2007-2009 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా బైటపడలేదని అది వాస్తవానికి నిరంతర సంక్షోభంలో తీసుకుంటోందని మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులు చెప్పిన మాటలను సాక్ష్యాత్తు ఐ.ఎం.ఎఫ్ ధ్రువపరిచింది. అలవిమాలిన ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటిస్తూ, అమలు చేస్తూ ప్రపంచాన్ని మాంద్యం నుండి బైటికి తేవడానికి మార్కెట్ ఎకానమీ దేశాలు, సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్ధిక పరిస్ధితులు లొంగిరామంటున్నాయి. మంగళవారం ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ పత్రం అనేక దేశాల ఆర్ధిక భవిష్యత్తు నిరాశాజనకంగా ఉందని స్పష్టం చేయడంతో ఇండియాతో పాటు ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్ళాయి.
ఐ.ఎం.ఎఫ్ పత్రం వెలువడిన అనంతరం భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం రెండున్నర నెలల స్ధాయికి పతనం అయ్యాయి. బుధవారం కూడా భారత మార్కెట్లు నష్టాలనే నమోదు చేశాయి. ఐ.ఎం.ఎఫ్ నిరాశాజనక అంచనాల దరిమిలా ఇండియా నుండి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను పెద్దమొత్తంలో ఉపసంహరించుకుంటున్నారు. ఇండియా వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్ నివేదిక గతం కంటే పెంచినప్పటికీ స్టాక్ మార్కెట్ల పతనాన్ని అది అరికట్టలేకపోయింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై భారత ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా ఆధారపడి ఉన్నదో ఈ ఒక్క విషయమే స్పష్టంగా చాటుతోంది.
అక్టోబర్ 7 తేదీన ఐ.ఎం.ఎఫ్ విడుదల చేసిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ ప్రకారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఈ యేడు గత జులైలో అంచనా వేసినట్లుగా 3.4 శాతం కాకుండా 3.3 శాతం మాత్రమే వృద్ధి చెందుతుంది. 2015 లో వృద్ధి రేటు 4 శాతం కాకుండా 3.8 శాతం మాత్రమే ఉంటుందని నివేదిక అంచనా వేసింది. తన ఆర్ధిక అంచనాలను తగ్గించుకోవడం ఐ.ఎం.ఎఫ్ కు వరుసగా ఇది 3వ సారి కావడం గమనార్హం. గత మూడేళ్లలో 12 సార్లు అంచనాలను విడుదల చేసిన ఐ.ఎం.ఎఫ్ అందులో 9 సార్లు గత అంచనాలను కిందికి సవరించుకుంది. అమెరికా, యూరో జోన్ లు సాధించే ఆర్ధిక స్వస్ధత (ఎకనమిక్ రికవరీ) ను ఐ.ఎం.ఎఫ్ పదే పదే అతిగా అంచనా వేస్తోంది. మార్కెట్ ఎకానమీల నడక ఐ.ఎం.ఎఫ్ కే అంతు బట్టడం లేదని ఈ సంగతి చెబుతోంది.
అభివృద్ధి చెందిన దేశాలపై సమీప భవిష్యత్తులో పెద్దగా ఆశలు లేవని ఐ.ఎం.ఎఫ్ చీఫ్ ఎకనమిస్టు ఆలివర్ బ్లాంచర్డ్ చెప్పడం విశేషం. ఈ దేశాల్లో వడ్డీ రేట్లు ఇప్పటికే నేలబారు స్ధాయిలో ఉన్నాయని, ఫలితంగా డిమాండ్ లో ఊపు తేగల సాధనాలు మృగ్యం అయ్యాయని ఆయన విశ్లేషించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నిరంతర స్తంభన (secular stagnation) లో కొనసాగే పరిస్ధితి కనిపిస్తున్నదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి లారెన్స్ సమ్మర్స్ చేసిన విశ్లేషణను ఐ.ఎం.ఎఫ్ చీఫ్ ఎకనమిస్టు తన వ్యాఖ్యల ద్వారా ధ్రువపరిచారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
“సరిపడా ఉత్పత్తి జరగడానికి వీలుగా డిమాండ్ ను పెంచడంలో మనం సఫలం అవుతామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము. అది చాలా కష్టం కావచ్చు” అని ఆలివర్ బ్లాంచర్డ్ స్పష్టం చేశారు. ఇంత నిరాశాజనకంగా మాట్లాడుతూ కూడా ఆయన వ్యవస్ధాగత సంస్కరణలపై మరింత తీవ్రంగా దృష్టి సారించాలని కోరుతున్నారు. వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే: అభివృద్ధి చెందిన దేశాలకేమో ‘కోతలు, రద్దులు’; అభివృద్ధి చెందుతున్న దేశాలకేమో ‘తలుపులు బార్లా తెరవడం, అయినకాడికి అమ్మేయడం.’
ఐ.ఎం.ఎఫ్ అనాదిగా ప్రతిపాదించి అమలు చేస్తున్న ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం’ (Structural Adjustment Program) కు అనేక మూడో ప్రపంచ దేశాల్లో వ్యవస్ధలను సర్వనాశనం చేసిన చరిత్ర ఉంది. చరిత్ర మాత్రమే కాదు అది వర్తమానం కూడా. ఐరోపా ఋణ సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడిన గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్, సైప్రస్ తదితర దేశాలలో ఐ.ఎం.ఎఫ్ ఈ కార్యక్రమాన్నే అమలు చేసింది. సరసమైన వడ్డీ రేట్లకు రుణం ఇచ్చినట్లు చెబుతూ అనేక విషమ షరతులను అమలు చేసింది.
ఆయా దేశాల్లో ప్రభుత్వ రంగ కంపెనీలను అప్పనంగా బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పే ప్రయివేటీకరణ విధానాలను అమలు చేయించింది. ప్రైవేటు కంపెనీల ఇష్టారాజ్యానికి ఆర్ధిక వ్యవస్ధలను తాకట్టు పెడుతూ కార్మిక చట్టాల కోరలు పీకించింది. నియంత్రణ వ్యవస్ధలను రద్దు చేయించింది. తీరా చూస్తే ఆ దేశాలు మరింత అప్పులో మునిగిపోవడమే కాకుండా ఆర్ధిక వ్యవస్ధలు కుదించుకుపోయి వరుసగా సంకోచ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అక్కడ నిరుద్యోగ లెక్కలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగిలిన ఉద్యోగుల వేతనాలను కత్తిరించేశారు. కాస్తో కూస్తో మిగిలిన సదుపాయాలను సంక్షేమ చర్యలను రద్దు చేసేశారు. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి ఆలివర్ బ్లాంచర్డ్ చెబుతున్న డిమాండు వల్లకాటికి తరలి వెళ్లింది.
ఇప్పుడు ఆ డిమాండు కోసం మళ్ళీ అవే వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాన్ని ఇంకా తీవ్రంగా అమలు చేయాలని ఆయన బోధిస్తున్నారు. దక్షిణ ఐరోపా దేశాలు దారుణమైన ఋణ సంక్షోభంలో చిక్కుకుపోవడానికి, మరింతగా కూరుకుపోవడానికి కారణమైన విధానాలను సవరించుకునేందుకు ఐ.ఎం.ఎఫ్ సిద్ధంగా లేదు. గ్రీసు విషయంలో ఇప్పటికే లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్, ఆ లెంపలను తీసి గట్టున పెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మరింత సంక్షోభంలోకి నేట్టేందుకు నడుం బిగించింది.
తమ ఆర్ధిక వృద్ధి మెరుగవుతుందని అమెరికా, బ్రిటన్ లు భావిస్తున్నాయి. కానీ అది నిజం కాదని ఐ.ఎం.ఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. యూరో జోన్ లో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలకు తన అంచనాలలో కోత పెట్టుకుంది. జపాన్, బ్రెజిల్ ల ఆర్ధిక వృద్ధి అంచనాలను కూడా తగ్గించుకుంది. “యూరో ఏరియాలో రికవరీ స్తంభించిపోయే ప్రమాదం నెలకొని ఉంది. మరింత బలహీనపడే అవకాశమూ ఉంది. అతి తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారుకునే ప్రమాదం పొంచి ఉంది. ఆ పరిస్ధితే వస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అదే అవుతుంది” అని ఐ.ఎం.ఎఫ్ నివేదిక పేర్కొంది. యూరో జోన్ దేశాలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు చేసే అవకాశం 30 శాతం ఉన్నదని, మళ్ళీ మాంద్యం (రిసెషన్) లోకి జారుకునే అవకాశం 40 శాతం ఉన్నదని ఐ.ఎం.ఎఫ్ నివేదిక తెలిపింది.
అమెరికా త్వరలో (వచ్చే సంవత్సరం) తన వడ్డీ రేటు పెంచనున్నట్లు చెబుతోంది. అనగా తన విత్త విధానాన్ని క్రమంగా బిగదీసుకోనుంది. ఈ ప్రభావం అనివార్యంగా ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతుంది. జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతేనే ఇండియా నుండి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. ఇక అమెరికా వడ్డీ రేటు పెంచితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్ల సరఫరా తగ్గిపోయి ఆ మేరకు ఇండియా లాంటి చోట్ల నుండి పెట్టుబడులు మరింత వేగంగా, భారీగా వెనక్కి వెళ్లిపోతాయి. ఈ పరిస్ధితికి ఇండియా సిద్ధంగా ఉన్నదని మన పాలకులు చెప్పలేకున్నారు. వడ్డీ రేటు పెంచేముందు కాస్త చెప్పండని గత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ను వేడుకోవడం బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంచడం ప్రారంభిస్తే ప్రపంచ ద్రవ్య మార్కెట్ ఒక్కసారిగా కూలబడవచ్చని ఐ.ఎం.ఎఫ్ నివేదిక సైతం హెచ్చరించింది.
జపాన్ లోనూ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ సంకోచానికి గురయింది. 2014 రెండో త్రైమాసికంలో జపాన్ 1.8 శాతం మేర కుచించుకుపోయింది. అనగా -1.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2012 Q2 నుండి 2012 Q4 వరకు సంకోచం నమోదు చేసిన జపాన్ ఆ తర్వాత మూడు త్రైమాసికాల పాటు వృద్ధి నమోదు చేసి మళ్ళీ 2013 Q4లో సంకోచించింది. అనంతరం 2014 Q1 లో 1.5 శాతం వృద్ధి చెందినప్పటికీ 2014 Q2 లో -1.8 వృద్ధి నమోదు చేసింది. ఈ విధంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ ఆర్ధిక వ్యవస్ధ పడుతూ లేస్తున్న నేపధ్యంలో జపాన్ అంచనాలను కూడా ఐ.ఎం.ఎఫ్ తగ్గించుకుంది.
ఉక్రెయిన్ విషయంలో నెలకొని ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి పై ప్రభావం చూపుతున్నాయని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. రష్యాపై విధించిన ఆంక్షల వల్ల రష్యా గ్యాస్ ఎగుమతులు పడిపోయినప్పటికీ ఆ కొరవను చైనాకు ఎగుమతి చేయడం ద్వారా రష్యా పూడ్చుకుంటోంది. కానీ రష్యాకు చేసే ఎగుమతుల్లో గణనీయ మొత్తాన్ని రష్యా ప్రభుత్వం ఆంక్షల చట్రంలో బిగించడంతో అది నేరుగా యూరోపియన్ గ్రోత్ ఇంజన్ జర్మనీ పై ప్రభావం చూపుతోంది. ఫలితంగా అసలే సంక్షోభం అంచున ఉన్న యూరో జోన్ మరింత లోపలికి జరిగినట్లయింది.
“సవాలు ఏమిటంటే… సాధారణ మంత్రం అయిన ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాన్ని’ దాటి ముందుకు పోవాలి. అనగా అత్యవసరమైన సంస్కరణలను గుర్తించడంతో పాటు, రాజకీయంగా సాధ్యమయ్యే సంస్కరణలు ఏవో కూడా గుర్తించాలి” అని ఐ.ఎం.ఎఫ్ నివేదిక పేర్కొనడం బట్టి ఉక్రెయిన్ పై విధించిన ఆంక్షలను అది పరోక్షంగా తప్పు పట్టినట్లు కనిపిస్తోంది. లేదా ఉక్రెయిన్ ఆంక్షలకు అనుగుణంగా ఇతర ప్రాధామ్యాలను మార్చుకోవాలని చెప్పడం అయినా కావచ్చు.