ఇండియా, పాకిస్ధాన్ సరిహద్దులో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించిన భారత ప్రధాని నరేంద్ర మోడి క్రమక్రమంగా పాక్ చర్చలకు దూరం జరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం మీరంటే మీరే అని ఇరు దేశాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిర్వహించిన ఆందోళనల ఫలితంగా పాక్ విదేశీ విధానం, ముఖ్యంగా ఇండియా విధానం నవాజ్ చేతుల్లో నుండి పాక్ మిలట్రీ చేతుల్లోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి సరిహద్దు ఉద్రిక్తలకు ఇదే ప్రధాన కారణం కావచ్చన్న పరిశీలనను కొట్టిపారేయలేము. కానీ చారిత్రక నేపధ్యం నుండి చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలకు ప్రధాన లబ్దిదారులు ఇరువైపులా ఉన్న పాలకవర్గాలు కాగా అన్ని రకాలుగా నష్టపోతున్నది మాత్రం ఇరువైపులా నివసించే సాధారణ ప్రజలే. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్ధాన్ మళ్ళీ ఉల్లంఘించిందన్న వార్తలు ప్రతి రోజూ భారత పత్రికలు ప్రచురిస్తున్నాయి. టి.వి ఛానెళ్లు ప్రకటిస్తున్నాయి. ఆ వెంబడి భారత సైనికాధికారుల హెచ్చరికలను ప్రసారం చేస్తున్నాయి. పాక్ కాల్పులకు దీటైన జవాబు ఇస్తున్నామని మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారు. ఇది ఇండియాలో మనకు నిత్యం కనపడుతున్న తంతు.
అయితే సరిహద్దుకు ఆవల ఏం జరుగుతోంది? అక్కడ కూడా పాకిస్ధానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించ్చిందని పత్రికలు చెబుతున్నాయా? అక్కడి మంత్రులు, అధికారులు, సైన్యాధికారులు కూడా కాల్పులకు నెపాన్ని తమపైనే వేసుకుంటున్నారా లేక ఇండియాపై వేస్తున్నారా? ఊరికే ఇండియాపై నెపం వేస్తే సరిపోదు. అందుకు సాక్ష్యాలను కూడా పత్రికలు, అక్కడి ప్రభుత్వం చూపాలి. అలా చూపిస్తున్నాయా? ఇవన్నీ మనం దృష్టి పెట్టని అంశాలు. మన పత్రికలు, ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి పాక్ పై ద్వేషం మరింత పెంచుకునే అంశాలు. కానీ అవతల నిజంగా ఏం జరుగుతోంది?
పాకిస్ధాన్ లోనూ పత్రికలూ, ప్రభుత్వమూ సరిగ్గా మన పత్రికలూ, మన ప్రభుత్వమూ చెప్పే మాటలే చెబుతున్నాయి. కాకపోతే ఇండియా స్ధానంలో పాకిస్ధాన్, పాకిస్ధాన్ స్ధానంలో ఇండియా ఉంటాయంతే. ఇండియాయే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అక్కడి ప్రభుత్వం తరచుగా ఆరోపిస్తుంది. సరిహద్దు ఆవల నుండి కాల్పులు జరుపుతున్న భారత సైనికులకు తాము దీటుగా జవాబిస్తున్నామని పాక్ సైనికాధికారులు ప్రకటిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇండియా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్న ప్రకటనలు, వార్తలు అక్కడ ప్రసారం అవుతున్నాయి, ప్రచురించబడుతున్నాయి.
పౌరుల మరణాలు ఇండియా వైపే కాదు, పాకిస్ధాన్ వైపూ సంభవించాయి. ఆ మాటకొస్తే ఇక్కడి కంటే అక్కడే ఎక్కువమంది పౌరులు మరణించారు. ఈ మరణించినవారి బంధువులకు తమవాళ్లు ఎందుకు చనిపోయారో తెలియదు. కాల్పుల నుండి తప్పించుకోవడానికి సైన్యాలు నెలకొల్పిన శిబిరాలకు తరలివెళ్లడమే తప్ప తమకా పరిస్ధితి రావడానికి తామేమి తప్పు చేశామో తెలియదు. రాయిటర్స్ పత్రిక ప్రకారం పాక్ లో 9 మంది పౌరులు చనిపోగా ఇండియా వైపు 8 మంది పౌరులు చనిపోయారు.
పాక్ కి చెందిన పత్రిక డాన్, ఈ రోజు మొదటి పేజీలో “భారత్ కాల్పుల్లో ఒక ఎజెకె (ఆజాద్ జమ్ము & కాశ్మీర్) పౌరుడు మృతి” అన్న శీర్షికతో వార్త ప్రచురించింది. “భారత బలగాలు భారీ ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి… కాల్పులు తీవ్రంగా జరుగుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి” అని పాక్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ డాన్ తెలిపింది. భారత జవాన్ల కాల్పుల్లో సియాల్ కోట్ లో మంగళవారం రాత్రి కనీసం ముగ్గురు చనిపోయారని, నలుగురు గాయపడ్డారని పత్రిక తెలిపింది. గత మూడు రోజుల్లో 10 మంది పౌరులు మరణించారని డాన్ తెలిపింది.
పాక్ లోని మరో పత్రిక పాకిస్తాన్ అబ్జర్వర్. “హెచ్చరిక లేకుండా LoC మీదుగా భారత్ భారీ కాల్పులు” అన్న శీర్షికతో ఆ పత్రిక వార్త ప్రచురించింది. పత్రికలో మెయిన్ వార్త ఇదే. “ఆజాద్ కాశ్మీర్ లోని కోట్లీ ప్రాంతంలో భారత దురాక్రమణ దాడులకు పాక్ బలగాలు దీటుగా జవాబు చెబుతున్నాయి” అని ఆ వార్త తెలిపింది.
డెయిలీ టైమ్స్ పత్రిక భారత కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను పాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని తెలియజేసింది. సమయమనం పాటించవలసిందిగా ఇండియాను కోరుతున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపింది. “భారత భద్రతా బలగాల దాడుల వల్ల అనేక కుటుంబాలు ఈద్ పండుగను జరపలేకపోవడం అత్యంత శోచనీయం” అని పాక్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారని పత్రిక తెలిపింది.
“LoC కాల్పుల విరమణను మళ్ళీ ఉల్లంఘించిన భారత్” అని ది నేషన్ పత్రిక శీర్షిక పెట్టి ఓ వార్త ప్రచురించింది. భారత బలగాల కాల్పులు తమవైపు నుండి ఎటువంటి చర్య లేకుండానే జరిగాయని ప్రభుత్వం ప్రకటించిందని ఆ వార్త తెలిపింది.
భారత్ కాల్పుల్లో పాక్ పౌరులు మరణించారని పాక్ పత్రికలు చెబుతున్నప్పటికీ సంబంధిత ఫోటోలను ఆ పత్రికలు ప్రచురించకపోవడం గమనించదగిన విషయం.
మొత్తం మీద, ఈ వార్తలను బట్టి, ఇరు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయని అర్ధం అవుతోంది. పాక్ కాల్పుల్లో భారత పౌరులు, జవాన్లు మరణిస్తుండగా, భారత్ కాల్పుల్లో పాక్ పౌరులు, జవాన్లు మరణిస్తున్నారు. ఇరు పక్షాలు తమ వైపు మరణాలను, అవతలివైపు కాల్పులను మాత్రమే రిపోర్ట్ చేస్తూ అవతలివైపు మరణాలను రిపోర్ట్ చేయడం లేదు. ఇరు పక్షాలు అవతలి వైపు నుండి జరుగుతున్న అన్ ప్రోవోక్డ్ కాల్పులకు దీటైన జవాబు చెబుతున్నామని చెబుతున్నాయి. ఇరువురు కలిసి సాధారణ పౌరులను బలి తీసుకుంటున్నారు. భారత్ లో 18,000 మంది శిబిరాల్లో తలదాచుకుంటుండగా పాక్ లో 20,000 మందిని తరలించారని వార్తలు చెబుతున్నాయి.
“ఇండియా, పాకిస్తాన్ సైనికుల మధ్య శతృత్వం ఉంటే ఫైటింగ్ చేసుకోండి. కానీ మేమేం చేశామని మా ప్రాణాలు తీస్తున్నారు? నడిరాత్రి మేము మా ఇళ్ళు వదిలి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఈ బడిలో హృదయవిదారక పరిస్ధితుల్లో గడుపుతున్నాము. తినడానికి తిండి కూడా లేదు. కాల్పులు ఆగిపోతే మా ఇళ్లకు మేము వెళ్తాము” (రాయిటర్స్) ఈ మాటలు అన్నది జమ్ము లోని ఆర్నియా ప్రాంత వాసి ఘరో దేవి. 50 సం.ల దేవి ఇరు పక్షాలను తిట్టిపోయడం బట్టి ఘర్షణలను వారు ఏ కళ్ళతో చూస్తున్నదీ అర్ధం చేసుకోవచ్చు. వారి దృష్టిలో ఇండియా, పాక్ లు ఏవీ వారికి సంబందించినవి కావు. వారిది జమ్ము & కాశ్మీర్! అంతే.