జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది.
సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి చలి కాచుకునే అమెరికా కాశ్మీరు సమస్యకు పరిష్కారం చూపెడుతుందని అది కూడా ఇండియాకు అనుకూలంగా ఉంటుందని ఆశించడమే అమాయకత్వమే అవుతుంది. నిజానికి అమెరికా సెనేటర్లు ప్రకటించిన అవగాహన కూడా దక్షిణాసియాలో మంటలు రేపేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటోందని చెప్పేందుకు సూచన అయినా కావచ్చు.
అమెరికా సెనేటర్లు తిమోతి కైనే, యాంగస్ కింగ్ లు ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు. వారు న్యూ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఇండియా-పాకిస్ధాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతుండడం పట్ల ఆందోళన ప్రకటించరు. అంతవరకు ఏమి అభ్యంతరం లేదు. కాశ్మీరు సంఘర్షణలో ఐక్యరాజ్యసమితి మరింత పెద్ద పాత్ర పోషించాలని వారు సూచించడంతో భారతీయ పరిశీలకుల భృకుటి ముడిపడేలా చేసింది.
“ఇండియా, పాకిస్తాన్ ల మధ్య పరిస్ధితి దిగజారుతున్న పరిస్ధితిని మెరుగుపరచడానికి దౌత్య ప్రయత్నాలు చేయాలని, చర్చలు జరుపుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఇచ్చిన పిలుపును నేను ఆహ్వానిస్తున్నాను” అని చెప్పిన తిమోతి మరింత ముందుకు వెళ్ళి “వివాదాలను శాంతియుతంగా పరిష్కరించే సంస్ధగా ఐరాస మంచి పని చేస్తుంది. ఆ అర్ధంలో వారి పాత్రను ఆహ్వానించాలి” అని తిమోతి ప్రకటించాడు.
కాశ్మీరు సమస్య పరిష్కారంలో ఇండియా అవగాహన ఇది కాదు. కాశ్మీరు సమస్య పరిష్కారంలో ఐరాసతో సహా మరే మూడో పక్షం పాత్రనూ భారత పాలకులు (ప్రజలు కాదు. వారికా తీరిక లేదు) అంగీకరించరు. కాశ్మీర్ ను ద్వైపాక్షిక సమస్యగా మాత్రమే వారు పరిగణిస్తారు. ఇండియా, పాకిస్ధాన్ లు చర్చించుకుని పరిష్కరించుకోవలసిన సమస్యగా వారు చెబుతారు. కాశ్మీరు ఇండియాలో అంతర్భాగం అనీ, కనుక ఇండియా ఆజాద్ కాశ్మీరు ఆక్రమణ అంటే ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకోవడమే అని ఇండియా భావిస్తుంది. కాబట్టి ఇరు దేశాలు చర్చించి పరిష్కారం చేసుకోవాలని భావిస్తుంది.
కానీ పాకిస్ధాన్ అవగాహన ప్రకారం కాశ్మీరు సమస్య అంతర్జాతీయ సమస్య. ఈ సమస్య పరిష్కారంలో ఐరాసతో సహా మరే ఇతర మూడో పక్షం (ముఖ్యంగా అమెరికా, ఆ తర్వాత ఐరోపా) పాత్ర తీసుకుని మధ్యవర్తిత్వం వహించాలి. పాలస్తీనా, ఇరాన్ అణు విధానం తదితర సమస్యలలో ఎలాగైతే అంతర్జాతీయ సమాజం (ఇంటర్నేషనల్ కమ్యూనిటీ – ఈ పదం పశ్చిమ దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. వాటి దృష్టిలో అంతర్జాతీయ సమాజం అంటే తామే. తాము చెప్పే ప్రతి మాటా అంతర్జాతీయ సమాజం చెప్పే మాటగా చెల్లుబాటు చేస్తాయి) ఒక గ్రూపును ఏర్పాటు చేసి దశాబ్దాల తరబడి చర్చలు చేస్తున్నాయో అదే తరహాలో కాశ్మీరు విషయంలోనూ చొరవ తీసుకోవాలని పాక్ కోరుతుంది.
ఈ రెండు అవగాహనలూ ఇండియా, పాక్ ల తమ తమ సొంత ప్రయోజనాలకోసం ఉద్దేశించినవే తప్ప కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించినవి కావు. కాశ్మీరు అంటే చెట్టూ పుట్టా, నింగీ నేలా కాదు. అక్కడ జనం ఉన్నారు. వారికి సొంత చరిత్ర ఉంది. వారికంటూ సొంత సంస్కృతి ఉంది. వారు అనేక శతాబ్దాలుగా స్వతంత్ర జాతిగా, స్వతంత్ర దేశంగా ఉనికి కలిగి ఉన్నారు. కనుక కాశ్మీరు సమస్య పరిష్కారంలో అక్కడి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు ప్రధమ స్ధానం వహించాలి తప్ప ఇంకేవ్వరి ప్రయోజనాలూ కాదు.
కానీ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను ఎవ్వరూ గుర్తించరు. అటు పాక్ గానీ, ఇటు ఇండియా గానీ, అంతర్జాతీయ సమాజం గానీ గుర్తించవు. కాశ్మీర్ మంటల్లో ఎవరి చుట్ట వారు కాల్చుకుంటారంతే.
ఇప్పటివరకూ కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాక్ మాట కంటే ఇండియా మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. ఇతర దేశాల చేత కాశ్మీర్ విషయంలో ఇండియా అవగాహనకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకోవడం అతి పెద్ద దౌత్య విజయంగా భారత పాలకులు భావిస్తారు. అలాగే కాశ్మీర్ సమస్యలో ఐరాస చొరవ తీసుకోవాలని ఇతర దేశాల చేత ప్రకటన ఇప్పించడం అతి పెద్ద దౌత్య విజయంగా పాక్ పాలకులు భావిస్తారు.
ఈ నేపధ్యంలో భారత్ పర్యటనలో ఉన్న అమెరికా సెనేటర్లు మన విలేఖరులతో మాట్లాడుతూ మన అవగాహనకు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడం ఒక అనూహ్య పరిణామం. ఐరాసకు పాత్ర ఇవ్వడం అంటే అమెరికా, ఐరోపాలకు ఇచ్చినట్లే. ఐరాస అనేది ఒక తోలు బొమ్మ. దాన్ని ఆడించేది అమెరికా, ఐరోపా దేశాలే. కనుక కాశ్మీర్ సమస్యలో ఐరాసకు పాత్ర ఇవ్వడం అంటే అమెరికా, ఐరోపాలకు ఇచ్చినట్లే లెక్క. మరో మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ మాట నెగ్గినట్లే లెక్క.
పాక్ మాట నెగ్గినా, నెగ్గకపోయినా మనకు అనవసరం. అసలు నెగ్గ వలసింది అటు పాక్ మాటా కాదు, ఇటు ఇండియా మాటా కాదు. కాశ్మీర్ ప్రజల మాట నెగ్గాలి. వారు ఏమి కోరుకుంటే అది నెగ్గాలి. కాశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది స్వయం పాలన. జాతుల సమస్యకు అసలు సిసలు పరిష్కారం జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించడమే. జాతులను అణచివేసి వారి వనరులను కాజేయడం పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వ్యవస్ధల లక్షణం. అందుకే కాశ్మీరు ప్రజల ఆకాంక్షలు అణచివేతకు గురవుతున్నాయి.