తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎ.ఐ.ఎ.డి.ఏం.ఎ అధినేత్రి, ప్రస్తుతం బెంగుళూరులో ఊచలు లెక్కబెడుతున్న రాజకీయ నాయకురాలు జయలలిత కేసు కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు ముందుకు రానుంది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో 4 సం.ల జైలు శిక్షను సెషన్ కోర్టు విధించింది. శిక్ష రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు అప్పీలు చేసిన జయలలిత, అప్పీలుపై విచారణ జరిపే లోపు తనకు బెయిలు ఇవ్వాలని హై కోర్టును కోరారు. సదరు అప్పీలును హై కోర్టు తిరస్కరించింది.
జయలలితకు ఇతర ముగ్గురు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హై కోర్టుకు చెప్పినప్పటికీ కోర్టు మాత్రం అందుకు తిరస్కరించింది. దానితో జయలలిత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
రాం జేఠ్మలాని లాంటి ఉద్దండ పిండం రంగంలోకి దిగినా జయలలితకు ఫలితం దక్కలేదు. ఈ రాం గారికి అంత పేరు ఎలా వచ్చిందో గానీ ఆయన ఈ మధ్యకాలంలో చేపట్టిన హై ప్రొఫైల్ కేసులు ఏవీ సక్సెస్ కాలేదు.
సుప్రీం కోర్టుకు వెళ్తామని జయలలిత తరపు లాయర్లు ప్రకటించడంతో ఇక బంతి సుప్రీం కోర్టుకు రానుంది. పెద్ద కోర్టులో రాం జెఠ్మలానీతో పాటు మరో ఉద్దండ పిండం కూడా జతకలిసి వాదనా పోరాటం చేస్తారట. ఆ ఇద్దరూ కలిస్తే బెయిలు రాలుద్దో, బూడిద రాలుద్దో వేచి చూస్తే గాని తెలియదు.
బెయిలా, జైలా అన్నది ఉద్దండ పిండాల చేతుల్లో లేదని అది కోర్టు చేతుల్లోనే ఉందని ఈ కార్టూన్ సూచిస్తోంది. అక్రమ ఆస్తుల కేసు అనే రైలు జైలు మార్గంలో వెళ్లనుందా లేక బెయిలు మార్గం వైపుకు దిశ మార్చుకుంటుందా అన్నది కోర్టు చేతిలోని తీర్పు లివర్ నిర్ణయిస్తుందని కార్టూన్ సూచిస్తోంది.