ఇక్కడ రాష్ట్రాల ఎన్నికలను చూసుకోవడమా, అక్కడ సరిహద్దులో పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను పట్టించుకొనడమా? ‘కిం కర్తవ్యం’ అన్న సంకట కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడి ఎదుర్కొంటున్నారని కార్టూన్ సూచిస్తోంది.
ఎన్నికల వేళ కావడంతో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం పాక్ ఉల్లంఘనలను తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క పాకిస్ధాన్ కాల్పుల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే “అంతా సవ్యంగానే ఉంటుంది” అని ప్రధాని ప్రకటనలు ఇస్తున్నారని రాహుల్ విమర్శిస్తున్నారు. చైనా సైనికుల చొరబాటును కూడా ఆయన ఎత్తి చూపుతున్నారు.
“చైనా అధ్యక్షులు సందర్శించినప్పుడు మోడి సాహిబ్ తో కలిసి ఓ పక్క ఊయల ఊగుతూ ఒక దేశాధిపతి తన సైన్యాన్ని కూడా వెంట తెచ్చిన ఉదాహరణ బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మన సరిహద్దుల్లో వారం రోజులుగా కాల్పులు జరుగుతున్నా మన ప్రభుత్వం ఒక్క మాట అనలేకపోయింది” అని రాహుల్ గాంధీ హర్యానాలో జరిగిన ఓ ఎన్నికల సభలో విమర్శించారు.
“మోడి ప్రభుత్వం బడా వ్యాపారులదే. హర్యానా ప్రభుత్వం 600 ఔషధాలను ఉచితంగా ఇస్తుంది. మోడి అమెరికాకు వెళ్ళే ముందు అమెరికా ఔషధ కంపెనీలు తమ మందులను ఇక్కడ అమ్ముకుంటామని కోరారు. దానితో ఆయన ఔషధాలపై విధించిన కనీస ధరలను తొలగించేశారు. ఇప్పుడు రు. 8,000 ఖరీదు చేస్తున్న ఔషధం త్వరలో లక్ష రూపాయలకు అమ్మబోతున్నారు” అని రాహుల్ విమర్శించారు.
మహారాష్ట్రలో బి.జె.పి కి విచిత్ర పరిస్ధితి ఎదురవుతోంది. శివసేన మాటల్ని బట్టి అక్కడ బి.జె.పికి శక్తివంతమైన, మెరుగైన నాయకులు లేరు. దానితో ప్రచారకర్తగా మోడి రంగంలోకి దిగవలసి వచ్చింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం మొదలు కాగానే సరిహద్దులో పాక్-ఇండియాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మోడి ఇరకాటంలో పడ్డారని కార్టూనిస్టు సూచిస్తున్నారు.