయలేదు. టి.వి ఛానెళ్ల ప్రసారాలకు కూడా తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు అనేకమంది రేడియోలను ఆశ్రయించారని పత్రికలు తెలిపాయి.
తుఫాను తాకిడికి అనేక భారీ వృక్షాలు వేళ్ళతో సహా పెకలించబడ్డాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు సైతం కూలిపోయాయి. టెలిఫోన్ లైన్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగా శనివారం రాత్రి నుండి విశాఖ నగరంలో విద్యుత్ ప్రసారం ఆగిపోయింది. సమాచార వ్యవస్ధ స్తంభించిపోయింది. విశాఖ విమానాశ్రయం పైకప్పు పలుచోట్ల గాలి తీవ్రతకు ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలోని విద్యుత్ దీపాలు, బోర్డులు పగిలిపోయి, కూలిపోవడం, గాలికి కొట్టుకుపోవడం జరగడంతో అక్కడ ఏవో ఘర్షణలు జరిగిన వాతావరణం నెలకొందని పత్రికలు తెలిపాయి.
విశాఖలో పలు అపార్ట్ మెంట్లు గాలి తీవ్రతకు పగుళ్లు ఇచ్చాయి. వరద నీరు అనేక ఇళ్ళల్లోకి ప్రవేశించింది. ఇళ్ళల్లోకి వచ్చిన నీటిని బైటికి పంపించడం ఎలాగో తెలియక ప్రజలు ప్రభుత్వ సాయం కోరుతున్నారు.
తుఫాను కన్ను తీరం దాటిన అనంతరం తీవ్ర అల్పపీడనంగా మారి ఛత్తీస్ ఘడ్ మీదికి వెళ్లింది. తుఫాను తీవ్రత రాష్ట్రం దాటిన అనంతరం వర్షం తెరిపిడి ఇవ్వడంతో జనం వీధుల్లోకి వచ్చి తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకోవడంలో నిమగ్నం అయ్యారు. పాల ప్యాకెట్ల కోసం, పెట్రోలు కోసం భారీ క్యూలలో నిలబడవలసి వస్తోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
జాతీయ విపత్తు నివారణ బలగాలు రంగంలోకి దిగి పలుచోట్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రోడ్డుపై విరిగిపడిన చెట్లను వారు తొలగించడంతో సోమవారం మధ్యాహ్నానికి NH5 పై ట్రాఫిక్ ను పునరుద్ధరించారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా విశాఖలో బస చేయడం విశేషం. ప్రధాని మోడి మంగళవారం రాష్ట్రం (విశాఖ) సందర్శించినున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం తక్షణం 2,000 కోట్లు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ప్రజల్లో నమ్మకం కలిగేవరకు తాను విశాఖలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
Photos: APToday and others