ప్రాకృతిక జీవ(న) వైవిధ్యం -ఫోటోలు


భూ మండలంపై 8.7 మిలియన్ల ప్రాణి కోటి నివసిస్తున్నదని ఒక అంచనా. ఇందులో మూడు వంతులు నేలపైనే నివసిస్తున్నాయని తెలిస్తే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం ఎందుకంటే భూ గ్రహంపై మూడు వంతులు నీరే కదా ఆక్రమించింది!

6.5 మిలియన్ల జీవులు నేలపై సంచరిస్తుంటే 2.2 మిలియన్లు నీటిలో గడుపుతున్నాయని ఆ మధ్య శాస్త్రవేత్తలు లెక్క గట్టారు. జీవ రాశుల సంఖ్యకు సంబంధించి ఇంతవరకూ ఇదే అత్యుత్తమ, సరైన లెక్క అని వారు తమకు తాము సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కూడా.

నేలపై నివసించే జీవరాశుల్లో అత్యధికం కీటకాలే అన్నది మరో నిజం. మొత్తం జీవుల సంఖ్య 87 లక్షలు అంటే కనీసం కోటి దాటలేదన్నమాటేగా! ఆ లెక్కన ప్రాణి కోటి, జీవ కోటి అనడం కరెక్ట్ కాదన్నట్లే.

ఇంకో దిగ్భ్రాంతికర నిజం ఏమిటంటే నేలపై జీవుల్లో 86 శాతం మనిషి ఇంతవరకు చూడనేలేదట. జీవులు అంటే జంతువులు, పక్షులు తదితర కదిలే జీవులతో పాటు మొక్కలు కూడా.  అలాగే సముద్రంలోని జీవుల్లో 91 శాతం మనిషికి తెలియదు. వీటికి పేరు పెట్టి వర్గీకరించడం ఇంతవరకు జరగలేదు.

మరి ఎలా అంత ఖచ్చితంగా లెక్కించనట్లు? జీవ ఆవిర్భావానికి సంబధించిన పరిణామ క్రమాన్ని బట్టి లెక్కించారు. జీవ పరిణామ క్రమాన్ని వివరించేందుకు బయాలజీలో ఒక చెట్టు లాంటి పటాన్ని చూపిస్తారు. దాని ప్రకారమే జీవం ఏయే దశలలో విస్తరించిందో అంచనా వేస్తూ మొత్తం జీవాలను లెక్కించారు.

మనిషి మొత్తం జీవాలు ఏమిటేమిటో కనుగొని వారికి పేర్లు పెట్టే లోపు వాటిలో అనేకం అంతరించిపోవచ్చు కూడా అని శాస్త్రవేత్తలు బాధపడుతున్నారు. శాస్త్రవేత్తల బాధ సంగతేమో గానీ జీవాలు అంతరించిపోవడానికి మనిషే సగం కారణం అవుతున్నాడని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు కదా.

ఈ కింది ఫోటోలు ప్రాణి కోటిలో… సారీ, ప్రాణి 87 లక్షలలో కొన్నింటిని ఫోటోలు తీయగా బోస్టన్ పత్రిక ప్రచురించింది. ఫొటోల్లో ఉన్నవి తరచుగా టీ.వీల్లో బొమ్మల్లో చూసేవే. కానీ ఆయా జీవులు ప్రదర్శిస్తున్న తమ తమ జీవన విధానమే ఇందులో మనం చూడవలసింది.

మనకు సరిగ్గా తెలియదు గానీ జంతువులు, పక్షులు కూడా కాస్త అటూ ఇటూగా మనిషి లాగానే తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాయి. అంతే కాకుండా దగ్గరి నుండి పరిశీలిస్తే జంతువులు కూడా మనిషి తరహా భావాలను కలిగి ఉంటాయని మనకు అర్ధం అవుతుంది. కాకపోతే ఆయా భావాలను వ్యక్తం చేయగల నరాల నిర్మాణం జంతువులకు లేదు. అంతే తేడా.

పెరిగి పెద్దయ్యాక తమ తల్లి దండ్రులను మర్చిపోవడం జంతువుల సహజ లక్షణం. కానీ మనిషికి అది సహజ లక్షణం కాదు, సమాజ లక్షణం మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే ఆయా సామాజిక వ్యవస్ధల లక్షణాలనే మనిషి కనపరుస్తుంటాడు.

ఇతర జీవులు మాత్రం అన్నీ ప్రకృతి ప్రకారం నడుచుకునేవే. తమ సహజ ప్రకృతికి ఏ మాత్రం భిన్నమైన పరిస్ధితులు ఎదురైనా అవి అయోమయానికి గురవుతాయి.

కింది ఫొటోల్లో చివర ఉన్నది బ్రైడ్స్ వేల్ అనే ఓ పేద్ధ తిమింగలం. వీటి సంఖ్య ప్రస్తుతం 30 నుండి 35 వరకే ఉంటాయని లెక్క గట్టారు. ధాయిలాండ్ అఖాతంలో కనిపించే ఇవి త్వరలో అంతరించిపోనున్నాయన్న అంచనాతో వీటిని వేటాడడం నిషేధించారు. వీటి శరీరంలో ఏ భాగాన్నైనా సరే రవాణా చేయడం, అమ్మడం, కొనడం నిషిద్ధం.

అంత పెద్ద తిమింగలానికే మనుషుల బాధ తప్పక అంతరించిపోయే పరిస్ధితి వచ్చింది. ఇక ఇతర ప్రాణులు తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలి?

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s