ఈఫిల్ టవర్ కు కొత్త సొబగులను సమకూర్చిపెట్టారని పత్రికలు ఘోష పెడుతున్నాయి. ‘టూరిజమే నా యిజం’ అన్న మన తెలుగు రాజకీయ నాయకుడి నడమంత్రిజాన్ని ఒంట పట్టించుకున్నారో యేమో తెలియదు గానీ పారిస్ నగర ప్రభుత్వం ఈఫిల్ టవర్ కు 200 అడుగుల ఎత్తులో అద్దాల నేలను అమర్చి మరింత మంది టూరిస్టులను ఆకర్షించే పధకం వేసింది.
అంత ఎత్తున అద్దాలను అమర్చడం వలన సందర్శకులకు గాలిలో నిలబడిన భ్రాంతి కలుగుతోందిట. పారిస్ ప్రభుత్వం కోరుకున్నట్లుగానే కొత్త చేర్పులను స్వయంగా అనుభవించి తరించడానికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారని తెలుస్తోంది.
200 అడుగుల ఎత్తులో దృఢమైన అద్దాల నేలను అమర్చడానికి 37.5 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. స్మార్ట్ ఫోన్ ల ఉరవడితో పాటుగా సెల్ఫీల యుగం ఏతెంచిన ప్రస్తుత తరుణంలో ఈఫిల్ టవర్ అద్దాల నేలపై పడుకుని సెల్ఫీలు తీసుకోవడం అక్కడ నిత్య కృత్యం అయింది.
200 అడుగుల ఎత్తులోని కొత్త అద్దాల నేల మొదటి నేల (అదేనండీ, ఫస్ట్ ఫ్లోర్!) కావడం గమనార్హం. ఆకాశాన్ని తాకే భవనాలు కూడా ఇలాగే కింది అంతస్ధులు అత్యంత ఎత్తులో ఉండి పైకి పోయే కొద్దీ ఎత్తు తగ్గిపోతూ ఉంటుంది.
అద్దాల నేలపై అప్పుడే నమ్మకం కలగకపోవడంతో కొందరు అనుమానితులు దానిపై అడుగు పెట్టడానికి భయపడుతున్నారని కింది ఫోటోల ద్వారా తెలుస్తోంది. బహుశా అనుమానితుల్లో ఎక్కువమంది భారీకాయులై ఉండాలి.
అద్దాల నేల సంగతి అటుంచి ఈఫిల్ టవర్ ను భిన్న కోణాల్లో దర్శించే అవకాశాన్ని ఈ ఫోటోలు మనకు కలిగిస్తున్నాయి.
Photos: Boston
One thought on “అద్దాల నేల: కొత్త సొబగుల ఈఫిల్ టవర్ -ఫోటోలు”